లాస్ట్ మినిట్ లో ఆ వేషం సృష్టించారు.. | Jandhyala stated the word suthi | Sakshi
Sakshi News home page

లాస్ట్ మినిట్ లో ఆ వేషం సృష్టించారు..

Published Wed, Aug 5 2015 10:26 PM | Last Updated on Sun, Sep 3 2017 6:50 AM

లాస్ట్ మినిట్ లో ఆ వేషం సృష్టించారు..

లాస్ట్ మినిట్ లో ఆ వేషం సృష్టించారు..

‘సుత్తి’ని కూడా కామెడీకి వాడుకున్న ఘనత జంధ్యాలది. 33 ఏళ్లుగా ‘సుత్తి’ అనే పదం తెలుగు నాట ఓ నానుడై పోయింది. అందుకు నాంది ఈ ‘నాలుగు స్థంభాలాట’ సినిమా. ఈ ‘సుత్తి’ పుణ్యమా అని నటుడు వేలు కొన్నేళ్ల పాటు కామెడీ ప్రపంచాన్ని ఏలిపారేశారు. రేపు (శుక్రవారం) ‘సుత్తి’ వేలు జయంతి. ఈ సందర్భంగా ఆయన ‘సుత్తి’నోసారి స్తుతించుకుందాం.
 
సినిమా పేరు        :    నాలుగు స్థంభాలాట (1982)
డెరైక్ట్ చేసింది         :    జంధ్యాల
సినిమా తీసింది      :    ‘నవతా’ కృష్ణంరాజు
మాటలు రాసింది   :    జంధ్యాల

వీరభద్రం అంటే అందరికీ దడా, వణుకూ, హడల్. అలాగని ఆయనో అరివీర భయంకరుడైన రౌడీనో, దాదానో, ఖూనీకోరో అనుకుంటే మాత్రం మీరు చికెన్ కర్రీలో కాలేసినట్టే. ఆఫ్ట్రాల్ ఆయనో పెద్ద మనిషంతే. ఓ భార్యా... ఓ కొడుకూ... ఓ కూతురూ... ఓ గుమాస్తా... కొంతమంది అనాధ పిల్లలూ. ఇదీ అతని లైఫ్‌బుక్ ప్రొఫైల్. తెలుగంటే పడి చస్తాడు. ఇంగ్లీషంటే ఏడ్చి చస్తాడు. ఏదైనా లెక్క ప్రకారం ఉంటాడు. తిక్కగా కూడా ఉంటాడు. చాదస్తాన్ని జిరాక్స్ చేస్తే అచ్చం వీరభద్రంలానే ఉంటుంది.
 
వీరభద్రం బాధిత పీడితుల్లో నెంబర్‌వన్ క్యాండిడేట్ ఎవరంటే - గుమాస్తా గుర్నాథం. బతకలేక బడిపంతుల్లాగా, గతిలేక ఈ గుమాస్తా గిరీ వెలగబెడుతుంటాడు పాపం. ఆలస్యంగా వచ్చినా వీరభద్రంతో చిక్కే. పెందలాడే వచ్చినా చిక్కే.
ఆ రోజు గుర్నాథం ఎంటరయ్యీ ఎంటరవ్వడంతోటే వీరభద్రంతో అక్షింతలు చల్లించుకున్నాడు.
‘‘బుద్ధి లేదటయ్యా నీకు! కాస్త పెందలాడే వచ్చి లెక్కాడొక్కా చూద్దామన్న జ్ఞానం ఉండక్కర లేదటయ్యా గుర్నాథం!’’ అని కయ్‌మన్నాడు వీరభద్రం.
‘‘అదేంటయ్యా... ఈ రోజు రోజూ కన్నా పావుగంట ముందొస్తేనూ’’ అని కౌంటరిచ్చాడు గుర్నాథం.
‘‘ఆ... ఆ... ముందెందుకొచ్చావ్. అసలు ముందెందుకొచ్చావని అడుగుతున్నాను. కాలజ్ఞానం లేకపోతే ఎలా పైకొస్తావ్. జ్ఞానం లేదటయ్యా. నిన్నూ, ఈ దేశాన్నీ బాగుచేయడం నావల్ల కాదు’’ అని రెచ్చిపోయాడు వీరభద్రం.
‘‘మహాప్రభో... ఇలా సుత్తి దెబ్బలు కొట్టకండి. అర్భకపు వెధవని. త్వరగా మీ సుత్తి దాచేయండి మహాప్రభో... దాచేయండి’’ అంటూ వీరభద్రం కాళ్ల మీద పడిపోయాడు గుర్నాథం.
అయినా ఆపకుండా క్లాస్ పీకుతూనే ఉన్నాడు వీరభద్రం. ఈ గోల కారణంగా గుర్నాథం సరిగ్గా చిట్టాపద్దులు కూడా రాయలేకపోతున్నాడు.
‘కత్తి సుబ్బారావు’ పేరుకి బదులు ‘సుత్తి సుబ్బారావు’ అని రాసేసి వీరభద్రంతో చీవాట్లు కూడా తింటాడు.

ఆ రోజు చిట్టాపద్దులు చెక్ చేస్తున్నాడు వీరభద్రం. గుర్నాథం టెన్షన్‌గా చూస్తున్నాడు. ఓ చోట తప్పు చేసి దొరికేశాడు.
 ‘‘సిగ్గూ ఎగ్గూ ఉన్న సన్నాసివైతే... ఇలా పిల్లల భోజనాల పద్దులో తలనొప్పి బిళ్లల ఖర్చు రాస్తావా?... చెప్పు ఎందుకొచ్చాయివి?’’ అని ఇల్లెగిరిపోయేలా అరిచాడు వీరభద్రం. ‘‘అయ్యా! అవి నేను వేసుకున్నవండయ్యా’’ అని భయంతో కూడిన, వినయంతో కూడిన గౌరవంతో జవాబిచ్చాడు గుర్నాథం.
 ‘‘చేతులతో పని చేస్తుంటే తలకు, మొలకు నొప్పులేవిటి నీ శ్రాద్ధం’’ అని మళ్లీ అరిచాడు వీరభద్రం.
 ‘‘చేతులతో చేస్తే రాదండయ్యా... కానీ ఈ మధ్య నా చేతుల కంటే చెవులకే పని ఎక్కువయిపోయిందండయ్యా.. మీ సుత్తి పుణ్యమా అని’’ అసహనంగా సమాధానమిచ్చాడు గుర్నాథం.
 ‘‘అందుకే ఉదయాన్నే లేవగానే సూర్య నమస్కారాలు, యోగాసనాలు వేయమన్నాను. దాంతో నీ దగ్గరకు ఏ జబ్బూ రాదు గాక రాదు. అసలు సూర్య నమస్కారాల యొక్క ప్రాధాన్యత తెలుసా నీకు?’’ అని ‘సుత్తి’ కొట్టడం స్టార్ట్ చేశాడు వీరభద్రం.
 పాపం గుర్నాథం చెవులు మూసుకున్నాడు. కళ్లు మూసుకున్నాడు. నోరు మూసుకున్నాడు. అన్నీ మూసుకున్నా సరే... వీరభద్రం వదిలి చావడే!
 
వీధి అరుగు మీద గుర్నాథం గుర్రుపెట్టి నిద్ద రోతున్నాడు.
వీరభద్రం కూతురు వచ్చి నిద్రలేపి ‘‘బాబాయ్ గారూ! ఇక్కడ పడుకున్నారేంటి?’’ అనడిగింది.
‘‘అమ్మాయ్... ఏం చేస్తాం? మీ నాన్నగారి సుత్తి కారణంగా నాకేమీ తెలియడం లేదు’’ అని వాపోయాడు.
‘‘అవునూ! మీరెప్పుడూ సుత్తి... సుత్తి అంటుంటారు. అంటే ఏంటండీ?’’ అని ఆసక్తిగా అడిగిందా అమ్మాయి.
గుర్నాథం ‘సుత్తి’ హిస్టరీ చెప్పడం మొదలుపెట్టాడు.
‘‘ఈ సుత్తి అనే పదం కలియుగంలో కాదమ్మా... త్రేతాయుగంలోనిది. వనవాసానికి వెళ్లిన శ్రీరామచంద్రుణ్ణి వెతుక్కుంటూ భరతుడు కూడా అడవికి వెళ్లాడు. అక్కడ రాములవారిని కలిసి ‘‘అయ్యా! నువ్వు వెనక్కు తిరిగొచ్చేసి... రాజ్యమేలుకో తండ్రీ’’ అనడిగాడు.
 
దానికి శ్రీరామచంద్రుడు ‘‘తమ్ముడూ భరతా! పితృ వాక్య పరిపాలనాదక్షుడైన ఓ పుత్రుడిగా, సత్యశీలత కలిగిన ఓ వ్యక్తిగా, ఆడిన మాట తప్పని ఓ మనిషిగా, జాతికి నీతి నేర్పగల ఓ పుణ్యపురుషుడిగా, ప్రజల శ్రేయస్సు కాంక్షించే ఓ రాజకుమారుడిగా... నాన్నగారి మాట నేను జవదాటలేను. తమ్ముడూ! నేను రాజ్యానికి రాను... రాజ్యానికి రాలేను’’ అని చెప్పాడు.
ఆ వాక్ప్రవాహానికి శోష వచ్చి పడిపోయిన భరతుడు కాసేపటికి తేరుకుని ‘‘అన్నయ్యా! నేను రాను అని ఒక్క మాట చెబితే చాలదా... ఇంత సుత్తి ఎందుకూ?’’ అన్నాడు. ఇలా ఆ భరతుడి నోట్లోంచి రాలిన ‘సుత్తి’ భారతదేశంలో వాడుకలోకొచ్చిందన్న మాట.
అమ్మా... ఈ సుత్తుల్లో చాలా రకాలున్నాయి.
ఒక్కోడు ఠంగు ఠంగుమని గడియారం గంటకొట్టినట్టు సుత్తేస్తాడు. మీ నాన్నగారిలాగా. దాన్ని ఇనుప సుత్తి అంటారు. అంటే ఐరన్ హేమరింగ్ అన్నమాట.
ఇంకోడు సుత్తేసినట్టు తెలీయకుండా మెత్తగా వేస్తాడు. రబ్బరు సుత్తి. అంటే.. రబ్బర్ హేమరింగ్ అన్నమాట. ఇంకోడు అందరికీ కలిపి సామూహికంగా సుత్తేస్తాడు. సామూహిక సుత్తి. దీన్నే మాస్ హేమరింగ్ అన్నమాట. అంటే... రాజకీయనాయకుల మీటింగులు ఈ టైప్ అన్నమాట. పోతే... ఇంకో టైప్ ఉంది. మీ నాన్నగారు సుత్తేద్దామని వచ్చారనుకో! నేనే ఎదురు తిరిగి సుత్తేశాననుకో! ఉత్తినే అనుకుందాం. ఇది జరిగేపని కాదనుకో. దీన్ని ఎదురు సుత్తి అంటారు. రివర్స్ సుత్తి అంటారు.  రివర్స్ హేమరింగ్ అన్నమాట. ఇలా చెప్పుకుంటూ పోతే నాది సుదీర్ఘ సుత్తి అవుతుందమ్మా. అంటే... ప్రొలాంగ్డ్ హేమరింగ్ అన్నమాట. వెళ్లమ్మా వెళ్లు... వెళ్లి నీ పని చేసుకో’’ అని ఆవులిస్తూ ఆ అరుగు మీదే తుండుగుడ్డ వేసుకుని మునగదీసుకు పడుకున్నాడు గుర్నాథం.
పాపం గుర్నాథం కల నిజం కావాలని... అతని సుత్తికి వీరభద్రం చిత్తయిపోవాలని... మనసారా సుత్తిస్తూ కోరుకుందాం!
- పులగం చిన్నారాయణ
 
లాస్ట్ మినిట్‌లో ఈ గుర్నాథం పాత్ర సృష్టించారు!
‘‘జంధ్యాల గారి తొలి సినిమా ‘ముద్ద మందారం’ నాక్కూడా ఫస్ట్ పిక్చర్. అందులో హోటల్ మేనేజర్‌గా చాలా చిన్న వేషం వేశా. ఆయన రెండో సినిమా ‘మల్లె పందిరి’లో కూడా చేశా. ‘నాలుగు స్థంభాలాట’ షూటింగ్ వైజాగ్‌లో జరుగుతుంటే వెళ్లి జంధ్యాల గారిని కలిశా. నాలుగైదు రోజులు ఉద్యోగానికి సెలవు పెట్టి రమ్మన్నారు. వీరభద్రరావు గారికి గుమాస్తా వేషం. మొదట స్క్రిప్టులో ఈ వేషం లేదు. ఏదో వంటవాడి వేషం అనుకుని సత్తిబాబుతో చేయించాలనుకున్నారట. అయితే అది కథకు అడ్డం పడుతుందని, లాస్ట్ మినిట్‌లో ఈ గుమాస్తా వేషం సృష్టించారు. ‘సుత్తి’ అనే పదం ఇంత క్లిక్ అవుతుందని, అదే నా ఇంటిపేరు అవుతుందని అస్సలు అనుకోలేదు. ఈ ‘సుత్తి’తో నేను పాపులరైపోయి, సినిమా ఇండస్ట్రీలో స్థిరపడిపోయా. ఈ గుమాస్తా గుర్నాథం పాత్రకు డబ్బింగ్ చెప్పడానికి ఎనిమిది గంటలు పట్టింది. చాలా ఓపిగ్గా నాతో డబ్బింగ్ చెప్పించారు. జంధ్యాల గారు డెరైక్ట్ చేసిన అన్ని సినిమాల్లోనూ దాదాపుగా నాకు స్థానం దక్కడం నా అదృష్టం.’’
- కీ.శే. ‘సుత్తి’ వేలు (గతంలో జరిపిన సంభాషణ ఆధారంగా...)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement