మలుపులు తిరుగుతున్నమడకశిర రాజకీయం
స్థానికేతరుడు, టీడీపీ అభ్యర్థి ఎంఎస్ రాజును వ్యతిరేకిస్తున్న జనం
స్థానికుడైన ఈరలక్కప్పకే మా మద్దతు అంటూ స్పష్టం
గతంలో స్థానికేతరులను గెలిపించి నష్టపోయామంటున్న వైనం
మడకశిర: ఎస్సీ రిజర్వుడు నియోజకవర్గమైన మడకశిర రాజకీయం రసవత్తరంగా మారింది. ఎన్నికలు సమీపిస్తున్న వేళ....లోకల్, నాన్‌లోకల్ నినాదం ఊపందుకుంది. వైఎస్సార్ సీపీ అభ్యర్థి ఈరలక్కప్ప పక్కా లోకల్ కాగా... టీడీపీ అభ్యర్థి ఎంఎస్ రాజు నాన్ లోకల్. దీంతో నియోజకవర్గ ప్రజలంతా గతంలో నాన్ లోకల్‌ను గెలిపించి పడిన ఇబ్బందులను గుర్తు చేసుకుంటున్నారు. లోకల్‌కే తమ మద్దతు అంటూ స్పష్టం చేస్తున్నారు.
ఎంఎస్ రాజు నాన్ లోకల్..
అనంతపురం జిల్లా శింగనమల నియోజకవర్గానికి చెందిన ఎంఎస్ రాజును టీడీపీ అధినేత చంద్రబాబు మడకశిర టీడీపీ అభ్యర్థిగా ప్రకటించారు. ఆయనకు మడకశిర నియోజకవర్గ ప్రజలతో ఏమాత్రం సంబంధాలు లేవు. అసలు మడకశిర నియోజకవర్గంపై కనీస అవగాహన కూడా లేదు. టీడీపీలో చోటుచేసుకున్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఎంఎస్ రాజుకు మడకశిర టికెట్ కేటాయించారు.
స్థానికులైన ఎంతో మంది దళిత నాయకులు దరఖాస్తు చేసుకున్నా... టీడీపీ హైకమాండ్ స్థానికేతరుడు ఎంఎస్ రాజుకు టికెట్ కేటాయించడంతో ఆ పార్టీ శ్రేణుల్లోనే వ్యతిరేకత వ్యక్తమైన విషయం తెలిసిందే. ‘లోకల్ ముద్దు...నాన్ లోకల్ వద్దు’ అంటూ టీడీపీ కార్యకర్తలే ఎంఎస్ రాజుకు వ్యతిరేకంగా ఆందోళనలు కూడా చేశారు. అయినా చంద్రబాబు స్థానికేతరుడికే మద్దతు తెలిపారు. ఈ నేపథ్యంలో మడకశిర ప్రజలు నాన్‌లోకల్ వద్దంటే వద్దంటున్నారు. గతంలో స్థానికేతరులను గెలిపించి తీవ్రంగా నష్టపోయామని, మరోసారి ఆ తప్పు చేయబోమంటున్నారు.
ఈరలక్కప్ప... పక్కా లోకల్
గుడిబండ మండలం ఫళారం గ్రామానికి చెందిన ఉపాధి హామీ కూలి ఈరలక్కప్పకు వైఎస్సార్ సీపీ టికెట్ ఇచ్చింది. ఆయన నిరుపేద. ప్రభుత్వం ఇచ్చిన గృహంలో తల్లితో కలిసి ఉంటున్నారు. వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్ తీసుకున్న నిర్ణయాన్ని నియోజకవర్గ ప్రజలంతా మెచ్చుకుంటున్నారు. రాజకీయాల్లోకి నిరుపేదలు కూడా రావాలన్న సంకల్పం మంచిదంటున్నారు. ఈరలక్కప్ప 2006–2011 మధ్య గుడిబండ సర్పంచ్‌గా పని చేసి మంచి పేరు తెచ్చుకున్నారు.
అంతేకాకుండా ప్రభుత్వ కార్యాలయాల వద్దకు వచ్చే ప్రజల సమస్యలు తెలుసుకుని వాటి పరిష్కారానికి కృషి చేసేవారు. అందువల్లే ప్రస్తుతం ఈరలక్కప్ప ఏ గ్రామానికి వెళ్లినా... ప్రజలు అపూర్వ స్వాగతం పలుకుతున్నారు. ఈరలక్కప్ప ఎమ్మెల్యే అయితే అందరికీ అందుబాటులో ఉండి సేవలందిస్తారని చెబుతున్నారు. సామాన్యుడికి జగన్ అవకాశం ఇచ్చారని, తప్పకుండా అసెంబ్లీకి పంపుతామంటున్నారు.
ఎస్సీ సామాజిక వర్గం నుంచే రాజుపై తీవ్ర వ్యతిరేకత..
టీడీపీ అభ్యర్థి ఎంఎస్ రాజును ఆ పార్టీలోని ఎస్సీ వర్గానికి చెందిన నాయకులే తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. పార్టీ కోసం పనిచేసిన తమను కాదని స్థానికేతరుడు, వివాదాస్పదుడైన ఎంఎస్ రాజుకు టికెట్ ఇవ్వడాన్ని వారు జీర్ణించుకోలేకపోతున్నారు. టీడీపీ టికెట్ కోసం ఎస్సీ వర్గానికే చెందిన స్థానిక నాయకులు మాజీ ఎమ్మెల్యే ఈరన్న, మంజునాథ్, సుబ్బరాయుడు, జయకుమార్, కృష్ణమూర్తి, మల్లికార్జున తదితరులు ప్రయత్నించారు. అయితే టీడీపీ హైకమాండ్ మాజీ ఎమ్మెల్యే ఈరన్న తనయుడు సునీల్‌కు తొలుత టికెట్ కేటాయించింది.
దాదాపు 50 రోజుల పాటు సునీల్ నియోజకవర్గంలో ప్రచారం చేశారు. చివరకు టీడీపీ తరఫున నామినేషన్ కూడా వేశారు. అయితే చివరి నిమిషంలో టీడీపీ అధినేత చంద్రబాబు సునీల్‌ను పక్కనపెట్టి ఎంఎస్ రాజుకు బీఫాం ఇచ్చారు. దీంతో స్థానిక ఎస్సీ వర్గాల నుంచి తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. ఈక్రమంలోనే కొందరు స్థానిక ఎస్సీ సంఘాల నాయకులు ఎంఎస్ రాజుకు వ్యతిరేకంగా ప్రకటనలు కూడా చేశారు. ఎంఎస్ రాజుపై 54 కేసులు ఉన్నాయని, అతను గెలిచినా పెద్దగా ఉపయోగం ఉండదంటున్నారు. వాయిదాల కోసం కోర్టుల చుట్టూ తిరగడానికే సమయం సరిపోతుందని చెబుతున్నారు. ప్రజలు కూడా ఆలోచించి స్థానికులకే పట్టం కట్టాలని కోరుతున్నారు.
1983లో నాన్ లోకల్ అభ్యర్థిని చిత్తుగా ఓడించిన ప్రజలు..
1983లో మడకశిర టీడీపీ అభ్యర్థిగా అనంతపురానికి చెందిన జగదోద్ధారకగుప్తా పోటీ చేశారు. ఆ ఎన్నికల్లో పలువురు స్థానికులు టికెట్ ఆశించినా ఎన్టీఆర్ పట్టించుకోలేదు. దీంతో మడకశిర వాసులు రగిలి పోయారు. ఆ ఎన్నికల్లో ఎన్టీఆర్ గాలి పెద్ద ఎత్తున వీచినా...మడకశిరలో మాత్రం స్థానికేతరుడైన టీడీపీ అభ్యర్థి జగదోద్ధారకగుప్తా చిత్తుగా ఓడిపోయారు. డిపాజిట్ కూడా దక్కలేదు. ప్రస్తుతం ఎంఎస్ రాజుకు ఇదే పరిస్థితి ఎదురవుతుందనే రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.
స్థానికేతరుల హయాంలో అభివృద్ధికి నోచుకోని మడకశిర..
మడకశిర 1962 నుంచి 1972 వరకు ఎస్సీ రిజర్వ్‌డ్ నియోజకవర్గంగా కొనసాగింది. ఆ పదేళ్లలో మూడుసార్లు అసెంబ్లీకి ఎన్నికలు జరిగాయి. 1967, 1972 ఎన్నికల్లో స్థానికేతరులు మడకశిర నుంచి పోటీ చేశారు. 1967 స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసిన స్థానికేతరుడైన ఎంబీ రాజారావు గెలుపొందారు. అదే విధంగా 1972లో స్థానికేతరుడు యల్లప్ప కాంగ్రెస్ తరుఫున పోటీ చేసి గెలుపొందారు. కానీ వారిద్దరూ నియోజకవర్గ అభివృద్ధిని విస్మరించారు. అసలు నియోజకవర్గ ప్రజలకే అందుబాటులో ఉండేవారు కాదు. దీంతో చిన్నచిన్న సమస్యలు కూడా ఎవరికి చెప్పుకోవాలో తెలియక ప్రజలు ఇబ్బందులు పడ్డారు. తాజాగా టీడీపీ స్థానికేతరుడైన ఎంఎస్ రాజుకు టికెట్ ఇవ్వడంతో నాటి రోజులను నియోజకవర్గ ప్రజలు గుర్తు చేసుకుంటున్నారు.
Comments
Please login to add a commentAdd a comment