మైండ్ బ్లాక్ చేసింది | puri jagannath Story behind film dialogues | Sakshi
Sakshi News home page

మైండ్ బ్లాక్ చేసింది

Published Sun, May 31 2015 1:17 AM | Last Updated on Fri, Mar 22 2019 1:53 PM

మైండ్ బ్లాక్ చేసింది - Sakshi

మైండ్ బ్లాక్ చేసింది

సినిమా వెనుక స్టోరీ
14 రీళ్ల సినిమాలో ఎన్నో మలుపులు, మెరుపులు. అవి ఉంటేనే బాక్సాఫీస్ దగ్గర ఉరుములూ మెరుపులూ. ఆ మాటకొస్తే సినిమాలోనే కాదు... సినిమా మేకింగ్‌లోనూ ఎన్నో మలుపులుంటాయి. అందుకే ఓ సక్సెస్‌ఫుల్ సినిమా తయారీ కూడా సినిమా అంత ఆసక్తికరం.
 ‘ఆంధ్రావాలా’ డిజాస్టర్.
అప్పటికి వరుసగా నాలుగు హిట్లు ఇచ్చి ఉన్న పూరి జగన్నాథ్ కెరీర్‌లో అతి పెద్ద కుదుపు ఇది.

లెక్కలన్నీ తారుమారు. ఏం చేయాలో, ఏం చేయకూడదో తెలీని పరిస్థితి. చిరంజీవితో ఓ ప్రాజెక్టు గురించి ఎప్పటినుంచో చర్చలు జరుగుతున్నాయి. ‘శ్రీకృష్ణుడు ఫ్రమ్ సురభి కంపెనీ’ పేరుతో పూరి ఓ స్క్రిప్టు సిద్ధం చేస్తున్నాడు. చిరంజీవికి అది వినిపించాలి... ఆయన గ్రీన్ సిగ్నల్ ఇవ్వాలి... ప్రాజెక్టు పట్టాలెక్కాలి... అదంతా పెద్ద ప్రొసీజర్. ఇట్ టేక్స్ లాంగ్ టైమ్.
 
పూరీకి పేషెన్స్ తక్కువ. అది అసహనం కాదు... వేగం. ఖాళీగా కూర్చోకూడదనే తత్వం.
 ‘బద్రి’ టైమ్‌లో చేసుకున్న ఓ స్క్రిప్టు బూజు దులిపాడు.
 ‘ఉత్తమ్‌సింగ్ సన్నాఫ్ సూర్యనారాయణ.’
 టైటిల్ విని రవితేజ ఫ్లాట్. ‘చేసేద్దాం జగన్’ అంటూ తొందరపడ్డాడు. ప్రొడ్యూసర్ నాగబాబు కూడా రెడీ.
 ఇక్కడో ట్విస్ట్.
 
 రవితేజకు బంగారం లాంటి ఆఫరొచ్చింది. తమిళంలో సూపర్ డూపర్ హిట్టయిన చేరన్ సినిమా ‘ఆటోగ్రాఫ్’ తెలుగు రీమేక్‌లో చేసే ఛాన్సు... వదులుకోకూడదు... వదిలితే ఎవరో ఒకరు చేసేస్తారు.  రవితేజ హార్ట్‌ని టచ్ చేసిన సినిమా అది.
 దాంతో ‘ఆటోగ్రాఫ్’ ప్రాజెక్టుకి ఆటోగ్రాఫ్ ఇచ్చేశాడు రవితేజ. ‘ఉత్తమ్‌సింగ్’కి తాత్కాలిక బ్రేక్.
 ఇక్కడ పూరి ఖాళీగా ఉండలేడు కదా. తమ్ముడు సాయిరామ్ శంకర్‌తో ‘143’ స్టార్ట్ చేసేశాడు. ‘143’ రిలీజైంది కానీ, రవితేజ ఖాళీగా లేడు.
 
పూరి అన్నాళ్ళు ఆగలేడు. ఎవరో ఒకరితో ‘ఉత్తమ్‌సింగ్’ చేసెయ్యాలి.
 సోనూసూద్ కనబడ్డాడు.
 బాలీవుడ్ యాక్టర్. ఒడ్డూ పొడుగు... బావుంటాడు...
 పూరీకి అతనితో ఎక్స్‌పెరిమెంట్ చేద్దామనిపించింది.
 లెక్కలు కుదర్లేదు. మళ్లీ బ్రేక్.
   
 2004 నవంబరు 3.
 రాత్రి తొమ్మిదో పదో అయ్యింది.
 హైదరాబాద్ తాజ్ హోటల్లో పూరి, మహేశ్ కూర్చున్నారు.
 మహేశ్‌కి పూరి కథ చెప్పాలి.
 మూడేళ్ల తర్వాత సెకండ్ మీటింగ్. అప్పుడేదో కథ చెబితే ‘ప్చ్... నచ్చలేద’న్నాడు మహేశ్. ‘ఇడియట్’ సినిమా మహేశ్‌తోనే చేయాలనుకున్నాడు.
 
ఈసారైనా కనెక్టవుతాడా? పూరి కథ చెప్పడం మొదలెట్టాడు.
 హీరో సిక్కుల కుర్రాడు. పేరు ఉత్తమ్‌సింగ్. మాఫియా ముఠాలో చేరతాడు. వాళ్ల మధ్యనే ఉంటూ వాళ్లను ఖతమ్ చేస్తాడు. క్లైమాక్స్ ట్విస్ట్ ఏంటంటే - ఉత్తమ్‌సింగ్ ఓ పోలీసాఫీసరు.
 ‘‘ఎక్స్‌లెంట్ సార్’’ అన్నాడు మహేశ్ ఉద్వేగంగా.
 ‘‘నెక్ట్స్ ఇయర్ మొదలుపెట్టేద్దాం... కానీ చిన్న ఛేంజ్. సిక్కు బ్యాక్‌డ్రాప్ మార్చేయండి. మిగతాదంతా ఓకే’’ అని చెప్పాడు మహేశ్.
 
మార్పుకి పూరీ ఓకే.
కానీ నెక్ట్స్ ఇయర్ వరకూ ఆగాలే..! అదీ టెన్షన్. ఏం పర్లేదు... అక్కడ నాగార్జున రెడీగా ఉన్నాడు. ఆయనతో ‘సూపర్’ సినిమా చేసొచ్చేస్తే, ఇక్కడ మహేశ్ ఫ్రీ అయిపోతాడు.
 మహేశ్‌కి ‘ఉత్తమ్‌సింగ్’ టైటిల్ నచ్చలేదు. పూరి టకీమని ‘పోకిరి’ టైటిల్ చెప్పేశాడు. మహేశ్ పెదవులపై స్మయిల్. అంటే బాగా నచ్చేసినట్టే!
 
మహేశ్ పక్కన హీరోయిన్ అంటే కత్తి కసాటాలా ఉండాలి. ‘సూపర్’ హీరోయిన్ ఆయేషా టకియా నిజంగా కత్తి కసాటానే. ఆ అమ్మాయి ఓకే. కానీ లాస్ట్ మినిట్ ఛేంజ్. అర్జంట్‌గా హీరోయిన్ కావాలి. రకరకాల ఫోటోలు... ఎంక్వైరీలు... దీపికా పదుకొనే స్టిల్స్ కూడా చూశారు .‘వెన్నెల’ సినిమాలో యాక్ట్ చేసిన పార్వతీ మెల్టన్ ఎలా ఉంటుంది? ఇలా ఏవేవో డిస్కషన్లు. ఫైనల్‌గా ‘దేవదాసు’ పోరీ ఇలియానాకు బెర్త్ కన్‌ఫర్మ్.
   
‘పోకిరి’ షూటింగ్ స్టార్ట్.
చకచకా... టకటకా... పూరీది మామూలు స్పీడు కాదు. మహేశ్ కంగారుపడిపోయాడు. ఇదేంటబ్బా అనుకున్నాడు. అన్నీ సింగిల్ టేక్‌లే. వారం తర్వాత పూరి స్టయిల్ అర్థమైపోయింది మహేశ్‌కి. ‘భలే ఉందే’ అనుకున్నాడు.  మహేశ్ క్రాఫ్ మారింది. గెటప్ మారింది. డైలాగ్ డెలివరీ మారింది. మహేశ్‌కి కొత్త లుక్. కొత్త కేరెక్టరైజేషన్.
 
70 రోజుల్లో సినిమా ఫినిష్. ఎప్పుడొచ్చామన్నది కాదన్నయ్యా... బుల్లెట్ దిగిందా? లేదా..! బాక్సాఫీస్ దగ్గర అదే జరిగింది.
2006 ఏప్రిల్ 28న రిలీజైన ఈ సినిమా దడదడలాడించేసింది. రికార్డులన్నీ చెల్లాచెదురు. మహేశ్‌కి సూపర్ స్టార్‌డమ్. పూరీకి టాప్ డెరైక్టర్ హోదా. ఇలియానా స్టార్ హీరోయిన్. ప్రతీదీ పేలింది. డైలాగ్స్, సాంగ్స్, ఉప్మా సీన్, ముష్టివాళ్ల కామెడీ, బ్రహ్మీ సాఫ్ట్‌వేర్ ఎపిసోడ్... ఇలా అన్నీ అదుర్స్. మాస్ సినిమా అంటే  ఇలానే ఉండాలి. ఇకపై ఇదే టెక్ట్స్ బుక్. ‘పోకిరి’ లాంటి సినిమానే కావాలంటూ ఇతర హీరోల కలలు. (అప్పటికి) 75 సంవత్సరాల తెలుగు సినిమా చరిత్రలోనే కాదు... ఇప్పటికీ ‘పోకిరి’ ఓ సెన్సేషన్.
మళ్లీ ఓసారి చూద్దామా...
- పులగం చిన్నారాయణ
 
హిట్ డైలాగ్స్...
* ఒకసారి కమిటైతే నా మాట నేనే వినను.
* నేనెంత ఎదవనో నాకే తెలియదు.
* ఎవడు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయిపోద్దో... ఆడే పండుగాడు.

వెరీ ఇంట్రస్టింగ్...!
* ఇందులో మహేశ్ ముద్దుపేరు ‘పండు’. పూరి భార్య లావణ్య ముద్దు పేరు అదే.
* మహేశ్‌బాబు క్లైమాక్స్‌లో ప్రకాశ్‌రాజ్‌ని గూబ మీద కొడితే కాసేపు సెలైన్స్ అయిపోతుంది. థియేటర్లో ఈ సీన్‌కి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ ఐడియా ఫైట్‌మాస్టర్ విజయన్‌ది.
* ‘శివమణి’ షూటింగ్ కోసం ఫారిన్ వెళ్లినప్పుడు అక్కడో గిటారిస్టు ‘లిజన్ టు ద ఫాలింగ్ రెయిన్’ పాట ప్లే చేస్తుంటే విని ఆశ్చర్యపోయారు పూరి. అది అచ్చం సూపర్‌స్టార్ కృష్ణ నటించిన ‘గౌరి’ (1974) సినిమాలోని ‘గలగల పారుతున్న గోదారిలా...’  పాటలా ఉంది. ఎంక్వైరీ చేస్తే ఈ ఇంగ్లీషు పాట ప్రేరణతోనే ‘గౌరి’లో ఆ పాట చేశారట. ఎలానూ కృష్ణ పాట కాబట్టి, మహేశ్‌పై చేస్తే కొత్తగా ఉంటుందనుకున్నారు పూరి. ఆయన అంచనా ఫలించింది. ‘గలగలపారుతున్న గోదారిలా...’ పాట సూపర్‌హిట్.
* ఈ సినిమాకు శ్యామ్ కె.నాయుడు కెమేరామేన్. కానీ ‘జగడమే..’ పాటకు మాత్రం గుహన్ ఫొటోగ్రఫీ చేశారు. ఎందుకంటే ఈ పాట తీసే టైమ్‌కి శ్యామ్ ‘మున్నా’ షూటింగ్‌లో బిజీగా ఉన్నారు. గుహన్ అంతకుముందు మహేశ్‌తో ‘అతడు’ చేశారు. ఈ పాటను హైదరాబాద్‌లోని గాయ్రతీ హిల్స్, గోల్కొండ ఫోర్ట్, అన్నపూర్ణ ఏడెకరాల్లో తీశారు.
* దీన్ని తమిళంలో విజయ్‌తో ప్రభుదేవా (పోక్కిరి-2007) రీమేక్ చేశారు. హిందీలో సల్మాన్‌ఖాన్‌తో ప్రభుదేవా (వాంటెడ్-2009) రీమేక్ చేశారు. కన్నడంలో దర్శన్ (పొర్కి 2010), బెంగాలీలో షకిబ్ ఖాన్ (రాజోట్టో- 2014) చేశారు. నాలుగు చోట్లా సూపర్ డూపర్ హిట్. దటీజ్ ద స్టోరీ వ్యాల్యూ.
 
ఇన్‌స్పిరేషన్...
ఓ హాలీవుడ్ సినిమాలో ఒక బ్యాంక్ దొంగతనం జరుగుతుంది. కెమెరాలో రికార్డయిన దాన్నిబట్టి వాళ్లు సీ సర్ఫర్స్ అని అర్థమవుతుంది. దాంతో పోలీసాఫీసరైన హీరో వాళ్ల గ్రూపులో చేరి అసలు దొంగల్ని పట్టుకుంటాడు. ‘పోకిరి’లో హీరో చేసింది కూడా అదే కదా!
 హిందీలో గోవింద్ నిహలానీ తీసిన ‘ద్రోహ్‌కాల్’ సినిమాలోని కోవర్ట్ సీన్ కూడా ఈ సినిమాకి ప్రేరణ. దాదాపుగా ఇలాంటి కథాంశంతో చిరంజీవి రెండు సినిమాలు చేశారు...  ‘మరణమృదంగం’, ‘స్టేట్‌రౌడీ’.
 
ఎక్కడ తీశారంటే...
హైదరాబాద్‌లోని అన్నపూర్ణ స్టూడియో, అన్నపూర్ణ ఏడెకరాలు, అల్యూమినియమ్ ఫ్యాక్టరీ, చెన్నైలోని బిన్నీమిల్స్, బ్యాంకాక్, పుకెట్ ఐలెండ్...

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement