Story behind film
-
ఒక్క అడుగు...
సినిమా వెనుక స్టోరీ - 28 కొందరు కలుసుకోవాలంటే కాలం వెంటనే అనుకూలించదు. ఏవేవో అవాంతరాలు తెచ్చి పెడుతుంది. కానీ, ఒకసారి కలవడమంటూ జరిగితే మాత్రం ఆ బంధం ఎప్పటికీ విడనంత స్ట్రాంగ్‌గా ఉంటుంది. ప్రభాస్ - రాజమౌళి విషయం అంతే. ప్రభాస్ ‘ఈశ్వర్’ సినిమా చేస్తున్న టైమ్‌లో, రాజమౌళి ‘స్టూడెంట్ నం.1’ చేసి ఖాళీగా ఉన్నాడు. ప్రభాస్‌తో సినిమా చేయాలని రాజమౌళి ఉబలాటపడ్డాడు. కుదర్లేదు. ‘సింహాద్రి’ తర్వాత కూడా ట్రై చేశాడు. అప్పుడూ కుదర్లేదు. ఈసారి మాత్రం రాజమౌళి బలంగా సంకల్పించుకున్నాడు. అటువైపు ప్రభాస్ కూడా. ఈసారి వీళ్లనాపే శక్తి లేనే లేదు. కీరవాణి ఫ్యామిలీకి భోగవల్లి ప్రసాద్ చాలా క్లోజ్. సినిమాలకు అతీతమైన బంధం వాళ్లది. భోగవల్లి ప్రసాద్ ఏ సినిమా చేసినా దాదాపుగా కీరవాణి మ్యూజిక్ చేయాల్సిందే. తన ముందు ఎదిగిన రాజమౌళి ఇండస్ట్రీలో టాప్ డెరైక్టర్ కావడం చూసి భోగవల్లి ప్రసాద్ చాలా ఆనందపడిపోయారు. రాజమౌళితో సినిమా చేయాలని ముచ్చట పడ్డారాయన.రాజమౌళికి కూడా ఓకే. ‘‘ఎంత బడ్జెట్ అయినా ఫర్లేదు’’ అని చెప్పేశాడాయన. ఇంత స్వేచ్ఛ ఇస్తే ఎవరికైనా టెన్షనే. రాజమౌళి బరువైన బాధ్యతతో ప్రాజెక్ట్‌కి రూపకల్పన చేస్తున్నాడు. ప్రభాస్ సినిమాలన్నీ వరుసపెట్టి చూస్తున్నాడు రాజమౌళి. ఏ హీరోతో సినిమా చేసినా, అతను అంతకుముందు చేసిన సినిమాలన్నీ చూసి, పాత్రల తీరు, వాటిలో ఆడియన్స్‌కి ఏం నచ్చాయనే విషయాలన్నీ రీసెర్చ్ చేయడం రాజమౌళికి అలవాటు. బి.గోపాల్ దర్శకత్వంలో వచ్చిన ‘అడవిరాముడు’లో బర్త్‌డే సీన్లో ఆర్తి అగర్వాల్‌తో ప్రభాస్ ‘‘నువ్విచ్చిన ఈ గిఫ్ట్‌ని జీవితాంతం గుర్తుపెట్టుకుంటాను’’ అని చెబుతాడు. అక్కడ ప్రభాస్ ఎక్స్ప్రెషన్ రాజమౌళికి చాలా నచ్చేసింది. చేస్తే ఇతనితో హై లెవెల్ ఎమోషనల్ సినిమా చేయాలని ఆ క్షణమే డిసైడైపోయాడు. నాన్న విజయేంద్రప్రసాద్‌తో కూర్చున్నాడు రాజమౌళి. ఇద్దరి మధ్య డిస్కషన్స్. ‘‘ఈ పదేళ్లలో తల్లీ కొడుకుల సెంటిమెంట్‌తో సినిమా రాలేదు. ఆ ప్యాట్రన్‌లో మంచి కథ కావాలి నాన్నా’’ అడిగాడు మౌళి. ఆయనకు వెంటనే ‘ఛత్రపతి’ సబ్జెక్ట్ గుర్తుకొచ్చింది. దానికో ఫ్లాష్‌బ్యాక్ ఉంది. 1988లో ఓ రాత్రిపూట విజయేంద్రప్రసాద్ వీడియో ప్లేయర్ ఆన్ చేశారు. ఓ వీహెచ్ఎస్ క్యాసెట్ ప్లే చేశారు. ‘స్కార్ ఫేస్’ అనే హాలీవుడ్ సినిమా అది. సౌండ్ సరిగ్గా రావడం లేదు. సరిగ్గా అర్థం కాకపో యినా, అందులోని సెంటిమెంట్ ఆయన్ను కదిలించింది. అప్పటికప్పుడు ఓ స్టోరీ ఐడియా స్ఫురణకొచ్చేసింది. గాఢనిద్రలో ఉన్న భార్యను లేపి ఉత్సాహంగా ఆ కథ మొత్తం చెప్పేసి, తర్వాత ప్రశాంతంగా నిద్రపోయారాయన. ఆవిడ మాత్రం నిద్రపోలేదు. ఆ కథలోని సెంటిమెంట్‌కి ఆవిడకు ఏడుపాగలేదు. ఇదే కథను తర్వాత ఆఫీసులో డిస్కస్ చేస్తుంటే, పద్మాలయా సంస్థలో డెరైక్షన్ డిపార్ట్మెంట్లో పనిచేసే గోపి విన్నాడు. ‘‘ఏం కథండీ బాబూ... ‘ఛత్రపతి’ అని టైటిల్ పెట్టండి. అదిరిపోతుంది’’ అన్నాడు. ‘నిజమే... ఈ కథకు ‘ఛత్రపతి’ టైటిల్ కరెక్ట్’ అనుకున్నారు విజయేంద్రప్రసాద్. ‘ఛత్రపతి’ అనగానే మరాఠా యోధుడు శివాజీ గుర్తొస్తాడు. తల్లి జిజియాబాయి, శివాజీకి ధైర్యం నూరిపోసి సూపర్ హీరోని చేసింది. ఈ కథలోనూ హీరోకి తల్లి మాటలే స్ఫూర్తి. టైటిల్ అలా సెట్ అయ్యింది. అక్కడితో ఆ కథకు ఫుల్స్టాప్ పడింది. రాజమౌళికి ‘ఛత్రపతి’ కథ విప రీతంగా నచ్చేసింది. ప్రభాస్ ఇమేజ్‌కు తగ్గట్టుగా కొన్ని మార్పులూ చేర్పులూ చేసుకున్నాడు. రాజమౌళి ఏ కథ చేసినా అందులో సూపర్ హీరోయిజం కచ్చితంగా ఉంటుంది. ఇందులో కూడా బాగా వర్కవుటయ్యింది. అలాగే కామెడీ కూడా బాగా రావాలని రాజమౌళి తపన. శంకర్ సినిమా ‘అపరిచితుడు’ అప్పుడు టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ. దానికి పేరడీ చేస్తే? రాజమౌళి ఆలోచన. కో-డెరైక్టర్ కణ్నన్ దానికి పోపు చల్లాడు. ‘అప్రతిష్ఠుడు’ అంటూ చేసిన ఎపిసోడ్ బాగా వచ్చింది. ఇక స్క్రిప్ట్ లాక్. ఎం.రత్నంతో డైలాగ్స్ రాయించారు. హీరోయిన్గా శ్రీయ, మెయిన్ విలన్‌గా ‘సై’ ఫేమ్ ప్రదీప్ రావత్ ఓకే. ఇంకో విలన్ కావాలి. ‘సై’లో విలన్‌గా మొదట అనుకున్న నరేంద్ర ఝా గుర్తొచ్చాడు. బాజీరావ్‌గా అతను ఖరార్. కాట్రాజు పాత్రకు ప్రభాస్‌లా ఒడ్డూ పొడవున్నవాడు కావాలి. చాలామందికి స్క్రీన్ టెస్ట్ చేశారు. ఫైనల్‌గా సుప్రీత్ సెలెక్ట్ అయ్యాడు. ‘సై’లో విలన్ గ్యాంగ్‌లోని పదిమందిలో అతనొకడు. ఇందులో ఇంపార్టెంట్ కేరెక్టర్. కానీ ఇంకా స్ట్రాంగ్‌గా తయారవ్వాలి. 4 నెలలు జిమ్‌కెళ్లి 8 కేజీలు పెరిగాడు సుప్రీత్. తల్లి పాత్రకు భానుప్రియ అయితే బెటర్. కానీ ఆవిడేమో అమెరికా వెళ్లే హడావిడిలో ఉన్నారు. రాజమౌళి ఒక్కసారి కథ వినమని బతిమిలాడాడు. భానుప్రియ కథ విని ‘‘నేనీ సినిమా చేస్తున్నా’’ అని చెప్పేశారు. ప్రభాస్ బ్రదర్‌గా షఫీని ఫిక్స్ చేశారు. ‘సై’కి పని చేసిన సెంథిల్‌కే కెమెరామ్యాన్ పోస్ట్. ఆ సినిమాకి ఎలాంటి షాట్స్ కావాలో చెప్పి చేయించుకున్నాడు. స్క్రిప్ట్ ఇచ్చేసి ‘నీ ఇష్టం... ఎలా తీస్తావో’’ అనేశాడు. ఆర్ట్ డెరైక్టర్ రవీందర్ ఈ టీమ్‌లో కొత్తగా జాయినయ్యాడు. ఇక పెద్దన్న కీరవాణి ఎలానూ పెద్ద అండ. పాటలన్నీ రెడీ. ‘ఎ’ వచ్చి ‘బి’పై వాలే’ పాటను బాలీవుడ్ సింగర్ అద్నాన్ సామీతో పాడించాలనుకున్నారు. దానికి తగ్గట్టే పాట శ్రుతిని అడ్జస్ట్ చేశారు. ఆ టైమ్‌కి అద్నాన్ ఫారిన్లో ఉండటంతో కీరవాణి తన వాయిస్‌తో ట్రాక్ చేశారు. చివరకు ఇదే బావుందని ఉంచేశారు. ‘అగ్ని స్ఖలన సందిగ్ధరిపు వర్గ ప్రళయ రథ ఛత్రపతి’ పాటను కీరవాణి తండ్రి శివశక్తి దత్తా రాశారు. వైజాగ్ సముద్రం. భారీ క్రేన్‌తో ప్రభాస్‌ని సముద్రం మధ్యలో వేలాడదీశారు. ఇది ఫస్ట్ డే ఫస్ట్ సీన్. భోగవల్లి ప్రసాద్కైతే ఒకటే కంగారు. ప్రభాస్, రాజమౌళి మాత్రం చాలా కూల్‌గా పనిచేసుకుంటూ వెళ్లిపోతున్నారు. వైజాగ్ పోర్ట్ ఏరి యాలోనే శరణార్థుల కాలనీ సెట్ వేశారు. అక్కడే మేజర్ పోర్షన్ తీసేశారు. పీటర్ హేన్స్ హాలీవుడ్ స్టాండర్డ్‌లో యాక్షన్ సీన్స్ డిజైన్ చేశాడు. కష్టమంతా కెమెరామ్యాన్ సెంథిల్దే. రాజమౌళి తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకోవాలి. అందుకే కష్టపడుతున్నాడు. భారీ యాక్షన్ ఎపిసోడ్స్ ఉన్నా, సాఫ్ట్‌లుక్ రావడానికి ట్రై చేస్తున్నాడు. అందుకే బ్రౌన్ టింట్ అప్లయ్ చేశాడు. రెగ్యులర్ కమర్షియల్ సినిమాలకు వాడే కెమెరా టెక్నిక్స్ యూజ్ చేయలేదు. ‘స్లీపింగ్ హాలో’ అనే హాలీవుడ్ సినిమాలో వాడిన సాఫ్ట్ బాక్స్ టెక్నిక్‌ని ఓ ఫైట్ సీక్వెన్స్‌లో ఉపయోగించారు. వీడియో మేకింగ్‌లో వాడే సాఫ్ట్ బాక్స్‌లను తెప్పించి వాటిని ఆన్ చేశారు. 40 అడుగుల ఐరన్ ఫ్రేమ్‌కి లైట్స్ బిగించారు. బెలూన్ లైట్స్‌ని పెద్ద క్రేన్ సాయంతో 100 అడుగుల ఎత్తులో ఉంచి, వాటిని శాటిన్ క్లాత్‌తో కవర్ చేశారు. ఆ లైటింగ్‌లో ఆ ఫైట్ సీక్వెన్స్ తీశారు. ‘ఎ వచ్చి బిపై వాలే’లో కొంత పోర్షన్ లైట్ బ్యాక్‌గ్రౌండ్‌లో తీశారు. హీరో హీరోయిన్స్, డ్యాన్సర్ల కాస్ట్యూమ్స్ కూడా లైట్ కలర్. కొరియోగ్రాఫర్ లారెన్స్ బ్యాక్‌గ్రౌండ్ మారుద్దామన్నారు. సెంథిల్ మాత్రం కొత్తగా ఉంటుందని చెప్పారు. నిజంగానే పాట కొత్తగా వచ్చింది. భోగవల్లి ప్రసాద్ రోజూ హ్యాపీగా లొకేషన్‌కి వస్తున్నారు. అసలు టెన్షన్ రాజమౌళిది. చెప్పిన బడ్జెట్ దాటకూడదు. అందుకే ప్రతివారం బడ్జెట్ ఫిగర్స్ అన్నీ చూస్తూండేవాడు. ఎక్కడా పెరగడానికి వీల్లేదు. అలాగని ఎక్కడా తగ్గకూడదు. అంతా పర్ఫెక్ట్ ప్లానింగ్. ప్రీ ప్రొడక్షన్‌కు 4 నెలలు... ప్రొడక్షన్‌కు 7 నెలలు... పోస్ట్ ప్రొడక్షన్‌కు 1 నెల... అంతా అనుకున్నట్టే జరుగుతోంది. వైజాగ్, హైదరాబాద్, మైసూరు (1 పాట), నెల్లూరు (క్లైమాక్స్)ల్లో దిగ్విజయంగా షూటింగ్ పూర్తయ్యింది. 1.6 లక్షల అడుగుల ఫుటేజ్ వచ్చింది. దాన్ని 15,000 అడుగులకు ఫైనల్ కట్ చేశారు. కాస్త వల్గర్‌గా ఉందని వేణుమాధవ్ కామెడీ బిట్ ఒకదాన్ని తీసేశారు. నేరేషన్‌కు అడ్డుపడుతుందని కోట శ్రీనివాసరావు బాత్ టబ్ సీన్‌ని తీసేశారు. షఫీది పెక్యులియర్ వాయిస్. అందుకే ఎవరితోనైనా డబ్బింగ్ చెప్పించాలనుకున్నారు. కానీ ఆ కేరెక్టర్‌కి ఆ రిథమ్ కరెక్ట్ అనిపించి, షఫీతోనే చెప్పించేశారు. ఫైనల్ వెర్షన్ కీరవాణి చేతిలో పెట్టారు. ఆయన ఈ సినిమా మూడ్‌ని ఎలివేట్ చేస్తూ అద్భుతమైన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ఇచ్చారు. అవుట్‌పుట్ అదిరిపోయింది. సినిమా లెవెలే మారిపోయింది. ఎంత కంట్రోల్ చేసినా బడ్జెట్ 12.5 కోట్లు అయ్యింది. అయినా సినిమా మీద నమ్మకంతో భోగవల్లి ప్రసాద్ సొంతగా రిలీజ్ చేయడానికి సిద్ధమయ్యారు. కానీ మంచి ఆఫర్లు రావడంతో రెండు ఏరియాలు ఉంచుకుని మిగతావి అమ్మేశారు. 2005 సెప్టెంబర్ 30. ‘ఛత్రపతి’కి ఫస్ట్ డే డివెడైడ్ టాక్. కానీ రాజమౌళి టీమ్ మాత్రం చాలా కాన్ఫిడెంట్‌గా ఉన్నారు. జనరల్‌గా రాజమౌళి ఇండస్ట్రీ టాక్‌ను పట్టించుకోరు. తనకు తెలిసిన సోర్స్‌ల ద్వారా ఆడియన్స్ టాక్ తెలుసుకుంటారు. ‘ఛత్రపతి’ స్లో పాయిజన్‌లా ప్రేక్షకులకు ఎక్కుతోందని రూఢి అయిపోయింది. ‘తన కోసం తాను బతికేవాడు మనిషి. నలుగురి కోసం బతికేవాడు ఛత్రపతి’ అనే బేసిక్ థీమ్ ప్రేక్షకులకు నచ్చేసింది. 54 కేంద్రాల్లో వంద రోజులాడింది. ప్రభాస్ ఇంట్రడక్షన్ సీన్‌గా వచ్చే షార్క్ ఫైట్ గ్రాఫిక్స్ విషయంలోనే అందరికీ అసంతృప్తి. అది ఊహించిన విధంగా రాలేదు. దాంతో రాజమౌళి దాన్ని మళ్లీ రీప్లేస్ చేయించారు. చిరంజీవి ఈ సినిమా చూసి ఇంప్రెస్ అయ్యి, రాజమౌళిని ఇంటికి పిలిచి మూడు గంటలు మాట్లాడారు. ఈ సినిమా తర్వాత భోగవల్లి ప్రసాద్‌ను అందరూ ‘ఛత్రపతి’ ప్రసాద్ అని పిలవడం మొదలుపెట్టారు. ప్రభాస్ రేంజ్ ఈ ‘ఒక్క అడుగు’తో కొత్త పుంతలు తొక్కడం మొదలుపెట్టింది. ఇక రాజమౌళి గురించి ఏం చెప్పాలి? ఒట్టేసి ఒక మాట, ఒట్టు వేయకుండా ఒక మాట చెప్పినా చెప్పకపోయినా... ఇది రాజమౌళి సృష్టించిన వండర్! వెరీ ఇంట్రస్టింగ్ * ‘ఛత్రపతి’ టైటిల్ సజెస్ట్ చేసిన గోపీ చాలాకాలం క్రితమే చనిపోయారు. వాళ్ల ఫ్యామిలీకి కొంత పారితోషికం ఇవ్వాలని విజయేంద్రప్రసాద్ ప్రయత్నించి, ఆచూకీ కనుక్కోలేకపోయారు. * ఉత్తమ సంగీత దర్శకునిగా కీరవాణి, ఉత్తమ సహాయనటిగా భానుప్రియ నంది పురస్కారాలు గెలుచుకున్నారు. * ‘హుకుమత్కి జంగ్’ పేరుతో హిందీలో అనువాదమైంది. కన్నడంలో ‘ఛత్రపతి’గా, బెంగాలీలో ‘రెఫ్యూజీ’గా రీమేక్ అయ్యింది. -
గుర్తుపట్టే గుండెనడుగు...
సినిమా వెనుక స్టోరీ - 27 యు.ఎస్.ఎ... నలుగురు తెలుగు కుర్రాళ్లు ఉంటోన్న రూమ్ అది. సాధారణంగా బ్యాచిలర్ రూమ్స్‌లో ఉండకూడనివన్నీ ఉంటాయ్. కానీ ఇక్కడ ఉండాల్సినవే ఉన్నాయి. తెలుగు లిటరేచర్ బుక్స్. అతను కథ వినిపిస్తున్నాడు. ఆ ముగ్గురూ చాలా ఆసక్తిగా వింటున్నారు. క్యాంపస్ స్టోరీ అది. కళ్లకు కట్టినట్టు చెప్పాడు. ‘‘వెల్డన్ క్రిష్... సినిమా చూపించేశావ్. ఇక నువ్వు డెరైక్టరైపోవచ్చు’’. ఆ ముగ్గురూ సిన్సియర్‌గా కామెంట్ చేశారు. క్రిష్ కళ్లముందు కొత్త స్వప్నాలు. ఫార్మసీ గ్రాడ్యుయేట్‌నని చెప్పుకోవడం కన్నా పుస్తకాల పురుగు, సినిమా పిచ్చోడి నని చెప్పుకోవడమే క్రిష్‌కి ఇష్టం. కంప్యూ టర్స్‌లో ఎమ్మెస్ చేయడానికి వచ్చాడిక్క డికి. కానీ కాన్సన్ట్రేషన్ అంతా కథలు తయారుచేసుకోవడం, సినిమా తీయాలను కోవడం మీదే. ఫ్రెండ్స్ మెచ్చుకున్న స్టోరీతో యూఎస్‌లోనే సినిమా చేసేద్దామని ట్రయల్స్ కూడా వేశాడు. వర్కవుట్ కాలేదు. ఇండియా వెళ్లాక దీని పని పడదామని డిసైడయ్యాడు. ఇండియా... క్రిష్ హైదరాబాద్‌లో ఉన్నాడు. తన మొదటి స్టెప్... ‘ఫస్ట్ కౌన్సిల్’ అనే ఓవర్సీస్ ఎడ్యుకేషనల్ కన్సల్టెన్సీ పెట్టడం. రెండో స్టెప్.. దాన్ని సక్సెస్ చేయడం. మూడో స్టెప్... సినిమా ఇండస్ట్రీలోకి వెళ్లడం. ఈ రూట్లో వెళ్తేనే త్వరగా గమ్యం చేరుకుంటానని క్రిష్‌కి బాగా తెలుసు. అదే జరిగింది కూడా. సినిమా ఇండస్ట్రీలోకి ఎంటర్ కావడానికి ఇంట్లోవాళ్లు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారు. ఓ కంపెనీకి డెరైక్టర్‌గా ఉన్నవాడు ఓ సినిమాకు అసిస్టెంట్ డెరైక్టర్‌గా చేరాడు. నో ఇన్హిబిషన్స్. నో ఇగోస్. వర్క్ నేర్చు కోవాలి. దానిపైనే కాన్సన్ట్రేషన్. అది ‘ఒకరికి ఒకరు’ సినిమా. కెమెరామ్యాన్ రసూల్ ఫస్ట్ టైమ్ డెరైక్ట్ చేస్తున్నాడు. చాలా తొందరగా టీమ్‌తో కలిసిపోయాడు క్రిష్. ఏ పని చెప్పినా చేసేవాడు. చివరకు ఆఫీస్ బాయ్ లేకపోతే టీ కూడా పెట్టి ఇచ్చేవాడు. ఒక్క సినిమాతోనే ఎంతో నేర్చుకున్నాడు. అశ్వినీదత్ బేనర్లో హిందీ సినిమా ఆఫర్. ‘అఖండ్ భారత్.... బట్ ఇండియా డివెడైడ్’. విస్తృతమైన సబ్జెక్ట్. గాంధీ - గాడ్సేల కథ. చాలా రీసెర్చ్ చేయాలి. ముంబై వెళ్లాడు. అక్కడి నుంచి పుణే వెళ్లి నాథూరామ్ గాడ్సే తమ్ముడు గోపాల్‌ను కలిశాడు. ఆ తర్వాత నాగపూర్.. సాంగ్లీ.. ఇలా వెళ్తూనే ఉన్నాడు కారులో. డ్రైవరు బుజీద్ క్రిష్‌కి బాగా నచ్చేశాడు. తనకు తెలిసిందంతా, తెలుసుకోవాలనుకుంటు న్నదంతా బుజీద్కు చెబుతున్నాడు. ఆ రోజు సాంగ్లీలో ఉన్నారు. ఎంత వెతికినా మినరల్ వాటర్ దొరకలేదు. విపరీతమైన దాహం. రోడ్డు పక్కన బోరింగ్ పంప్ కన బడితే కారాపేసి గబగబా తాగేసి వచ్చాడు బుజీద్. ‘‘మీరూ తాగండి, ఎంతసేపని దాహంతో ఉంటారు’’ అన్నాడు. క్రిష్‌కి కోపం వచ్చింది. ‘‘ఈ నీళ్లు ఎలా తాగుతాం? బోలెడన్ని క్రిమి కీటకాలుంటాయ్. హెల్త్ పాడవుతుంది...’’ క్రిష్ ఇలా క్లాస్ పీకుతుంటే, బుజీద్ ఓ మాట అన్నాడు. ‘‘బాటిల్ వాటర్ లేనిదే నడవని జీవితం... అదేం జీవితం సార్!’’ క్రిష్‌కు ఒక్కసారిగా మబ్బులు విడి పోయాయి. తాను జీవితాన్ని ఒకే కోణంలో చూస్తున్నానని, ఇంకా చూడాల్సిన కోణాలు చాలా ఉన్నాయని తేలిపోయింది. కారు బయలుదేరింది. అద్దం దించి ప్రపంచాన్ని చూస్తున్నాడు క్రిష్. ‘‘కారు అద్దాల్లోంచి చూసేది అసలైన ప్రపంచం కాదు.’’ క్రిష్ ఆలోచిస్తూనే ఉన్నాడు. ఒకటే కారు... ఇద్దరు మనుషులు. గమనం ఒకటే కానీ గమ్యాలు వేరు. తానేమో ఏం పుస్త కాలు చదవాలి, ఎవర్ని కలవాలి, ఏం అడగాలి అని ఆలోచిస్తున్నాడు. బుజీద్ - ఈ కారు ఎక్కడ ఆపాలి, ఏ దాబాలో భోం చేయాలి అని ఆలోచిస్తున్నాడు. ఎంత భిన్నమైన ఆలోచనలు! కారు షోలాపూర్లోకి ఎంటరైంది. క్రిష్ ఓ చిన్న హోటల్లో దిగి, బుజీద్ను వెళ్లిపోమన్నాడు. కొన్ని తెల్ల కాగితాలు కొనుక్కుని, రూమ్‌లోకి వెళ్లి తలుపేసు కున్నాడు. ఓ ప్రవాహం. అడ్డూ అదుపూ లేదు. అలా రాసుకుంటూనే పోతున్నాడు. కారు ప్రయాణం, కలిసిన మనుషులు, ముద్ర వేసిన సంఘటనలు, ‘ఈజీ రైడర్’ (1969), ‘మోటార్ సైకిల్ డైరీస్’ లాంటి హాలీవుడ్ సినిమాలు, ‘జెన్ అండ్ ద ఆర్ట్ ఆఫ్ మోటార్ సైకిల్ మెయింటెనెన్స్’ లాంటి పుస్తకాలు, బుద్ధుని రచనలు... అన్నీ మైండ్‌లో కలతిరుగుతున్నాయి. ఇంత మథనం తర్వాత పుట్టింది కథ. మురిపెంగా చూసుకున్నాడు దాన్ని. ఢిల్లీలో మొదలై, బీహార్ వెళ్లి ఛత్తీస్‌గఢ్‌లో కథ ముగుస్తుంది. ‘ఆజ్ జాయేంగే’ పేరుతో తీస్తే బాలీవుడ్‌వాళ్లు తనను నెత్తిన పెట్టు కుంటారు. ఆ టైమ్‌లో అశ్వినీదత్ కూతురు స్వప్నాదత్ కాల్ చేసింది. ‘‘ఓ లో-బడ్జెట్ సినిమా కోసం కథేమైనా ఉందా?’’... క్రిష్ ఆత్రంగా ఈ కథ చెప్పేశాడు. హైదరాబాద్ రాగానే క్రిష్‌కి కె.రాఘ వేంద్రరావు నుంచి పిలుపు. ‘‘ముగ్గురు ఎన్నారై యువకులు విప్లవాత్మకంగా ఏదైనా చేయాలని ఆంధ్రాకొస్తారు. దీన్ని బేస్ చేసుకుని స్క్రిప్టు రెడీ చెయ్. ‘యువ సైన్యం’ పేరుతో సినిమా చేద్దాం’’. క్రిష్‌కు గోల్డెన్ చాన్స్. ఇక క్షణం వేస్ట్ చేయదలచు కోలేదు. ప్రముఖ నాటక రచయిత గంధం నాగరాజుతో కూర్చున్నాడు. ఇద్దరూ కలిసి స్క్రిప్టు రెడీ చేశారు. బడ్జెట్ చాలా ఎక్కువ అయ్యేట్టుంది. రాఘవేంద్ర రావు చేసేట్టు లేరు. లాభం లేదని క్రిష్ తన కథ బయ టకు తీశాడు. హిందీలో కాదు. తెలుగులోనే తీయాలి. నాగరాజుతో ఫుల్‌బౌండ్ స్క్రిప్ట్ రెడీ చేయించాడు. టైటిల్ ‘సిద్ధార్థ’. బుద్ధుడి అసలు పేరు. ఇంట్లోంచి బయటి కొచ్చాకే సిద్ధార్థుడు జీవితం గురించి తెలుసుకున్నాడు. ఇక్కడా అంతే కదా! రాఘవేంద్రరావు, వాళ్లబ్బాయి ప్రకాశ్, తన ఫ్యామిలీ మెంబర్స్... అందరూ కథ విన్నారు. అందరికీ ఓకే. ఫైనల్‌గా ‘సిరి వెన్నెల’ సీతారామశాస్త్రిని కలిశాడు. కథంతా విని ‘‘అరే అబ్బాయ్... ఒక మనిషి గురించి చెబుదామని నీకెందుకంత తాపత్రయం’’ అంటూ డిస్కషన్ స్టార్ట్ చేశా డాయన. ‘‘ఇది సినిమాకు సూటయ్యే కథ కాదు. మార్పులూ చేర్పులూ చేయాలి’’ అంటూ చాలా సజెషన్స్ ఇచ్చారు. క్రిష్ అక్కడ్నుంచి మాయమైపోయాడు. మళ్లీ 9 నెలల తర్వాత ప్రత్యక్షం. ఏడు వెర్షన్ల తర్వాత బాగా చిక్కబడ్డ కథ. ‘‘ఇదిరా కథంటే’’ అంటూ సీతారామశాస్త్రి స్టాంప్ వేశారు. ‘‘గురువుగారూ... నా దగ్గర ఎక్కువ డబ్బులు లేవండీ . ఒక్క పాట రాయండి’’ అని ఇబ్బందిపడుతూ అడిగాడు క్రిష్. ‘‘ఇది ఒక మనిషి గురించి ఒక మనిషి చెప్తున్న కథరా. ఆ మనిషి కోసం ఈ మనిషి రాస్తున్న పాటలురా ఇవి. మొత్తం పాటలు నేనే రాస్తా. ఒక్క పైసా కూడా ఇవ్వొద్దు. నీకు అవసరమైతే నన్నే అడుగు’’ అన్నారాయన. క్రిష్ మనసు చెమ్మగిల్లిపోయింది. క్రిష్ చాలామంది నిర్మాతల్ని కలిశాడు. అందరూ కథ బావుందంటారు కానీ, చేయ డానికి ముందుకు రావడం లేదు. క్రిష్ తపన చూసి వాళ్ల నాన్నే ముందుకొచ్చారు. జాగర్లమూడి సాయిబాబు, సినిమా ఫీల్డ్‌కు సంబంధం లేని మనిషి. క్రిష్ ధైర్యంగా ముందుకు దూకేశాడు. ‘గాలి శీను’ పాత్రకి ఫస్ట్ నుంచి మైండ్‌లో ఉంది ‘అల్లరి’ నరేశ్. నరేశ్ ఓకే అన్నాడు. అభి కేరెక్టర్‌కు ఒకరి ద్దరిని అనుకుని ఫైనల్‌గా శర్వానంద్ కన్ ఫర్మ్. హీరోయిన్గా కమలినీని అనడిగితే రెమ్యునరేషన్ ఎక్కువ చెప్పింది. ఇంకెవ రెవరినో ట్రై చేశాడు. కమలినీయే బెటర్. రావు గోపాలరావు కొడుకు రావు రమేశ్ ఫ్యామిలీ ఫ్రెండ్. తనకు మంచి కేరెక్టర్ ఇస్తానని ప్రామిస్ చేశాడు. మాట నిలబెట్టు కున్నాడు. కెమెరామ్యాన్‌గా సీనియర్ కావాలి. హరి అనుమోలు తగిలాడు. సినిమా అంతా తెలంగాణ, రాయల సీమ, ఆంధ్రాల్లో తిరుగుతుంది. అందుకు తగ్గట్టే లొకేషన్స్, భాష, యాస, వేష ధారణ. ఫ్లాష్‌బ్యాక్ సీన్స్ అన్నీ హైదరా బాద్‌లో తీశారు. అమరావతిలో కొంత షూట్ చేశారు. క్లైమాక్స్ రేలంగి రైల్వే స్టేషన్లో, నక్సల్స్ ఎపిసోడ్ రంపచోడ వరంలో ప్లాన్ చేశారు. నక్సలైట్ పాత్ర కోసం 10-15 మందిని అనుకున్నారు. అందరూ బిజీనే. ‘‘మీరే చేసేయండి’’ అన్నారు ఫైట్ మాస్టర్స్ రామ్-లక్ష్మణ్. క్రిష్ ఖంగు తిన్నాడు. అతనికి యాక్టింగ్ ఆలోచన లేదు. కానీ తప్పని పరిస్థితి. చే గువేరా అంటే క్రిష్‌కు ప్రాణం. ఆ గెటప్‌తోనే ఈ కేరెక్టర్ చేసేశాడు. టైటిల్ మార్చాలి. ‘గాలిపటం’ లేక ‘గమ్యం’. అయితే సినిమా అంతా ప్రయా ణమే కాబట్టి ‘గమ్యం’ బెటర్. 57 రోజుల్లో సినిమా పూర్తయిపోయింది. 78 వేల అడు గుల ఫిల్మ్ ఎక్స్పోజ్డ్. అంటే ఎంత ప్లాన్డ్గా, ప్యాక్డ్గా సినిమా చేశాడో! ప్రసాద్ ల్యాబ్‌లో ప్రివ్యూల మీద ప్రివ్యూలు వేస్తున్నారు. బావుందంటు న్నారు కానీ, ఒక్కరూ కొనడం లేదు. కానీ క్రిష్ ధైర్యంగా ఉన్నాడు. అది సీతారామ శాస్త్రి ఇచ్చిన ధైర్యం. ఆయన ప్రివ్యూ చూసి ‘‘నాకు చెప్పినదానికన్నా బాగా తీశావు. నేనొక కోడిని. సూర్యుడిలా నువ్వొస్తున్నా వన్న విషయాన్ని ముందుగా గమనించి ‘కొక్కొరొక్కో’ అంటూ లోకానికి తెలియ జేస్తున్నా’’ అంటూ హగ్ చేసుకున్నారు. మరోపక్క సీనియర్ దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ్ అండా దండా. ఈ సినిమా రిలీజై హిట్టయితేనే క్రిష్‌కు లైఫ్. లేకపోతే చలో అమెరికా. ఇది ఇంట్లోవాళ్ల కండిషన్. చూద్దాం ఏం జరుగుతుందో!? 2008, ఫిబ్రవరి 29. ‘గమ్యం’ గమ్యాన్ని చేరిన రోజు. అందరికీ నచ్చేసింది. తెలుగు సినిమాకు సరికొత్త గమ్యం అంటూ కితాబులు. క్రిష్ పడ్డ కష్టానికి, సీతారామశాస్త్రి ఇచ్చిన వె(పె)న్నుదన్నుకి సంపూర్ణ ఫలితం. శర్వానంద్‌కి ఇదొక తీపి మజిలీ. ‘గాలి శీను’ పాత్ర ‘అల్లరి’ నరేశ్ హవాను పెంచింది. తమిళం, కన్నడం... ఎక్కడ రీమేక్ చేసినా విజయ గమ్యమే. ముక్తాయింపు: ఆర్టీసీ క్రాస్‌రోడ్స్‌లోని ‘దేవి’ థియేటర్. ‘గమ్యం’ చూసొస్తూ ఇద్దరు మాట్లాడుకుంటున్నారు... ‘‘ఈ నా కొడుకెవడో గానీ పుస్తకాలు తెగ చదివాడ్రా. మనిషంటే ఎవరో భలే చెప్పాడు.’’ ఈ కాంప్లిమెంట్ను మించిన నంది అవార్డు, ఫిల్మ్‌ఫేర్ అవార్డు ఏముంటుంది?! వెరీ ఇంట్రస్టింగ్... * ‘నైస్’ అనే స్వచ్ఛంద సంస్థ నడిపే పూర్ణ చంద్రరావు గిరిబాబు పాత్రకు స్ఫూర్తి. దంపుడు లక్ష్మి పాత్ర... కోటప్పకొండలో జరిగిన వాస్తవ సంఘటనల నుంచి పుట్టింది. ఓ యాక్సిడెంట్లో ఒకాయన ప్రవర్తన ఆధారంగా బ్రహ్మానందం పాత్ర డిజైన్ చేశారు. * శర్వానంద్ పాత్రకు మొదట రామ్‌ని అడిగారు. * తమిళ, కన్నడ భాషల్లోనూ కమలినీయే నాయికగా చేశారు. -
నీ స్నేహం ఇకరాను అని...
సినిమా వెనుక స్టోరీ - 6 ‘‘నేనండీ... ఎమ్మెస్ రాజుని. ఓసారి ఆఫీసుకి రాగలరా?’’... వీఎన్ ఆదిత్య హాస్పిటల్కెళ్లే హడావిడిలో ఉన్నాడు. అపాయింట్మెంట్ టైమ్‌కి వెళ్లకపోతే డాక్టర్ డీబీఎన్ మూర్తి తిడతారు. అందుకే హైదరాబాద్‌లోని అమీర్‌పేటలో ఉన్న హాస్పిటల్‌కు వెళ్ళడానికి ఆదరాబాదరాగా రెడీ అవుతున్నాడు. ఆ టైమ్‌లోనే ఈ ఫోన్. ‘‘అర్జంట్ హాస్పిటల్ పనుంది. నేను మళ్లీ చేస్తానండీ’’ అని ఫోన్ పెట్టేశాడు ఆదిత్య.డాక్టర్ని కలిసి వచ్చేసరికి బాగా లేటయిపోయింది. అప్పుడు గుర్తొచ్చింది ఎమ్మెస్ రాజు ఫోను. ఎంత ఆలోచించినా ఆయనెవరో గుర్తుకురావడం లేదు. సురేష్ ప్రొడక్షన్స్ ఆఫీసులో తెలిసిన ఆపరేటర్ ఉంటే, అతన్నడిగాడు. ‘‘అదేంటీ... రాజుగారు తెలియదా? ‘దేవి, దేవీపుత్రుడు’ సినిమాలు తీసిన హనీబాబు ఆయనే కదా!’’ అని చెప్పాడతను. ఆదిత్య తెగ ఫీలైపోయాడు. ‘‘అరే... అంత పెద్దాయన ఫోన్ చేస్తే గుర్తుపట్టలేక పోయానే! హనీబాబుగా గుర్తుపెట్టుకుని అసలు పేరు మరిచిపోయానే...’’ అని బాధపడిపోయాడు. అయినా... ఆయన నాకెందుకు ఫోన్ చేసుంటారు? ఆదిత్య రకరకాలుగా ఆలోచిస్తున్నాడు. అక్కడ ఎమ్మెస్ రాజు కూడా ఆలోచిస్తున్నారు. ‘దేవీపుత్రుడు’ సినిమా ఫలితం... ఆయన్ని బాగా కుదిపేసింది. ఈసారి ట్రెండు మార్చాలి... రూట్ మార్చాలి... కొత్త దర్శకుడితో క్యూట్ లవ్‌స్టోరీ తీయాలి. ఎమ్మెస్ రాజుకి రాత్రింబవళ్లూ ఇదే ఆలోచన. కెమెరామ్యాన్ ఎస్. గోపాలరెడ్డి ఆయనకు క్లోజ్ ఫ్రెండ్. అన్ని విషయాలూ ఇద్దరూ షేర్ చేసుకుంటారు. గోపాలరెడ్డి దగ్గర ఇదే టాపిక్ వచ్చింది. ‘‘మీక్కావల్సింది చాకు లాంటి కొత్త డెరైక్టరేగా? వీఎన్ ఆదిత్య అని సింగీతం, జయంత్ సి. పారాన్జీల దగ్గర పని చేశాడు. ఆదిత్య మీకు సెట్ అవుతాడు’’ అని ఆదిత్య ఫోన్ నెంబరిచ్చారు గోపాలరెడ్డి. ఎమ్మెస్ రాజు వెంటనే ఆదిత్యకు ఫోన్ కొట్టారు. అప్పుడే అతను డాక్టర్ అపాయింట్మెంట్ ఉందని చెప్పింది. సరే... నెక్ట్స్ డే చేస్తాడేమోనని ఎమ్మెస్ రాజు వెయిట్ చేశారు. నో రెస్పాన్స్. మర్చిపోయాడా? భయపడ్డాడా? ఆదిత్యకు మళ్లీ కాల్ చేశారు ఎమ్మెస్ రాజు. ‘‘సారీ సార్... అర్జంట్‌గా రాజమండ్రి వెళ్తున్నా. అక్కడ టెంపుల్లో పూజ చేయించడానికి వెళ్తున్నా’’ చెప్పాడు ఆదిత్య. ‘‘వెరీ గుడ్. వచ్చాక కలవండి’’ అన్నారు ఎమ్మెస్ రాజు. వారం గడిచినా ఆదిత్య నుంచి కాల్ రాలేదు. ‘మంచి కుర్రాడని చెప్పారు. ఇంత ఇర్రెస్పాన్సిబుల్గా ఉన్నాడేంటి?’ ఎమ్మెస్ రాజుకి కోపం వచ్చింది. ఫైనల్ కాల్. వస్తే వచ్చాడు. లేకపోతే కట్. సుమంత్ ఆర్ట్స్ ఆఫీస్. ఎమ్మెస్ రాజు ముందు బిక్కు బిక్కుమంటూ కూర్చున్నాడు ఆదిత్య. ‘‘సారీ సార్! నాతో మీరు సినిమా చేస్తారని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. కోడి రామకృష్ణగారు ఉండగా నన్నెందుకు పిలుస్తారనుకున్నా. అందుకే కలవడానికి ఇబ్బంది పడ్డా. క్షమించండి.’’ ఎమ్మెస్ రాజు చాలా ప్రశాంతంగా ఆదిత్య మాటలు వింటున్నారు. ‘‘సార్! మీరు పెద్ద ప్రొడ్యూసరు. నేను కొత్తవాణ్ణి. లవ్‌స్టోరీతోనే కెరీర్ స్టార్ట్ చేద్దామను కుంటున్నవాణ్ణి. మీరింతవరకూ లవ్‌స్టోరీ తీయలేదు. నా కథను ఎలా జడ్జ్ చేయగలరు?’’ అని కాస్తంత ధైర్యం కూడ దీసుకుని డౌట్ ఎక్స్‌ప్రెస్ చేశాడు ఆదిత్య. ‘‘గుడ్ క్వశ్చన్. ఓ పది రోజులు ఆఫీసుకి రా! ఇద్దరం సరదాగా డిస్కస్ చేసుకుందాం. ట్యూనింగ్ కుదిరితేనే కలిసి పని చేద్దాం’’ అన్నారు ఎమ్మెస్ రాజు. ఆదిత్య షాకైపోయాడు. అంత పెద్ద ప్రొడ్యూసర్ తనలాంటి కొత్త కుర్రాణ్ణి ఇంతలా ఆదరిస్తారని కలలో కూడా ఊహించలేదు. రోజూ ఆఫీసుకొస్తున్నాడు ఆదిత్య. ఓ రోజు ఎమ్మెస్ రాజు ‘‘నీకు రెండు స్టోరీ ఐడియాలు చెబుతా. ఏది నచ్చితే దాంతోనే సినిమా చేద్దాం’’ అన్నారు. ఎమ్మెస్ రాజు ఫస్ట్ ఐడియా చెప్పారు. ‘‘ఇదేంటి సార్... ఇది ‘ప్రేమించుకుందాం రా’ కథలా ఉంది. ఆ సినిమాకి నేను అసోసియేట్ డెరైక్టర్ని. మళ్లీ అదే కథతో ఎలా సినిమా చేస్తాం?’’ అనడిగేశాడు ఆదిత్య. ఎమ్మెస్ రాజు నవ్వుతూ ‘‘గుడ్... డెరైక్షన్ ఆఫరివ్వగానే ఏది పడితే అది చేసేస్తావా, లేక ఆలోచిస్తావా అని టెస్ట్ చేశానంతే’’ అన్నారు. ఇప్పుడు రెండో ఐడియా చెప్పారు. ఆదిత్యకు నచ్చేసింది. వర్క్ మొదలైంది. హిందీలో వచ్చిన ‘అన్మోల్ ఘడీ’ (1946) సినిమా ఇన్స్పిరేషన్తో కొంతవరకూ కథను తీర్చిదిద్దారు. యాంటిక్ వాచ్ బహుమతిగా ఇవ్వడం, తన ప్రేమకథనే నవలగా రాయడం లాంటి కొన్ని సీన్స్ అలానే డెవలప్ అయ్యాయి. దర్శక - రచయిత కె. భాగ్యరాజా తీసిన ‘డార్లింగ్... డార్లింగ్’ సినిమా కూడా కొంచెం అదే తరహాలో ఉంటుంది. ఆ సినిమా ప్యాట్రన్‌లో చైల్డ్‌హుడ్ నుంచి లవ్‌స్టోరీ మొదలుపెట్టాలని ఆదిత్య కోరిక. అలాగే ‘అప్పు చేసి పప్పు కూడు’లో రేలంగి పాత్ర అంటే ఆదిత్యకు చాలా ఇష్టం. ఆ ఇన్స్పిరేషన్తో హీరో ఫ్రెండ్ కేరెక్టర్ని డిజైన్ చేశారు. ఇలా ఎమ్మెస్ రాజు, ఆదిత్య కలిసి స్క్రిప్టు చేసుకుంటూ వెళ్తున్నారు. ఆ రోజు ఎమ్మెస్ రాజుకి ఓ సీన్ వినిపించాడు ఆదిత్య. సముద్రపు ఒడ్డున భోరున వర్షం. హీరో ఏడుస్తూ ఉంటే, అతని ఫ్రెండ్ వచ్చి ఓ డైలాగ్ చెబుతాడు. ‘‘ఒరేయ్! వర్షం కూడా అప్పుడప్పుడూ మనకు మేలు చేస్తుందిరా! మన కన్నీళ్లను ఎదుటివాళ్లకు కనబడకుండా దాచేస్తుంది.’’ ఈ డైలాగ్‌కి ఎమ్మెస్ రాజు మనసు చెమర్చింది. వెంటనే చెక్‌బుక్ తీసి పాతికవేలకు చెక్ రాసిచ్చేశారు. నెక్ట్స్ డే అనౌన్స్మెంట్. ప్రముఖ నిర్మాత ఎమ్మెస్ రాజు, కొత్త కుర్రాడు వి.ఎన్.ఆదిత్యకు డెరైక్షన్ ఛాన్స్ ఇస్తూ చేస్తున్న సినిమా... ‘మనసంతా నువ్వే’. ఆ టైటిల్ కూడా ఎమ్మెస్ రాజు పెట్టిందే. ‘మనసంతా నువ్వే’ని మహేశ్‌బాబుతో చేస్తే? ఎమ్మెస్ రాజుకి ఎగ్జయిటింగ్‌గా ఉందీ ఐడియా. కానీ ఆదిత్య ఏమో కొత్తవాడైతే కరెక్ట్ అంటాడు. ఇప్పటికిప్పుడు కొత్త హీరో ఎక్కడ దొరుకుతాడు? ఆదిత్య దగ్గర ఆప్షన్ ఉంది. ‘చిత్రం’ హీరో ఉదయ్‌కిరణ్. ఇప్పుడు ‘నువ్వు-నేను’ చేస్తున్నాడు. వెంటనే ఎమ్మెస్ రాజు ‘నువ్వు-నేను’ రష్ చూడ్డానికెళ్లారు. ఆ రష్ చూసీ చూడగానే ఈ సినిమాకు ఉదయ్‌కిరణ్‌ను ఫిక్స్ చేసేశారు. ఫైనల్‌గా స్క్రిప్ట్ పరుచూరి బ్రదర్స్ దగ్గరకు వెళ్లింది. ఇక్కడే అసలు బాంబు పేలింది. కథ బాలేదన్నారు పరుచూరి గోపాలకృష్ణ. సెకండాఫ్ సరిగ్గా లేదు... చైల్డ్ ఎపిసోడ్ అంతసేపు వేస్టు... ఇలా ఒక్కోటీ చెబుతుంటే ఆదిత్య గుండె జారిపోయింది. షూటింగ్కెళ్లే టైమ్‌లో... బ్లాస్ట్. అరకులోయలో ఓ గెస్ట్‌హౌస్. టెన్ డేస్ సిట్టింగ్స్. పరుచూరి బ్రదర్స్... ఎమ్మెస్ రాజు... వీఎన్ ఆదిత్య... వీరూ పోట్ల... స్క్రిప్టు విషయంలో కిందా మీదా పడుతున్నారు. స్క్రీన్‌ప్లే ఆర్డర్ మారింది. కథ కొత్త మలుపులు తిరుగుతోంది. హమ్మయ్య... మొత్తానికి కథ పర్ఫెక్ట్లీ ఆల్రైట్. ఆర్పీ పట్నాయక్ మ్యూజిక్ డెరైక్టర్. ట్యూన్స్ విరగ్గొట్టేస్తున్నాడు. యాంటిక్ వాచ్ సౌండ్ కోసమైతే ఆర్పీ చాలా కష్టపడ్డాడు. మలయాళంలో విద్యాసాగర్ ‘ప్రణయ వర్ణంగల్’ (1998) కోసం ‘కన్నాడి కూడుంకూట్టి’ పాట చేశాడు. అది సూపర్ డూపర్ హిట్. దాన్ని యథాతథంగా వాడితే సిట్యుయేషన్ అదిరిపోతుంది. ఇక్కడ అదే ‘తూనీగ... తూనీగ...’ పాట అయ్యింది. 95 పర్సంట్ షూటింగ్ ఓవర్. ఓన్లీ 5 పర్సంట్ బ్యాలెన్స్. అమీర్‌పేట - చర్మాస్ షోరూమ్‌లో హాఫ్ డే షూటింగ్. రీమాసేన్ బట్టలు కొనుక్కోవడానికి వచ్చే సీన్ తీయాలి. లైటింగ్ రెడీ అవుతోంది. ఇంకాసేపట్లో సీన్ తీయాలి. చిత్రనిర్మాణంలో ప్రతి చిన్న అంశాన్ని దగ్గరుండి జాగ్రత్తగా చూసుకునే ఎమ్మెస్ రాజుకు సడెన్‌గా డౌటొచ్చింది. ఈ సీన్ బట్టల షాపులో కంటే బుక్‌షాప్‌లో తీస్తే బెటరేమో! చిన్నపాటి డిస్కషన్. షూటింగ్ ఆగింది. ఆదిత్య హర్టయిపోయాడు. అలాగే నడుచుకుంటూ బయటికొచ్చేశాడు. కృష్ణానగర్ దాకా వెళ్లాడు. ఏవేవో ఆలోచనలు. ఇప్పటికే షూటింగ్ దాదాపు అయిపోవచ్చింది. ఇప్పుడీ కోపం వల్ల మొత్తం ప్రాజెక్ట్ డామేజ్ అవుతుంది. అదేదో వాళ్లను కన్విన్స్ చేసుకుంటే బెటర్ కదా! ఆదిత్య మళ్లీ వెనక్కు తిరిగొచ్చేశాడు. లొకేషన్లో అందరూ ఆదిత్య కోసం వెతుకుతున్నారు. అప్పటికే పరుచూరి వెంకటేశ్వరరావు వచ్చి చెప్పడంతో ఎమ్మెస్ రాజు కన్విన్స్ అయ్యారట. అంతా ఓకే... రామానాయుడు స్టూడియో... ఆవిడ్ ఎడిటింగ్ రూమ్‌లో రష్ చూస్తున్నారు. ఎవరూ ఏమీ మాట్లాడడం లేదు. ఎమ్మెస్ రాజు, పరుచూరి గోపాలకృష్ణ, ఎస్. గోపాలరెడ్డి... ముగ్గురూ పక్కకెళ్లి సీరియస్ డిస్కషన్. ఆదిత్యకు ఏమీ అర్థం కావడం లేదు. క్లైమాక్స్ తేడా కొట్టేసింది... సినిమా కష్టం... పరుచూరి గోపాలకృష్ణ జడ్జిమెంట్ చెప్పేశారు. ఇదంతా ఎడిటర్ కె.వి. కృష్ణారెడ్డి అబ్జర్వ్ చేస్తున్నాడు. అతను వీళ్ల దగ్గరకొచ్చి ‘‘ఒక్కసారి మళ్లీ క్లైమాక్స్ చూడండి... ఎడిటింగ్‌లో చిన్న ఛేంజ్ చేశాను’’ అన్నాడు. వీళ్లు నిర్లిప్తంగానే లోపలికెళ్లారు. కాసేపటికి బయటికొచ్చిన గోపాలకృష్ణ, ఆదిత్య దగ్గరకొచ్చి ‘‘అదిరిపోయింది’’ అంటూ హగ్ చేసుకున్నాడు. ఎడిటింగ్ మేజిక్. ఫస్ట్ హాఫ్‌లోని ‘నీ స్నేహం’ పాటను మళ్లీ క్లైమాక్స్‌లో యాడ్ చేసేసరికి, ఎక్కడలేని డెప్త్ వచ్చేసింది. 2001 అక్టోబర్ 19. ఎమ్మెస్ రాజు నిర్మాతగా కొత్త ట్రెండ్ సృష్టించిన రోజు... వీఎన్ ఆదిత్య లైఫ్ టర్న్ అయిన రోజు... ఉదయ్కిరణ్కి హ్యాట్రిక్ (‘చిత్రం’, ‘నువ్వు - నేను’, ‘మనసంతా నువ్వే’) పూర్తయిన రోజు... ఎక్కడ చూసినా ‘మనసంతా నువ్వే’ టాపిక్కే. బాక్సాఫీసంతా కనక వర్షమే! - పులగం చిన్నారాయణ -
మైండ్ బ్లాక్ చేసింది
సినిమా వెనుక స్టోరీ 14 రీళ్ల సినిమాలో ఎన్నో మలుపులు, మెరుపులు. అవి ఉంటేనే బాక్సాఫీస్ దగ్గర ఉరుములూ మెరుపులూ. ఆ మాటకొస్తే సినిమాలోనే కాదు... సినిమా మేకింగ్‌లోనూ ఎన్నో మలుపులుంటాయి. అందుకే ఓ సక్సెస్ఫుల్ సినిమా తయారీ కూడా సినిమా అంత ఆసక్తికరం. ‘ఆంధ్రావాలా’ డిజాస్టర్. అప్పటికి వరుసగా నాలుగు హిట్లు ఇచ్చి ఉన్న పూరి జగన్నాథ్ కెరీర్లో అతి పెద్ద కుదుపు ఇది. లెక్కలన్నీ తారుమారు. ఏం చేయాలో, ఏం చేయకూడదో తెలీని పరిస్థితి. చిరంజీవితో ఓ ప్రాజెక్టు గురించి ఎప్పటినుంచో చర్చలు జరుగుతున్నాయి. ‘శ్రీకృష్ణుడు ఫ్రమ్ సురభి కంపెనీ’ పేరుతో పూరి ఓ స్క్రిప్టు సిద్ధం చేస్తున్నాడు. చిరంజీవికి అది వినిపించాలి... ఆయన గ్రీన్ సిగ్నల్ ఇవ్వాలి... ప్రాజెక్టు పట్టాలెక్కాలి... అదంతా పెద్ద ప్రొసీజర్. ఇట్ టేక్స్ లాంగ్ టైమ్. పూరీకి పేషెన్స్ తక్కువ. అది అసహనం కాదు... వేగం. ఖాళీగా కూర్చోకూడదనే తత్వం. ‘బద్రి’ టైమ్‌లో చేసుకున్న ఓ స్క్రిప్టు బూజు దులిపాడు. ‘ఉత్తమ్‌సింగ్ సన్నాఫ్ సూర్యనారాయణ.’ టైటిల్ విని రవితేజ ఫ్లాట్. ‘చేసేద్దాం జగన్’ అంటూ తొందరపడ్డాడు. ప్రొడ్యూసర్ నాగబాబు కూడా రెడీ. ఇక్కడో ట్విస్ట్. రవితేజకు బంగారం లాంటి ఆఫరొచ్చింది. తమిళంలో సూపర్ డూపర్ హిట్టయిన చేరన్ సినిమా ‘ఆటోగ్రాఫ్’ తెలుగు రీమేక్‌లో చేసే ఛాన్సు... వదులుకోకూడదు... వదిలితే ఎవరో ఒకరు చేసేస్తారు. రవితేజ హార్ట్‌ని టచ్ చేసిన సినిమా అది. దాంతో ‘ఆటోగ్రాఫ్’ ప్రాజెక్టుకి ఆటోగ్రాఫ్ ఇచ్చేశాడు రవితేజ. ‘ఉత్తమ్‌సింగ్’కి తాత్కాలిక బ్రేక్. ఇక్కడ పూరి ఖాళీగా ఉండలేడు కదా. తమ్ముడు సాయిరామ్ శంకర్‌తో ‘143’ స్టార్ట్ చేసేశాడు. ‘143’ రిలీజైంది కానీ, రవితేజ ఖాళీగా లేడు. పూరి అన్నాళ్ళు ఆగలేడు. ఎవరో ఒకరితో ‘ఉత్తమ్‌సింగ్’ చేసెయ్యాలి. సోనూసూద్ కనబడ్డాడు. బాలీవుడ్ యాక్టర్. ఒడ్డూ పొడుగు... బావుంటాడు... పూరీకి అతనితో ఎక్స్పెరిమెంట్ చేద్దామనిపించింది. లెక్కలు కుదర్లేదు. మళ్లీ బ్రేక్. 2004 నవంబరు 3. రాత్రి తొమ్మిదో పదో అయ్యింది. హైదరాబాద్ తాజ్ హోటల్లో పూరి, మహేశ్ కూర్చున్నారు. మహేశ్‌కి పూరి కథ చెప్పాలి. మూడేళ్ల తర్వాత సెకండ్ మీటింగ్. అప్పుడేదో కథ చెబితే ‘ప్చ్... నచ్చలేద’న్నాడు మహేశ్. ‘ఇడియట్’ సినిమా మహేశ్‌తోనే చేయాలనుకున్నాడు. ఈసారైనా కనెక్టవుతాడా? పూరి కథ చెప్పడం మొదలెట్టాడు. హీరో సిక్కుల కుర్రాడు. పేరు ఉత్తమ్‌సింగ్. మాఫియా ముఠాలో చేరతాడు. వాళ్ల మధ్యనే ఉంటూ వాళ్లను ఖతమ్ చేస్తాడు. క్లైమాక్స్ ట్విస్ట్ ఏంటంటే - ఉత్తమ్‌సింగ్ ఓ పోలీసాఫీసరు. ‘‘ఎక్స్లెంట్ సార్’’ అన్నాడు మహేశ్ ఉద్వేగంగా. ‘‘నెక్ట్స్ ఇయర్ మొదలుపెట్టేద్దాం... కానీ చిన్న ఛేంజ్. సిక్కు బ్యాక్‌డ్రాప్ మార్చేయండి. మిగతాదంతా ఓకే’’ అని చెప్పాడు మహేశ్. మార్పుకి పూరీ ఓకే. కానీ నెక్ట్స్ ఇయర్ వరకూ ఆగాలే..! అదీ టెన్షన్. ఏం పర్లేదు... అక్కడ నాగార్జున రెడీగా ఉన్నాడు. ఆయనతో ‘సూపర్’ సినిమా చేసొచ్చేస్తే, ఇక్కడ మహేశ్ ఫ్రీ అయిపోతాడు. మహేశ్‌కి ‘ఉత్తమ్‌సింగ్’ టైటిల్ నచ్చలేదు. పూరి టకీమని ‘పోకిరి’ టైటిల్ చెప్పేశాడు. మహేశ్ పెదవులపై స్మయిల్. అంటే బాగా నచ్చేసినట్టే! మహేశ్ పక్కన హీరోయిన్ అంటే కత్తి కసాటాలా ఉండాలి. ‘సూపర్’ హీరోయిన్ ఆయేషా టకియా నిజంగా కత్తి కసాటానే. ఆ అమ్మాయి ఓకే. కానీ లాస్ట్ మినిట్ ఛేంజ్. అర్జంట్‌గా హీరోయిన్ కావాలి. రకరకాల ఫోటోలు... ఎంక్వైరీలు... దీపికా పదుకొనే స్టిల్స్ కూడా చూశారు .‘వెన్నెల’ సినిమాలో యాక్ట్ చేసిన పార్వతీ మెల్టన్ ఎలా ఉంటుంది? ఇలా ఏవేవో డిస్కషన్లు. ఫైనల్‌గా ‘దేవదాసు’ పోరీ ఇలియానాకు బెర్త్ కన్ఫర్మ్. ‘పోకిరి’ షూటింగ్ స్టార్ట్. చకచకా... టకటకా... పూరీది మామూలు స్పీడు కాదు. మహేశ్ కంగారుపడిపోయాడు. ఇదేంటబ్బా అనుకున్నాడు. అన్నీ సింగిల్ టేక్‌లే. వారం తర్వాత పూరి స్టయిల్ అర్థమైపోయింది మహేశ్‌కి. ‘భలే ఉందే’ అనుకున్నాడు. మహేశ్ క్రాఫ్ మారింది. గెటప్ మారింది. డైలాగ్ డెలివరీ మారింది. మహేశ్‌కి కొత్త లుక్. కొత్త కేరెక్టరైజేషన్. 70 రోజుల్లో సినిమా ఫినిష్. ఎప్పుడొచ్చామన్నది కాదన్నయ్యా... బుల్లెట్ దిగిందా? లేదా..! బాక్సాఫీస్ దగ్గర అదే జరిగింది. 2006 ఏప్రిల్ 28న రిలీజైన ఈ సినిమా దడదడలాడించేసింది. రికార్డులన్నీ చెల్లాచెదురు. మహేశ్‌కి సూపర్ స్టార్డమ్. పూరీకి టాప్ డెరైక్టర్ హోదా. ఇలియానా స్టార్ హీరోయిన్. ప్రతీదీ పేలింది. డైలాగ్స్, సాంగ్స్, ఉప్మా సీన్, ముష్టివాళ్ల కామెడీ, బ్రహ్మీ సాఫ్ట్వేర్ ఎపిసోడ్... ఇలా అన్నీ అదుర్స్. మాస్ సినిమా అంటే ఇలానే ఉండాలి. ఇకపై ఇదే టెక్ట్స్ బుక్. ‘పోకిరి’ లాంటి సినిమానే కావాలంటూ ఇతర హీరోల కలలు. (అప్పటికి) 75 సంవత్సరాల తెలుగు సినిమా చరిత్రలోనే కాదు... ఇప్పటికీ ‘పోకిరి’ ఓ సెన్సేషన్. మళ్లీ ఓసారి చూద్దామా... - పులగం చిన్నారాయణ హిట్ డైలాగ్స్... * ఒకసారి కమిటైతే నా మాట నేనే వినను. * నేనెంత ఎదవనో నాకే తెలియదు. * ఎవడు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయిపోద్దో... ఆడే పండుగాడు. వెరీ ఇంట్రస్టింగ్...! * ఇందులో మహేశ్ ముద్దుపేరు ‘పండు’. పూరి భార్య లావణ్య ముద్దు పేరు అదే. * మహేశ్‌బాబు క్లైమాక్స్‌లో ప్రకాశ్‌రాజ్‌ని గూబ మీద కొడితే కాసేపు సెలైన్స్ అయిపోతుంది. థియేటర్లో ఈ సీన్‌కి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ ఐడియా ఫైట్‌మాస్టర్ విజయన్‌ది. * ‘శివమణి’ షూటింగ్ కోసం ఫారిన్ వెళ్లినప్పుడు అక్కడో గిటారిస్టు ‘లిజన్ టు ద ఫాలింగ్ రెయిన్’ పాట ప్లే చేస్తుంటే విని ఆశ్చర్యపోయారు పూరి. అది అచ్చం సూపర్‌స్టార్ కృష్ణ నటించిన ‘గౌరి’ (1974) సినిమాలోని ‘గలగల పారుతున్న గోదారిలా...’ పాటలా ఉంది. ఎంక్వైరీ చేస్తే ఈ ఇంగ్లీషు పాట ప్రేరణతోనే ‘గౌరి’లో ఆ పాట చేశారట. ఎలానూ కృష్ణ పాట కాబట్టి, మహేశ్‌పై చేస్తే కొత్తగా ఉంటుందనుకున్నారు పూరి. ఆయన అంచనా ఫలించింది. ‘గలగలపారుతున్న గోదారిలా...’ పాట సూపర్‌హిట్. * ఈ సినిమాకు శ్యామ్ కె.నాయుడు కెమేరామేన్. కానీ ‘జగడమే..’ పాటకు మాత్రం గుహన్ ఫొటోగ్రఫీ చేశారు. ఎందుకంటే ఈ పాట తీసే టైమ్‌కి శ్యామ్ ‘మున్నా’ షూటింగ్లో బిజీగా ఉన్నారు. గుహన్ అంతకుముందు మహేశ్‌తో ‘అతడు’ చేశారు. ఈ పాటను హైదరాబాద్‌లోని గాయ్రతీ హిల్స్, గోల్కొండ ఫోర్ట్, అన్నపూర్ణ ఏడెకరాల్లో తీశారు. * దీన్ని తమిళంలో విజయ్‌తో ప్రభుదేవా (పోక్కిరి-2007) రీమేక్ చేశారు. హిందీలో సల్మాన్‌ఖాన్‌తో ప్రభుదేవా (వాంటెడ్-2009) రీమేక్ చేశారు. కన్నడంలో దర్శన్ (పొర్కి 2010), బెంగాలీలో షకిబ్ ఖాన్ (రాజోట్టో- 2014) చేశారు. నాలుగు చోట్లా సూపర్ డూపర్ హిట్. దటీజ్ ద స్టోరీ వ్యాల్యూ. ఇన్స్పిరేషన్... ఓ హాలీవుడ్ సినిమాలో ఒక బ్యాంక్ దొంగతనం జరుగుతుంది. కెమెరాలో రికార్డయిన దాన్నిబట్టి వాళ్లు సీ సర్ఫర్స్ అని అర్థమవుతుంది. దాంతో పోలీసాఫీసరైన హీరో వాళ్ల గ్రూపులో చేరి అసలు దొంగల్ని పట్టుకుంటాడు. ‘పోకిరి’లో హీరో చేసింది కూడా అదే కదా! హిందీలో గోవింద్ నిహలానీ తీసిన ‘ద్రోహ్కాల్’ సినిమాలోని కోవర్ట్ సీన్ కూడా ఈ సినిమాకి ప్రేరణ. దాదాపుగా ఇలాంటి కథాంశంతో చిరంజీవి రెండు సినిమాలు చేశారు... ‘మరణమృదంగం’, ‘స్టేట్‌రౌడీ’. ఎక్కడ తీశారంటే... హైదరాబాద్‌లోని అన్నపూర్ణ స్టూడియో, అన్నపూర్ణ ఏడెకరాలు, అల్యూమినియమ్ ఫ్యాక్టరీ, చెన్నైలోని బిన్నీమిల్స్, బ్యాంకాక్, పుకెట్ ఐలెండ్...