నీ స్నేహం ఇకరాను అని...
సినిమా వెనుక స్టోరీ - 6
‘‘నేనండీ... ఎమ్మెస్ రాజుని. ఓసారి ఆఫీసుకి రాగలరా?’’... వీఎన్ ఆదిత్య హాస్పిటల్‌కెళ్లే హడావిడిలో ఉన్నాడు. అపాయింట్‌మెంట్ టైమ్‌కి వెళ్లకపోతే డాక్టర్ డీబీఎన్ మూర్తి తిడతారు. అందుకే హైదరాబాద్‌లోని అమీర్‌పేటలో ఉన్న హాస్పిటల్‌కు వెళ్ళడానికి ఆదరాబాదరాగా రెడీ అవుతున్నాడు. ఆ టైమ్‌లోనే ఈ ఫోన్. ‘‘అర్జంట్ హాస్పిటల్ పనుంది. నేను మళ్లీ చేస్తానండీ’’ అని ఫోన్ పెట్టేశాడు ఆదిత్య.డాక్టర్‌ని కలిసి వచ్చేసరికి బాగా లేటయిపోయింది.
అప్పుడు గుర్తొచ్చింది ఎమ్మెస్ రాజు ఫోను. ఎంత ఆలోచించినా ఆయనెవరో గుర్తుకురావడం లేదు. సురేష్ ప్రొడక్షన్స్ ఆఫీసులో తెలిసిన ఆపరేటర్ ఉంటే, అతన్నడిగాడు. ‘‘అదేంటీ... రాజుగారు తెలియదా? ‘దేవి, దేవీపుత్రుడు’ సినిమాలు తీసిన హనీబాబు ఆయనే కదా!’’ అని చెప్పాడతను. ఆదిత్య తెగ ఫీలైపోయాడు. ‘‘అరే... అంత పెద్దాయన ఫోన్ చేస్తే గుర్తుపట్టలేక పోయానే! హనీబాబుగా గుర్తుపెట్టుకుని అసలు పేరు మరిచిపోయానే...’’ అని బాధపడిపోయాడు. అయినా... ఆయన నాకెందుకు ఫోన్ చేసుంటారు? ఆదిత్య రకరకాలుగా ఆలోచిస్తున్నాడు.
అక్కడ ఎమ్మెస్ రాజు కూడా ఆలోచిస్తున్నారు. ‘దేవీపుత్రుడు’ సినిమా ఫలితం... ఆయన్ని బాగా కుదిపేసింది. ఈసారి ట్రెండు మార్చాలి... రూట్ మార్చాలి... కొత్త దర్శకుడితో క్యూట్ లవ్‌స్టోరీ తీయాలి. ఎమ్మెస్ రాజుకి రాత్రింబవళ్లూ ఇదే ఆలోచన. కెమెరామ్యాన్ ఎస్. గోపాలరెడ్డి ఆయనకు క్లోజ్ ఫ్రెండ్. అన్ని విషయాలూ ఇద్దరూ షేర్ చేసుకుంటారు. గోపాలరెడ్డి దగ్గర ఇదే టాపిక్ వచ్చింది.
‘‘మీక్కావల్సింది చాకు లాంటి కొత్త డెరైక్టరేగా? వీఎన్ ఆదిత్య అని సింగీతం, జయంత్ సి. పారాన్జీల దగ్గర పని చేశాడు. ఆదిత్య మీకు సెట్ అవుతాడు’’ అని ఆదిత్య ఫోన్ నెంబరిచ్చారు గోపాలరెడ్డి.
ఎమ్మెస్ రాజు వెంటనే ఆదిత్యకు ఫోన్ కొట్టారు. అప్పుడే అతను డాక్టర్ అపాయింట్‌మెంట్ ఉందని చెప్పింది.
సరే... నెక్ట్స్ డే చేస్తాడేమోనని ఎమ్మెస్ రాజు వెయిట్ చేశారు. నో రెస్పాన్స్. మర్చిపోయాడా? భయపడ్డాడా? ఆదిత్యకు మళ్లీ కాల్ చేశారు ఎమ్మెస్ రాజు. ‘‘సారీ సార్... అర్జంట్‌గా రాజమండ్రి వెళ్తున్నా. అక్కడ టెంపుల్‌లో పూజ చేయించడానికి వెళ్తున్నా’’ చెప్పాడు ఆదిత్య. ‘‘వెరీ గుడ్. వచ్చాక కలవండి’’ అన్నారు ఎమ్మెస్ రాజు. వారం గడిచినా ఆదిత్య నుంచి కాల్ రాలేదు. ‘మంచి కుర్రాడని చెప్పారు. ఇంత ఇర్రెస్పాన్సిబుల్‌గా ఉన్నాడేంటి?’ ఎమ్మెస్ రాజుకి కోపం వచ్చింది. ఫైనల్ కాల్. వస్తే వచ్చాడు. లేకపోతే కట్.
సుమంత్ ఆర్ట్స్ ఆఫీస్.
ఎమ్మెస్ రాజు ముందు బిక్కు బిక్కుమంటూ కూర్చున్నాడు ఆదిత్య.
‘‘సారీ సార్! నాతో మీరు సినిమా చేస్తారని అస్సలు ఎక్స్‌పెక్ట్ చేయలేదు. కోడి రామకృష్ణగారు ఉండగా నన్నెందుకు పిలుస్తారనుకున్నా. అందుకే కలవడానికి ఇబ్బంది పడ్డా. క్షమించండి.’’
ఎమ్మెస్ రాజు చాలా ప్రశాంతంగా ఆదిత్య మాటలు వింటున్నారు. ‘‘సార్! మీరు పెద్ద ప్రొడ్యూసరు. నేను కొత్తవాణ్ణి.
లవ్‌స్టోరీతోనే కెరీర్ స్టార్ట్ చేద్దామను కుంటున్నవాణ్ణి. మీరింతవరకూ లవ్‌స్టోరీ తీయలేదు. నా కథను ఎలా జడ్జ్ చేయగలరు?’’ అని కాస్తంత ధైర్యం కూడ దీసుకుని డౌట్ ఎక్స్‌ప్రెస్ చేశాడు ఆదిత్య.
‘‘గుడ్ క్వశ్చన్. ఓ పది రోజులు ఆఫీసుకి రా! ఇద్దరం సరదాగా డిస్కస్ చేసుకుందాం. ట్యూనింగ్ కుదిరితేనే కలిసి పని చేద్దాం’’ అన్నారు ఎమ్మెస్ రాజు. ఆదిత్య షాకైపోయాడు. అంత పెద్ద ప్రొడ్యూసర్ తనలాంటి కొత్త కుర్రాణ్ణి ఇంతలా ఆదరిస్తారని కలలో కూడా ఊహించలేదు.
రోజూ ఆఫీసుకొస్తున్నాడు ఆదిత్య.
ఓ రోజు ఎమ్మెస్ రాజు ‘‘నీకు రెండు స్టోరీ ఐడియాలు చెబుతా. ఏది నచ్చితే దాంతోనే సినిమా చేద్దాం’’ అన్నారు. ఎమ్మెస్ రాజు ఫస్ట్ ఐడియా చెప్పారు.
‘‘ఇదేంటి సార్... ఇది ‘ప్రేమించుకుందాం రా’ కథలా ఉంది. ఆ సినిమాకి నేను అసోసియేట్ డెరైక్టర్‌ని. మళ్లీ అదే కథతో ఎలా సినిమా చేస్తాం?’’ అనడిగేశాడు ఆదిత్య. ఎమ్మెస్ రాజు నవ్వుతూ ‘‘గుడ్... డెరైక్షన్ ఆఫరివ్వగానే ఏది పడితే అది చేసేస్తావా, లేక ఆలోచిస్తావా అని టెస్ట్ చేశానంతే’’ అన్నారు.
ఇప్పుడు రెండో ఐడియా చెప్పారు.
ఆదిత్యకు నచ్చేసింది. వర్క్ మొదలైంది.
హిందీలో వచ్చిన ‘అన్‌మోల్ ఘడీ’ (1946) సినిమా ఇన్‌స్పిరేషన్‌తో కొంతవరకూ కథను తీర్చిదిద్దారు. యాంటిక్ వాచ్ బహుమతిగా ఇవ్వడం, తన ప్రేమకథనే నవలగా రాయడం లాంటి కొన్ని సీన్స్ అలానే డెవలప్ అయ్యాయి. దర్శక - రచయిత కె. భాగ్యరాజా తీసిన ‘డార్లింగ్... డార్లింగ్’ సినిమా కూడా కొంచెం అదే తరహాలో ఉంటుంది. ఆ సినిమా ప్యాట్రన్‌లో చైల్డ్‌హుడ్ నుంచి లవ్‌స్టోరీ మొదలుపెట్టాలని ఆదిత్య కోరిక. అలాగే ‘అప్పు చేసి పప్పు కూడు’లో రేలంగి పాత్ర అంటే ఆదిత్యకు చాలా ఇష్టం. ఆ ఇన్‌స్పిరేషన్‌తో హీరో ఫ్రెండ్ కేరెక్టర్‌ని డిజైన్ చేశారు. ఇలా ఎమ్మెస్ రాజు, ఆదిత్య కలిసి స్క్రిప్టు చేసుకుంటూ వెళ్తున్నారు.
ఆ రోజు ఎమ్మెస్ రాజుకి ఓ సీన్ వినిపించాడు ఆదిత్య.
సముద్రపు ఒడ్డున భోరున వర్షం. హీరో ఏడుస్తూ ఉంటే, అతని ఫ్రెండ్ వచ్చి ఓ డైలాగ్ చెబుతాడు. ‘‘ఒరేయ్! వర్షం కూడా అప్పుడప్పుడూ మనకు మేలు చేస్తుందిరా! మన కన్నీళ్లను ఎదుటివాళ్లకు కనబడకుండా దాచేస్తుంది.’’ ఈ డైలాగ్‌కి ఎమ్మెస్ రాజు మనసు చెమర్చింది. వెంటనే చెక్‌బుక్ తీసి పాతికవేలకు చెక్ రాసిచ్చేశారు.
నెక్ట్స్ డే అనౌన్స్‌మెంట్. ప్రముఖ నిర్మాత ఎమ్మెస్ రాజు, కొత్త కుర్రాడు వి.ఎన్.ఆదిత్యకు డెరైక్షన్ ఛాన్స్ ఇస్తూ చేస్తున్న సినిమా... ‘మనసంతా నువ్వే’. ఆ టైటిల్ కూడా ఎమ్మెస్ రాజు పెట్టిందే. ‘మనసంతా నువ్వే’ని మహేశ్‌బాబుతో చేస్తే? ఎమ్మెస్ రాజుకి ఎగ్జయిటింగ్‌గా ఉందీ ఐడియా. కానీ ఆదిత్య ఏమో కొత్తవాడైతే కరెక్ట్ అంటాడు. ఇప్పటికిప్పుడు కొత్త హీరో ఎక్కడ దొరుకుతాడు? ఆదిత్య దగ్గర ఆప్షన్ ఉంది. ‘చిత్రం’ హీరో ఉదయ్‌కిరణ్.
ఇప్పుడు ‘నువ్వు-నేను’ చేస్తున్నాడు.
వెంటనే ఎమ్మెస్ రాజు ‘నువ్వు-నేను’ రష్ చూడ్డానికెళ్లారు. ఆ రష్ చూసీ చూడగానే ఈ సినిమాకు ఉదయ్‌కిరణ్‌ను ఫిక్స్ చేసేశారు. ఫైనల్‌గా స్క్రిప్ట్ పరుచూరి బ్రదర్స్ దగ్గరకు వెళ్లింది.
ఇక్కడే అసలు బాంబు పేలింది. కథ బాలేదన్నారు పరుచూరి గోపాలకృష్ణ. సెకండాఫ్ సరిగ్గా లేదు... చైల్డ్ ఎపిసోడ్ అంతసేపు వేస్టు... ఇలా ఒక్కోటీ చెబుతుంటే ఆదిత్య గుండె జారిపోయింది. షూటింగ్‌కెళ్లే టైమ్‌లో... బ్లాస్ట్.
అరకులోయలో ఓ గెస్ట్‌హౌస్.
టెన్ డేస్ సిట్టింగ్స్. పరుచూరి బ్రదర్స్... ఎమ్మెస్ రాజు... వీఎన్ ఆదిత్య... వీరూ పోట్ల... స్క్రిప్టు విషయంలో కిందా మీదా పడుతున్నారు. స్క్రీన్‌ప్లే ఆర్డర్ మారింది. కథ కొత్త మలుపులు తిరుగుతోంది. హమ్మయ్య... మొత్తానికి కథ పర్‌ఫెక్ట్‌లీ ఆల్‌రైట్.
ఆర్పీ పట్నాయక్ మ్యూజిక్ డెరైక్టర్. ట్యూన్స్ విరగ్గొట్టేస్తున్నాడు. యాంటిక్ వాచ్ సౌండ్ కోసమైతే ఆర్పీ చాలా కష్టపడ్డాడు. మలయాళంలో విద్యాసాగర్ ‘ప్రణయ వర్ణంగల్’ (1998) కోసం ‘కన్నాడి కూడుంకూట్టి’ పాట చేశాడు. అది సూపర్ డూపర్ హిట్. దాన్ని యథాతథంగా వాడితే సిట్యుయేషన్ అదిరిపోతుంది. ఇక్కడ అదే ‘తూనీగ... తూనీగ...’ పాట అయ్యింది.
95 పర్సంట్ షూటింగ్ ఓవర్. ఓన్లీ 5 పర్సంట్ బ్యాలెన్స్. అమీర్‌పేట - చర్మాస్ షోరూమ్‌లో హాఫ్ డే షూటింగ్. రీమాసేన్ బట్టలు కొనుక్కోవడానికి వచ్చే సీన్ తీయాలి. లైటింగ్ రెడీ అవుతోంది. ఇంకాసేపట్లో సీన్ తీయాలి. చిత్రనిర్మాణంలో ప్రతి చిన్న అంశాన్ని దగ్గరుండి జాగ్రత్తగా చూసుకునే ఎమ్మెస్ రాజుకు సడెన్‌గా డౌటొచ్చింది. ఈ సీన్ బట్టల షాపులో కంటే బుక్‌షాప్‌లో తీస్తే బెటరేమో! చిన్నపాటి డిస్కషన్. షూటింగ్ ఆగింది. ఆదిత్య హర్టయిపోయాడు. అలాగే నడుచుకుంటూ బయటికొచ్చేశాడు. కృష్ణానగర్ దాకా వెళ్లాడు. ఏవేవో ఆలోచనలు.
ఇప్పటికే షూటింగ్ దాదాపు అయిపోవచ్చింది. ఇప్పుడీ కోపం వల్ల మొత్తం ప్రాజెక్ట్ డామేజ్ అవుతుంది. అదేదో వాళ్లను కన్విన్స్ చేసుకుంటే బెటర్ కదా! ఆదిత్య మళ్లీ వెనక్కు తిరిగొచ్చేశాడు. లొకేషన్‌లో అందరూ ఆదిత్య కోసం వెతుకుతున్నారు. అప్పటికే పరుచూరి వెంకటేశ్వరరావు వచ్చి చెప్పడంతో ఎమ్మెస్ రాజు కన్విన్స్ అయ్యారట. అంతా ఓకే...
రామానాయుడు స్టూడియో... ఆవిడ్ ఎడిటింగ్ రూమ్‌లో రష్ చూస్తున్నారు. ఎవరూ ఏమీ మాట్లాడడం లేదు. ఎమ్మెస్ రాజు, పరుచూరి గోపాలకృష్ణ, ఎస్. గోపాలరెడ్డి... ముగ్గురూ పక్కకెళ్లి సీరియస్ డిస్కషన్. ఆదిత్యకు ఏమీ అర్థం కావడం లేదు. క్లైమాక్స్ తేడా కొట్టేసింది... సినిమా కష్టం... పరుచూరి గోపాలకృష్ణ జడ్జిమెంట్ చెప్పేశారు. ఇదంతా ఎడిటర్ కె.వి. కృష్ణారెడ్డి అబ్జర్వ్ చేస్తున్నాడు. అతను వీళ్ల దగ్గరకొచ్చి ‘‘ఒక్కసారి మళ్లీ క్లైమాక్స్ చూడండి... ఎడిటింగ్‌లో చిన్న ఛేంజ్ చేశాను’’ అన్నాడు. వీళ్లు నిర్లిప్తంగానే లోపలికెళ్లారు. కాసేపటికి బయటికొచ్చిన గోపాలకృష్ణ, ఆదిత్య దగ్గరకొచ్చి ‘‘అదిరిపోయింది’’ అంటూ హగ్ చేసుకున్నాడు.
ఎడిటింగ్ మేజిక్. ఫస్ట్ హాఫ్‌లోని ‘నీ స్నేహం’ పాటను మళ్లీ క్లైమాక్స్‌లో యాడ్ చేసేసరికి, ఎక్కడలేని డెప్త్ వచ్చేసింది.
2001 అక్టోబర్ 19.
ఎమ్మెస్ రాజు నిర్మాతగా కొత్త ట్రెండ్ సృష్టించిన రోజు... వీఎన్ ఆదిత్య లైఫ్ టర్న్ అయిన రోజు... ఉదయ్‌కిరణ్‌కి హ్యాట్రిక్ (‘చిత్రం’, ‘నువ్వు - నేను’, ‘మనసంతా నువ్వే’) పూర్తయిన రోజు... ఎక్కడ చూసినా ‘మనసంతా నువ్వే’ టాపిక్కే. బాక్సాఫీసంతా కనక వర్షమే!
- పులగం చిన్నారాయణ