ఒక్క అడుగు... | Story behind film as Rajamouli Chhatrapati Movie | Sakshi
Sakshi News home page

ఒక్క అడుగు...

Published Sun, Dec 13 2015 2:18 AM | Last Updated on Sun, Jul 14 2019 4:05 PM

ఒక్క అడుగు... - Sakshi

ఒక్క అడుగు...

సినిమా వెనుక స్టోరీ - 28
కొందరు కలుసుకోవాలంటే కాలం వెంటనే అనుకూలించదు. ఏవేవో అవాంతరాలు తెచ్చి పెడుతుంది. కానీ, ఒకసారి కలవడమంటూ జరిగితే మాత్రం ఆ బంధం ఎప్పటికీ విడనంత స్ట్రాంగ్‌గా ఉంటుంది. ప్రభాస్ - రాజమౌళి విషయం అంతే. ప్రభాస్ ‘ఈశ్వర్’ సినిమా చేస్తున్న టైమ్‌లో, రాజమౌళి ‘స్టూడెంట్ నం.1’ చేసి ఖాళీగా ఉన్నాడు. ప్రభాస్‌తో సినిమా చేయాలని రాజమౌళి ఉబలాటపడ్డాడు. కుదర్లేదు. ‘సింహాద్రి’ తర్వాత కూడా ట్రై చేశాడు. అప్పుడూ కుదర్లేదు. ఈసారి మాత్రం రాజమౌళి బలంగా సంకల్పించుకున్నాడు. అటువైపు ప్రభాస్ కూడా. ఈసారి వీళ్లనాపే శక్తి లేనే లేదు.
    
కీరవాణి ఫ్యామిలీకి భోగవల్లి ప్రసాద్ చాలా క్లోజ్. సినిమాలకు అతీతమైన బంధం వాళ్లది. భోగవల్లి ప్రసాద్ ఏ సినిమా చేసినా దాదాపుగా కీరవాణి మ్యూజిక్ చేయాల్సిందే. తన ముందు ఎదిగిన రాజమౌళి ఇండస్ట్రీలో టాప్ డెరైక్టర్ కావడం చూసి భోగవల్లి ప్రసాద్ చాలా ఆనందపడిపోయారు. రాజమౌళితో సినిమా చేయాలని ముచ్చట పడ్డారాయన.రాజమౌళికి కూడా ఓకే. ‘‘ఎంత బడ్జెట్ అయినా ఫర్లేదు’’ అని చెప్పేశాడాయన. ఇంత స్వేచ్ఛ ఇస్తే ఎవరికైనా టెన్షనే. రాజమౌళి బరువైన బాధ్యతతో ప్రాజెక్ట్‌కి రూపకల్పన చేస్తున్నాడు.
    
ప్రభాస్ సినిమాలన్నీ వరుసపెట్టి చూస్తున్నాడు రాజమౌళి. ఏ హీరోతో సినిమా చేసినా, అతను అంతకుముందు చేసిన సినిమాలన్నీ చూసి, పాత్రల తీరు, వాటిలో ఆడియన్స్‌కి ఏం నచ్చాయనే విషయాలన్నీ రీసెర్చ్ చేయడం రాజమౌళికి అలవాటు. బి.గోపాల్ దర్శకత్వంలో వచ్చిన ‘అడవిరాముడు’లో బర్త్‌డే సీన్‌లో ఆర్తి అగర్వాల్‌తో ప్రభాస్ ‘‘నువ్విచ్చిన ఈ గిఫ్ట్‌ని జీవితాంతం గుర్తుపెట్టుకుంటాను’’ అని చెబుతాడు.

అక్కడ ప్రభాస్ ఎక్స్‌ప్రెషన్ రాజమౌళికి చాలా నచ్చేసింది. చేస్తే ఇతనితో హై లెవెల్ ఎమోషనల్ సినిమా చేయాలని ఆ క్షణమే డిసైడైపోయాడు. నాన్న విజయేంద్రప్రసాద్‌తో కూర్చున్నాడు రాజమౌళి. ఇద్దరి మధ్య డిస్కషన్స్. ‘‘ఈ పదేళ్లలో తల్లీ కొడుకుల సెంటిమెంట్‌తో సినిమా రాలేదు. ఆ ప్యాట్రన్‌లో మంచి కథ కావాలి నాన్నా’’ అడిగాడు మౌళి. ఆయనకు వెంటనే ‘ఛత్రపతి’ సబ్జెక్ట్ గుర్తుకొచ్చింది. దానికో ఫ్లాష్‌బ్యాక్ ఉంది.
    
1988లో ఓ రాత్రిపూట విజయేంద్రప్రసాద్ వీడియో ప్లేయర్ ఆన్ చేశారు. ఓ వీహెచ్‌ఎస్ క్యాసెట్ ప్లే చేశారు. ‘స్కార్ ఫేస్’ అనే హాలీవుడ్ సినిమా అది. సౌండ్ సరిగ్గా రావడం లేదు. సరిగ్గా అర్థం కాకపో యినా, అందులోని సెంటిమెంట్ ఆయన్ను కదిలించింది. అప్పటికప్పుడు ఓ స్టోరీ ఐడియా స్ఫురణకొచ్చేసింది. గాఢనిద్రలో ఉన్న భార్యను లేపి ఉత్సాహంగా ఆ కథ మొత్తం చెప్పేసి, తర్వాత ప్రశాంతంగా నిద్రపోయారాయన. ఆవిడ మాత్రం నిద్రపోలేదు. ఆ కథలోని సెంటిమెంట్‌కి ఆవిడకు ఏడుపాగలేదు.

ఇదే కథను తర్వాత ఆఫీసులో డిస్కస్ చేస్తుంటే, పద్మాలయా సంస్థలో డెరైక్షన్ డిపార్ట్‌మెంట్‌లో పనిచేసే గోపి విన్నాడు. ‘‘ఏం కథండీ బాబూ... ‘ఛత్రపతి’ అని టైటిల్ పెట్టండి. అదిరిపోతుంది’’ అన్నాడు. ‘నిజమే... ఈ కథకు ‘ఛత్రపతి’ టైటిల్ కరెక్ట్’ అనుకున్నారు విజయేంద్రప్రసాద్. ‘ఛత్రపతి’ అనగానే మరాఠా యోధుడు శివాజీ గుర్తొస్తాడు. తల్లి జిజియాబాయి, శివాజీకి ధైర్యం నూరిపోసి సూపర్ హీరోని చేసింది. ఈ కథలోనూ హీరోకి తల్లి మాటలే స్ఫూర్తి. టైటిల్ అలా సెట్ అయ్యింది. అక్కడితో ఆ కథకు ఫుల్‌స్టాప్ పడింది.
    
రాజమౌళికి ‘ఛత్రపతి’ కథ విప రీతంగా నచ్చేసింది. ప్రభాస్ ఇమేజ్‌కు తగ్గట్టుగా కొన్ని మార్పులూ చేర్పులూ చేసుకున్నాడు. రాజమౌళి ఏ కథ చేసినా అందులో సూపర్ హీరోయిజం కచ్చితంగా ఉంటుంది. ఇందులో కూడా బాగా వర్కవుటయ్యింది. అలాగే కామెడీ కూడా బాగా రావాలని రాజమౌళి తపన. శంకర్ సినిమా ‘అపరిచితుడు’ అప్పుడు టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ. దానికి పేరడీ చేస్తే? రాజమౌళి ఆలోచన. కో-డెరైక్టర్ కణ్నన్ దానికి పోపు చల్లాడు. ‘అప్రతిష్ఠుడు’ అంటూ చేసిన ఎపిసోడ్ బాగా వచ్చింది. ఇక స్క్రిప్ట్ లాక్.
 
ఎం.రత్నంతో డైలాగ్స్ రాయించారు. హీరోయిన్‌గా శ్రీయ, మెయిన్ విలన్‌గా ‘సై’ ఫేమ్ ప్రదీప్ రావత్ ఓకే. ఇంకో విలన్ కావాలి. ‘సై’లో విలన్‌గా మొదట అనుకున్న నరేంద్ర ఝా గుర్తొచ్చాడు. బాజీరావ్‌గా అతను ఖరార్. కాట్రాజు పాత్రకు ప్రభాస్‌లా ఒడ్డూ పొడవున్నవాడు కావాలి. చాలామందికి స్క్రీన్ టెస్ట్ చేశారు. ఫైనల్‌గా సుప్రీత్ సెలెక్ట్ అయ్యాడు. ‘సై’లో విలన్ గ్యాంగ్‌లోని పదిమందిలో అతనొకడు.

ఇందులో ఇంపార్టెంట్ కేరెక్టర్. కానీ ఇంకా స్ట్రాంగ్‌గా తయారవ్వాలి. 4 నెలలు జిమ్‌కెళ్లి 8 కేజీలు పెరిగాడు సుప్రీత్. తల్లి పాత్రకు భానుప్రియ అయితే బెటర్. కానీ ఆవిడేమో అమెరికా వెళ్లే హడావిడిలో ఉన్నారు. రాజమౌళి ఒక్కసారి కథ వినమని బతిమిలాడాడు. భానుప్రియ కథ విని ‘‘నేనీ సినిమా చేస్తున్నా’’ అని చెప్పేశారు. ప్రభాస్ బ్రదర్‌గా షఫీని ఫిక్స్ చేశారు. ‘సై’కి పని చేసిన సెంథిల్‌కే కెమెరామ్యాన్ పోస్ట్. ఆ సినిమాకి ఎలాంటి షాట్స్ కావాలో చెప్పి చేయించుకున్నాడు. స్క్రిప్ట్ ఇచ్చేసి ‘నీ ఇష్టం... ఎలా తీస్తావో’’ అనేశాడు.

ఆర్ట్ డెరైక్టర్ రవీందర్ ఈ టీమ్‌లో కొత్తగా జాయినయ్యాడు. ఇక పెద్దన్న కీరవాణి ఎలానూ పెద్ద అండ. పాటలన్నీ రెడీ. ‘ఎ’ వచ్చి ‘బి’పై వాలే’ పాటను బాలీవుడ్ సింగర్ అద్నాన్ సామీతో పాడించాలనుకున్నారు. దానికి తగ్గట్టే పాట శ్రుతిని అడ్జస్ట్ చేశారు. ఆ టైమ్‌కి అద్నాన్ ఫారిన్‌లో ఉండటంతో కీరవాణి తన వాయిస్‌తో ట్రాక్ చేశారు. చివరకు ఇదే బావుందని ఉంచేశారు. ‘అగ్ని స్ఖలన సందిగ్ధరిపు వర్గ ప్రళయ రథ ఛత్రపతి’ పాటను కీరవాణి తండ్రి శివశక్తి దత్తా రాశారు.
    
వైజాగ్ సముద్రం. భారీ క్రేన్‌తో ప్రభాస్‌ని సముద్రం మధ్యలో వేలాడదీశారు. ఇది ఫస్ట్ డే ఫస్ట్ సీన్. భోగవల్లి ప్రసాద్‌కైతే ఒకటే కంగారు. ప్రభాస్, రాజమౌళి మాత్రం చాలా కూల్‌గా పనిచేసుకుంటూ వెళ్లిపోతున్నారు. వైజాగ్ పోర్ట్ ఏరి యాలోనే శరణార్థుల కాలనీ సెట్ వేశారు. అక్కడే మేజర్ పోర్షన్ తీసేశారు. పీటర్ హేన్స్ హాలీవుడ్ స్టాండర్డ్‌లో యాక్షన్ సీన్స్ డిజైన్ చేశాడు. కష్టమంతా కెమెరామ్యాన్ సెంథిల్‌దే. రాజమౌళి తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకోవాలి.

అందుకే కష్టపడుతున్నాడు. భారీ యాక్షన్ ఎపిసోడ్స్ ఉన్నా, సాఫ్ట్‌లుక్ రావడానికి ట్రై చేస్తున్నాడు. అందుకే బ్రౌన్ టింట్ అప్లయ్ చేశాడు. రెగ్యులర్ కమర్షియల్ సినిమాలకు వాడే కెమెరా టెక్నిక్స్ యూజ్ చేయలేదు. ‘స్లీపింగ్ హాలో’ అనే హాలీవుడ్ సినిమాలో వాడిన సాఫ్ట్ బాక్స్ టెక్నిక్‌ని ఓ ఫైట్ సీక్వెన్స్‌లో ఉపయోగించారు. వీడియో మేకింగ్‌లో వాడే సాఫ్ట్ బాక్స్‌లను తెప్పించి వాటిని ఆన్ చేశారు. 40 అడుగుల ఐరన్ ఫ్రేమ్‌కి లైట్స్ బిగించారు.

బెలూన్ లైట్స్‌ని పెద్ద క్రేన్ సాయంతో 100 అడుగుల ఎత్తులో ఉంచి, వాటిని శాటిన్ క్లాత్‌తో కవర్ చేశారు. ఆ లైటింగ్‌లో ఆ ఫైట్ సీక్వెన్స్ తీశారు. ‘ఎ వచ్చి బిపై వాలే’లో కొంత పోర్షన్ లైట్ బ్యాక్‌గ్రౌండ్‌లో తీశారు. హీరో హీరోయిన్స్, డ్యాన్సర్ల కాస్ట్యూమ్స్ కూడా లైట్ కలర్. కొరియోగ్రాఫర్ లారెన్స్ బ్యాక్‌గ్రౌండ్ మారుద్దామన్నారు. సెంథిల్ మాత్రం కొత్తగా ఉంటుందని చెప్పారు. నిజంగానే పాట కొత్తగా వచ్చింది.
 
భోగవల్లి ప్రసాద్ రోజూ హ్యాపీగా లొకేషన్‌కి వస్తున్నారు. అసలు టెన్షన్ రాజమౌళిది. చెప్పిన బడ్జెట్ దాటకూడదు. అందుకే ప్రతివారం బడ్జెట్ ఫిగర్స్ అన్నీ చూస్తూండేవాడు. ఎక్కడా పెరగడానికి వీల్లేదు. అలాగని ఎక్కడా తగ్గకూడదు. అంతా పర్‌ఫెక్ట్ ప్లానింగ్. ప్రీ ప్రొడక్షన్‌కు 4 నెలలు... ప్రొడక్షన్‌కు 7 నెలలు... పోస్ట్ ప్రొడక్షన్‌కు 1 నెల... అంతా అనుకున్నట్టే జరుగుతోంది. వైజాగ్, హైదరాబాద్, మైసూరు (1 పాట), నెల్లూరు (క్లైమాక్స్)ల్లో దిగ్విజయంగా షూటింగ్ పూర్తయ్యింది. 1.6 లక్షల అడుగుల ఫుటేజ్ వచ్చింది. దాన్ని 15,000 అడుగులకు ఫైనల్ కట్ చేశారు. కాస్త వల్గర్‌గా ఉందని వేణుమాధవ్ కామెడీ బిట్ ఒకదాన్ని తీసేశారు.

నేరేషన్‌కు అడ్డుపడుతుందని కోట శ్రీనివాసరావు బాత్ టబ్ సీన్‌ని తీసేశారు. షఫీది పెక్యులియర్ వాయిస్. అందుకే ఎవరితోనైనా డబ్బింగ్ చెప్పించాలనుకున్నారు. కానీ ఆ కేరెక్టర్‌కి ఆ రిథమ్ కరెక్ట్ అనిపించి, షఫీతోనే చెప్పించేశారు. ఫైనల్ వెర్షన్ కీరవాణి చేతిలో పెట్టారు. ఆయన ఈ సినిమా మూడ్‌ని ఎలివేట్ చేస్తూ అద్భుతమైన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ఇచ్చారు. అవుట్‌పుట్ అదిరిపోయింది. సినిమా లెవెలే మారిపోయింది. ఎంత కంట్రోల్ చేసినా బడ్జెట్ 12.5 కోట్లు అయ్యింది. అయినా సినిమా మీద నమ్మకంతో భోగవల్లి ప్రసాద్ సొంతగా రిలీజ్ చేయడానికి సిద్ధమయ్యారు. కానీ మంచి ఆఫర్లు రావడంతో రెండు ఏరియాలు ఉంచుకుని మిగతావి అమ్మేశారు.
   
2005 సెప్టెంబర్ 30. ‘ఛత్రపతి’కి ఫస్ట్ డే డివెడైడ్ టాక్. కానీ రాజమౌళి టీమ్ మాత్రం చాలా కాన్ఫిడెంట్‌గా ఉన్నారు. జనరల్‌గా రాజమౌళి ఇండస్ట్రీ టాక్‌ను పట్టించుకోరు. తనకు తెలిసిన సోర్స్‌ల ద్వారా ఆడియన్స్ టాక్ తెలుసుకుంటారు. ‘ఛత్రపతి’ స్లో పాయిజన్‌లా ప్రేక్షకులకు ఎక్కుతోందని రూఢి అయిపోయింది. ‘తన కోసం తాను బతికేవాడు మనిషి. నలుగురి కోసం బతికేవాడు ఛత్రపతి’ అనే బేసిక్ థీమ్ ప్రేక్షకులకు నచ్చేసింది. 54 కేంద్రాల్లో వంద రోజులాడింది. ప్రభాస్ ఇంట్రడక్షన్ సీన్‌గా వచ్చే షార్క్ ఫైట్ గ్రాఫిక్స్ విషయంలోనే అందరికీ అసంతృప్తి. అది ఊహించిన విధంగా రాలేదు.

దాంతో రాజమౌళి దాన్ని మళ్లీ రీప్లేస్ చేయించారు. చిరంజీవి ఈ సినిమా చూసి ఇంప్రెస్ అయ్యి, రాజమౌళిని ఇంటికి పిలిచి మూడు గంటలు మాట్లాడారు. ఈ సినిమా తర్వాత భోగవల్లి ప్రసాద్‌ను అందరూ ‘ఛత్రపతి’ ప్రసాద్ అని పిలవడం మొదలుపెట్టారు. ప్రభాస్ రేంజ్ ఈ ‘ఒక్క అడుగు’తో కొత్త పుంతలు తొక్కడం మొదలుపెట్టింది. ఇక రాజమౌళి గురించి ఏం చెప్పాలి? ఒట్టేసి ఒక మాట, ఒట్టు వేయకుండా ఒక మాట చెప్పినా చెప్పకపోయినా... ఇది రాజమౌళి సృష్టించిన వండర్!
 
వెరీ ఇంట్రస్టింగ్
* ‘ఛత్రపతి’ టైటిల్ సజెస్ట్ చేసిన గోపీ చాలాకాలం క్రితమే చనిపోయారు. వాళ్ల ఫ్యామిలీకి కొంత పారితోషికం ఇవ్వాలని విజయేంద్రప్రసాద్ ప్రయత్నించి, ఆచూకీ కనుక్కోలేకపోయారు.
* ఉత్తమ సంగీత దర్శకునిగా కీరవాణి, ఉత్తమ సహాయనటిగా భానుప్రియ నంది పురస్కారాలు గెలుచుకున్నారు.
* ‘హుకుమత్‌కి జంగ్’ పేరుతో హిందీలో అనువాదమైంది. కన్నడంలో ‘ఛత్రపతి’గా, బెంగాలీలో ‘రెఫ్యూజీ’గా రీమేక్ అయ్యింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement