గుర్తుపట్టే గుండెనడుగు... | Gamyam movie story as Story behind film | Sakshi
Sakshi News home page

గుర్తుపట్టే గుండెనడుగు...

Published Sun, Dec 6 2015 3:18 AM | Last Updated on Sun, Sep 3 2017 1:33 PM

గుర్తుపట్టే గుండెనడుగు...

గుర్తుపట్టే గుండెనడుగు...

సినిమా వెనుక స్టోరీ - 27
యు.ఎస్.ఎ... నలుగురు తెలుగు కుర్రాళ్లు ఉంటోన్న రూమ్ అది. సాధారణంగా బ్యాచిలర్ రూమ్స్‌లో ఉండకూడనివన్నీ ఉంటాయ్. కానీ ఇక్కడ ఉండాల్సినవే ఉన్నాయి. తెలుగు లిటరేచర్ బుక్స్. అతను కథ వినిపిస్తున్నాడు. ఆ ముగ్గురూ చాలా ఆసక్తిగా వింటున్నారు. క్యాంపస్ స్టోరీ అది. కళ్లకు కట్టినట్టు చెప్పాడు. ‘‘వెల్‌డన్ క్రిష్... సినిమా చూపించేశావ్. ఇక నువ్వు డెరైక్టరైపోవచ్చు’’. ఆ ముగ్గురూ సిన్సియర్‌గా కామెంట్ చేశారు.
 
క్రిష్ కళ్లముందు కొత్త స్వప్నాలు. ఫార్మసీ గ్రాడ్యుయేట్‌నని చెప్పుకోవడం కన్నా పుస్తకాల పురుగు, సినిమా పిచ్చోడి నని చెప్పుకోవడమే క్రిష్‌కి ఇష్టం. కంప్యూ టర్స్‌లో ఎమ్మెస్ చేయడానికి వచ్చాడిక్క డికి. కానీ కాన్‌సన్‌ట్రేషన్ అంతా కథలు తయారుచేసుకోవడం, సినిమా తీయాలను కోవడం మీదే. ఫ్రెండ్స్ మెచ్చుకున్న స్టోరీతో యూఎస్‌లోనే సినిమా చేసేద్దామని ట్రయల్స్ కూడా వేశాడు. వర్కవుట్ కాలేదు. ఇండియా వెళ్లాక దీని పని పడదామని డిసైడయ్యాడు.
      
ఇండియా... క్రిష్ హైదరాబాద్‌లో ఉన్నాడు. తన మొదటి స్టెప్... ‘ఫస్ట్ కౌన్సిల్’ అనే ఓవర్సీస్ ఎడ్యుకేషనల్ కన్సల్టెన్సీ పెట్టడం. రెండో స్టెప్.. దాన్ని సక్సెస్ చేయడం. మూడో స్టెప్... సినిమా ఇండస్ట్రీలోకి వెళ్లడం. ఈ రూట్‌లో వెళ్తేనే త్వరగా గమ్యం చేరుకుంటానని క్రిష్‌కి బాగా తెలుసు. అదే జరిగింది కూడా. సినిమా ఇండస్ట్రీలోకి ఎంటర్ కావడానికి ఇంట్లోవాళ్లు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారు.
 
ఓ కంపెనీకి డెరైక్టర్‌గా ఉన్నవాడు ఓ సినిమాకు అసిస్టెంట్ డెరైక్టర్‌గా చేరాడు. నో ఇన్‌హిబిషన్స్. నో ఇగోస్. వర్క్ నేర్చు కోవాలి. దానిపైనే కాన్‌సన్‌ట్రేషన్. అది ‘ఒకరికి ఒకరు’ సినిమా. కెమెరామ్యాన్ రసూల్ ఫస్ట్ టైమ్ డెరైక్ట్ చేస్తున్నాడు. చాలా తొందరగా టీమ్‌తో కలిసిపోయాడు క్రిష్. ఏ పని చెప్పినా చేసేవాడు. చివరకు ఆఫీస్ బాయ్ లేకపోతే టీ కూడా పెట్టి ఇచ్చేవాడు.  ఒక్క సినిమాతోనే ఎంతో నేర్చుకున్నాడు.
      
అశ్వినీదత్ బేనర్‌లో హిందీ సినిమా ఆఫర్. ‘అఖండ్ భారత్.... బట్ ఇండియా డివెడైడ్’. విస్తృతమైన సబ్జెక్ట్. గాంధీ - గాడ్సేల కథ. చాలా రీసెర్చ్ చేయాలి. ముంబై వెళ్లాడు. అక్కడి నుంచి పుణే వెళ్లి నాథూరామ్ గాడ్సే తమ్ముడు గోపాల్‌ను కలిశాడు. ఆ తర్వాత నాగపూర్..  సాంగ్లీ.. ఇలా వెళ్తూనే ఉన్నాడు కారులో. డ్రైవరు బుజీద్ క్రిష్‌కి బాగా నచ్చేశాడు. తనకు తెలిసిందంతా, తెలుసుకోవాలనుకుంటు న్నదంతా బుజీద్‌కు చెబుతున్నాడు.

ఆ రోజు సాంగ్లీలో ఉన్నారు. ఎంత వెతికినా మినరల్ వాటర్ దొరకలేదు. విపరీతమైన దాహం. రోడ్డు పక్కన బోరింగ్ పంప్ కన బడితే కారాపేసి గబగబా తాగేసి వచ్చాడు బుజీద్. ‘‘మీరూ తాగండి, ఎంతసేపని దాహంతో ఉంటారు’’ అన్నాడు. క్రిష్‌కి కోపం వచ్చింది. ‘‘ఈ నీళ్లు ఎలా తాగుతాం? బోలెడన్ని క్రిమి కీటకాలుంటాయ్. హెల్త్ పాడవుతుంది...’’
 
క్రిష్ ఇలా క్లాస్ పీకుతుంటే, బుజీద్ ఓ మాట అన్నాడు. ‘‘బాటిల్ వాటర్ లేనిదే నడవని జీవితం... అదేం జీవితం సార్!’’ క్రిష్‌కు ఒక్కసారిగా మబ్బులు విడి పోయాయి. తాను జీవితాన్ని ఒకే కోణంలో చూస్తున్నానని, ఇంకా చూడాల్సిన కోణాలు చాలా ఉన్నాయని తేలిపోయింది. కారు బయలుదేరింది. అద్దం దించి ప్రపంచాన్ని చూస్తున్నాడు క్రిష్. ‘‘కారు అద్దాల్లోంచి చూసేది అసలైన ప్రపంచం కాదు.’’
 
క్రిష్ ఆలోచిస్తూనే ఉన్నాడు. ఒకటే కారు... ఇద్దరు మనుషులు. గమనం ఒకటే కానీ గమ్యాలు వేరు. తానేమో ఏం పుస్త కాలు చదవాలి, ఎవర్ని కలవాలి, ఏం అడగాలి అని ఆలోచిస్తున్నాడు. బుజీద్ - ఈ కారు ఎక్కడ ఆపాలి, ఏ దాబాలో భోం చేయాలి అని ఆలోచిస్తున్నాడు. ఎంత భిన్నమైన ఆలోచనలు!
 
కారు షోలాపూర్‌లోకి ఎంటరైంది. క్రిష్ ఓ చిన్న హోటల్లో దిగి, బుజీద్‌ను వెళ్లిపోమన్నాడు. కొన్ని తెల్ల కాగితాలు కొనుక్కుని, రూమ్‌లోకి వెళ్లి తలుపేసు కున్నాడు. ఓ ప్రవాహం. అడ్డూ అదుపూ లేదు. అలా రాసుకుంటూనే పోతున్నాడు. కారు ప్రయాణం, కలిసిన మనుషులు, ముద్ర వేసిన సంఘటనలు, ‘ఈజీ రైడర్’ (1969), ‘మోటార్ సైకిల్ డైరీస్’ లాంటి హాలీవుడ్ సినిమాలు, ‘జెన్ అండ్ ద ఆర్ట్ ఆఫ్ మోటార్ సైకిల్ మెయింటెనెన్స్’ లాంటి పుస్తకాలు, బుద్ధుని రచనలు... అన్నీ మైండ్‌లో కలతిరుగుతున్నాయి.

ఇంత మథనం తర్వాత పుట్టింది కథ. మురిపెంగా చూసుకున్నాడు దాన్ని. ఢిల్లీలో మొదలై, బీహార్ వెళ్లి ఛత్తీస్‌గఢ్‌లో కథ ముగుస్తుంది. ‘ఆజ్ జాయేంగే’ పేరుతో తీస్తే బాలీవుడ్‌వాళ్లు తనను నెత్తిన పెట్టు కుంటారు. ఆ టైమ్‌లో అశ్వినీదత్ కూతురు స్వప్నాదత్ కాల్ చేసింది. ‘‘ఓ లో-బడ్జెట్ సినిమా కోసం కథేమైనా ఉందా?’’... క్రిష్ ఆత్రంగా ఈ కథ చెప్పేశాడు.
      
హైదరాబాద్ రాగానే క్రిష్‌కి కె.రాఘ వేంద్రరావు నుంచి పిలుపు. ‘‘ముగ్గురు ఎన్నారై యువకులు విప్లవాత్మకంగా ఏదైనా చేయాలని ఆంధ్రాకొస్తారు. దీన్ని బేస్ చేసుకుని స్క్రిప్టు రెడీ చెయ్. ‘యువ సైన్యం’ పేరుతో సినిమా చేద్దాం’’. క్రిష్‌కు గోల్డెన్ చాన్స్. ఇక క్షణం వేస్ట్ చేయదలచు కోలేదు. ప్రముఖ నాటక రచయిత గంధం నాగరాజుతో కూర్చున్నాడు. ఇద్దరూ కలిసి స్క్రిప్టు రెడీ చేశారు. బడ్జెట్ చాలా ఎక్కువ అయ్యేట్టుంది.

రాఘవేంద్ర రావు చేసేట్టు లేరు. లాభం లేదని క్రిష్ తన కథ బయ టకు తీశాడు. హిందీలో కాదు. తెలుగులోనే తీయాలి. నాగరాజుతో ఫుల్‌బౌండ్ స్క్రిప్ట్ రెడీ చేయించాడు. టైటిల్ ‘సిద్ధార్థ’. బుద్ధుడి అసలు పేరు. ఇంట్లోంచి బయటి కొచ్చాకే సిద్ధార్థుడు జీవితం గురించి తెలుసుకున్నాడు. ఇక్కడా అంతే కదా!
 
రాఘవేంద్రరావు, వాళ్లబ్బాయి ప్రకాశ్, తన ఫ్యామిలీ మెంబర్స్... అందరూ కథ విన్నారు. అందరికీ ఓకే. ఫైనల్‌గా ‘సిరి వెన్నెల’ సీతారామశాస్త్రిని కలిశాడు. కథంతా విని ‘‘అరే అబ్బాయ్... ఒక మనిషి గురించి చెబుదామని నీకెందుకంత తాపత్రయం’’ అంటూ డిస్కషన్ స్టార్ట్ చేశా డాయన. ‘‘ఇది సినిమాకు సూటయ్యే కథ కాదు. మార్పులూ చేర్పులూ చేయాలి’’ అంటూ చాలా సజెషన్స్ ఇచ్చారు. క్రిష్ అక్కడ్నుంచి మాయమైపోయాడు.

మళ్లీ 9 నెలల తర్వాత ప్రత్యక్షం. ఏడు వెర్షన్ల తర్వాత బాగా చిక్కబడ్డ కథ. ‘‘ఇదిరా కథంటే’’ అంటూ సీతారామశాస్త్రి స్టాంప్ వేశారు. ‘‘గురువుగారూ... నా దగ్గర ఎక్కువ డబ్బులు లేవండీ . ఒక్క పాట రాయండి’’ అని ఇబ్బందిపడుతూ అడిగాడు క్రిష్. ‘‘ఇది ఒక మనిషి గురించి ఒక మనిషి చెప్తున్న కథరా. ఆ మనిషి కోసం ఈ మనిషి రాస్తున్న పాటలురా ఇవి. మొత్తం పాటలు నేనే రాస్తా. ఒక్క పైసా కూడా ఇవ్వొద్దు. నీకు అవసరమైతే నన్నే అడుగు’’ అన్నారాయన. క్రిష్ మనసు చెమ్మగిల్లిపోయింది.
      
క్రిష్ చాలామంది నిర్మాతల్ని కలిశాడు. అందరూ కథ బావుందంటారు కానీ, చేయ డానికి ముందుకు రావడం లేదు. క్రిష్ తపన చూసి వాళ్ల నాన్నే ముందుకొచ్చారు. జాగర్లమూడి సాయిబాబు, సినిమా ఫీల్డ్‌కు సంబంధం లేని మనిషి. క్రిష్ ధైర్యంగా ముందుకు దూకేశాడు. ‘గాలి శీను’ పాత్రకి ఫస్ట్ నుంచి మైండ్‌లో ఉంది ‘అల్లరి’ నరేశ్. నరేశ్ ఓకే అన్నాడు. అభి కేరెక్టర్‌కు ఒకరి ద్దరిని అనుకుని ఫైనల్‌గా శర్వానంద్ కన్ ఫర్మ్.

హీరోయిన్‌గా కమలినీని అనడిగితే రెమ్యునరేషన్ ఎక్కువ చెప్పింది. ఇంకెవ రెవరినో ట్రై చేశాడు. కమలినీయే బెటర్. రావు గోపాలరావు కొడుకు రావు రమేశ్ ఫ్యామిలీ ఫ్రెండ్. తనకు మంచి కేరెక్టర్ ఇస్తానని ప్రామిస్ చేశాడు. మాట నిలబెట్టు కున్నాడు. కెమెరామ్యాన్‌గా సీనియర్ కావాలి. హరి అనుమోలు తగిలాడు.
 
సినిమా అంతా తెలంగాణ, రాయల సీమ, ఆంధ్రాల్లో తిరుగుతుంది. అందుకు తగ్గట్టే లొకేషన్స్, భాష, యాస, వేష ధారణ. ఫ్లాష్‌బ్యాక్ సీన్స్ అన్నీ హైదరా బాద్‌లో తీశారు. అమరావతిలో కొంత షూట్ చేశారు. క్లైమాక్స్ రేలంగి రైల్వే స్టేషన్‌లో, నక్సల్స్ ఎపిసోడ్ రంపచోడ వరంలో ప్లాన్ చేశారు. నక్సలైట్ పాత్ర కోసం 10-15 మందిని అనుకున్నారు. అందరూ బిజీనే. ‘‘మీరే చేసేయండి’’ అన్నారు ఫైట్ మాస్టర్స్ రామ్-లక్ష్మణ్.  
క్రిష్ ఖంగు తిన్నాడు.

అతనికి యాక్టింగ్ ఆలోచన లేదు. కానీ తప్పని పరిస్థితి. చే గువేరా అంటే క్రిష్‌కు ప్రాణం. ఆ గెటప్‌తోనే ఈ కేరెక్టర్ చేసేశాడు. టైటిల్ మార్చాలి. ‘గాలిపటం’ లేక ‘గమ్యం’. అయితే సినిమా అంతా ప్రయా ణమే కాబట్టి ‘గమ్యం’ బెటర్. 57 రోజుల్లో సినిమా పూర్తయిపోయింది. 78 వేల అడు గుల ఫిల్మ్ ఎక్స్‌పోజ్డ్. అంటే ఎంత ప్లాన్డ్‌గా, ప్యాక్డ్‌గా సినిమా చేశాడో!
      
ప్రసాద్ ల్యాబ్‌లో ప్రివ్యూల మీద ప్రివ్యూలు వేస్తున్నారు. బావుందంటు న్నారు కానీ, ఒక్కరూ కొనడం లేదు. కానీ క్రిష్ ధైర్యంగా ఉన్నాడు. అది సీతారామ శాస్త్రి ఇచ్చిన ధైర్యం. ఆయన ప్రివ్యూ చూసి ‘‘నాకు చెప్పినదానికన్నా బాగా తీశావు. నేనొక కోడిని. సూర్యుడిలా నువ్వొస్తున్నా వన్న విషయాన్ని ముందుగా గమనించి ‘కొక్కొరొక్కో’ అంటూ లోకానికి తెలియ జేస్తున్నా’’ అంటూ హగ్ చేసుకున్నారు.

మరోపక్క సీనియర్ దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ్ అండా దండా. ఈ సినిమా రిలీజై హిట్టయితేనే క్రిష్‌కు లైఫ్. లేకపోతే చలో అమెరికా. ఇది ఇంట్లోవాళ్ల కండిషన్. చూద్దాం ఏం జరుగుతుందో!?
      
2008, ఫిబ్రవరి 29. ‘గమ్యం’ గమ్యాన్ని చేరిన రోజు. అందరికీ నచ్చేసింది. తెలుగు సినిమాకు సరికొత్త గమ్యం అంటూ కితాబులు. క్రిష్ పడ్డ కష్టానికి, సీతారామశాస్త్రి ఇచ్చిన వె(పె)న్నుదన్నుకి సంపూర్ణ ఫలితం. శర్వానంద్‌కి ఇదొక తీపి మజిలీ. ‘గాలి శీను’ పాత్ర ‘అల్లరి’ నరేశ్ హవాను పెంచింది. తమిళం, కన్నడం... ఎక్కడ రీమేక్ చేసినా విజయ గమ్యమే.
 
ముక్తాయింపు: ఆర్టీసీ క్రాస్‌రోడ్స్‌లోని ‘దేవి’ థియేటర్. ‘గమ్యం’ చూసొస్తూ ఇద్దరు మాట్లాడుకుంటున్నారు... ‘‘ఈ నా కొడుకెవడో గానీ పుస్తకాలు తెగ చదివాడ్రా. మనిషంటే ఎవరో భలే చెప్పాడు.’’ ఈ కాంప్లిమెంట్‌ను మించిన నంది అవార్డు, ఫిల్మ్‌ఫేర్ అవార్డు ఏముంటుంది?!
 
వెరీ ఇంట్రస్టింగ్...
* ‘నైస్’ అనే స్వచ్ఛంద సంస్థ నడిపే పూర్ణ చంద్రరావు గిరిబాబు పాత్రకు స్ఫూర్తి. దంపుడు లక్ష్మి పాత్ర... కోటప్పకొండలో జరిగిన వాస్తవ సంఘటనల నుంచి పుట్టింది. ఓ యాక్సిడెంట్‌లో ఒకాయన ప్రవర్తన ఆధారంగా బ్రహ్మానందం పాత్ర డిజైన్ చేశారు.
* శర్వానంద్ పాత్రకు మొదట రామ్‌ని అడిగారు.
* తమిళ, కన్నడ భాషల్లోనూ కమలినీయే నాయికగా చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement