పదకొండున్నరకి లంచ్ ఎందుకు చేయించారో అప్పుడర్థమైంది... | jandhyala.. a heartful director, says rajendra prasad | Sakshi
Sakshi News home page

పదకొండున్నరకి లంచ్ ఎందుకు చేయించారో అప్పుడర్థమైంది...

Published Wed, Jun 18 2014 10:42 PM | Last Updated on Sat, Sep 2 2017 9:00 AM

పదకొండున్నరకి లంచ్ ఎందుకు చేయించారో అప్పుడర్థమైంది...

పదకొండున్నరకి లంచ్ ఎందుకు చేయించారో అప్పుడర్థమైంది...

హీరో రాజేంద్రప్రసాద్ - దర్శకుడు జంధ్యాలది హిట్ కాంబినేషన్. రెండు రెళ్లు ఆరు, అహ నా పెళ్లంట, వివాహ భోజనంబు, జయమ్ము నిశ్చయమ్మురా, విచిత్ర ప్రేమ, ప్రేమ జిందాబాద్... ఇలా అరడజను చిత్రాలు వీరి కలయికలో రూపొందాయి. జంధ్యాలంటే రాజేంద్రప్రసాద్‌కి ప్రాణం. తమది జన్మజన్మల బంధం అంటారాయన. జంధ్యాలతో పరిచయం నుంచి ఇప్పటికీ గుర్తొచ్చే సంఘటనల దాకా రాజేంద్రుని మదిలోని జ్ఞాపకాలు ‘సాక్షి’కి ప్రత్యేకం.
 
ఓ సినిమా షూటింగ్ పని మీద వైజాగ్ వెళ్లాను. కారులో భీమిలి వైపు వెళ్తుంటే, రోడ్డు పక్కన నందమూరి బాలకృష్ణ కనిపించాడు. నేను కారు దిగి ‘‘ఇదేంటి బాలా..! ఇక్కడేం చేస్తున్నావ్?’’ అనడిగా. ఆ పక్కన కొండ మీద కెమెరా యూనిట్ చూపించి ‘‘ ‘బాబాయ్-అబ్బాయ్’ షూటింగ్ జరుగుతోంది’’ అని చెప్పాడు. ఆ సినిమాకి దర్శకుడు జంధ్యాలగారు. నన్నాయనకు పరిచయం చేశాడు బాలకృష్ణ. ఆయన వెంటనే ‘‘ఈ సీన్ చేయడానికి ట్యాక్సీ డ్రైవర్ పాతిక టేక్‌లు తిన్నాడు. ఆ వేషం మీరు వేస్తారా?’’ అనడిగారు. నేను ఎస్, నో చెప్పక ముందే డ్రైవర్ దగ్గర్నుంచీ ఖాకీ చొక్కా తీసేసుకుని నాకిచ్చి వేసుకోమన్నారు. అంత పెద్ద వ్యక్తి అడిగితే చేయననడం బాగోదని, ఏదో ఓ ట్రాన్స్‌లో ఉన్నట్టుగా నేను ఆ ట్యాక్సీ డ్రైవర్ వేషం చేసేశాను. సింగిల్ టేక్‌లో షాట్ ఓకే. ‘‘ఏంటండీ... నాతో మరీ జూనియర్ ఆర్టిస్ట్ వేషం వేయించారు’’ అన్నాను. ‘‘దేవుడు మనిద్దర్నీ కలిపాడు. చూద్దాం... ఏమవుతుందో’’ అన్నారాయన.
 
  కొన్ని రోజుల తర్వాత... జంధ్యాలగారి నుంచి ‘రెండు రెళ్ళు ఆరు’ కోసం కబురొచ్చింది. చంద్రమోహన్‌గారు, నేనూ హీరోలం. నాపై తీసిన ఫస్ట్ షాట్ డైలాగ్ ఏంటో తెలుసా? ‘‘ఏంటయ్యా... నేను కమెడియన్‌లా కనిపిస్తున్నానా? నేను హీరోని’’. ఇంతవరకూ బాగానే ఉంది. ఆ నెక్ట్స్ షాట్ మాత్రం నన్ను ఇరుకున పడేసింది. విఠలాచార్య సినిమాల్లో హీరో నరసింహరాజు కాస్ట్యూమ్ లాంటి దొకటి తీసుకొచ్చి నన్ను వేసుకోమన్నారు. రాజు గెటప్ అన్న మాట. నేను గుర్రం మీద ఓ పాడుబడిన కోట దగ్గరకు వెళ్లి ‘ఇది ఎవరి సంస్థానం?’ అనడగడంతో సినిమా టైటిల్స్ మొదలవుతాయి. ‘ఏమిటీ పిచ్చి డెరైక్షన్... ఎవడు డెరైక్టర్?’ అని నేను అడిగినప్పుడు, ఆ షాట్ ఫ్రీజ్ చేసి జంధ్యాల గారి పేరు వేస్త్తారన్నమాట. ఇలా మీ గురించి నేను కామెంట్ చేస్తే ‘జనం నన్ను తిడతారండీ’ అన్నాను. ‘‘రేపు థియేటర్‌లో చూడు... జనం దీనికి క్లాప్స్ కొడతారు’’ అని జంధ్యాలగారు ఒత్తిడి చేయడంతో, నేను ఇబ్బంది పడుతూనే ఆ షాట్ చేశాను. నిజంగానే ఆ షాట్‌కి థియేటర్లో క్లాప్స్ పడ్డాయి.
 
  ‘రెండు రెళ్లు ఆరు’లో నాది చాలా మంచి వేషం. ప్రముఖ మెజీషియన్ బీవీ పట్టాభిరామ్‌గారు, జంధ్యాల గారికి క్లోజ్ ఫ్రెండ్. ఈ సినిమాలో నేను కొన్ని మేజిక్స్ చేయాలి. అందుకోసం నన్ను పట్టాభిరామ్‌గారి దగ్గర మూడు రోజులు మేజిక్స్ నేర్చుకోమన్నారు. ఒక్క రోజులోనే నేర్చేసుకుని జంధ్యాల గారికి చూపిస్తే ఆనందపడిపోయారు.  ఇక ‘వివాహ భోజనంబు’లో నాతో తొలిసారిగా లేడీ గెటప్ వేయించారు. అది జంధ్యాలగారి గొప్పతనమే. ‘వివాహ భోజనంబు’లో హీరోయిన్ ఇంటి ఎదురుగా నేను కానిస్టేబుల్ వేషంలో ఉండే ఎపిసోడ్‌లో నాకు అస్సలు డైలాగులు ఉండవు. అప్పుడు నేనిచ్చే ఎక్స్‌ప్రెషన్స్‌కి పొట్ట పట్టుకుని నవ్వాల్సిందే. డైలాగులు కూడా లేకుండా కామెడీ పుట్టించాలంటే జంధ్యాల గారి తర్వాతే ఎవరైనా.
 
  ‘వివాహ భోజనంబు’ షూటింగ్ వైజాగ్‌లో జరుగుతోంది. అప్పుడు టైమ్ ఉదయం పదకొండున్నర అవుతోంది. జంధ్యాలగారు నా దగ్గరకొచ్చి ‘‘బాగా ఆకలేస్తోంది. లంచ్‌కి వెళ్దాం పద’’ అన్నారు. ఇప్పుడు లంచ్ ఏంటండీ? అన్నాను. బలవంతంగా తీసుకెళ్లారు. జంధ్యాలగారు మంచి భోజన ప్రియులు. మేం రెగ్యులర్‌గా కలిసే భోంచేస్తుంటాం. నేను ఆయన కోసమని లంచ్ చేస్తున్నాను. అయితే అంత ఆకలి అన్న జంధ్యాలగారు పెద్దగా తినడం లేదు. ఆయన కళ్లల్లో నీళ్లు తిరుగుతుంటే, కర్చీఫ్‌తో తుడుచుకుంటున్నారు. సమ్‌థింగ్ రాంగ్ అనిపించి, ‘‘ఏం జరిగిందండీ?’’ అనడిగాను. ఆయన ఏం మాట్లాడలేదు. నా లంచ్ పూర్తయ్యాక, ‘‘ప్రసాద్..! అర్జంట్‌గా మీ ఊరు బయల్దేరు. మీ నాన్నగారు నిన్ను చూడాలనుకుంటున్నారట. కారు రెడీ’’ అని చెప్పారు. నాకు విషయం అర్థమైపోయింది. మా నాన్నగారు చనిపోయారన్న వార్త తెలిసి, ఇలా చేశారని అర్థమైంది. నా గురించి ఎంత కేర్ తీసుకున్నారో అనిపించింది.
 
  మా ఇద్దరి కాంబినేషన్‌లో నెంబర్‌వన్ - ‘అహ నా పెళ్లంట’. ఆ సినిమా గురించి మాట్లాడుకోని తెలుగువాడు ఉండరంటే అతిశయోక్తి కాదు. నిర్మాత డి. రామానాయుడు గారికి స్టోరీ లైన్ చెబితే నచ్చేసింది. కానీ ఫుల్ స్క్రిప్ట్ ఉంటేనే షూటింగ్ మొదలుపెడతానని చెప్పారట. మరి ఈయనకు పౌరుషం వచ్చిందో ఏమో, రాత్రికి రాత్రి కూర్చుని ‘అహ నా పెళ్లంట’ స్క్రిప్ట్ రాసేశారు. నేను చాలామంది దర్శకులతో పని చేశాను కానీ, జంధ్యాల తరహా పనితీరు ఎక్కడా చూడలేదు. ఆయన షూటింగ్ అంటే ఓ పిక్నిక్ కింద లెక్క. ఎంత సందడిగా ఉంటుందో. ఆయన మాట్లాడే ప్రతి మాటలోనూ ఫన్ ఉంటుంది. అలాగే ఎవర్నీ హర్ట్ చేసిన సందర్భం లేదు. బాగా కోపం వచ్చిందంటే... ఓ చోట సెలైంట్‌గా కూర్చునేవారు తప్ప, ఒక్క పరుష వాక్యం మాట్లాడేవారు కాదు.
 
  చుట్టుపక్కల జరిగేవాటి నుంచే ఆయన బోలెడంత కామెడీ పుట్టిస్తారు. అప్పటికప్పుడు సీన్లు సృష్టించేస్తారు. స్పాట్ ఇంప్రొవైజేషన్స్ బ్రహ్మాండం. జంధ్యాల ఎంత గొప్పగా రాసేవారో, అంత గొప్పగా మాట్లాడేవారు. అంతకన్నా గొప్పగా డెరైక్షన్ చేసేవారు. ఆయనలోని మరో గొప్ప విషయం - ఏదీ శ్రుతి మించకపోవడం. బూతు అనేది ఆయన అక్షరాల్లో భూతద్దం వేసినా కనబడదు. అంతా సహజత్వమే. ఎక్కడా కృత్రిమత్వం ఉండదు. ఆయన కామెడీ ప్రాణంతో ఉన్న బొమ్మ లాంటిది. జంధ్యాల ఓ క్రియేటివ్ జీనియస్. కొంతమంది గొప్ప గొప్ప వాళ్లని దేవుడు ఏదో అర్జంట్ పని ఉన్నట్టుగా పైకి తీసుకుపోతాడు. ఈ కెరీర్‌లో దేవుడు నాకు ఇచ్చిన గొప్ప అందమైన కల జంధ్యాలగారు. ఆయన ఎప్పుడూ గుర్తొస్తుంటారు. జంధ్యాలగారు నాకు బ్రదరా? బాబాయా? బావా? తండ్రా? స్నేహితుడా? ఏమో... మా ఇద్దరి మధ్య ఏదో రుణానుబంధం ఉన్నట్టే అనిపిస్తుంది. ఓ బిడ్డను చూసుకున్నట్టుగానే నన్ను చూసుకున్నారు. జంధ్యాల గారు బతికి ఉండి ఉంటే మా కాంబినేషన్‌లో మరిన్ని ‘అహ నా పెళ్లంట’లు వచ్చేవి.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement