'అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి' రివ్యూ.. నవ్వులతో మెప్పించారా? | Akkada Ammayi Ikkada Abbayi Pradeep Movie Review And Rating Telugu | Sakshi
Sakshi News home page

'అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి' రివ్యూ.. నవ్వులతో మెప్పించారా?

Published Fri, Apr 11 2025 1:49 PM | Last Updated on Fri, Apr 11 2025 2:56 PM

Akkada Ammayi Ikkada Abbayi Pradeep Movie Review And Rating Telugu

టైటిల్‌ : అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి’
నటీనటులు: ప్రదీప్‌  మాచిరాజు, దీపికా పిల్లి, వెన్నెల కిశోర్, బ్రహ్మానందం, సత్య, గెటప్‌ శ్రీను, మురళీధర్‌ గౌడ్‌,రోహిణి, ఝాన్సీ తదితరులు
నిర్మాణ సంస్థలు:  మాంక్స్‌ అండ్‌ మంకీస్‌
నిర్మాత: మాంక్స్‌ అండ్‌ మంకీస్‌ బ్యానర్‌
ఎడిటింగ్: కొడాటి పవన్‌ కల్యాణ్‌
దర్శకత్వం, స్క్రీన్‌ప్లే: నితిన్‌–భరత్‌
కథ, డైలాగ్స్‌: సందీప్‌ బొల్లా
సంగీతం: రధన్‌
సినిమాటోగ్రఫీ: ఎమ్‌ఎన్‌ బాల్‌రెడ్డి
విడుదల: ఏప్రిల్‌ 11, 2025

‘30 రోజుల్లో ప్రేమించడం ఎలా’ సినిమాతో హీరోగా పరిచయమైన ప్రదీప్‌  మాచిరాజు నటించిన కొత్త చిత్రం ‘అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి’(Akkada Ammayi Ikkada Abbayi) నేడు ఏప్రిల్‌ 11న విడుదలైంది. ఇందులో  దీపికా పిల్లి  హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది. నితిన్‌–భరత్‌ దర్శకత్వంలో మాంక్స్‌ అండ్‌ మంకీస్‌ ఈ మూవీని నిర్మించింది. చిన్న సినిమాగా తెరకెక్కిన ఈ ప్రాజక్ట్‌ ద్వారా చాలామంది కొత్తవాళ్లు ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు. వెన్నెల కిశోర్, సత్య, గెటప్‌ శ్రీను, మురళీధర్‌ గౌడ్‌ ఇతర కీలక పాత్రల్లో నటించిన ఈ సినిమాకు సంగీతం రధన్‌ అందించారు. ఈ సినిమాలో దర్శకులతో పాటు హీరోయిన్‌ని కూడా బుల్లితెర వారినే తీసుకోవడం విశేషం. హీరోగా తన రెండో ప్రయత్నంలో  ప్రదీప్ మాచిరాజు ఎలాంటి విజయాన్ని అందుకున్నాడో తెలుసుకుందాం.

కథేంటి..?
కథ మొదలు కావడమే తమిళనాడులోని భైరిలంక గ్రామం నుంచి మొదలౌతుంది. కొన్ని దశాబ్దాలుగా రాజన్న (జీఎమ్‌ సుందర్‌) కుటుంబానికి చెందిన వారే గ్రామ సర్పంచ్‌గా ఉంటారు. అయితే, తన తరంలో అయినా వారసత్వ రాజకీయం అంతం కావాలని ఆయన పెళ్లి కూడా చేసుకోడు. అలా ప్రజల బాగు కోసం రాజన్న ఎంతవరకైనా త్యాగం, దానం చేసేందుకు వెనకడుగు వేయడు. అయితే, ఆ గ్రామంలో ప్రతి ఇంట్లో మగబిడ్డ మాత్రమే జన్మిస్తుండటంతో సర్పంచ్‌లో ఆందోళన మొదలౌతుంది. అలా 60 మంది తర్వాత రాజా (దీపికా పిల్లి) జన్మిస్తుంది. అప్పటి వరకు గ్రామంలో అలముకున్న అపశకునాలన్ని పోతాయి. రాజా పుట్టిన తర్వాత అక్కడ వర్షాలతో పాటు పంటలు  బాగా పండుతాయి. ఆమె తమ గ్రామానికి అదృష్ట దేవత అని అందరూ భావిస్తారు. 

రాజా పెరిగి పెద్ద అయిన తర్వాత గ్రామం దాటనీయొద్దని, అదే గ్రామంలో ఉన్న 60 మందిలో ఒక్కరిని పెళ్లి చేసుకుని అక్కడే ఉండాలని సర్పంచ్‌ రాజన్న తీర్మానిస్తాడు. ఆమె ఎవరిని అయితే పెళ్లి చేసుకుంటుందో అతనే గ్రామ సర్పంచ్‌ అని, తనకు సంబంధించిన ఆస్తి అంతా ఆమె భర్తకే చెందుతుందని ప్రకటిస్తాడు. దీంతో ఆమెను పెళ్లి చేసుకోవాలని 60 మంది యువకులు పోటీ పడుతారు. ఇతర గ్రామాలకు చెందిన అబ్బాయిలను తమ ఊరిలో అడుగుపెట్టకుండా వారందరూ చూసుకుంటూ ఉంటారు. సరిగ్గా అలాంటి సమయంలోనే గ్రామంలో పలు అభివృద్ధి పనులకు ప్రభుత్వం శ్రీకారం చుడుతుంది. అందులో భాగంగా వారి గ్రామంలో మొదట బాత్‌రూమ్‌లు నిర్మించాలని సర్పంచ్‌ అనుకుంటాడు. అందుకోసం ఇంజనీర్‌ అయిన కృష్ణ (ప్రదీప్‌ మాచిరాజు) పట్నం నుంచి అక్కడకు వస్తాడు. మరో ప్రాంతానికి చెందిన వ్యక్తి ఆ గ్రామంలో అడుగుపెట్టడం ఆ 60మందికి నచ్చదు. 

రాజాను పెళ్లి చేసుకునేందుకు అతను ఎక్కడ పోటీకి వస్తాడో అని వారు అడ్డుపడుతారు. అలాంటి సమయంలో ఫైనల్‌గా అక్కడ పనులు ప్రారంభం అవుతాయి. ఒకరోజు రాజా (దీపికా పిల్లి), కృష్ణ (ప్రదీప్‌  మాచిరాజు) ఇద్దరూ అనుకోకుండా కలవడం ఆపై ప్రేమలో పడిపోవడం జరిగిపోతుంది. అయితే, రాజా, కృష్ణల పెళ్లికి ఉన్న అడ్డంకులు ఏంటి..? వారి ప్రేమ విషయం తెలుసుకున్న గ్రామ పెద్దలందరూ  కృష్ణకు పెట్టిన పరీక్ష ఏంటి..? రాజాను పెళ్లి చేసుకోవాలనుకున్న ఆ 60 మంది కలిసి   కృష్ణను ఏం చేశారు..? ఫైనల్‌గా వారిద్దరూ ఒక్కటి అవుతారా..? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

ఎలా ఉందంటే..
సినిమా మొత్తం నవ్వులతోనే కొనసాగుతుంది. మంచి వినోదాన్ని పంచి ప్రేక్షకులను ఎంటర్‌టైన్‌ చేయాలనే దర్శకులు నితిన్‌–భరత్‌ ఈ చిత్రాన్ని తెరకెక్కించారని చెప్పవచ్చు. కథ పరిచయాన్నే చాలా ఆసక్తిగా చెప్పారు కానీ, ఇంటర్వెల్‌ తర్వాత కాస్త తడబడ్డారు. ఒక్క అమ్మాయి కోసం 60మంది పెళ్లి చేసుకోవాలని పోటీ పడటం చాలా ఫన్నీగా దర్శకుడు చూపాడు. ఈ క్రమంలో ఆమెను దక్కించుకునేందుకు వారందరూ పడుతున్న పాట్లు మామూలుగా ఉండవు. ప్రశాంతంగా ఉన్న ఆ గ్రామంలోకి ఒకరోజు సడెన్‌గా కృష్ణ (ప్రదీప్‌  మాచిరాజు) రావడంతో వారిలో అందోళన మొదలౌతుంది. 

ఆ గ్రామంలోకి కృష్ణతో పాటు బిలాల్‌ (సత్య) కూడా కారు డ్రైవర్‌గా ఎంట్రీ ఇస్తాడు. 60మంది గ్యాంగ్‌లో పని (గెటప్‌ శ్రీను) ఉంటాడు. వారందరి చుట్టే కథ రన్‌ అవుతుంది. ప‌ల్లెటూరి అమ్మాయితో పట్నం నుంచి వచ్చిన అబ్బాయి ప్రేమ‌లో ప‌డ‌టం, వారి ప్రేమ కథలో చిన్నచిన్న ట్విస్ట్‌లు, ట‌ర్న్‌ల‌తో ఫీల్‌గుడ్ ఎంట‌ర్‌టైన‌ర్‌ అని చెప్పచ్చు. క‌థాప‌రంగా సినిమాలో కొత్త‌ద‌నం లేక‌పోయినా గెట‌ప్ శ్రీను, స‌త్యల మధ్య వచ్చే కామెడీ  సీన్లు సినిమాకు ప్రధాన బలం అని చెప్పవచ్చు.  వారు స్క్రీన్‌పై క‌నిపించే ప్ర‌తిసీన్‌లో ప్రేక్షకులను క‌డుపుబ్బా న‌వ్వుతారు. వారి పంచ్‌లు, ప్రాస‌లు గ‌ట్టిగానే పేలాయి.

రాజా (దీపికా పిల్లి), కృష్ణ (ప్రదీప్‌  మాచిరాజు) ఇద్దరి జోడీ సరిగ్గా సెట్‌ అయింది. 60మంది కళ్లుకప్పి వారిద్దరూ సీక్రెట్‌గా పదేపదే కలుసుకునే సీన్లు బాగుంటాయి. వెన్నెల కిషోర్‌, బ్రహ్మానందం ఇద్దరూ కామియో రోల్స్‌లో  ఎంట్రీ ఇస్తారు. ఉన్నది కొద్దిసేపు మాత్రమే అయినా బాగా ఫన్‌ ఉంటుంది. గ్రామీణ ప్రాంతం నుంచి ఆ గ్యాంగ్‌ మొత్తం సిటీకి చేరుకున్న తర్వాత సినిమా కాస్త నెమ్మదిస్తుంది. అక్కడి నుంచి పంచ్‌ డైలాగ్స్‌, కామెడీ అంతగా మెప్పించేలా ఉండవు. అలా ఫస్టాఫ్‌లో ఉన్న బలం సెకండాఫ్‌లో ఉండదు. సినిమాకు కాస్త ఇదే మైనస్‌ అని చెప్పవచ్చు. సినిమా క్లైమాక్స్‌ సీన్‌ మరీ కామెడీగా ఉంటుంది. ఇలా కూడా సినిమాను ముగించేయవచ్చా అనే సందేహం ప్రేక్షకులలో  రావడం ఖాయం అని చెప్పవచ్చు. ముఖ్యంగా ఈ సినిమాకు పాటలు చాలా వీక్‌.. అవి పదే పదే రావడం వల్ల ప్రేక్షకులలో విసుగును తెప్పిస్తాయి.

ఎవరెలా చేశారంటే..
గెట‌ప్ శ్రీను, స‌త్య కామెడీ కోసం ఈ సినిమా తప్పకుండా చూడొచ్చు. మూవీకి బిగ్గెస్ట్ ప్ల‌స్ పాయింట్‌ వారిద్దరే.. తమ పాత్రలతో నవ్విస్తూ దుమ్మురేపారని చెప్పవచు. ఆ తర్వాత హీరోయిన్‌ దీపిక తన పాత్రలో బాగా సెట్‌ అయిపోయింది. తను యాంకర్‌గా పలు వేదికలపై రాణించిన అనుభవం ఉండటంతో ఈజీగా తన పాత్రలో నటించేసింది. ప్ర‌దీప్‌కు ఇదీ రెండో సినిమా కావడంతో సులువుగానే కనెక్ట్‌ అయిపోయాడు. అతని డైలాగ్ డెలివ‌రీ, కామెడీ టైమింగ్ బాగున్నప్పటికీ అక్కడక్కడా కొంత త‌డ‌బాటుకు లోన‌య్యాడ‌ని చెప్పవచ్చు.  ప్రదీప్‌ తల్లిదండ్రులుగా మురళీధర్‌ గౌడ్‌,రోహిణి  తమ పరిదిమేరకు మెప్పించారు. పాన్‌ ఇండియా పెళ్లిళ్ల బ్రోకర్‌గా బ్రహ్మాజీ కనిపించింది కొంతసేపు మాత్రమే.. అయినా తన పాత్రకు ఆడియన్స్‌ బాగా కనెక్ట్‌ అవుతారు. సంగీతం, కెమెరామెన్‌ పనితీరు బాగుంది. చిన్న బడ్జెట్ సినిమాలకి ఈ స్థాయి టెక్నికల్ క్వాలిటీస్‌ ఉండటం చాలా అరుదు. కథ బలం ఉన్నంతమేరకు నిర్మాణ విలువలు బాగున్నాయి. ప్రదీప్‌, దీపిక, గెట‌ప్ శ్రీను, స‌త్య అభిమానులకు ఈ సినిమా తప్పకుండా నచ్చుతుంది. ఆపై  కామెడీని ఇష్టపడే వారు హ్యాపీగా వెళ్లొచ్చు..

Rating:
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement