తడిపి తడిపి తనతో నడిపి.. | varsham movie story | Sakshi
Sakshi News home page

తడిపి తడిపి తనతో నడిపి..

Published Sat, Oct 31 2015 11:14 PM | Last Updated on Sun, Sep 3 2017 11:47 AM

తడిపి తడిపి తనతో నడిపి..

తడిపి తడిపి తనతో నడిపి..

సినిమా వెనుక స్టోరీ - 22

హైదరాబాద్‌లో వర్షం అనుకోని అతిథి లాంటిది. ఎప్పుడొస్తుందో తెలీదు. ఆ రోజు అలానే ఊహించని విధంగా వర్షం కురిసింది. ఎమ్మెస్ రాజు కారు బంజారా హిల్స్ రోడ్లమీద వేగంగా పరిగెడుతోంది. ఆయనప్పుడే సూర్యనారాయణరాజుని కలిసి వస్తున్నారు. సూర్యనారాయణరాజు అంటే ‘రెబల్ స్టార్’ కృష్ణంరాజుకి సొంత తమ్ముడు. వాళ్లబ్బాయ్ ప్రభాస్ అప్పుడే హీరోగా ఎంటరయ్యాడు. ‘ఈశ్వర్’, ‘రాఘవేంద్ర’... రెండు సినిమాలు చేశాడు.  ‘‘మావాణ్ణి మీ చేతుల్లో పెడు తున్నాను. ఎలా చేస్తారో, ఏం చేస్తారో మీ ఇష్టం’’ అన్నారు సూర్యనారాయణరాజు.  అంత ఫ్రీడమ్ ఇస్తే ఎమ్మెస్ రాజు లాంటి ఫిల్మ్‌మేకర్‌కి ఫుల్ హ్యాపీ. దాంతో పాటే కొండంత ఒత్తిడి కూడాను. ‘‘నన్ను నమ్మి వాళ్లబ్బాయిని అప్పగిస్తున్నారు. ఎలాగైనా వాళ్ల నమ్మకాన్ని నిలబెట్టాలి.’’ కారు కన్నా వేగంగా పరుగులు తీస్తోంది ఎమ్మెస్ రాజు మనసు. వర్షం వెలిసి పోవడంతో హైదరాబాద్ తడితడి అందాలతో మెరిసిపోతోంది.
     
‘ఒక్కడు’ ఆల్‌టైమ్ సూపర్‌హిట్. ఎమ్మెస్ రాజు నెక్స్ట్ ఏం చేస్తారు? ఇండస్ట్రీ అంతా వెయిటింగ్. ఎమ్మెస్ రాజు ఎక్కువ మాట్లాడరు. ఆయన చేతల మనిషి. ఏం చేసినా సెలైంట్‌గానే చేస్తారు. ప్రభాస్‌తో పక్కా యాక్షన్ ఫిల్మ్ చేయడానికి కావాల్సిన సరంజామా సిద్ధం చేస్తున్నారాయన. పరుచూరి బ్రదర్స్ దగ్గర వీరు పోట్ల అసిస్టెంట్. ఫుల్ జెమ్. అతనో యాక్షన్ ఎపిసోడ్ చెప్పాడు. ఎమ్మెస్ రాజుకి విపరీతంగా నచ్చేసింది. దాని చుట్టూరా స్క్రిప్టు అల్లుతున్నారు. రామాయణం లాంటి కథ. సీతను రావణుడు మోహించి లంకలో బంధిస్తాడు. ఆ లంక నుంచి సీతను విడిపించడమే రాముడి లక్ష్యం. సేమ్ టు సేమ్ అలాంటి ప్యాట్రనే.
 
ఓ అందమైన అమ్మాయి. ఆమె చుట్టూ గుడ్, బ్యాడ్, అగ్లీ క్యారెక్టర్స్. గుడ్ అంటే హీరో. బ్యాడ్ అంటే విలన్. అగ్లీ అంటే హీరోయిన్ ఫాదర్. ఈ నలుగురితో పాటు వర్షానిది కూడా ఇంపార్టెంట్ రోల్. ఇదంతా ఓకే. కానీ బ్యాక్‌డ్రాప్ అదిరి పోవాలి. ఇంతవరకూ ఏ సినిమాలోనూ వచ్చి ఉండకూడదు. ఏవేవో ఆలోచిస్తుంటే ఫైనల్‌గా దొరికింది. వరంగల్ బ్యాక్‌డ్రాప్. వేయి స్తంభాల గుడి, మిగతా హిస్టారికల్ ప్లేసెస్. ఆడియన్స్‌కి ఇంట్రస్టింగ్‌గా అనిపిస్తుంది. ఇవన్నీ ఇన్‌క్లూడ్ చేసు కుంటూ స్టోరీ సెట్ చేశారు. హిందీ సినిమా ‘తేజాబ్’లో కొన్ని క్యారెక్టర్స్ చాలా ఇంట్రస్టింగ్‌గా ఉంటాయి. కూతుర్ని ఉపయోగించుకుని కోటీశ్వరుడు కావాలని కలలు కనే తండ్రిగా అనుపమ్ ఖేర్ చేశాడు. అందులో అనిల్‌కపూర్ - మాధురీ దీక్షిత్ మనస్పర్థలొచ్చి విడిపోతారు. వీటన్నిటి ఇన్‌స్పిరేషన్‌తో స్క్రిప్ట్ ఫైనల్ అయ్యింది. ఇంతకూ ఈ కథను ఎమ్మెస్ రాజు ఎవరితో డెరైక్ట్ చేయిస్తారు? ఎవరా లక్కీ గై?
     
‘బాబి’ సినిమా డిజాస్టర్ కావడంతో డెరైక్టర్ శోభన్ పాపం ఫుల్లీ డిప్రెస్డ్. అలాంటి టైమ్‌లో ఎమ్మెస్ రాజు నుంచి ఫోన్. పోన్లే... తుపాన్ టైమ్‌లో రొట్టె ముక్క అయినా దొరుకుతోంది. డెరైక్టర్‌గా ఎలాగూ భవిష్యత్తు లేదు. రైటర్‌గానైనా స్థిరపడదాం... శోభన్ ఊపిరి పీల్చుకున్నాడు. జీరో క్యాండిల్ బల్బులాగా సుమంత్ ఆర్ట్స్ ఆఫీసులోకి అడుగుపెట్టినవాడు, ఫ్లడ్ లైట్‌లాగా బయటికొచ్చాడు. నెవర్ ఎక్స్‌పెక్టింగ్ ఆఫర్. ప్రభాస్ సినిమాకి స్క్రిప్ట్ వర్క్ చేయమంటారనుకుంటే... ఏకంగా డెరైక్షన్ ఆఫర్ ఇచ్చారు.
     
స్టార్ కాని ప్రభాస్‌తో... అట్టర్ ఫ్లాప్ డెరైక్టర్‌తో... ఎమ్మెస్ రాజు సినిమానా? మరీ ఇంత మొండి ధైర్యమా? ఈ టైమ్‌లో ఏటికి ఎదురీదడం అవసరమా? ఈ కామెంట్స్ అన్నీ ఎమ్మెస్ రాజు చెవిన పడుతున్నాయి. కానీ ఇవేవీ పట్టించుకునే స్థితిలో లేరాయన. ఓ పక్క స్క్రిప్ట్ ఫైనల్ డిస్కషన్స్. మరోపక్క కాస్టింగ్ సెలెక్షన్. కె. రాఘవేంద్రరావు ‘గంగోత్రి’ సినిమాలో ఓ కొత్తమ్మాయిని ఇంట్రడ్యూస్ చేస్తున్నారు. అదితీ అగర్వాల్. హీరోయిన్ ఆర్తీ అగర్వాల్ సిస్టర్. అదిరిపోయేలా ఉందని టాక్. ప్రభాస్ పక్కన బాగానే ఉండేట్టు ఉంది. కానీ ‘గంగోత్రి’ కంప్లీట్ అయితే తప్ప, డేట్స్ దొరకవు. వేరే ఆప్షన్ చూసుకోవాల్సిందే.
     
చెన్నైలో ‘నాని’ షూటింగ్. సరదాగా మహేశ్‌ని కలవడానికెళ్లారు ఎమ్మెస్ రాజు. ఎయిర్‌పోర్ట్ నుంచి హోటల్‌కెళ్తుంటే - జెమినీ ఫ్లై ఓవర్ దగ్గర అప్పుడే ఓ కొత్త సినిమా వినైల్ ఫిక్స్ చేస్తున్నారు. అందులో మెరుపులాగా ఓ అమ్మాయి కనిపించింది. ఎమ్మెస్ రాజు వెంటనే ఎంక్వైరీ మొదలుపెట్టారు. విక్రమ్ పక్కన ‘సామి’ అనే తమిళ సినిమాలో చేస్తోందట. తెలుగులో కూడా ‘నీ మనసు నాకు తెలుసు’ అనే సినిమా చేస్తోంది. ఆ చిత్ర నిర్మాత ఎ.ఎం.రత్నం ద్వారా ఆ అమ్మాయిని కాంటాక్ట్ చేశారు. వెంటనే లైన్‌లోకొచ్చిందా అమ్మాయి. ఎమ్మెస్ రాజు చూచాయగా కథ చెబితే థ్రిల్లయిపోయింది. ఆ అమ్మాయే త్రిష. శైలజ పాత్రకు త్రిష రెడీ.
     
‘జయం’, ‘నిజం’ సినిమాల్లో విలన్‌గా చేసి మంచి స్వింగ్ మీదున్నాడు గోపీచంద్. ఇందులో భద్రన్న పాత్రకు అతనే ఫస్ట్ చాయిస్. ఒడ్డూ పొడుగు, క్యారెక్టర్స్ పరంగా ప్రభాస్‌తో పోటాపోటీగా ఉండాలి. గోపీచంద్ ఓకే. హీరోయిన్ ఫాదర్‌గా ప్రకాశ్‌రాజ్‌ను మించిన ఆప్షన్ ఎవరుంటారు? డైలాగ్ రైటర్ సత్యమూర్తి కొడుకైన దేవిశ్రీ ప్రసాద్‌ను ‘దేవి’తో మ్యూజిక్ డెరైక్టర్‌ని చేసింది ఎమ్మెస్ రాజే. ఆ తర్వాత మళ్లీ పిలవలేదు. ఈ సినిమాకు మాత్రం దేవిశ్రీతోనే మ్యూజిక్ చేయించుకోవాలని ముందే ఫిక్స్. గోల్డెన్ చాన్స్. దేవి చెలరేగిపోయాడు. ఎమ్మెస్ రాజు ఒక ట్యూన్ అడిగితే వంద ఆప్షన్లిచ్చేవాడు.
 
‘సిరివెన్నెల’ సీతారామశాస్త్రి అంటే ఎమ్మెస్ రాజుకి భక్తి, గౌరవం, ఆరాధన. ఆయనకు స్క్రిప్టు ఇచ్చేసి, ‘‘మీ ఇష్టం గురువుగారూ... ఎంతైనా తీసుకోండి. నాకు మంచి పాటలు కావాలి’’ అన్నారు ఎమ్మెస్ రాజు. పగలబడి నవ్వేశారు సిరివెన్నెల. అంతే... పాటల కనక వర్షం కురిసింది.  టైటిల్ ‘వర్షం’ అయితే బాగుంటుంది. కానీ వీఎన్ ఆదిత్య అప్పటికే ఇదే టైటిల్‌తో నాగార్జున కోసం ఓ స్క్రిప్ట్ చేసుకుంటున్నాడు. ఎమ్మెస్ రాజు అడగ్గానే టైటిల్ ఇచ్చేశాడు. రూట్ క్లియర్.
     
మార్చి 14... ఎమ్మెస్ రాజు శ్రీమతి పుట్టినరోజు. సెంటిమెంటల్ డే. ‘ఒక్కడు’ అదే రోజు మొదలైంది. ‘వర్షం’ కూడా అదే రోజున స్టార్ట్. ఫస్ట్ షెడ్యూల్ వర్క్ జరుగుతోంది. ఎమ్మెస్ రాజు నాట్ శాటిస్‌ఫైడ్ విత్ దట్ వర్క్. షూటింగ్ ఆపేశారు. 2 నెలలు బ్రేక్. మళ్లీ స్క్రిప్ట్ మీద కూర్చున్నారు. లోపాలన్నీ పట్టిపట్టి వెతుకుతున్నారు. హీరోకు విలన్‌కు మధ్య ఒకసారి ఫైట్ జరిగింది. రెండోసారి కూడా ఫైట్ పెట్టాల్సిన పరిస్థితి. కానీ పెట్టకూడదు. అంత ఎఫెక్ట్ వచ్చేంత డైలాగ్ పడాలి. పరుచూరి బ్రదర్స్ ఇలాంటి వాటిల్లో మాస్టర్స్. ‘‘శైలు కోసం నేను వందసార్లు చస్తాను. నువ్వు ఒక్కసారి చస్తావా?’’ అని హీరో, విలన్‌ని అడుగుతాడు. ఆ ఒక్క డైలాగ్‌తో విలన్ బుర్ర తిరిగిపోయేలా కొట్టాడు హీరో. ఇలాంటి కరెక్షన్స్ అన్నీ చేసేశారు. ఇప్పుడు స్క్రిప్ట్ పర్‌ఫెక్ట్.
 మళ్లీ షూటింగ్ స్టార్ట్.
     
రైల్వేస్టేషన్‌లో ఓ పాట. అలా ఇలా ఉండకూడదు. మోతెక్కిపోవాలి. ప్రభుదేవా లాంటి కొరియోగ్రాఫర్ కావాలి. అప్పుడతను ఆర్టిస్టుగా చాలా బిజీగా ఉన్నాడు. ఎంత బిజీ అంటే కొరియోగ్రఫీ కూడా పక్కన పెట్టేశాడు. కానీ ఎమ్మెస్ రాజు లాంటివాడు అడిగితే కాదనగలడా? జీ హుజూర్ అంటూ వచ్చేశాడు.  తిరుపతికి 40 కిలోమీటర్ల దూరంలో ‘పనపాకం’ రైల్వేస్టేషన్. ప్రభాస్, త్రిష, వందలాది మంది జూనియర్ ఆర్టిస్టులు, 60-70 మంది మోడల్స్‌తో వన్ వీక్ తీశారా పాట... ‘ఇన్నాళ్లకు గుర్తొచ్చానా వాన... ఎన్నాళ్లని దాక్కుంటావే పైన’.
 
పూతలపట్టు రైల్వేస్టేషన్... పాత బస్తీలోని సుల్తాన్ బజార్... శంకర్‌పల్లి దగ్గర భారీ సెట్... ఇలా చాలా చోట్ల యాక్షన్ ఎపిసోడ్స్ తీశారు.
వరంగల్‌లో టెన్ డేస్ షెడ్యూల్ చేశారు. ‘‘ఇక్కడ తీసిన సినిమాలేవీ ఆడలేదు’’ అన్నాడు ఒకతను. ‘‘ఈ సినిమాతో ఆ సెంటిమెంట్ పోతుందిలే’’ చెప్పారు ఎమ్మెస్ రాజు చాలా కాన్ఫిడెంట్‌గా. ఎమ్మెస్ రాజుకి అరకు వ్యాలీ సెంటిమెంట్. అక్కడ తీసిన ఆయన సినిమాలన్నీ హిట్టే. అందుకే అరకులో కొన్ని యాక్షన్ సీన్స్, ఒక సాంగ్ తీశారు. ఇంట్రడక్షన్ షాట్ హెవీ రిస్క్. క్వారీలో బాంబు పేలుళ్ల మధ్య షాట్స్ తీయాలి. డూప్ పెడదామంటే ప్రభాస్ ఒప్పుకోలేదు. 140 వర్కింగ్ డేస్‌లో సినిమా షూటింగ్ కంప్లీటెడ్. 5 కోట్ల బడ్జెట్ తేలింది.
     
ఈ సినిమాతో ప్రభాస్ పెద్ద రేంజ్‌కెళ్తాడు. ఇది ఎమ్మెస్ రాజు ప్రిడిక్షన్. ఇంతకు మించి ‘వర్షం’ గురించి ఒక్క ముక్క మాట్లాడలేదాయన. 2004 సంక్రాంతి. మంచి పోటాపోటీ సీజన్. ఎమ్మెస్ రాజు కాన్ఫిడెన్సే గెలిచింది. వర్షం... సూపర్ డూపర్ హిట్. 120 ప్రింట్స్... 200 థియేటర్స్. సెకండ్ వీక్‌కొచ్చేసరికి ఇంకో 80 ప్రింట్స్ పెంచాల్సిన పరిస్థితి. ప్రభాస్ ఇప్పుడు స్టార్. ‘చిరంజీవి’కి ‘ఖైదీ’లాగా ప్రభాస్‌కి ఇది టర్నింగ్ పాయింట్. త్రిషకు సూపర్ క్రేజ్. కోలా రంగారావు పాత్రలో ప్రకాశ్‌రాజ్ డీలింగ్‌కి ఫుల్ మార్క్స్. భద్రన్నగా గోపీచంద్‌కు సూపర్‌‌బ రెస్పాన్స్. గోపాలరెడ్డి కెమెరావర్క్‌కు అందరూ ఫ్లాట్. దేవి మ్యూజిక్ క్రియేటెడ్ వండర్.  ఎమ్మెస్ రాజుకు డేరింగ్ డ్యాషింగ్ అండ్ డైనమిక్ ఫిలిం మేకర్‌గా బ్రాండ్. ఆ రోజు భారీ వర్షం. ఎమ్మెస్ రాజు కారులో వెళ్తూ ఆ వర్షాన్నే మురిపెంగా చూస్తున్నారు. ఎప్పుడు వర్షం వచ్చినా, ఆయన్ని ‘వర్షం’ సినిమా జ్ఞాపకాలు వెంటాడుతూనే ఉంటాయి.
 
వెరీ ఇంట్రస్టింగ్...

* హైదరాబాద్ - తెలుగు లలిత కళాతోరణంలో సిల్వర్‌జూబ్లీ ఫంక్షన్ చేశారు. చిరంజీవి, వెంకటేశ్, మహేశ్‌బాబు చీఫ్ గెస్ట్‌లు.
 

* ఈ సినిమాకు పనిచేసిన వీరు పోట్ల (కథారచయిత), వంశీ పైడిపల్లి - గౌతమ్ పట్నాయక్ - శ్రావణ్ (అసోసియేట్ డెరైక్టర్స్), కె.రాంబాబు (కో-డెరైక్టర్), ప్రభుదేవా - లారెన్స్ - సుచిత్రా చంద్రబోస్ (కొరియో గ్రాఫర్స్), ఎస్.గోపాల్‌రెడ్డి (కెమెరా మ్యాన్) తర్వాతి కాలంలో డెరైక్టర్స్‌గా మారారు. ఎమ్మెస్ రాజు కూడా.

* తమిళంలో ‘జయం’ రవితో ఎస్పీ బాలసుబ్రమణ్యం ‘మళై’గా రీమేక్ చేశారు.
 
- పులగం చిన్నారాయణ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement