టైటిల్: మళ్ళీ పెళ్లి
నటీనటులు: వీకే నరేశ్, పవిత్రా లోకేష్, శరత్ బాబు, జయసుధ, అన్నపూర్ణమ్మ తదితరులు
నిర్మాణ సంస్థ: విజయకృష్ణ మూవీస్
నిర్మాత: వీకే నరేశ్
దర్శకత్వం: ఎమ్మెస్ రాజు
సంగీతం: సురేష్ బొబ్బిలి
సినిమాటోగ్రఫీ: బాల్ రెడ్డి
ఎడిటర్: జునైద్ సిద్ధిక్యూ
విడుదల తేది: మే 26, 2023
ప్రశ్న: ‘నరేశ్ గారు.. ‘మళ్ళీ పెళ్లి’ రమ్యా రఘుపతిపై రివేంజ్ తీర్చుకోవడానికి తీశారా?
జవాబు: ఆమె పై పగ తీర్చుకోవడానికి 15 కోట్లు పెట్టి సినిమా తియ్యాలా? ఇది ఎవరిని ఉద్దేశించి తీసిన సినిమా కాదు. ఒక వయస్సు వచ్చిన తర్వాత తోడు కావాలని అనిపిస్తుంది. అలా రెండు మనసులు ఎలా కలుసుకున్నాయి? అనేదే మేము ఈ చిత్రం చెప్పాం.
ప్రశ్న: ఎమ్మెస్ రాజు గారు.. ట్రైలర్ చూస్తే ఇది నరేశ్‌గారి జీవితంలో జరిగిన సంఘటనలే గుర్తు చేస్తున్నాయి. ఇది నరేశ్‌గారి బయోపిక్ అనుకోవచ్చా?
జవాబు: అలా ఎలా అనుకుంటారు? ఇది ట్రెండింగ్ టాపిక్. ట్రైలర్‌లో చూపించిన సీన్స్ నరేశ్ నిజ జీవితంలో జరిగినే అని ఎందుకు అనుకుంటారు? యూట్యూబ్‌లో వందల వీడియోలు ఉంటాయి. అలాంటివే ఇవి. ఇది సినిమా ప్రమోషన్స్‌లో మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నలకు చిత్రబృందం ఇచ్చిన సమాధానం.
టైటిల్.. ట్రైలర్.. అందులో చెప్పించిన సంభాషణలు అన్ని నరేశ్ జీవితానికి సంబధించినవే అయినప్పటికీ.. ఎక్కడా ఇది నా కథ అనిఆయన చెప్పలేదు. మరి ఇది ఎవరి కథ? నరేశ్-పవిత్రల బయోపికా? లేదా కల్పిత కథనా?
‘మళ్ళీ పెళ్లి’ కథేంటంటే..
టాలీవుడ్‌కి చెందిన సీనియర్ హీరో నరేంద్ర(వీకే నరేశ్)కు, ఆయన మూడో భార్య సౌమ్యా సేనపతి(వనితా విజయ్ కుమార్) మధ్య విభేదాలు తలెత్తుతాయి. వ్యాపారం అంటూ ఆమె.. సినిమా అంటూ నరేంద్ర ఇద్దరూ బిజీ బిజీగా గడుపుతారు. అదే సమయంలో నరేంద్రకు కన్నడ నటి పార్వతి(పవిత్రా లోకేష్) పరిచయం అవుతుంది. పార్వతికి ఇద్దరు పిల్లలు. భర్త ఫణింద్ర(అద్దూరి రవివర్మ)తో గొడవలు ఉంటాయి.
ఇలా ఇద్దరి వ్యక్తిగత జీవితాల్లో సంతోషం అనేది ఉండదు. సినిమా షూటింగ్ సమయంలో ఇద్దరు ప్రేమలో పడతారు. ఆ తర్వాత ఏం జరిగింది. అసలు నరేంద్రకు మూడో భార్య సౌమ్య సేతుపతికి మధ్య గొడవలు ఏంటి? నటుడు, రచయిత అయిన ఫణింద్ర.. భార్య పార్వతికి ఎందుకు దూరంగా ఉంటున్నాడు? బెంగళూరు మీడియాను అడ్డుపెట్టుకొని సౌమ్య ఆడిన నాటకం ఏంటి? నరేంద్ర, పార్వతి కలిసి ఓ రోజు హోటల్‌లో ఎందుకు గడపాల్సి వచ్చింది? అనేదే మిగతా కథ.
ఎలా ఉందంటే..
నరేశ్ నిజజీవితంలోకి పవిత్రా లోకేష్ వచ్చాక జరిగిన సంఘటనల ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించాడు దర్శకుడు ఎమ్మెస్ రాజు. ఈ విషయాన్ని సినిమా ప్రమోషన్స్‌లో ఎక్కడా చెప్పకపోయినా.. సినిమా చూస్తే అందరికి అర్థమైపోతుంది. మొత్తం ఐదు చాప్టర్లుగా సినిమాను తీర్చి దిద్దారు. మొదటి చాప్టర్‌లో నరేశ్-పవిత్రల పరిచయాన్ని .. రెండో చాప్టర్‌లో రమ్య రఘుపతిని ఎందుకు పెళ్లి చేసుకోవాల్సి వచ్చిందో చూపించారు.
ఇక మూడో చాప్టర్‌లో పవిత్రా లోకేష్ కెరీర్.. పెళ్లి సంఘటనలను చూపించారు.నాలుగు, ఐదు చాప్టర్లలో నరేశ్-పవిత్రలు కలిసి ఉండడం.. మూడో భార్య మీడియాకెక్కడం తదితర సంఘటనలను చూపించారు.
అయితే సినిమా మొత్తం చూస్తే.. నరేశ్-పవిత్ర మళ్లీ పెళ్లి చేసుకోవాలనుకోవడంలో తప్పులేదు. నరేశ్ మూడో భార్య, పవిత్ర భర్తలు అస్సలు మంచి వాళ్లు కాదు. ఆస్తి కోసం వాళ్లను పెళ్లి చేసుకున్నారనేది ప్రేక్షకులకు అర్థమవుతుంది. మరి ఇందులో వాస్తవం ఎంతో, కల్పితం ఎంతో చెప్పలేం. కానీ సినిమాలో కొన్ని విషయాలను చాలా బోల్డ్‌గా చూపించారు ఎమ్మెస్ రాజు. ఫ్రంట్- బ్యాక్ స్క్రీన్ ప్లే తో కథనాన్ని ఆసక్తికరంగా మలిచాడు. అలాగే పవిత్రా లోకేష్ వ్యక్తిగత జీవితానికి సబంధించి తెలుగు ప్రేక్షకులకు తెలియని విషయాలను చూపించారు.
ఇంటర్వెల్ సీన్ సెండాఫ్‌పై ఆసక్తిని పెంచుతుంది. అయితే ఇక్కడ మైనస్ ఏంటంటే.. నరేష్, పవిత్ర జీవితంలో జరిగిన ఘటనలు.. వారి నేపథ్యం గురించి అంతగా తెలియని ప్రేక్షకులకు అంతగా అర్థం కాకపోవచ్చు. కానీ బెంగళూరులో రమ్య రఘుపతి ప్రెస్ మీట్ ఎందుకు పెట్టింది? నరేశ్-పవిత్ర హోటల్‌లో మీడియాకు ఎలా దొరికిపోయారు? అనేది తెలుసుకోవాలనే క్యూరియాసిటీ ఉన్నవాళ్లకు మళ్లీ పెళ్లి నచ్చుతుంది.
అయితే ఇదంతా నరేశ్-పవిత్రల వెర్షన్ మాత్రమే. మరి రమ్య రఘుపతి వెర్షన్ ఏంటి అనేది ఇలాగే సినిమాను తెరకెక్కించి చెబుతారా? లేదా ప్రెస్ మీట్‌లో చెబుతారా అనేది తెలియాలంటే కొన్నాళ్లు మనం ఎదురు చూడాల్సిందే.
ఎవరెలా చేశారంటే..
నరేంద్ర పాత్రలో నరేశ్, పార్వతి పాత్రలో పవిత్రా లోకేశ్ తమ తమ పాత్రల్లో జీవించేశారు. కొన్ని రొమాంటిక్ సీన్స్ అద్భుతంగా పండించారు. సౌమ్యా సేతుపతిగా వనితా విజయ్ కుమార్ అద్భుతంగా నటించారు. నెగెటివ్ షేడ్స్ ఉన్న పాత్ర తనది. అయితే తెలుగు డబ్బింగ్ మాత్రం అంతగా ఆకట్టుకోలేదనే చెప్పాలి. ఇక సూపర్‌స్టార్ పాత్రలో శరత్ బాబు, నరేంద్ర తల్లి విమలమ్మ పాత్రలో జయసుధ తమ పాత్రలకు న్యాయం చేశారు. ఇక యంగ్ పార్వతిగా అనన్యా నాగళ్ల తెరపై చాలా అందంగా కలిపించింది. మిగిలిన నటీనటులు తమ పాత్రకు న్యాయం చేశారు.
సాంకేతిక విషయాలకొస్తే.. సురేష్ బొబ్బిలి సంగీతం బాగుంది. పాటలతో కథలో భాగంగా వస్తుంటాయి. బాల్ రెడ్డి సినిమాటోగ్రఫీ చాలా బాగుంది. ప్రతి ఫ్రేమ్‌ని చాలా అందంగా చూపించారు. నిర్మాణ విలువలు చాలా ఉన్నతంగా ఉన్నాయి. ఖర్చు విషయంలో నరేశ్ ఎక్కడా కాంప్రమైజ్ కాలేదని సినిమా చూస్తే అర్థమతుంది.
-అంజి శెట్టె, సాక్షి వెబ్‌డెస్క్
Comments
Please login to add a commentAdd a comment