pulagam cinnarayana
-
లాస్ట్ మినిట్ లో ఆ వేషం సృష్టించారు..
‘సుత్తి’ని కూడా కామెడీకి వాడుకున్న ఘనత జంధ్యాలది. 33 ఏళ్లుగా ‘సుత్తి’ అనే పదం తెలుగు నాట ఓ నానుడై పోయింది. అందుకు నాంది ఈ ‘నాలుగు స్థంభాలాట’ సినిమా. ఈ ‘సుత్తి’ పుణ్యమా అని నటుడు వేలు కొన్నేళ్ల పాటు కామెడీ ప్రపంచాన్ని ఏలిపారేశారు. రేపు (శుక్రవారం) ‘సుత్తి’ వేలు జయంతి. ఈ సందర్భంగా ఆయన ‘సుత్తి’నోసారి స్తుతించుకుందాం. సినిమా పేరు : నాలుగు స్థంభాలాట (1982) డెరైక్ట్ చేసింది : జంధ్యాల సినిమా తీసింది : ‘నవతా’ కృష్ణంరాజు మాటలు రాసింది : జంధ్యాల వీరభద్రం అంటే అందరికీ దడా, వణుకూ, హడల్. అలాగని ఆయనో అరివీర భయంకరుడైన రౌడీనో, దాదానో, ఖూనీకోరో అనుకుంటే మాత్రం మీరు చికెన్ కర్రీలో కాలేసినట్టే. ఆఫ్ట్రాల్ ఆయనో పెద్ద మనిషంతే. ఓ భార్యా... ఓ కొడుకూ... ఓ కూతురూ... ఓ గుమాస్తా... కొంతమంది అనాధ పిల్లలూ. ఇదీ అతని లైఫ్‌బుక్ ప్రొఫైల్. తెలుగంటే పడి చస్తాడు. ఇంగ్లీషంటే ఏడ్చి చస్తాడు. ఏదైనా లెక్క ప్రకారం ఉంటాడు. తిక్కగా కూడా ఉంటాడు. చాదస్తాన్ని జిరాక్స్ చేస్తే అచ్చం వీరభద్రంలానే ఉంటుంది. వీరభద్రం బాధిత పీడితుల్లో నెంబర్‌వన్ క్యాండిడేట్ ఎవరంటే - గుమాస్తా గుర్నాథం. బతకలేక బడిపంతుల్లాగా, గతిలేక ఈ గుమాస్తా గిరీ వెలగబెడుతుంటాడు పాపం. ఆలస్యంగా వచ్చినా వీరభద్రంతో చిక్కే. పెందలాడే వచ్చినా చిక్కే. ఆ రోజు గుర్నాథం ఎంటరయ్యీ ఎంటరవ్వడంతోటే వీరభద్రంతో అక్షింతలు చల్లించుకున్నాడు. ‘‘బుద్ధి లేదటయ్యా నీకు! కాస్త పెందలాడే వచ్చి లెక్కాడొక్కా చూద్దామన్న జ్ఞానం ఉండక్కర లేదటయ్యా గుర్నాథం!’’ అని కయ్‌మన్నాడు వీరభద్రం. ‘‘అదేంటయ్యా... ఈ రోజు రోజూ కన్నా పావుగంట ముందొస్తేనూ’’ అని కౌంటరిచ్చాడు గుర్నాథం. ‘‘ఆ... ఆ... ముందెందుకొచ్చావ్. అసలు ముందెందుకొచ్చావని అడుగుతున్నాను. కాలజ్ఞానం లేకపోతే ఎలా పైకొస్తావ్. జ్ఞానం లేదటయ్యా. నిన్నూ, ఈ దేశాన్నీ బాగుచేయడం నావల్ల కాదు’’ అని రెచ్చిపోయాడు వీరభద్రం. ‘‘మహాప్రభో... ఇలా సుత్తి దెబ్బలు కొట్టకండి. అర్భకపు వెధవని. త్వరగా మీ సుత్తి దాచేయండి మహాప్రభో... దాచేయండి’’ అంటూ వీరభద్రం కాళ్ల మీద పడిపోయాడు గుర్నాథం. అయినా ఆపకుండా క్లాస్ పీకుతూనే ఉన్నాడు వీరభద్రం. ఈ గోల కారణంగా గుర్నాథం సరిగ్గా చిట్టాపద్దులు కూడా రాయలేకపోతున్నాడు. ‘కత్తి సుబ్బారావు’ పేరుకి బదులు ‘సుత్తి సుబ్బారావు’ అని రాసేసి వీరభద్రంతో చీవాట్లు కూడా తింటాడు. ఆ రోజు చిట్టాపద్దులు చెక్ చేస్తున్నాడు వీరభద్రం. గుర్నాథం టెన్షన్‌గా చూస్తున్నాడు. ఓ చోట తప్పు చేసి దొరికేశాడు. ‘‘సిగ్గూ ఎగ్గూ ఉన్న సన్నాసివైతే... ఇలా పిల్లల భోజనాల పద్దులో తలనొప్పి బిళ్లల ఖర్చు రాస్తావా?... చెప్పు ఎందుకొచ్చాయివి?’’ అని ఇల్లెగిరిపోయేలా అరిచాడు వీరభద్రం. ‘‘అయ్యా! అవి నేను వేసుకున్నవండయ్యా’’ అని భయంతో కూడిన, వినయంతో కూడిన గౌరవంతో జవాబిచ్చాడు గుర్నాథం. ‘‘చేతులతో పని చేస్తుంటే తలకు, మొలకు నొప్పులేవిటి నీ శ్రాద్ధం’’ అని మళ్లీ అరిచాడు వీరభద్రం. ‘‘చేతులతో చేస్తే రాదండయ్యా... కానీ ఈ మధ్య నా చేతుల కంటే చెవులకే పని ఎక్కువయిపోయిందండయ్యా.. మీ సుత్తి పుణ్యమా అని’’ అసహనంగా సమాధానమిచ్చాడు గుర్నాథం. ‘‘అందుకే ఉదయాన్నే లేవగానే సూర్య నమస్కారాలు, యోగాసనాలు వేయమన్నాను. దాంతో నీ దగ్గరకు ఏ జబ్బూ రాదు గాక రాదు. అసలు సూర్య నమస్కారాల యొక్క ప్రాధాన్యత తెలుసా నీకు?’’ అని ‘సుత్తి’ కొట్టడం స్టార్ట్ చేశాడు వీరభద్రం. పాపం గుర్నాథం చెవులు మూసుకున్నాడు. కళ్లు మూసుకున్నాడు. నోరు మూసుకున్నాడు. అన్నీ మూసుకున్నా సరే... వీరభద్రం వదిలి చావడే! వీధి అరుగు మీద గుర్నాథం గుర్రుపెట్టి నిద్ద రోతున్నాడు. వీరభద్రం కూతురు వచ్చి నిద్రలేపి ‘‘బాబాయ్ గారూ! ఇక్కడ పడుకున్నారేంటి?’’ అనడిగింది. ‘‘అమ్మాయ్... ఏం చేస్తాం? మీ నాన్నగారి సుత్తి కారణంగా నాకేమీ తెలియడం లేదు’’ అని వాపోయాడు. ‘‘అవునూ! మీరెప్పుడూ సుత్తి... సుత్తి అంటుంటారు. అంటే ఏంటండీ?’’ అని ఆసక్తిగా అడిగిందా అమ్మాయి. గుర్నాథం ‘సుత్తి’ హిస్టరీ చెప్పడం మొదలుపెట్టాడు. ‘‘ఈ సుత్తి అనే పదం కలియుగంలో కాదమ్మా... త్రేతాయుగంలోనిది. వనవాసానికి వెళ్లిన శ్రీరామచంద్రుణ్ణి వెతుక్కుంటూ భరతుడు కూడా అడవికి వెళ్లాడు. అక్కడ రాములవారిని కలిసి ‘‘అయ్యా! నువ్వు వెనక్కు తిరిగొచ్చేసి... రాజ్యమేలుకో తండ్రీ’’ అనడిగాడు. దానికి శ్రీరామచంద్రుడు ‘‘తమ్ముడూ భరతా! పితృ వాక్య పరిపాలనాదక్షుడైన ఓ పుత్రుడిగా, సత్యశీలత కలిగిన ఓ వ్యక్తిగా, ఆడిన మాట తప్పని ఓ మనిషిగా, జాతికి నీతి నేర్పగల ఓ పుణ్యపురుషుడిగా, ప్రజల శ్రేయస్సు కాంక్షించే ఓ రాజకుమారుడిగా... నాన్నగారి మాట నేను జవదాటలేను. తమ్ముడూ! నేను రాజ్యానికి రాను... రాజ్యానికి రాలేను’’ అని చెప్పాడు. ఆ వాక్ప్రవాహానికి శోష వచ్చి పడిపోయిన భరతుడు కాసేపటికి తేరుకుని ‘‘అన్నయ్యా! నేను రాను అని ఒక్క మాట చెబితే చాలదా... ఇంత సుత్తి ఎందుకూ?’’ అన్నాడు. ఇలా ఆ భరతుడి నోట్లోంచి రాలిన ‘సుత్తి’ భారతదేశంలో వాడుకలోకొచ్చిందన్న మాట. అమ్మా... ఈ సుత్తుల్లో చాలా రకాలున్నాయి. ఒక్కోడు ఠంగు ఠంగుమని గడియారం గంటకొట్టినట్టు సుత్తేస్తాడు. మీ నాన్నగారిలాగా. దాన్ని ఇనుప సుత్తి అంటారు. అంటే ఐరన్ హేమరింగ్ అన్నమాట. ఇంకోడు సుత్తేసినట్టు తెలీయకుండా మెత్తగా వేస్తాడు. రబ్బరు సుత్తి. అంటే.. రబ్బర్ హేమరింగ్ అన్నమాట. ఇంకోడు అందరికీ కలిపి సామూహికంగా సుత్తేస్తాడు. సామూహిక సుత్తి. దీన్నే మాస్ హేమరింగ్ అన్నమాట. అంటే... రాజకీయనాయకుల మీటింగులు ఈ టైప్ అన్నమాట. పోతే... ఇంకో టైప్ ఉంది. మీ నాన్నగారు సుత్తేద్దామని వచ్చారనుకో! నేనే ఎదురు తిరిగి సుత్తేశాననుకో! ఉత్తినే అనుకుందాం. ఇది జరిగేపని కాదనుకో. దీన్ని ఎదురు సుత్తి అంటారు. రివర్స్ సుత్తి అంటారు. రివర్స్ హేమరింగ్ అన్నమాట. ఇలా చెప్పుకుంటూ పోతే నాది సుదీర్ఘ సుత్తి అవుతుందమ్మా. అంటే... ప్రొలాంగ్డ్ హేమరింగ్ అన్నమాట. వెళ్లమ్మా వెళ్లు... వెళ్లి నీ పని చేసుకో’’ అని ఆవులిస్తూ ఆ అరుగు మీదే తుండుగుడ్డ వేసుకుని మునగదీసుకు పడుకున్నాడు గుర్నాథం. పాపం గుర్నాథం కల నిజం కావాలని... అతని సుత్తికి వీరభద్రం చిత్తయిపోవాలని... మనసారా సుత్తిస్తూ కోరుకుందాం! - పులగం చిన్నారాయణ లాస్ట్ మినిట్‌లో ఈ గుర్నాథం పాత్ర సృష్టించారు! ‘‘జంధ్యాల గారి తొలి సినిమా ‘ముద్ద మందారం’ నాక్కూడా ఫస్ట్ పిక్చర్. అందులో హోటల్ మేనేజర్‌గా చాలా చిన్న వేషం వేశా. ఆయన రెండో సినిమా ‘మల్లె పందిరి’లో కూడా చేశా. ‘నాలుగు స్థంభాలాట’ షూటింగ్ వైజాగ్‌లో జరుగుతుంటే వెళ్లి జంధ్యాల గారిని కలిశా. నాలుగైదు రోజులు ఉద్యోగానికి సెలవు పెట్టి రమ్మన్నారు. వీరభద్రరావు గారికి గుమాస్తా వేషం. మొదట స్క్రిప్టులో ఈ వేషం లేదు. ఏదో వంటవాడి వేషం అనుకుని సత్తిబాబుతో చేయించాలనుకున్నారట. అయితే అది కథకు అడ్డం పడుతుందని, లాస్ట్ మినిట్‌లో ఈ గుమాస్తా వేషం సృష్టించారు. ‘సుత్తి’ అనే పదం ఇంత క్లిక్ అవుతుందని, అదే నా ఇంటిపేరు అవుతుందని అస్సలు అనుకోలేదు. ఈ ‘సుత్తి’తో నేను పాపులరైపోయి, సినిమా ఇండస్ట్రీలో స్థిరపడిపోయా. ఈ గుమాస్తా గుర్నాథం పాత్రకు డబ్బింగ్ చెప్పడానికి ఎనిమిది గంటలు పట్టింది. చాలా ఓపిగ్గా నాతో డబ్బింగ్ చెప్పించారు. జంధ్యాల గారు డెరైక్ట్ చేసిన అన్ని సినిమాల్లోనూ దాదాపుగా నాకు స్థానం దక్కడం నా అదృష్టం.’’ - కీ.శే. ‘సుత్తి’ వేలు (గతంలో జరిపిన సంభాషణ ఆధారంగా...) -
మైండ్ బ్లాక్ చేసింది
సినిమా వెనుక స్టోరీ 14 రీళ్ల సినిమాలో ఎన్నో మలుపులు, మెరుపులు. అవి ఉంటేనే బాక్సాఫీస్ దగ్గర ఉరుములూ మెరుపులూ. ఆ మాటకొస్తే సినిమాలోనే కాదు... సినిమా మేకింగ్‌లోనూ ఎన్నో మలుపులుంటాయి. అందుకే ఓ సక్సెస్ఫుల్ సినిమా తయారీ కూడా సినిమా అంత ఆసక్తికరం. ‘ఆంధ్రావాలా’ డిజాస్టర్. అప్పటికి వరుసగా నాలుగు హిట్లు ఇచ్చి ఉన్న పూరి జగన్నాథ్ కెరీర్లో అతి పెద్ద కుదుపు ఇది. లెక్కలన్నీ తారుమారు. ఏం చేయాలో, ఏం చేయకూడదో తెలీని పరిస్థితి. చిరంజీవితో ఓ ప్రాజెక్టు గురించి ఎప్పటినుంచో చర్చలు జరుగుతున్నాయి. ‘శ్రీకృష్ణుడు ఫ్రమ్ సురభి కంపెనీ’ పేరుతో పూరి ఓ స్క్రిప్టు సిద్ధం చేస్తున్నాడు. చిరంజీవికి అది వినిపించాలి... ఆయన గ్రీన్ సిగ్నల్ ఇవ్వాలి... ప్రాజెక్టు పట్టాలెక్కాలి... అదంతా పెద్ద ప్రొసీజర్. ఇట్ టేక్స్ లాంగ్ టైమ్. పూరీకి పేషెన్స్ తక్కువ. అది అసహనం కాదు... వేగం. ఖాళీగా కూర్చోకూడదనే తత్వం. ‘బద్రి’ టైమ్‌లో చేసుకున్న ఓ స్క్రిప్టు బూజు దులిపాడు. ‘ఉత్తమ్‌సింగ్ సన్నాఫ్ సూర్యనారాయణ.’ టైటిల్ విని రవితేజ ఫ్లాట్. ‘చేసేద్దాం జగన్’ అంటూ తొందరపడ్డాడు. ప్రొడ్యూసర్ నాగబాబు కూడా రెడీ. ఇక్కడో ట్విస్ట్. రవితేజకు బంగారం లాంటి ఆఫరొచ్చింది. తమిళంలో సూపర్ డూపర్ హిట్టయిన చేరన్ సినిమా ‘ఆటోగ్రాఫ్’ తెలుగు రీమేక్‌లో చేసే ఛాన్సు... వదులుకోకూడదు... వదిలితే ఎవరో ఒకరు చేసేస్తారు. రవితేజ హార్ట్‌ని టచ్ చేసిన సినిమా అది. దాంతో ‘ఆటోగ్రాఫ్’ ప్రాజెక్టుకి ఆటోగ్రాఫ్ ఇచ్చేశాడు రవితేజ. ‘ఉత్తమ్‌సింగ్’కి తాత్కాలిక బ్రేక్. ఇక్కడ పూరి ఖాళీగా ఉండలేడు కదా. తమ్ముడు సాయిరామ్ శంకర్‌తో ‘143’ స్టార్ట్ చేసేశాడు. ‘143’ రిలీజైంది కానీ, రవితేజ ఖాళీగా లేడు. పూరి అన్నాళ్ళు ఆగలేడు. ఎవరో ఒకరితో ‘ఉత్తమ్‌సింగ్’ చేసెయ్యాలి. సోనూసూద్ కనబడ్డాడు. బాలీవుడ్ యాక్టర్. ఒడ్డూ పొడుగు... బావుంటాడు... పూరీకి అతనితో ఎక్స్పెరిమెంట్ చేద్దామనిపించింది. లెక్కలు కుదర్లేదు. మళ్లీ బ్రేక్. 2004 నవంబరు 3. రాత్రి తొమ్మిదో పదో అయ్యింది. హైదరాబాద్ తాజ్ హోటల్లో పూరి, మహేశ్ కూర్చున్నారు. మహేశ్‌కి పూరి కథ చెప్పాలి. మూడేళ్ల తర్వాత సెకండ్ మీటింగ్. అప్పుడేదో కథ చెబితే ‘ప్చ్... నచ్చలేద’న్నాడు మహేశ్. ‘ఇడియట్’ సినిమా మహేశ్‌తోనే చేయాలనుకున్నాడు. ఈసారైనా కనెక్టవుతాడా? పూరి కథ చెప్పడం మొదలెట్టాడు. హీరో సిక్కుల కుర్రాడు. పేరు ఉత్తమ్‌సింగ్. మాఫియా ముఠాలో చేరతాడు. వాళ్ల మధ్యనే ఉంటూ వాళ్లను ఖతమ్ చేస్తాడు. క్లైమాక్స్ ట్విస్ట్ ఏంటంటే - ఉత్తమ్‌సింగ్ ఓ పోలీసాఫీసరు. ‘‘ఎక్స్లెంట్ సార్’’ అన్నాడు మహేశ్ ఉద్వేగంగా. ‘‘నెక్ట్స్ ఇయర్ మొదలుపెట్టేద్దాం... కానీ చిన్న ఛేంజ్. సిక్కు బ్యాక్‌డ్రాప్ మార్చేయండి. మిగతాదంతా ఓకే’’ అని చెప్పాడు మహేశ్. మార్పుకి పూరీ ఓకే. కానీ నెక్ట్స్ ఇయర్ వరకూ ఆగాలే..! అదీ టెన్షన్. ఏం పర్లేదు... అక్కడ నాగార్జున రెడీగా ఉన్నాడు. ఆయనతో ‘సూపర్’ సినిమా చేసొచ్చేస్తే, ఇక్కడ మహేశ్ ఫ్రీ అయిపోతాడు. మహేశ్‌కి ‘ఉత్తమ్‌సింగ్’ టైటిల్ నచ్చలేదు. పూరి టకీమని ‘పోకిరి’ టైటిల్ చెప్పేశాడు. మహేశ్ పెదవులపై స్మయిల్. అంటే బాగా నచ్చేసినట్టే! మహేశ్ పక్కన హీరోయిన్ అంటే కత్తి కసాటాలా ఉండాలి. ‘సూపర్’ హీరోయిన్ ఆయేషా టకియా నిజంగా కత్తి కసాటానే. ఆ అమ్మాయి ఓకే. కానీ లాస్ట్ మినిట్ ఛేంజ్. అర్జంట్‌గా హీరోయిన్ కావాలి. రకరకాల ఫోటోలు... ఎంక్వైరీలు... దీపికా పదుకొనే స్టిల్స్ కూడా చూశారు .‘వెన్నెల’ సినిమాలో యాక్ట్ చేసిన పార్వతీ మెల్టన్ ఎలా ఉంటుంది? ఇలా ఏవేవో డిస్కషన్లు. ఫైనల్‌గా ‘దేవదాసు’ పోరీ ఇలియానాకు బెర్త్ కన్ఫర్మ్. ‘పోకిరి’ షూటింగ్ స్టార్ట్. చకచకా... టకటకా... పూరీది మామూలు స్పీడు కాదు. మహేశ్ కంగారుపడిపోయాడు. ఇదేంటబ్బా అనుకున్నాడు. అన్నీ సింగిల్ టేక్‌లే. వారం తర్వాత పూరి స్టయిల్ అర్థమైపోయింది మహేశ్‌కి. ‘భలే ఉందే’ అనుకున్నాడు. మహేశ్ క్రాఫ్ మారింది. గెటప్ మారింది. డైలాగ్ డెలివరీ మారింది. మహేశ్‌కి కొత్త లుక్. కొత్త కేరెక్టరైజేషన్. 70 రోజుల్లో సినిమా ఫినిష్. ఎప్పుడొచ్చామన్నది కాదన్నయ్యా... బుల్లెట్ దిగిందా? లేదా..! బాక్సాఫీస్ దగ్గర అదే జరిగింది. 2006 ఏప్రిల్ 28న రిలీజైన ఈ సినిమా దడదడలాడించేసింది. రికార్డులన్నీ చెల్లాచెదురు. మహేశ్‌కి సూపర్ స్టార్డమ్. పూరీకి టాప్ డెరైక్టర్ హోదా. ఇలియానా స్టార్ హీరోయిన్. ప్రతీదీ పేలింది. డైలాగ్స్, సాంగ్స్, ఉప్మా సీన్, ముష్టివాళ్ల కామెడీ, బ్రహ్మీ సాఫ్ట్వేర్ ఎపిసోడ్... ఇలా అన్నీ అదుర్స్. మాస్ సినిమా అంటే ఇలానే ఉండాలి. ఇకపై ఇదే టెక్ట్స్ బుక్. ‘పోకిరి’ లాంటి సినిమానే కావాలంటూ ఇతర హీరోల కలలు. (అప్పటికి) 75 సంవత్సరాల తెలుగు సినిమా చరిత్రలోనే కాదు... ఇప్పటికీ ‘పోకిరి’ ఓ సెన్సేషన్. మళ్లీ ఓసారి చూద్దామా... - పులగం చిన్నారాయణ హిట్ డైలాగ్స్... * ఒకసారి కమిటైతే నా మాట నేనే వినను. * నేనెంత ఎదవనో నాకే తెలియదు. * ఎవడు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయిపోద్దో... ఆడే పండుగాడు. వెరీ ఇంట్రస్టింగ్...! * ఇందులో మహేశ్ ముద్దుపేరు ‘పండు’. పూరి భార్య లావణ్య ముద్దు పేరు అదే. * మహేశ్‌బాబు క్లైమాక్స్‌లో ప్రకాశ్‌రాజ్‌ని గూబ మీద కొడితే కాసేపు సెలైన్స్ అయిపోతుంది. థియేటర్లో ఈ సీన్‌కి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ ఐడియా ఫైట్‌మాస్టర్ విజయన్‌ది. * ‘శివమణి’ షూటింగ్ కోసం ఫారిన్ వెళ్లినప్పుడు అక్కడో గిటారిస్టు ‘లిజన్ టు ద ఫాలింగ్ రెయిన్’ పాట ప్లే చేస్తుంటే విని ఆశ్చర్యపోయారు పూరి. అది అచ్చం సూపర్‌స్టార్ కృష్ణ నటించిన ‘గౌరి’ (1974) సినిమాలోని ‘గలగల పారుతున్న గోదారిలా...’ పాటలా ఉంది. ఎంక్వైరీ చేస్తే ఈ ఇంగ్లీషు పాట ప్రేరణతోనే ‘గౌరి’లో ఆ పాట చేశారట. ఎలానూ కృష్ణ పాట కాబట్టి, మహేశ్‌పై చేస్తే కొత్తగా ఉంటుందనుకున్నారు పూరి. ఆయన అంచనా ఫలించింది. ‘గలగలపారుతున్న గోదారిలా...’ పాట సూపర్‌హిట్. * ఈ సినిమాకు శ్యామ్ కె.నాయుడు కెమేరామేన్. కానీ ‘జగడమే..’ పాటకు మాత్రం గుహన్ ఫొటోగ్రఫీ చేశారు. ఎందుకంటే ఈ పాట తీసే టైమ్‌కి శ్యామ్ ‘మున్నా’ షూటింగ్లో బిజీగా ఉన్నారు. గుహన్ అంతకుముందు మహేశ్‌తో ‘అతడు’ చేశారు. ఈ పాటను హైదరాబాద్‌లోని గాయ్రతీ హిల్స్, గోల్కొండ ఫోర్ట్, అన్నపూర్ణ ఏడెకరాల్లో తీశారు. * దీన్ని తమిళంలో విజయ్‌తో ప్రభుదేవా (పోక్కిరి-2007) రీమేక్ చేశారు. హిందీలో సల్మాన్‌ఖాన్‌తో ప్రభుదేవా (వాంటెడ్-2009) రీమేక్ చేశారు. కన్నడంలో దర్శన్ (పొర్కి 2010), బెంగాలీలో షకిబ్ ఖాన్ (రాజోట్టో- 2014) చేశారు. నాలుగు చోట్లా సూపర్ డూపర్ హిట్. దటీజ్ ద స్టోరీ వ్యాల్యూ. ఇన్స్పిరేషన్... ఓ హాలీవుడ్ సినిమాలో ఒక బ్యాంక్ దొంగతనం జరుగుతుంది. కెమెరాలో రికార్డయిన దాన్నిబట్టి వాళ్లు సీ సర్ఫర్స్ అని అర్థమవుతుంది. దాంతో పోలీసాఫీసరైన హీరో వాళ్ల గ్రూపులో చేరి అసలు దొంగల్ని పట్టుకుంటాడు. ‘పోకిరి’లో హీరో చేసింది కూడా అదే కదా! హిందీలో గోవింద్ నిహలానీ తీసిన ‘ద్రోహ్కాల్’ సినిమాలోని కోవర్ట్ సీన్ కూడా ఈ సినిమాకి ప్రేరణ. దాదాపుగా ఇలాంటి కథాంశంతో చిరంజీవి రెండు సినిమాలు చేశారు... ‘మరణమృదంగం’, ‘స్టేట్‌రౌడీ’. ఎక్కడ తీశారంటే... హైదరాబాద్‌లోని అన్నపూర్ణ స్టూడియో, అన్నపూర్ణ ఏడెకరాలు, అల్యూమినియమ్ ఫ్యాక్టరీ, చెన్నైలోని బిన్నీమిల్స్, బ్యాంకాక్, పుకెట్ ఐలెండ్... -
జమ జచ్చ..!
ఎదుటివారిలో మచ్చలు వెతకడం మానవ నైజం. మన ‘లేడీస్ టైలర్’ చేసిందదే. కానీ అతను వెతికింది అమ్మాయిల కుడి తొడ మీది పుట్టుమచ్చ. అలాంటమ్మాయిని పెళ్లాడితే మహారాజ యోగం పడుతుందనేది అతడి ప్రగాఢ మూఢ నమ్మకం. అది నిజమో కాదో తెలీదు గానీ, ఈ సినిమాతో మాత్రం రాజేంద్రప్రసాద్‌కి మహారాజ యోగం పట్టింది. వంశీ గొప్ప ‘సిల్వర్ స్క్రీన్ కామెడీ టైలర్’ అని ఈ సినిమానే నిరూపించింది. ‘‘దేశమును ప్రేమించుమన్నా! మంచి అన్నది పెంచుమన్నా! ఉట్టి మాటలు కట్టిపెట్టి పుట్టు మచ్చలు వెతకవోయ్!’’ - వీపు మీద చపక్ మంటూ బెత్తం దెబ్బ. ‘‘ఉప్పు కప్పురంబు ఒక్క పోలికనుండు చూడ చూడ తొడల జాడ వేరు మచ్చలందు పుట్టు మచ్చలు వేరయా! విశ్వదాభిరామ నిన్ను ఇసకేసి తోమా!’’ - మళ్లీ రెండు బెత్తం దెబ్బలు. కుయ్యో మొర్రో మన్నాడు సుందరం. ఎన్ని మొట్టికాయలు పడ్డా, ఎన్ని బెత్తం దెబ్బలు తగిలినా అతగాడి ధ్యాసంతా జమ జచ్చ మీదే. అసలేమిటీ జమ జచ్చ? అసలెవడీ సుందరం? సుందరమంటే ఎవడు? కాకినాడకవతలుండే పల్లెటూళ్లో...పడమటీది సందులోన పాత ఇంటి ముందు ఉన్న లేడీసు టైలరు! సూదీ దారం కూడా లేకుండా చొక్కాలు కుట్టేసే మొనగాడు. బిందెడు బద్దకం... చెంబుడు చాదస్తం... లేకపోతే దర్జీలకు రాజుగా దర్జాగా ఉండేవాడు! ఉట్టికెగరలేనోడు స్వర్గానికెగరాలనుకునే టైపువాడు. ‘‘జబ జల్లి జబ జల్లి జప జడవే! నీకు సున్నుండలూ కజ్జికాయలూ పెడతా... కుడి భుజం మీదో... కడుపు మీదో పడవే’’ అని బల్లిని బతిమాలుకునే రకం. ‘కుడి తొడ మీద కుంకుడు గింజంత పుట్టుమచ్చుండే మాంచి పెట్టను పడితే నీ జాతక చక్రం నీ మిషను చక్రంలా తిరుగుతుం’దంటాడో కోయదొర. పెట్ట అంటే అమ్మాయి. అది కూడా పద్మినీ జాతి స్త్రీ అంట. పెద్ద పెద్ద కళ్లు... తెల్లటి ఒళ్లు... చూస్తే గుండె గుభిల్లు... అలాంటి స్త్రీ దొరికితే పట్టిందల్లా బంగారమేనట. ముట్టిందల్లా ముత్యమేనట. ‘‘మచ్చ ఉన్న భామ కనులకు కనరావా? ఎక్కడ ఎక్కడ ఎక్కడ దాక్కున్నావే లక్కున్న తెచ్చే చుక్కా... ఎక్కువ తిప్పలు పెట్టక చప్పున చిక్కవే చక్కా!’’ అంటూ ఈ మందలో ఏ సుందరో అంటూ సుందరం కూపీ తీయడం మొదలెట్టాడు. ఒక్క దెబ్బకు మూడు పిట్టలు పడ్డాయి. కొబ్బరి లౌజు లాంటి నాగమణి - పెన్సిలిన్ ఇంజక్షన్లాగా చురుక్కుమనిపించే నర్సు దయ - పరికిణీ వేసుకున్న పాలకోవా లాంటి నీలవేణి - అబ్బో... ఇక చూడాలి సుందరం తిప్పలు. వీళ్ల కుడి తొడ మీద మచ్చాన్వేషణ చేయాలి. బుర్రకు పదునెట్టి... కుట్టుమిషను మీద రకరకాల మేజిక్కులు చేస్తే... ప్చ్... నో జమ జచ్చ. కానీ ఈ ముగ్గురూ బంకజిగురులా వదలరాయె! దాంతో సుందరం ‘పుట్టుమచ్చ కరువైన బతుకెందుకూ’ అనుకుంటూ, ఊరు విడిచి జంప్ జిలానీ అయిపోతున్న టైమ్‌లో కనబడింది జమ జచ్చ. అచ్ఛా... ఇంకేముంది.. మళ్లీ సెకండాఫ్ కథ మొదలు. ఆ మచ్చ సుజాత టీచర్‌ది. ‘‘సుజాతా... మై మర్జాతా! తుమారా చుట్టూ ఫిర్జాతా! అది నా తలరాత! మై పడా! తుమారీ తొడా! మచ్చ! బహుత్ అచ్చా! మై బచ్చా! బట్టల సత్యం లుచ్చా’’... అంటూ ఏదో వచ్చీరాని హిందీ భాషలో మాట్టాడి, అచ్చిక బుచ్చికలాడి, సుజాత చేతిలో బెత్తం దెబ్బలు తింటూ... ఎట్టకేలకు లైన్లో పడేస్తాడు సుందరం. తీరా చూస్తే జంపింగ్ జపాంగ్. సుజాతకూ ఏ నా మచ్చా లేదు. లంకెల బిందెల మధ్య తాచుపాముల్లాగా వెంకటరత్నం... ఆడి అసిస్టెంట్ జట్కాబండి శ్రీనివాసు. కథ క్లైమాక్స్ కొచ్చేస్తుంది. అందరూ చుట్టుముట్టేసి సుందరాన్ని నడిరోడ్డు మీద దోషిలా నిలబెట్టేశారు. దాంతో సుందరానికి కళ్లకున్న కుట్లు, మనసుకేసిన హుక్కులు విడిపోయి... జ్ఞానోదయమవుతుంది. మనిషనేవాడు మచ్చ లేకుండా బతకాలి తప్ప, మచ్చ కోసం బతక్కూడదు. చేతిలో బంగారం లాంటి విద్య పెట్టుకుని శ్రీమంతుడు కావాలని పగటి కలలు కన్నందుకు చింతిస్తాడు. ఆడదానిలో వెతకాల్సింది మచ్చను కాదు... మంచి మనసును అని తెలుసుకుంటాడు సుందరం. ఇక నుంచి సుందరం జాతకం మారిపోకపోతే బట్టల సత్తిగాడి మీద ఒట్టు! జశు జభం! - పులగం చిన్నారాయణ పాపులర్ డైలాగ్ ‘‘ఇది మామూలు గౌను కాదు. పడుకునేటప్పుడు ఏసుకుంటే ఇంగ్లీషు కలలొస్తాయి. ఎలిజిబెత్ అని ఓ గొప్ప ఇంగ్లీషు సినిమా హీరోయినుంది. ఇలాంటి గౌనే ఏసుకుంటే బోలెడు పేరొచ్చేసింది. దాంతో ఆ గౌను కుట్టిన టైలర్నే పెళ్లి చేసేసుకుని, ఎలిజిబెత్ టైలర్ అయిపోయింది.’’ సినిమా పేరు : లేడీస్ టైలర్ (1986) డెరైక్ట్ చేసింది : వంశీ సినిమా తీసింది : ‘స్రవంతి’ రవికిశోర్ మాటలు రాసింది : తనికెళ్ల భరణి అదే ‘జ’ భాషకు ఇన్స్పిరేషన్ ‘‘మా ఊరు పసలపూడిలో త్యాగరాజు అనే టైలరుండేవాడు. మా ఈడు కుర్రాళ్లంతా అతని షాపు దగ్గర చేరేవాళ్లం. అతని ఇన్స్పిరేషన్తోనే ‘సుందరం’ పాత్ర అనుకున్నా. అయితే ఆడవాళ్ల గొడవ, మచ్చ... ఇవన్నీ అతనికి సంబంధం లేవు. అదంతా మా కల్పితం. సినిమా అంతా ‘తొడ మీద పుట్టుమచ్చ’కు సంబంధించి ఉంటుంది. అస్తమానూ ఆ మాట వాడితే బాగోదు కాబట్టి, ‘జ’ భాష వాడదామని రచయిత తనికెళ్ల భరణి సలహా ఇచ్చాడు. ముళ్లపూడి వెంకటరమణ గారు ‘అమ్మాయిలూ అబ్బాయిలూ’ కథలో ‘క’ భాష వాడారు. అదే ఇన్స్పిరేషన్. నా సినిమాల్లో బాగా పేలిన పాత్ర అంటే సుందరమే. దీనికి సీక్వెల్ చేయమని నిర్మాతలు అడిగితే ‘ఫ్యాషన్ డిజైనర్... సన్నాఫ్ లేడీస్ టైలర్’ పేరుతో ఓ స్క్రిప్టు చేశా. ఎప్పటికైనా చేస్తానేమో...?! - వంశీ, దర్శకుడు కసితో చేసిన సినిమా ‘‘వంశీ డైరక్షన్లో ‘మంచు పల్లకీ’ చేశా. సోలో హీరోగా ‘ప్రేమించు పెళ్లాడు’ చేశా. పెద్దగా ఆడలేదు. నేను బెంబేలు పడిపోతుంటే, ‘నెక్ట్స్ సినిమాలో తడాఖా చూపిద్దాం’ అన్నాడు. అలా కసితో చేసిన సినిమా ‘లేడీస్ టైలర్’. నటునిగా నాకిది 66వ సినిమా. డబ్బింగ్ ఆర్టిస్టుగా నాకున్న అనుభవాన్ని వంశీ ఈ సినిమాలో పూర్తిగా వాడుకున్నాడు. నా చేత ఎంత యాక్టింగ్ చేయించాడో, అంత కన్నా ఎక్కువే మైమ్ చేయించాడు’’ - రాజేంద్రప్రసాద్ -
మా ఇద్దరినీ కలిపింది కవిత్వం కాదు... జీవనోత్సాహం!
తనికెళ్ల భరణి... ఈ ప్రపంచానికి ఒక్కడిగా కనిపించొచ్చు! కానీ ప్రకాశ్‌రాజ్‌కి మాత్రం భరణి చుట్టూరానే ప్రపంచం కనిపిస్తుంది! ప్రకాశ్‌రాజ్ సుదీర్ఘ ప్రయాణంలో ఓ రహదారిలా... ఓ వారధిలా... దొరికిన సాంగత్యం భరణి! వీరిద్దరి స్నేహంలో ఓ ప్యాసా ఉంది... ఓ అంతుచిక్కని మజా ఉంది..! భరణి గురించి ప్రకాశ్‌రాజ్ హృదయావిష్కరణ... ‘సాక్షి’కి ప్రత్యేకం మనం ప్రేమించిన క్షణం... గడిచిపోయిన క్షణం కాదు. తలచుకొన్నప్పుడల్లా కాలాన్ని గెలిచి, మళ్లీ మళ్లీ బతికే క్షణం! ‘దేవదాసు’ చేసిన 20 ఏళ్ల తర్వాత దిలీప్‌కుమార్‌గారు బెంగళూరు వెళ్లారు...ఓ అభిమాని ‘దేవదాసు’ని గుర్తు చేసి‘ఎంత బాగా చేశారండీ’ అని ప్రశంసించాడు.దిలీప్‌కుమార్ కదిలిపోయారు.నేను వేషం వేస్తున్నప్పుడు బతికింది ఒక్క క్షణమే.తెరపై ఆ పాత్రను చూసి ప్రేక్షకుడు పులకించిందీ ఒక్క క్షణమే! అయితే ఆ పులకింతలన్నీ అనంతవాహినిలా ప్రవహిస్తూ... ఇరవై ఏళ్ల తర్వాత కూడా మళ్లీ నా క్షణాన్ని నాకు గుర్తు చేసింది కదా అనుకున్నారు దిలీప్‌కుమార్. తనికెళ్ల భరణి పొయిట్రీ చదువుతుంటే కూడా నాకదే ఫీలింగ్... మళ్లీ మళ్లీ బతికే క్షణం! అసలు తనికెళ్ల భరణి ఎవరు? నేను ఎవరు? ఓ రచయితగా, నటునిగా వాడు నాకు తెలియదు... నేనూ వాడికంతే! ఓ జర్నీ చేయడానికి ఇద్దరం దొరికాం.పది పదిహేనేళ్ల నుంచి జరుగుతున్న జర్నీ ఇది. ఒకరికొకరం వెతుక్కుంటూ వెళ్తే దొరికినవాళ్లం కాదు! వాడి ప్రపంచం వేరు... నా ప్రపంచం వేరు.అయినా కలిశాం. ఎందుకు కలిశామంటే... మేం కలవాలంతే! భరణి అంటే ఎందుకిష్టమంటే? ఏమో చెప్పలేను. కొన్నింటిని ఎక్స్‌ప్రెస్ చేస్తే ఆ మిస్టరీ పోతుంది. మా ఇద్దర్నీ కలిపింది కవిత్వం కాదు.. జీవనోత్సాహం! వాడు చాలా ప్రామాణికుడు... నిజంగా ప్రేమిస్తాడు. ఆత్మబంధువులా ఉంటాడు. కొందరే ఉంటారలా! తన ఆంతర్యాన్ని, ఆత్మను, అభివ్యక్తీకరించే తీరు... అదే నాకు నచ్చుతుందేమో! భరణి రాసిన ‘శృంగార గంగావతరణం’ చదివారా? వెంటనే చదవండి. ‘గంగోత్రి’ షూటింగ్ జరుగుతున్నప్పుడు గంగానది ఒడ్డున కూర్చుని, వినిపించాడు నాకు.శివుడు తన జటాజూటంలో గంగాదేవిని బంధిస్తే..గంగకే చెమట్లు పట్టడం లాంటి ఎక్స్ప్రెషన్స్... ఎన్నెన్నో! కొన్ని నెలల తర్వాత కలిసినా... ‘అరె.. నిన్ననే కలిశాం కదా’ అనిపించడమంటే.. ఆ బంధంలోని గాఢత్వం గురించి ఇంకేం చెప్పాలి? వాడు సంబరం చేసుకుంటుంటే వాడిలో సగమై నేనుంటా! నేను ఉత్సాహంతో ఊరేగుతుంటే వాడు నాలో ఉంటాడు! ఎక్కడో అమలాపురంలో షూటింగంతా కానిచ్చేసి మహ్మద్ రఫీ పాట వింటూ... ఓ తన్మయావస్థలో ఉన్నప్పుడు వాడు గుర్తుకొస్తాడు. చిన్న ఫోన్ కాల్... రెండు నిమిషాల టాక్... ఎందుకో ఆ సఖ్యం ఎప్పుడూ కావాలనిపిస్తుంది. ప్రపంచంలో వాడొక భాగం కాదు... వాడి చుట్టూరా ఉన్నదే ప్రపంచం! అక్కడ్నుంచే అసలు ప్రపంచం మొదలైందనిపిస్తుంది. వాడి అమెరికా వేరు... వాడి పల్లెటూరి వేరు. వాడి శివుడు వేరు.. వాడి ప్రేమ వేరు. నాదీ అదే పరిస్థితి! ఈ తీవ్రతే... ఈ విభిన్నతే... మా ఇద్దరికీ బ్రిడ్జ్ వేసినట్టుంది. ప్రతి మనిషిలోనూ పొయిట్రీ ఉంటుంది. ఆస్వాదించడం తెలియాలి... ఆహ్వానించడం రావాలి. వాడి ఆలోచనలెప్పుడూ ప్రెగ్నెంటే! అదే వాడిలో ఉన్న బ్యూటీ ఏమో!! ఫేమస్ పొయిట్ వర్డ్స్‌వర్త్ ఏమంటాడంటే... నువ్వో చెట్టు కింద విశ్రమిస్తే- ఎక్కడి నుంచో కోయిల పాట వినిపిస్తుంది.. ఆస్వాదించు. అంతేగానీ... అది ఎక్కడ నుంచి పాడుతుంది? ఎందుకు పాడుతుంది? దాని సైజేంటి? కలరేంటి? ఇలాంటి ప్రశ్నలన్నీ అవసరమా నీకు? ఎక్కడో పడిన వర్షానికే ఇక్కడ చల్లగాలి వీస్తుంది. ఇదొక జర్నీ. దాన్ని స్వచ్ఛంగా ఆస్వాదించడం తెలియాలి. భరణితో ప్రయణాన్ని కూడా ఎలాంటి ప్రశ్నలూ వేసుకోకుండా సంపూర్ణంగా ఆస్వాదిస్తున్నా! నేను ‘భరణీ’ అని పిలుస్తాను. వాడు నన్ను ‘ప్రకాశ్’ అంటాడు. ఎందుకో ఆ చనువు అలా వచ్చేసింది! నా వయసెంతో తనకు తెలీదు... అతని వయసు గురించి నాకనవసరం. ఎక్కడో నేను చూసిన వింతైన మనుషులు, గమ్మత్తయిన సంఘటనలు, కొన్ని మాటలు, కొంత మౌనం... ఇవన్నీ భరణితో షేర్ చేసుకోవాల్సిందే. బయటకు చెప్పుకోలేనివి చాలా ఉంటాయి. కానీ, ఎవరో ఒకరితో చెప్పుకోవాల్సిందే. మన దృష్టితో ఆలోచించేవాడయితేనే ఆ ట్రాన్స్ఫర్మేషన్ కుదురుతుంది. భరణి అలాంటివాడే! గుత్తొంకాయ కూర... తింటే వాడింట్లో తినాల్సిందే! షూటింగ్లో కలుసుకున్నప్పుడు... రేపు లంచ్‌లో మెనూ ఇదీ అంటాడు. తను రాకపోయినా గుత్తొంకాయ కూర వస్తుంది. ఆ రంగు.. రుచి.. వాసన.. ఆహా.. నోరూరిపోతుంది! ఫోన్ చేసి బావుందిరా అంటే... వాడి మనసు నిండిపోతుంది. అప్పుడప్పుడూ... చెన్నైలో సముద్రపు ఒడ్డున కూర్చుంటాం. ఎదురుగా సముద్రం... మాకిష్టమైన బ్రాండ్... ఇక మాటలే మాటలు..! నేను కర్నాటక పొయిట్రీ గురించి చెబుతాను... వాడు తెలుగు లిటరేచర్‌లోని అందాలు ఆవిష్కరిస్తాడు! ఇద్దరం అలా అలా... మరాఠీ కవితల్లోకి .. బెంగాలీ కథల్లోకి కొట్టుకెళ్లిపోతాం. జయంత్ కైకిని అని కన్నడంలో గొప్ప కవి. తను రాసిన ‘శబ్ద తీర’ పుస్తకం ఇప్పుడు చదువుతున్నా. ఓసారి అనుకోకుండా ముగ్గురం కలిశాం. జయంత్‌కి, భరణికి ఒకరికొకరికి ముఖపరిచయం లేదు. కానీ బాగా పరిచయస్తుల్లా కలిసిపోయారు. భరణి పొయిట్రీ గురించి జయంత్ ఆశువుగా చెప్పేస్తున్నాడు... జయంత్ కథల్లోని మెరుపుల గురించి భరణి తన్మయంగా వివరిస్తున్నాడు... వాళ్లిద్దర్నీ అలా చూస్తూ నాలో నేనే మైమరచిపోయా! వారిద్దరికీ బ్రిడ్జ్‌ని నేనే కదా మరి! ఈ భార్య, పిల్లలు, ప్రియురాలు, స్నేహితుడు... ఇలా కొంతమందికే పరిమితమైన ఆప్తవలయంలో వాడు ఉన్నాడు. మా రిలేషన్షిప్ దేనికీ ఆనదు. దేర్ ఆర్ నో రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. అందుకే నేనెక్కువ మాట్లాడలేకపోతున్నా. అయినా మా జర్నీ ఇంకా ఉంది కదా... మరింకెలా ఎక్స్ప్లెయిన్ చేయాలి? అందుకే మళ్లీ కలుద్దాం! బై! సంభాషణ: పులగం చిన్నారాయణ -
నాన్న డైరక్షన్ కూడా చేయాలనుకున్నారు
‘‘ఏ అట్టు... పెసరట్టా, మినపట్టా, రవ్వట్టా, మసాలా అట్టా, 70 ఎంఎం అట్టా, ఎమ్మెల్యే అట్టా, నూనేసి కాల్చాలా, నెయ్యేసి కాల్చాలా, నీళ్లోసి కాల్చాలా, పెట్రోలు పోసి కాల్చాలా, కిరసనాయిలు పోసి కాల్చాలా... డీజిలేసి కాల్చాలా... అసలు కాల్చాలా, వద్దా...’’ ‘వివాహ భోజనంబు’ సినిమాలో ఒకసారి ఈ సీన్ గుర్తు చేసుకోండి. ముఖ్యంగా ‘సుత్తి’ వీరభద్రరావు ఎక్స్ప్రెషన్స్. నవ్వి నవ్వి పొట్ట చెక్కలు కాకపోతే ఒట్టు. ‘సుత్తి’ వీరభద్రరావు తన కామెడీతో ఓ ట్రెండ్ సెట్ చేశారు. ఆయన పోయి 26 ఏళ్లవుతోంది. కానీ, ఇప్పటికీ ఎప్పటికీ ఆయన మనకు గుర్తుంటారు. వీరభద్రరావుకు ఒక కొడుకు, కూతురు. కొడుకు చక్రవర్తి చెన్నైలో సాఫ్ట్వేర్ కంపెనీ నిర్వహిస్తున్నారు. తండ్రి జ్ఞాపకాల్లోకి వెళ్తూ చక్రవర్తి చెప్పిన సంగతులు. నాన్న లేరంటే ఇప్పటికీ నమ్మబుద్దేయడంలేదు. చనిపోయేనాటికి ఆయన వయసు 41. ఆయన అంత త్వరగా చనిపోవడం మా దురదృష్టం. ‘చూపులు కలిసిన శుభవేళ’ సినిమా కోసం ఓ పాట తీస్తుంటే కాలు స్లిప్ అయ్యింది. తర్వాత బాగా వాచిపోయింది. షుగర్, బీపీ ఉన్నాయి కాబట్టి ఎందుకైనా మంచిదని చెన్నైలోని ఆళ్వార్పేటలోగల ఓ ఆసుపత్రిలో చేరారు. అక్కడుండగానే ఆయన హార్ట్ ఎటాక్‌తో చనిపోయారు. నాన్న పోయే నాటికి నాకు పదహారేళ్లు. ఇంటర్ ఫస్టియర్‌లో ఉన్నా. మాకు పెద్దగా ఆస్తులు లేకపోయినా ఉన్నంతలో మేం ఫర్వాలేదు. నాన్న ఎంత బిజీగా ఉన్నా మాకు సమయాన్ని కేటాయించేవారు. మా ఇంటి పేరు ’మామిళ్లపల్లి’. కానీ జంధ్యాలగారి సినిమాల వల్ల మా ఇంటి పేరే ‘సుత్తి’ అన్నట్టుగా అయిపోయింది. నాన్న కామెడీ అంటే నాకు బాగా ఇష్టం. ముఖ్యంగా ‘పుత్తడిబొమ్మ’ సినిమాలో ఏనుగు కోసం ఆస్తుల్ని అమ్ముకున్న పాత్ర ఎన్నిసార్లు చూసినా నవ్వొస్తుంది. రెండు రెళ్లు ఆరు, శ్రీవారికి ప్రేమలేఖ, ఆనందభైరవి, వివాహ భోజనంబు, బాబాయ్ అబ్బాయ్ తదితర చిత్రాల్లో కూడా నాన్న కామెడీ అదుర్స్. విజయవాడ ఆలిండియా రేడియోలో నాన్న పదేళ్లు అనౌన్సర్‌గానూ, ఆఫీసర్‌గానూ పని చేశారు. ఆయనకు మొదట్నుంచీ రంగస్థలం అంటే ప్రాణం. ఎన్నో నాటకాలు వేశారు. నాన్న తొలి సినిమా ‘బలిపీఠం’. ఆ తర్వాత వరుసగా ‘ఎర్రమల్లెలు’, ‘జాతర’ చేశారు. నాలుగో సినిమా ‘నాలుగు స్తంభాలాట’ నుంచి ఆయన హవా మొదలైంది. 1982 నుంచి 88 వరకూ 180కు పైగా సినిమాలు చేశారు. ఆయన ఆఖరి సినిమా ‘చూపులు కలిసిన శుభవేళ’. ఇంకొన్నాళ్లు ఉండుంటే, ఇంకెన్ని మంచి సినిమాలు చేసేవారో కదా! ‘కొంటె కోడళ్లు’ లాంటి రెండు, మూడు సినిమాల్లో మెయిన్ విలన్‌గా చేశారు. నాన్న విలనీ కూడా బాగుంటుంది. విజయవాడలో రంగస్థలం మీద నాన్న డెరైక్ట్ చేస్తే, జంధ్యాలగారు యాక్ట్ చేసేవారు. సినిమా ఫీల్డ్కొచ్చాక జంధ్యాలగారు డెరైక్టరైతే, నాన్న యాక్టరయ్యారు. నాన్న ఎప్పటికైనా డెరైక్షన్ చేయాలనుకున్నారు కూడా. నాక్కూడా నటన అంటే ఆసక్తి ఉంది కానీ, పరిస్థితుల రీత్యా ఇటు రాలేకపోయాను. అయితే భవిష్యత్తులో కమెడియన్‌గా రావాలని ఉంది. ‘సుత్తి ఆన్లైన్ డాట్‌కామ్’ పేరుతో నాన్న, సుత్తివేలుగారి సినిమాల కలెక్షన్ అంతా ఓ చోట నిక్షిప్తం చేసే ప్రయత్నంలో ఉన్నా. అలాగే ‘నాటిక డాట్ కామ్’ ప్రారంభించి నాన్న నాటకాలతో పాటు, రంగస్థల కళాకారుల ప్రొఫైల్స్ అన్నీ సేకరించి పెట్టాలనుకుంటున్నా. ఇన్నేళ్ల తర్వాత కూడా నాన్న పేరు అందరికీ గుర్తుందంటే ప్రేక్షకుల హృదయాల్లో ఆయన హాస్యం అంతలా ముద్ర వేసిందన్నమాట. సీరియస్‌గా కనిపిస్తూనే డైలాగ్ మాడ్యులేషన్‌తో కామెడీ పుట్టించేవారు. అంతటి గొప్ప నటుడికి కొడుకు కావడం నా అదృష్టంగా భావిస్తున్నా. - పులగం చిన్నారాయణ -
నాన్న ఇప్పటికీ గ్రేటే!
జంధ్యాల పోలికలు వీళ్లిద్దరిలో ఎవరికెక్కువ వచ్చాయంటే సంపదకే. జంధ్యాల ఏ కూర ఇష్టంగా తినేవారో సంపద కూడా అంతే. జంధ్యాల గల గల ఎలా మాట్లాడతారో, ఎలా అల్లరి చేస్తారో... సంపద కూడా డిటో. ‘‘నువ్వేంటే మీ నాన్న తీసిన సినిమాల్లో శ్రీలక్ష్మిలాగా లొడలొడా వాగుతుంటావ్’’ అని జంధ్యాల శ్రీమతి అన్నపూర్ణ ఆటపట్టిస్తుంటారు. హైదరాబాద్‌లోని సహేలీ అపార్ట్మెంట్స్ ఫోర్త్ ఫ్లోర్‌లోని బాల్కనీలోంచి చూస్తే నెక్లెస్‌రోడ్ అరవంకీలా మెరుస్తూ కనిపిస్తోంది. ‘‘మేం అల్లరి ఎక్కువ చేస్తూ అన్నం తినకపోతే నాన్నగారు మమ్మల్ని నెక్లెస్ రోడ్‌కి తీసుకెళ్లి ఆడించేవారట’’ చెప్పింది సాహితి. గంభీర గోదావరిలా నిశ్శబ్దంగా ఉండే ఆ అమ్మాయిలో నాన్న టాపిక్ రాగానే ఏదో హుషారు. ‘‘అవునవును. డాడీ ఆ నెక్లెస్ రోడ్ అంతా తిప్పుతూ మాకు గోరుముద్దలు తినిపించేవారట. స్టోరీ సిట్టింగ్స్క్కూడా తీసుకెళ్లేవారట. ఐస్క్రీమిస్తే అల్లరి చేయకుండా అలా కూర్చుని ఉండేదాన్నట’’ అంది మురిపెంగా సంపద. అసలు నాన్నంటే ఎవరికి ఇష్టం ఉండదు. పాపం... వీళ్లిద్దరికీ నాలుగేళ్ల వయసులో జంధ్యాల చనిపోయారు. జంధ్యాల అంటే గ్రేట్ రైటర్... గ్రేట్ డెరైక్టర్. ముఖ్యంగా కామెడీ సినిమాలకు కేరాఫ్ అడ్రస్. పేరుకు పేరు... డబ్బుకు డబ్బు... కానీ పిల్లలే లేరు! చివరివరకూ అదే చింత జంధ్యాలకు. కానీ... లక్ష్మీ, సరస్వతి జంటగా కరుణించారు. కవలలుగా జంధ్యాల ఇంట్లో పుట్టారు. అందుకేనేమో ఒకరి పేరు సాహితి, మరొకరి పేరు సంపద. ఇద్దరికీ ఒకే ఒక్క నిమిషం తేడా. జంధ్యాలకు పెళ్లైన పాతికేళ్ల తర్వాత పుట్టారిద్దరూ. జంధ్యాల మురిసిపోయారు. నాలుగేళ్లు నాలుగు క్షణాల్లా గడిచాయి. అక్కడితో ఆయన టైం అయిపోయి పెకైళ్లిపోయారు. వీళ్లకేమో తెలిసీ తెలియని వయసు. నాన్న అని గుర్తు పెట్టుకునేలోపే గుట్టుగా వెళ్లిపోయారాయన. వీళ్లిద్దరికీ నాన్న గుర్తున్నాడా అంటే ఉన్నాడు, లేడా అంటే లేడు. లీలగా జ్ఞాపకాలు. నాన్న నవ్వడం... ముద్దు పెట్టుకోవడం.. నాన్న గోరు ముద్దలు తినిపించడం. ఎత్తుకు తిప్పడం. అన్నీ మసక మసగ్గా.. అమ్మకు చెబితే ఆయనే మీ నాన్న అంటుంది. అందుకే సాహితీ, సంపదలకు నాన్నంటే... అమ్మ పంచిన జ్ఞాపకాలు. ‘‘నాన్న లేని లోటు కనపడకుండా అమ్మ ప్రతి క్షణం శ్రద్ధ తీసుకుంటుంది. నాన్న గురించి ప్రతి క్షణం గుర్తు చేస్తుంది. నాన్న తీసిన సినిమాలు, రాసిన డైలాగులు, నాన్న గురించి నలుగురూ చెప్పే ముచ్చట్లు, ఇప్పటికీ ప్రజ్వలంగా వెలుగుతోన్న ఆయన పేరు ప్రఖ్యాతులు... వీటన్నిటి మధ్యలో నాన్న లేరన్న ఫీలింగ్ తెలీడం లేదు. మా ఇంట్లోనే మాతోనే మా మధ్యనే నాన్న ఉన్నారనిపిస్తోంది...’’ సాహితి నాన్‌స్టాప్‌గా మాట్లాడుతోంది. జనరల్‌గా సాహితి ఎక్కువ మాట్లాడదట. అలాంటిది నాన్న పేరు చెప్పగానే సాహితిలో ఏదో ఉద్వేగం. అందుకు పూర్తి భిన్నంగా ఎప్పుడూ గలగల మాట్లాడే సంపద మాత్రం నాన్న పేరు చెప్పగానే నిశ్శబ్దమైపోయింది. ఏదో చెప్పాలనుకుంటోంది. కానీ చెప్పలేకపోతోంది. సంపదకు స్పోర్ట్స్ అంటే ఇష్టం. బాస్కెట్‌బాల్ బాగా ఆడుతుంది. డాన్స్ అంటే ఇష్టం. కూచిపూడి చేస్తుంది. నాజర్ స్కూల్లో ఎంఇసి చదువుతోంది. ఎంబిఏ చేయాలన్నది లక్ష్యం. సాహితి ఓబుల్‌రెడ్డి స్కూల్లో ఎంపీసీ చదువుతోంది. ఆర్కిటెక్చరంటే ఆసక్తి. ఇంటీరియర్ డెకరేటర్‌గా పేరు తెచ్చుకోవాలనుకుంటోంది. ‘‘నాన్నగారు చనిపోయి పదమూడేళ్లవుతోంది. కానీ ఇప్పటికీ అందరికీ గుర్తున్నారాయన. మా స్కూల్లో మేం జంధ్యాల డాటర్స్గా ఫేమస్. మా టీచర్స్ మమ్మల్ని ప్రత్యేకంగా చూస్తుంటారు. ఇదంతా నాన్న ఇచ్చిన గిఫ్ట్ మాకు’’ అని సాహితి చెబుతుంటే, ఆమె కళ్లల్లో ఓ మెరుపు. ‘‘మేమిద్దరం సినిమాలు బాగా చూస్తాం. ముఖ్యంగా కామెడీ సినిమాలు. ఐ లైక్ కామెడీ. బ్రహ్మానందం అంకుల్ కామెడీ అంటే పడి చస్తాం. నాన్న తీసిన సినిమాల వీడియోలు వీలు కుదిరినప్పుడల్లా చూస్తూనే ఉంటాం. ఎంత బావుంటాయో నాన్న తీసిన సినిమాలు. ఇప్పుడు చూసినా ట్రెండీగా అనిపిస్తాయి. అయినా ఈ రోజుల్లో ఆరోగ్యకరమైన కామెడీ సినిమాలే కరువైపోయాయి. డాడీ ఉంటే ఎంత బావుండేదో అనిపిస్తుంది’’ అంది సంపద. ‘‘మీలో ఎవరికైనా జంధ్యాలగారి లాగా రైటింగ్, డెరైక్షన్ వైపు ఆసక్తి ఉందా?’’ అనడిగితే సాహితి, సంపద ఒకరి మొహాలు ఒకరు చూసుకున్నారు. జంధ్యాల సతీమణి అన్నపూర్ణ సమాధానం చెబుతూ, ‘‘వీళ్లల్లో ఒక్కరికైనా అలాంటి ఆసక్తి ఉంటే కచ్చితంగా నేను ఎంకరేజ్ చేసేదాన్ని. సినిమాలంటే ఇద్దరికీ ఆసక్తే. కానీ, సినిమాల్లోకి వెళ్లాలని మాత్రం లేదు. సంపదకు ఫొటోగ్రఫీ అంటే ఇష్టం. హాలీడేస్‌లో ఫొటోగ్రఫీ కోర్స్‌లో జాయిన్ చేద్దామనుకున్నా. కానీ తాను పెద్ద ఆసక్తి చూపలేదు’’ అన్నారు. నాన్న సినిమాల్లో ఏవి ఇష్టం? అనడిగితే ఠకీమని ఆన్సర్లొచ్చేస్తాయి. సాహితికేమో ‘చంటబ్బాయ్, నాలుగు స్తంభాలాట’ అంటే ఇష్టం. సంపద అయితే ‘అహ నా పెళ్లంట, చంటబ్బాయ్’ సినిమాలను లెక్కలేనన్నిసార్లు చూసిందట. సాధారణంగా ఫస్ట్ బర్త్‌డే పిల్లలకు గుర్తుండదు. కానీ వీళ్లకు మాత్రం బాగా గుర్తుంది. కారణం... చుట్టాలంతా ఇప్పటికీ ఆ బర్త్‌డేని గుర్తు చేసి కథలు కథలుగా చెబుతుండడమే. నిజంగా బర్త్‌డేని జంధ్యాల ఓ పెళ్లిలా చేశారట. హైదరాబాద్‌లోని ఖాజా మ్యాన్షన్‌లో పెద్ద ల్యాన్. 800 మంది జనం... బోలెడంత మంది వీఐపీలు. ఏనుగులూ, గుర్రాలూ... పాలకొల్లు నుంచీ బుట్టబొమ్మలు... రకరకాల సంప్రదాయ వంటకాలు... కడియం వాళ్లు చేసిన పూల డెకరేషన్... మేజిక్షోస్, కామెడీ స్కిట్స్... పెద్ద పెద్దవాళ్లు కూడా చిన్న చిన్న పిల్లలైపోయి మరీ ఈ బర్త్‌డే ఫంక్షన్ ఎంజాయ్ చేశారట. ఆ వీడియో చూసుకుని సాహితి, సంపద ఇప్పటికీ మురిసిపోతుంటారు. ‘‘మాకు నాన్నంటే ఇష్టం. నాన్న పేరు నిలబెట్టాలని అమ్మ ఎప్పుడూ చెబుతూ ఉంటుంది. మా లక్ష్యం కూడా అదే. నాన్న పేరు నిలబెడతాం’’ అని సాహితి, సంపద కాన్ఫిడెంట్‌గా చెబుతుంటే ఎంత ముచ్చటేసిందో! ఈ ముచ్చట్లన్నీ పై నుంచి జంధ్యాల వ్యూ ఫైండర్లో చూస్తూనే ఉంటారు. - పులగం చిన్నారాయణ -
రజనీకాంత్‌ని హీరోగా అందరూ వద్దన్నారు!
చెన్నైలోని మైలాపూర్ ప్రాంతం. ఓ ఇరుకు సందులో... ఓ పాతకాలం డాబాలో... రెండు గదుల పోర్షన్. బయట నిలబడ్డ ఓ పెద్దాయన ‘‘నేనే ఈరంకి శర్మని. మీరేగా నా కోసం వచ్చింది’’ అని మమ్మల్ని లోపలకు తీసుకువెళ్లారు. ఆయనకు 92 ఏళ్లంటే అస్సలు నమ్మ బుద్ధేయదు. స్ప్రింగ్‌లా అటూ ఇటూ తిరుగుతూ, నాన్‌స్టాప్‌గా కబుర్లు చెబుతూనే ఉన్నారాయన. ‘‘చాలా చిత్రంగా ఉందే. మీరు నా ఇంటర్వ్యూ తీసుకోవడం! నాలాంటి దర్శకుణ్ణి ఇంకా ప్రేక్షకులు గుర్తు పెట్టుకున్నారంటారా? చిత్ర పరిశ్రమ వాళ్లకే నేను బతికున్నానో లేదో తెలీదు’’ అన్నారాయన. ఆ మాటల్లో నిర్వేదం ఎక్కడా లేదు. సమాజం వాస్తవ పరిస్థితి ఆయనకు బాగా తెలుసు. డబ్బుతోటీ విజయాలతోటీ ఇక్కడ మనుషుల్ని కొలుస్తారని ఆయనకు ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. సిక్ట్సీ ఇయర్స్ ఇండస్ట్రీ ఆయనది. రజనీకాంత్‌ని ‘చిలకమ్మ చెప్పింది’తో తెలుగు తెరకు పరిచయం చేసింది ఆయనే. జయప్రద ‘అంతులేని కథ’ చేయడానికి ముఖ్య కారకుడు ఆయనే. చిరంజీవితో ‘కుక్క కాటుకు చెప్పు దెబ్బ’, ‘సీతాదేవి’ లాంటి సినిమాలు చేసింది ఆయనే. చేసింది చాలా తక్కువ సినిమాలే కానీ, అన్నీ గుర్తుండిపోయేవే. ఇప్పటికీ విశ్రాంతి అనేది లేకుండా పని చేస్తున్న 92 ఏళ్ల యువకుడు ఈరంకి పురుషోత్తమశర్మ జీవన ప్రవాహంలోని కొన్ని కెరటాలు ఆయన మాటల్లోనే..! ఆఫీస్ అసిస్టెంట్ నుంచి డెరైక్షన్ వైపు! మాది మచిలీపట్నం. మా నాన్నగారు వెంకటశాస్త్రి చిత్రకళలో ఉద్దండులు. ప్రముఖ సినీ కళాదర్శకులు టీవీయస్ శర్మ, ఎస్వీయస్ రామారావు, గోఖలే, వాలి, తోట తదితరులంతా మా నాన్నగారి శిష్యులే. మా అన్నయ్య ఈరంకి గోపాలకృష్ణమూర్తి పేరొందిన పబ్లిసిటీ ఆర్టిస్ట్. 1952లో నేనూ సినిమా ఫీల్డ్‌లోకి ఎంటరయ్యాను. ఎస్వీయస్ రామారావు దర్శకత్వంలో ‘చిన్నమ్మ కథ’ అనే సినిమా రూపొందుతుంటే ఆఫీస్ అసిస్టెంట్‌గా చేరా. తర్వాత ఎడిటింగ్ సైడ్ జాయినయ్యా. మరో పక్క దర్శకత్వశాఖలోనూ పనిచేశా. బాగా అనుభవం వచ్చాక స్వతంత్రంగా ఎడిటర్‌గా 40 సినిమాలకు పైగా పని చేశాను. కానీ నా మనసు మాత్రం డెరైక్షన్ మీదే ఉండేది. జెమినీ సంస్థ వాళ్లు తెలుగులో కె.బాలచందర్ దర్శకత్వంలో తీసిన ‘భలే కోడళ్లు’కు నేను కో-డెరైక్టర్ని. అప్పటినుంచీ బాలచందర్ దగ్గర చాలా సినిమాలకు పని చేశాను. ఆ అమ్మాయిని నేనే బాలచందర్‌కి పరిచయం చేశా! ఓ రోజు నటి నిర్మలమ్మ ఫోన్ చేసి ‘‘రాజమండ్రి నుంచి ఓ అమ్మాయి వచ్చింది. మంచి వేషం ఉంటే చూడండి’’ అని చెప్పారు. అప్పుడే తెలుగులో ‘అంతులేని కథ’ చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయి. చెల్లెలు వేషానికి బావుంటుందని నేనే తీసుకెళ్లి బాలచందర్‌కి పరిచయం చేశాను. అంతా ఓకే. తమిళ వెర్షన్లో చేసిన సుజాత తెలుగులోనూ హీరోయిన్గా చేయాలి. కానీ తను చాలా బిజీ. చెల్లెలి వేషానికి తీసుకున్న అమ్మాయినే మెయిన్ హీరోయిన్గా తీసుకుందామన్నారు బాలచందర్. నేను ఓకే అన్నాను. ఆ అమ్మాయి ఎవరో కాదు. జయప్రద. ‘అంతులేని కథ’ సినిమాతో ఆమె ఎంత స్టార్ అయిందో తెలిసిందే. రజనీకాంత్ పారితోషికం అయిదు వేలు! ‘విజయా’ నాగిరెడ్డి గారు ఓ మలయాళ సినిమా ఆధారంగా తెలుగు, తమిళ భాషల్లో కె. బాలచందర్ దర్శకత్వంలో సినిమా చేయాలనుకున్నారు. చాలా యాంటీ సబ్జెక్ట్ అది. బాలచందర్ బిజీగా ఉండి చేయలేని పరిస్థితి. నాకేమో అలాంటి కథతో డెరైక్షన్ చేయాలని ఆశ. నిర్మాత హరిరామజోగయ్య నాతో సినిమా చేయడానికి రెడీ. తమిళం హక్కులు వేరే వాళ్లతో కొనిపించి, తెలుగులో మేం సినిమా మొదలుపెట్టాం. హీరో వేషానికి కొత్త మొహం కావాలి. నేను ఒక తమిళ హీరో పేరు సూచించాను. అందరూ రిజెక్ట్ చేశారు. నేను మాత్రం అతనే కావాలని పట్టుబట్టాను. ఫైనల్‌గా అతనితో సినిమా చేశాను. సినిమా పెద్ద హిట్టు. ఆ హీరో యాక్షన్‌కి ఒకటే క్లాప్స్. ఆ సినిమా పేరు ‘చిలకమ్మ చెప్పింది’ (1977). ఆ హీరో రజనీకాంత్. తెలుగులో అతనికి అదే తొలి సినిమా. పారితోషికం మూడు వేల రూపాయలు అని మాట్లాడాం కానీ, చివరకు అయిదు వేలు ఇచ్చాం. ఈ సినిమాతో రజనీకాంత్‌కి తెలుగు మార్కెట్ కూడా వచ్చింది. చిరంజీవితో చేయొద్దన్నారు! నేను తీసిన ‘నాలాగా ఎందరో’ చిత్రానికి ఎనిమిది నందులు వచ్చాయి. ఆ తర్వాత చిరంజీవి, మాధవితో ‘కుక్క కాటుకి చెప్పు దెబ్బ’ చేశా. హీరోగా చిరంజీవి వద్దని కొంతమంది చెప్పారు. మళ్లీ చిరంజీవితో ‘సీతాదేవి’ చేశాను. ‘అగ్ని పుష్పం’తో సీతను పరిచయం చేశాను. ఆ తర్వాత కొన్ని కారణాల వల్ల డెరైక్షన్ చేయలేదు. అప్పుడప్పుడు కొన్ని సీరియల్స్ డెరైక్ట్ చేశాను. ఇప్పుడు సినిమా డెరైక్ట్ చేసే అవకాశం వస్తే చేయడానికి రెడీ. ఇప్పటికీ అద్దె ఇల్లే! ఇన్నేళ్ల కెరీర్లో నేను సంపాదించిందేమీ లేదు. ఇప్పటికీ అద్దె ఇల్లే. హైదరాబాద్‌లో స్థలం తీసుకోమన్నా, ఆ కొండల్లో ఎందుకని వదిలేశా. ఇప్పుడు దాని విలువ కోట్లు. విజయ్ టీవీలో మా అబ్బాయి ఎడిటర్. వాడి జీతమే మాకు ఆధారం. ఇప్పటికీ స్క్రిప్ట్ వర్క్ చేస్తున్నాను. నవతరం దర్శకులకి మెళకువలు చెబుతున్నాను. నా ఆత్మకథ రాసుకున్నాను. అయితే అది నాకు మాత్రమే సొంతం. ప్రచురణ చేయాలనుకోవడం లేదు. అప్పటి సంఘటనలు చదువుకుంటుంటే అదో తీయని అనుభూతి. అదే ఈ వయసులో నాకు ఎనర్జీ. - పులగం చిన్నారాయణ