రాళ్లపల్లి జీవితంలో విషాదకర ఘటన.. | Tanikella Bharani talk about On His Guru Rallapalli | Sakshi
Sakshi News home page

రత్నాలపల్లి

Published Sun, May 19 2019 12:39 AM | Last Updated on Sun, May 19 2019 8:10 AM

Tanikella Bharani talk about On His Guru Rallapalli  - Sakshi

‘ఆయన స్ఫటికం’ అంటారు తనికెళ్ల భరణి. క్రిస్టల్‌ క్లియర్‌ అని. ఆ స్ఫటికంలో తనని తాను చూసుకున్నారు.తనని మాత్రమే కాదు..తనకో ఆదర్శాన్నీ.. తనకో అయ్యప్పనీ..తనకో గురువుగారినీ.. చూసుకున్నారు.

ఇప్పుడు ఆయన జ్ఞాపకాల్నితడికళ్లతో తడిమి తడిమి చూసుకుంటున్నారు.రాళ్లపల్లితో మొదలైన తనికెళ్ల ప్రయాణంలో..ఎన్నో మలుపులు..మరపురాని మరెన్నో తలపులు.చదవండి. సాక్షి ఎక్స్‌క్లూజివ్‌.

రాళ్లపల్లిగారితో మీ పరిచయం గురించి..?
తనికెళ్ల భరణి: అప్పుడు నేను హైదరాబాద్‌లోని రైల్వే కాలేజీలో చదువుతున్నాను. కాలేజీలో ఓ నాటకం వేయాల్సి వచ్చింది. ‘అద్దె కొంప’ అనే నాటకం. నేను రాసిందే. స్వీయానుభవాలతో రాసిన ఆ నాటకానికి ఫస్ట్‌ ప్రైజ్‌ వచ్చింది. ఆ దెబ్బతో మా చదువులు నాశనం. ఎప్పుడైతే నాటకం క్లిక్‌ అయిందో అప్పుడే సీతాఫల్‌ మండిలో ‘నవీన్‌ కళామందిర్‌’ అని ఓ నాటక సమాజాన్ని ఏర్పాటు చేద్దాం అనుకున్నాం.

అప్పుడు నేను బీకామ్‌ ఫస్ట్‌ ఇయర్‌ చదువుతున్నాను. మా నాటకానికి రాళ్లపల్లిగారిని పిలవాలనుకున్నాం. అప్పటికి ఆయనకు పెళ్లి జరిగి 14 రోజులే అయింది. మేం వెళ్లి ‘మీరు రావాలి సార్‌’ అన్నాం. ‘నాటకం కదా వస్తాను లే’ అన్నారు. ఆయనతో నా పరిచయం అదే. రాళ్లపల్లిగారు వస్తున్నారంటే ఒక ఉద్వేగం. స్టేజి మీద ‘ఇప్పుడు రాళ్లపల్లిగారు స్వగతంగా మాట్లాడతారు’ అన్నాను. ‘లేదు. ప్రకాశంగానే మాట్లాడతాను’ అని మొదలుపెట్టారాయన. ఆ తర్వాత నుంచి కాలేజీకి వచ్చిపోయేప్పుడు రాళ్లపల్లిగారింట్లో గడపడం అలవాటై అక్కడే ఉండిపోయేంతగా దగ్గరైపోయాను.

నాటక రంగంలో అప్పటికే ఆయన పాపులరా?
అవును. ఆయన అప్పటికే ‘సాంగ్‌ అండ్‌ డ్రామా డివిజన్‌’ అనే ప్రభుత్వ సంస్థలో పని చేస్తున్నారు. ఆయనా బీకామ్‌ చదివారు. కానీ టెన్త్‌ అండ్‌ ఇంటర్మీడియట్‌ సర్టిఫికెట్స్‌తో రైల్వేలో క్లాస్‌ ఫోర్‌ జాబ్‌ వచ్చింది. ఆ తర్వాత సాంగ్‌ అండ్‌ డ్రామా డివిజన్‌కు వచ్చారు. నాకు తెలిసి అప్పట్లో సీతాఫల్‌మండి ప్రాంతంలో ‘అయ్యప్ప స్వామి’ గురించి ప్రచారం చేసినవారిలో రాళ్లపల్లిగారు మొదటివారు.

అక్కడ ఓ తమిళియన్‌ ఉండేవారు. ఆయన శబరిమల వెళుతుండేవారు. అది తెలిసి ఈయన అయ్యప్ప గురించి చెప్పడం మొదలుపెట్టారు. రాళ్లపల్లిగారు 28సార్లు శబరిమల వెళ్లారు. ఆయన ద్వారా శబరిమలకు వెళ్లడం మాకూ అలవాటైంది. మా అనుబంధం ఎంత గాఢతను సంతరించుకుందంటే..  నేను నాటకాల్లో ఎక్కువగా నటిస్తున్నానని మా నాన్నగారు ఇంట్లో నుంచి గెంటివేశారు. అప్పుడు రాళ్లపల్లిగారి ఇంటికి వెళ్లాను. అక్కడే ఉండేవాణ్ణి.

రాళ్లపల్లిగారి నాటకాలకి స్పందన ఎలా ఉండేది?
విపరీతమైన ప్రేక్షకాదరణ ఉండేది. వైజాగ్‌ ఆంధ్ర విశ్వవిద్యాలయం ఉంది కదా. అక్కడి నాటకాల అధినేత మంత్రి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో ‘కన్యాశుల్కం’ నాటకాన్ని రవీంద్రభారతిలో రాష్ట్రపతి ముందు ప్రదర్శించారు. చాలా కీర్తిప్రతిష్టలు వచ్చాయి. రాళ్లపల్లిగారు కన్యాశుల్కం, వరకట్నం వంటి నాటకాలు వేస్తే కచ్చితంగా వన్స్‌మోర్లు వచ్చేవి.ఒక మనిషి ఇంతలా ఓ పాత్రలో ఒదిగిపోగలరా? అని ప్రేక్షకులు ఆశ్చర్యపోయే స్థాయిలో ఆయన నటించేవారు.ఆయన నాటక వైభవాన్ని చూశాం మేం. ప్రతి సంవత్సరం ఆయన నాటకం వేసేవారు. ఆగస్ట్‌ 15 ఆయన పుట్టినరోజు. ఆ రోజు ఓ పేద కళాకారుడికి సన్మానం చేసి 50 వేల రూపాయలు ఇచ్చేవారు. ఆయన ఆర్థిక స్థితి అంతంత మాత్రమే. 50 వేలు ఎలా? అప్పు చేసేవారో ఏమో కానీ 50 వేల రూపాయలు ఇచ్చేవారు. లాస్ట్‌ ఇయర్‌ దాకా ఇచ్చారు.

ఆయన నాటకాలు తీసే విధానం చాలా గొప్పగా ఉండేదట?
అవును. నాటకం చేస్తే ప్రాణం పెట్టేవారు. 5 గంటలకు అంటే సరిగ్గా ఆ టైమ్‌కే రిహార్సల్‌ మొదలుపెట్టాలి. అది కూడా ఒక వైభవంగా ఉండేది. సినిమా లెవల్లో ఉండేది. ఖర్చంతా ఆయనదే. అన్నీ లెక్క వేసి..  వెయ్యి రూపాయిలు ప్రొడక్షన్‌ వస్తుంటే  ఖర్చు 3 వేలు ఉండేది. అయితే ఆయన దగ్గర నేను నేర్చుకున్నదేంటంటే ఎప్పుడైతే నాటకం ఇలా అయిపోయిందో, ఎప్పుడైతే ఆయన ఇండస్ట్రీకి వెళ్లారో నాటకానికి ఇంత ఖర్చు చేయడం అనవసరం అని నేను అనుకున్నాను. ప్రయోగాత్మకంగా ఐదు రూపాయలతో మొదలెట్టా. ఖర్చు తగ్గించా. మ్యూజిక్‌ తీసేశా. ఉధృతంగా, ఉద్యమంలా నాటకాలు  వేసేవాళ్లం.

రాళ్లపల్లిగారిని మీరు ఏమని పిలిచేవారు?
గురువుగారూ అని పిలిచేవాణ్ణి. ‘ఏమయ్యా... భరణీ’ అనేవారు. గురువుగారి భార్యను ‘మాస్టారు’  అని పిలిచేవాళ్లం. ఎందుకంటే ఆమె టీచర్‌. వాళ్లది చాలా అన్యోన్యమైన దాంపత్యం. నిజం చెప్పాలంటే వారి ఇల్లు ఒక సత్రంలా ఉండేది. టిఫిన్లు.. భోజనాలు.. కాఫీలు.. టీలు ఇలా వచ్చినవాళ్లందరికీ సమకూరుస్తుండేవాళ్లు. నాటకాలంటే గురువుగారికి ఎంత మమకారం అంటే.. ఒకానొక దశలో వాటి కోసం అప్పులు చేయడం ప్రారంభించారు. ఏ స్థాయిలో అప్పులు అంటే.. ఆయన ఇంట్లో నుంచి ఓసారి ఓ సోఫాను నా కళ్లముందు నుంచి పట్టుకుపోయారు.  డబ్బు కోసం ఆయన మానసికంగా ఇబ్బంది పడ్డారు.

‘పర్లేదు.. గురువుగారూ.. మేం ఉన్నాం’ అని చెప్పేవాళ్లం. అయితే అప్పుడు మేం నిరుద్యోగులం. ఆయన నేతృత్వంలో నాటకాలు వేసేవాళ్లం. పరమ పరాకాష్ట ఏంటంటే... అప్పులవాళ్ల బాధ భరించలేక ఒకసారి ఇంటికి సైకిల్‌ మీద వచ్చి వెనక గుమ్మం మీద నుంచి దిగి మేడ మీదకు వచ్చి కోడిగుడ్డు సైజ్‌ దీపం పెట్టి... ‘ముగింపు లేని కథ’ అనే నాటకం రాశారు. దాదాపు మేం వందసార్లు ఆ నాటకాన్ని ప్రదర్శించాం. వేసిన ప్రతిసారీ ‘ఉత్తమ నాటకం’ అనిపించుకుంది. అప్పుడు నాకు 25 ఏళ్లు ఉంటాయి. అందులో నేను 70 ఏళ్లకు పైబడిన మామ పాత్ర చేశాను. ప్రదర్శించిన వందసార్లూ ఆ పాత్ర వేయడం ఓ మరచిపోలేని అనుభూతి.

మీ గురువుగారి సినిమా ఇండస్ట్రీ ఎంట్రీ గురించి?
‘స్త్రీ’ అనే సినిమాలో చిన్న వేషం వచ్చింది. చిన్నదైనా సినిమాల్లోకి వెళుతున్నారంటే గొప్ప కదా. మేమంతా రాళ్లపల్లిగారిని సీతాఫల్‌ మండిలో రిక్షాలో కూర్చోబెట్టుకుని, మేం అటూ ఇటూ కూర్చొని, అదే.. మాకు మెర్సిడెస్‌ బెంజ్‌.. ఆయన్ను తీసుకెళ్లి ట్రైన్‌ ఎక్కించాం. అమ్మగారి (రాళ్లపల్లిగారి సతీమణి) గురించి బాధపడవద్దు అని చెప్పాం.

మీ గురువుగారితో మీరు పంచుకున్న ‘బెస్ట్‌ మూమెంట్స్‌’లో మరచిపోలేనివి ఏమైనా..?
చాలా ఉన్నాయి. అప్పుడు నేను నిరుద్యోగిని. గురువుగారు సాంగ్‌ అండ్‌ డ్రామా కంపెనీకి సీతాఫల్‌ మండి నుంచి సైకిల్‌ వేసుకుని సోమాజిగూడ వెళ్లేవారు. వెళ్లేటప్పుడు నన్ను ముందు కూర్చోబెట్టుకుని పద్యాలు పాడుకుంటూ సైకిల్‌ తొక్కేవారు. సాయంత్రం నేను ఆయన్ను కూర్చోబెట్టుకుని సైకిల్‌పై సీతాఫల్‌ మండి నుంచి తీసుకొచ్చేవాణ్ణి. పేదరికం.. ఆ మధ్యతరగతి జీవితం.. ఇలా అన్నీ కలిసి ఎంజాయ్‌ చేశాం. ఈయనకు బేసిక్‌గా ఉన్న వ్యసనం, బలహీనత ‘దానం’ చేయడం. మన దగ్గర 1000 రూపాయలు ఉంటే.. వంద రూపాయలు ఇవ్వడం దానం. 500 ఇవ్వడం అపూర్వం. కానీ వెయ్యి రూపాయలు దానం చేయడం అంటే.. అది  గురువుగారే చేయగలరు.

ఆయన శిష్యుల్లో ఎవరూ అలా ఉన్నదంతా దానం చేసేయకూడదని చెప్పలేదా?
గొప్ప గొప్పవారు ఏదైనా చేస్తుంటే చూసి నేర్చుకోవాలి కానీ ఎందుకు అని అగడకూడదు. ఆయన తత్వం అది. ఊటీలో షూటింగ్‌ జరుగుతోంది ఓసారి. అప్పటికి ఆయన సినిమాకు పదివేల రూపాయలు పారితోషికం తీసుకునేవారు. ఆ షూటింగ్‌లో వందమంది జూనియర్‌ ఆర్టిస్టులు ఉన్నారు. అందరూ చలికి వణికిపోతున్నారు. అది చూసిన రాళ్లపల్లిగారు చలించిపోయి తనకు రావాల్సిన డబ్బులను ముందుగానే నిర్మాత నుంచి తీసుకుని ఆ డబ్బులతో వారికి షాల్స్‌ కొని తీసుకువచ్చారు.

ఇలాంటి ఓ వెయ్యి సంఘటనలను నేను చెప్పగలను. ఎంతోమందిని చదివించారు, పెళ్లిళ్లు చేశారు. ఎన్నో దానాలు చేశారు. ఆయన మంచితనాన్ని  సొమ్ము చేసుకున్నవారూ ఉన్నారు. నాకు కోపం వచ్చేది. కానీ ఆయనకు దానం ఓ వ్యసనం. కర్ణుడిలా అన్నమాట. అప్పట్లో ఆటోవాళ్లు కొట్టుకునేవారు ఆయన్ను తీసుకెళ్లడానికి. మీటర్‌ 100 అయితే 500 ఇచ్చేవారు. ఆయన ‘స్ఫటికం’లాంటి వ్యక్తి. ‘క్రిస్టల్‌ క్లియర్‌’ అంటారు కదా అలా. డబ్బు ఉన్నా లేకున్నా ఆయన సంతోషానికి కొదవ ఉండేది కాదు. మా గురువుగారు ‘నిత్య సంతోషి’.

మీ సినిమా కెరీర్‌... మీరు రచించి, రాళ్లపల్లిగారు నటుడిగా చేసిన సినిమాల గురించి?
నేను చెన్నై వెళ్లినప్పుడు ఓ సందర్భంలో గురువుగారు దర్శకుడు వంశీకి నన్ను పరిచయం చేశారు. ఆయన నాకు కథ చెప్పి కొన్ని రోజులు టైమ్‌ ఇచ్చి ఏడు సీన్లు రాసుకుని తీసుకు రమ్మన్నారు. నేను చాలా స్పీడ్‌గా ఉండేవాణ్ణి. వంశీ ఉదయం చెప్పగానే నేను సాయంత్రానికల్లా ఏడు సీన్లు రాసేశాను. అయితే నా సినిమా కెరీర్‌ మొదలైంది సుమన్‌ నటించిన ‘కంచు కవచం’తో. ఆ సినిమాకు రచయితగా, నటుడిగా చేశాను. ఆ తర్వాత వంశీ ‘ఆలాపన, లేడీస్‌ టైలర్‌’.. చేశాను. ‘లేడీస్‌ టైలర్‌’ సూపర్‌ హిట్‌. అప్పట్నుంచి రైటర్‌గా నేను వెనక్కి తిరిగి చూసుకోలేదు.

రాళ్లపల్లి గారివి కూడా వీటిలో చాలా మంచి పాత్రలు.ఓ తమాషా సంఘటన చెబుతాను. వంశీగారి ప్రతి సినిమాలో రాళ్లపల్లిగారు ఉంటారు. ఓ సినిమా కథ రాస్తున్నప్పుడు ఓ పాత్రకు రాళ్లపల్లిగారి పేరు రాశారు వంశీ. ఆ పేరు కొట్టేసి నేను ఇంకో పేరు రాసి, వేరే పాత్ర (బోయవాడి)కు గురువుగారి పేరు రాశాను. అప్పుడు వంశీ ‘ఆయన ఇంట్లో ఉంటూ ఆయన తిండి తింటూ మీ గురువుగారి పేరు కొట్టేశావేంటి? ఆయనకు ద్రోహం చేస్తున్నావేంటి?’ అన్నారు. లేదు సార్‌.. ఆ వేషం బాగుంటుంది అన్నాను. ఆ పాత్ర గురువుగారికి నిజంగా మంచి పేరు తెచ్చింది.

రాళ్లపల్లిగారు బాగా వంట చేస్తారట?
అవును. వంట సంగతి అడిగితే ఓ సంఘటన గుర్తొచ్చింది. ఓసారి గురువుగారి భార్య పుట్టింటికి వెళ్లారు. రవీంద్రభారతిలో నాటకం అయిపోయి మేం ఇంటికి వచ్చేసరికి రాత్రి 12 అయింది. స్టవ్‌ ఉంది. బియ్యం కడిగాం. చూస్తే అగ్గిపెట్టె లేదు. ఎలాగా అనుకున్నాం. ఆయనకో అలవాటు ఉండేది. చెవిలో అగ్గిపుల్లలు పెట్టుకుని తిప్పేవారు. దాన్ని అలా పైకి విసిరేవారు. అది గుర్తొచ్చి అటకమీద చూస్తే రెండు అగ్గిపుల్లలు ఉన్నాయి.

వాటిలో ఒకటి బాగుంది. ఒక్క అగ్గిపుల్లతో స్టవ్‌ వెలిగించాలి. వెలిగించలేకపోతే ఆ రోజు పస్తే. మీరు వెలిగించండి సార్‌ అన్నాను. నేను వెలిగించడం మిస్సయిందనుకోండి.. నా వల్ల పస్తు ఉండాల్సి వస్తుందేమో అని టెన్షన్‌. మొత్తానికి వెలిగించాం. ఆ రోజు భోజనం తిన్నాం. ఇలాంటి చిన్న చిన్న సంఘటనలు చాలా ఉన్నాయి. వంట అద్భుతంగా చేసేవారు. షూటింగ్‌లో ఈయన సీన్స్‌ ముందుగా తీసి, ఏదోటి చేసి పెట్టవయ్యా అనేవారు దర్శకులు.

ఆయన ఇష్టాలేంటి?
డప్పు బాగా కొట్టగలరు. సంగీతం బాగా వింటారు. పాటలు, పద్యాలు చాలా అందంగా పాడతారు. వంట చేయడం సరే సరి. వాటితోపాటు ఆయనకు ఎప్పటికైనా ఒక్క ఇంటర్నేషనల్‌ అవార్డ్‌ తీసుకోవాలనే కోరిక ఉండేది.

మరి ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నప్పుడు శిష్యులను అడిగేవారా?
ఏనాడూ అడిగింది లేదు. ఆ ఇంట్లో మనిషిగా నన్ను ఎంత బాగా చూసుకున్నారంటే డబ్బు లేక నేను ఇబ్బందిపడతానని, ఫీల్‌ అవుతానని నేను నిద్ర లేవక ముందే నా వెనక జేబులోనో, పర్స్‌లోనో డబ్బులు పెట్టేవారు. (గద్గద స్వరంతో, చెమర్చిన కళ్లతో కాసేపు మౌనం). చెబితే అతిశయోక్తి అనిపిస్తుంది కానీ నేను శబరిమల వెళ్తుండేవాణ్ణి. నా ముందు మా గురువుగారు ఉండేవారు. ఆయనే నాకు అయ్యప్పలా కనిపిస్తుండేవారు. ఏ మాత్రం కల్మషం లేని వ్యక్తి. ప్యూర్‌ హ్యూమన్‌.

పిల్లలకు ఆస్తులు ఇవ్వాలి అనుకునేవారా?
లౌకికం కొంచెం తక్కువ. ఎప్పుడైతే కూతురు పోయిందో డిటాచ్‌ అయిపోయారు. ఆ తర్వాత అంతా పరమేశ్వరుడే చూసుకున్నాడు.  

దైవ భక్తి చాలా ఎక్కువేమో?
బాగా. 28 సార్లు శబరికి వెళ్లారు. ఇల్లు కట్టుకున్నప్పుడు ఆ ఇంటికి ‘మహాతేజ’ అని పేరు  పెట్టుకున్నారు. అంటే.. అయ్యప్ప పేరు. ఆ పేరుని నేను మా అబ్బాయికి పెట్టాను.  పిల్లాడ్ని తీసుకెళ్లి ఆయన ఒళ్లో పడుకోబెట్టి ‘మీరే పిలవండి సార్‌’ అన్నాను.

రాళ్లపల్లిగారి ఆరోగ్యం ఎప్పుడు దెబ్బతింది? మీరు చివరిసారిగా ఎప్పుడు కలిశారు?
కూతురు చనిపోయాక కుంగిపోయారు. 10 ఏళ్ల క్రితం కంటికి సంబంధించిన ఇన్‌ఫెక్షన్‌ ఏదో వచ్చింది. అయినా గమ్మత్తేటంటే పోయిన వారం ఇంటికి వెళ్లినప్పుడు కూడా ఉత్సాహంగానే ఉన్నారు. ఉదయాన్నే నిద్ర లేవడం ఆయనకు అలవాటు. గంధం బొట్టు పెట్టుకుంటారు. వారం క్రితం ఉత్సాహంగా మాట్లాడిన వ్యక్తి ఇలా హఠాత్తుగా దూరం అవుతారని అనుకోం కదా. ఈ బాధను మాటల్లో చెప్పలేను (చెమర్చిన కళ్లతో).

మీరు ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నప్పుడు జరిగిన ఏదైనా ఓ సంఘటన గురించి?
ఏదో ఫంక్షన్‌కి వెళ్లాం. నేను, నా ఫ్యామిలీ ఆయనతో పాటు వెళ్తున్నాం. మా పాప నోట్లో పాలపీక ఉంది. అది పడిపోయింది ఎక్కడో. ఇక గోల. పాలపీక కొనడానికి డబ్బులు లేవు. పీక పావలా అన్నమాట. పావలా కోసం ఇల్లంతా వెతికాను. ఆ తర్వాత గురువుగారే వెళ్లి ఓ ఫ్రెండ్‌ ఇంటి తలుపు కొడితే 20 రూపాయిలు ఇచ్చారు. పాల పీక కొని, మిగతా డబ్బుని అప్పటికప్పుడు ఖర్చు పెట్టేశారు.

నటుడిగా మీ గురువుగారి దగ్గర మీరు పొందిన ప్రశంసలు?
‘ముగింపు లేని కథ’ నాటకంలో గురువుగారిది హీరో పాత్ర. ఇంకో వారంలో నాటకం వేయాలి. ఆయనకు సినిమా అవకాశం వచ్చి వెళ్లిపోయారు. నాటకానికి మళ్లీ రావాలి. అసలే కాంపిటీషన్‌. పోటీకి నాలుగు రోజులు ఉండగా టెలిగ్రామ్‌ పంపారు. ‘నేను రాలేపోతున్నాను. గాడ్‌ బ్లెస్‌ యు. బాగా చేయండి’ అని.  నా గుండె ఆగిపోయింది. ఆ వేషం ఎవరు వేయాలి? అప్పుడు నా వేషం ఇంకొకరికి ఇచ్చి ఆయన పాత్ర నేను వేశా. అది నాకు పెద్ద చాలెంజ్‌. రాళ్లపల్లి గారి నాటకంలో ఆయనకే ఎక్కువ డైలాగ్స్‌ ఉంటాయి.

అంత పెద్ద పాత్ర ఎలా వేయాలా అని రాత్రింబవళ్లు ప్రాక్టీస్‌ చేసి వేశాను. బెస్ట్‌ యాక్టర్‌ అవార్డ్‌ వచ్చింది. ఆ అవార్డ్‌ తీసుకెళ్లి ఇది నా తరఫున ‘గురుదక్షిణ సార్‌’ అని చెప్పాను. చాలా సంతోషపడ్డారు.మామూలుగా శిష్యులకు పేరు వస్తుంటే కొందరు గురువులు అసూయపడతారు. అసూయ ఉండొచ్చేమో. కానీ  ఆయన నా పట్లే కాదు ఎవరి పట్లా అసూయ పడేవారు కాదు. ఆయన మంచి రైజ్‌లో ఉన్నప్పుడు ఎవరో ఒకరిని రికమండ్‌ చేస్తుండేవారు.

రాళ్లపల్లిగారి జీవితంలో అత్యంత విషాదకర సంఘటన ఆయన పెద్ద కుమార్తె విజయ మాధురి మరణం. ఆ తర్వాత చాలా డిప్రెషన్‌లోకి వెళ్లిపోయారట?
ఆ అమ్మాయి డాక్టర్‌ చదువు కోసం రష్యాకు వెళ్తూ చనిపోయింది. ఢిల్లీ వరకూ ఫ్లైట్‌లో పంపించే స్తోమత ఆయనకు ఉంది. స్టూడెంట్స్‌ అందరూ ట్రైన్‌లో వెళ్తారు. పరిచయాలు అవుతాయని ట్రైన్‌లో వెళ్లింది. తనతో పాటుగా వాళ్ల మేనమామ వెళ్లారు. వరంగల్‌లో ఎక్కడో దిగిపోయారాయన. జర్నీలో తనకు బ్రెయిన్‌ ఫీవర్‌ వచ్చింది. ఆగ్రా రీచ్‌ అయ్యే ముందే చనిపోయింది. కూతురి భౌతికకాయాన్ని చూసి, ‘నీ పుట్టుకకు, నీ చావుకి కారణం అయింది కూడా నేనే’ అంటూ చాలా ఏడ్చారు. కూతుర్ని డాక్టర్‌ని చేయాలన్నది ఆయన కల. అందుకే రష్యా పంపించాలనుకున్నారు.

కూతురి మరణం తర్వాత మానసికంగా కుంగిపోయారు. ప్రతి  ఒక్కరికీ మానసికంగా.. ఎందుకు? ఎందుకు? అని డిప్రెషన్‌లో ఉన్న టైమ్‌లో ఒక ట్రాన్స్‌ఫర్మేషన్‌ ట్విస్ట్‌ వస్తుంది. గురువుగారి రెండో అమ్మాయికి పెళ్లి అయింది. కొడుకు లాంటి అల్లుడు దొరికాడు. అక్కడ నుంచి ఆయన మానసికంగా కొంచెం పుంజుకోవడం మొదలెట్టారు. అల్లుడు చాలా జాగ్రత్తగా చూసుకుంటాడు. చిన్నమ్మాయి, అల్లుడు అమెరికాలో ఉంటారు. అమ్మాయి వచ్చేసింది. అల్లుడు నాకు ఫోన్‌ చేసి, ‘నేను వచ్చే వరకూ ఉంచుతారా’ అని చాలా వేడుకోలుగా అడిగాడు. చాలా బాధ కలిగింది. అది గొప్ప విషయం కూడా. అలాంటి అల్లుడు దొరకడం అదృష్టం. అల్లుడి కోసమే గురువుగారి అంత్యక్రియలు 20న అనుకున్నాం.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement