'మ్యాడ్ స్క్వేర్‌' మూవీ రివ్యూ | Mad Square Movie Review And Rating Telugu | Sakshi
Sakshi News home page

Mad Square Movie Review: 'మ్యాడ్ స్క్వేర్‌' రివ్యూ.. నవ్వులతో డబుల్‌ రైడ్‌ మెప్పించిందా..?

Published Fri, Mar 28 2025 12:48 PM | Last Updated on Fri, Mar 28 2025 1:44 PM

Mad Square Movie Review And Rating Telugu

టైటిల్‌ : మ్యాడ్‌ స్క్వేర్‌
నటీనటులు: నార్నె నితిన్, సంగీత్‌ శోభన్, రామ్‌ నితిన్, శుభలేఖ సుధాకర్‌, మురళీధర్‌ గౌడ్‌, తదితరులు
నిర్మాణ సంస్థలు:  సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్‌
నిర్మాతలు: సూర్యదేవర హారిక, సాయి సౌజన్య
సమర్పకులు: ఎస్. నాగ వంశీ
ఎడిటింగ్: నవీన్ నూలి
దర్శకత్వం, కథ: కల్యాణ్‌ శంకర్‌ 
సంగీతం: భీమ్స్ సిసిరోలియో, తమన్‌
సినిమాటోగ్రఫీ: శామ్‌దత్
విడుదల: మార్చి 28, 2025

'మ్యాడ్‌ స్క్వేర్‌'తో(Mad Square) మరోసారి నవ్వులు పూయించేందుకు  నార్నె నితిన్‌, సంగీత్‌ శోభన్‌, రామ్‌ నితిన్‌ థియేటర్స్‌లోకి వచ్చేశారు. 2023లో విడుదలైన హిట్‌ సినిమా ‘మ్యాడ్‌’ (Mad) చిత్రానికి ఇది కొనసాగింపుగా ఉంది. కల్యాణ్ శంకర్‌ దర్శకత్వం వహించగా.. సూర్యదేవర హారిక, సాయి సౌజన్య సంయుక్తంగా నిర్మించారు. నేడు  (మార్చి 28) సినిమా విడుదలైంది. కాలేజీ నేపథ్యంతో పరిచయం అయిన కొందరు స్నేహితులు వారి చదువులు పూర్తి అయిన తర్వాత మళ్లీ ఒకచోట కలిస్తే వారి అల్లరి ఎలా ఉంటుందో ఈ చిత్రంలో చూపించారు. రాయల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇంజినీరింగ్ కళాశాల(RIE)లో చదువుకోవడం ఇష్టం లేక ఓ విద్యార్థి పారిపోయే సంఘటన నుంచి మ్యాడ్‌ పార్ట్‌-1 కథ మొదలవుతుంది.  ఫైనల్‌గా ఆ విద్యార్థి RIEలోనే చదివి తీరుతాననే నిర్ణయంతో కథ ముగుస్తుంది. ఇప్పుడు లడ్డు గాడి పెళ్లితో మ్యాడ్‌ స్క్వేర్‌ కథ ప్రారంభమౌతుంది.  కాలేజీ నుంచి తమ చదవులు పూర్తి చేసిన తర్వాత వారు ఏం చేశారనేది మ్యాడ్‌ స్క్వేర్‌లో ఫుల్‌ ఫన్‌తో దర్శకుడు చూపించాడు.

కథేంటంటే..
ఈ కథలో పెద్దగా లాజిక్స్‌ అంటూ ఏమీ ఉండవ్‌.. దానిని దృష్టిలో పెట్టుకొని ఈ చిత్రాన్ని చూస్తే ఎంజాయ్‌ చేస్తారని చెప్పవచ్చు. అశోక్ (నార్నె నితిన్), మనోజ్(రామ్ నితిన్), దామోదర్(సంగీత్ శోభన్),లడ్డు(విష్ణు) నలుగురు స్నేహితులు ఇంజనీరింగ్‌ పూర్తి అయిన తర్వాత విడిపోతారు. కానీ, లైఫ్‌లో సెటిల్‌ కాకుండా ఎంజాయ్‌ చేస్తూ ఉంటారు. లడ్డు(విష్ణు) పెళ్లి నుంచి ఈ సినిమా అసలు కథ మొదలౌతుంది. స్నేహితులకు చెప్పకుండా లడ్డు పెళ్లికి రెడీ అయిపోతాడు. ఈ విషయం తెలుసుకున్న అతని మిత్రులు వేడక సమయంలో సడెన్‌గా ఎంట్రీ ఇస్తారు. ఈ క్రమంలో అక్కడ భారీగా ఫన్‌ మొదలౌతుంది. లడ్డుకు ఎలాగైనా పెళ్లి చేయాలని తండ్రి మురళీధర్ గౌడ్‌ ఎదురు కట్నం ఇచ్చి సంబంధం సెట్‌ చేస్తాడు. ఈ క్రమంలో ఆ పెళ్లి చెడిపోకూడదని లడ్డూ ఫ్యామిలీ పడే పాట్లు నవ్వులు తెప్పిస్తాయి. ఫ్రెండ్‌ పెళ్లి ఘనంగా చేయాలని దామోదర్, అశోక్, మనోజ్‌ అనేక ప్లాన్స్‌ వేస్తుంటారు. వారి హంగామాకు తోడు పెళ్లికూతురు ఫ్యామిలీ నుంచి లడ్డూకు ఎదురయ్యే అవమానాలు కడుపుబ్బా నవ్విస్తాయి. 

తన స్నేహితులు చేసే తుంటరి పనుల వల్ల ఆ పెళ్లిలో చాలా గందరగోళం నెలకొంటుంది.  పెళ్లి జరుగుతున్నంత సేపు ఎక్కడ ఆ కార్యక్రమం ఆగిపోతుందో అనే భయంతో లడ్డు ఉంటాడు. సరిగ్గా పెళ్లి అవుతుందని సమయంలో లడ్డు స్నేహితులతో పాటు వచ్చిన ఒక వ్యక్తితో పెళ్లికూతురు వెళ్లిపోతుంది. ఈ విషయం తెలిశాక లడ్డూ ఇంట్లో జరిగే పంచాయితీ,  అక్కడ మ్యాడ్‌ గ్యాంగ్‌ చేసే అతి ఫుల్‌గా నవ్విస్తుంది. దీంతో తీవ్ర నిరాశలో ఉన్న లడ్డు కోసం కాస్త రిలాక్స్‌ ఇవ్వాలని వారందరూ గోవా ట్రిప్‌ ప్లాన్‌ చేసుకుంటారు. వారు ఎంట్రీ ఇచ్చాక గోవా మ్యూజియంలో విలువైన లాకెట్‌ను గోవాలో పెద్ద డాన్‌గా ఉన్న మ్యాక్స్‌ (సునీల్‌) మనుసులు దొంగలిస్తారు.  దానిని లడ్డు బ్యాచ్‌ చేశారని పోలీసులు అనుమానిస్తారు. దీంతో వారిపై నిఘా ఉంచుతారు. 

అయితే, ఒక ఘటనలో ఆ లాకెట్‌ లడ్డు చేతికి దొరుకుతుంది. దీంతో దానిని తిరిగి తెచ్చివ్వాలని లడ్డు తండ్రిని మ్యాక్స్‌ కిడ్నాప్‌ చేస్తాడు. ఈ కేసును చేధించేందుకు ఒక ఐపీఎస్‌ను ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది. లడ్డు బ్యాచ్‌లో ఉన్న ఆ అధికారి ఎవరు..? లడ్డుని పెళ్లి చేసుకోవాల్సిన అమ్మాయి మరో అబ్బాయితో ఎందుకు వెళ్లిపోయింది...? వారిద్దరూ కూడా గోవాకే ఎందుకు వెళ్తారు..? చివరిగా ఆ లాకెట్‌ కథ ఏంటి.. ఎవరి వద్ద ఉంటుంది..? ఫైనల్‌గా లడ్డును తన స్నేహితుడే జైలుకు ఎందుకు పంపుతాడు..? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

ఎలా ఉందంటే..?
మ్యాడ్‌ స్క్వేర్‌ విడుదలకు ముందే  నిర్మాత నాగవంశీ మాట్లాడుతూ.. ఈ సినిమాలో కథ గురించి పెద్దగా ఏమీ ఉండదని తెలిపారు. ఆయన చెప్పినట్లుగానే కథ బలం ఉండదు. కానీ, నవ్వులతో వంద శాతం ఎంటర్‌టైన్‌ చేస్తారు. ప్రతి సీన్‌లో వరుస పంచ్‌లతో నవ్విస్తారు. డీడీ, లడ్డు గ్యాంగ్ కావాల్సినంత హంగామా చేస్తారు. ఆద్యంతం ఎక్కడా విసుగు లేకుండా ప్రతి సన్నివేశంలో వారు వినోదాన్ని పంచుతారు. పార్ట్‌-1లో కాలేజి క్యాంపస్‌ను ఎంచుకున్న దర్శకుడు.. పార్ట్‌లో లడ్డు గాడి పెళ్లి, గోవా కాన్సెప్ట్‌ను ప్రధానంగా ఎంచుకున్నాడు. యువతను ఆకట్టుకునేలా ఫుల్‌ పంచ్‌లతో సినిమా ఉంటుంది. ఎలాంటి డబుల్‌ మీనింగ్‌ డైలాగ్స్‌ లేకుండా ప్రేక్షకులకు వినోదాన్ని పంచాడు దర్శకుడు కల్యాణ్‌ శంకర్. కాలేజీలో మొదలైన స్నేహం.. ఆ తర్వాత కూడా ఎంత మధురంగా  ఉంటుందో లడ్డు కథతో దర్శకుడు చెప్పాడు. 

 (ఇదీ చదవండి: ‘రాబిన్‌హుడ్‌’ మూవీ రివ్యూ)

ఈ కథలో ప్రధాన పాత్రధారులైన మనోజ్, అశోక్, దామోదర్‌ల పేర్లలోని మొదటి అక్షరాలను తీసుకొని మ్యాడ్ అనే టైటిల్ పెట్టి హిట్‌ కొట్టాడు. ఇప్పుడు దానికి లడ్డుగాడి కథన కలిపి మ్యాడ్‌ స్క్వేర్‌ చేశాడని చెప్పవచ్చు. సెకండాఫ్‌లో కథ గోవా షిఫ్ట్‌  అయ్యాక ఇంకాస్త స్పీడ్‌ పెంచాడు దర్శకుడు. ఫస్టాఫ్‌ అంతా లడ్డు పెళ్లితో ఫుల్‌ ఎంటర్‌టైన్‌ చేస్తే రెండో భాగం కాస్త ఫన్‌ నెమ్మదిస్తుంది.  మ్యాక్స్‌ గ్యాంగ్‌ చేసే దొంగతనం  మ్యాడ్‌ గ్యాంగ్‌కు చుట్టుకోవడం. ఆపై లడ్డూ తండ్రిని మ్యాక్స్‌ కిడ్నాప్‌ చేయడం.. ఆయన్ని ఎలాగైనా కాపాడాలని డీడీ, లడ్డూ, అశోక్, మనోజ్‌ చేసే ప్రయత్నాలు సెకండాఫ్‌లో ఉంటాయి.

సునీల్‌, లడ్డు ఫాదర్‌ మురళీధర్‌ మధ్య సీన్స్‌ బాగున్నాయి. సత్యం రాజేష్‌ పోలీసు పాత్ర నుంచి వచ్చే ప్రతి సీన్‌ కాస్త ఫోర్స్‌డుగా ఉంటుంది. సినిమాలో హిట్‌ సాంగ్‌ స్వాతిరెడ్డి కూడా సరైన పాయింట్‌లో లేదు అనిపిస్తుంది. ప్రియాంక జవల్కార్‌ను కామియో రోల్‌ ఇచ్చారు. కానీ, అంత ఎట్రాక్ట్‌ అనిపించలేదు. లడ్డు మీద వరుస పంచ్‌లు పడుతున్నా సరే సినిమాను ఫుల్‌ స్వింగ్‌లో నడిపించాడని చెప్పవచ్చు. అక్కడక్కడ మినహాయిస్తే..  విసుగు లేకుండా ప్రతి సన్నివేశంలో ఫుల్‌ వినోదం ఉంటుంది. రెండు గంటలపాటు బాగా ఎంజాయ్‌ చేసే థియేటర్‌ నుంచి ప్రేక్షకుల బయటకు వస్తారని చెప్పవచ్చు.

ఎవరెలా చేశారంటే..?
మ్యాడ్‌-1లో చాలా పాత్రలు ఉంటాయి.. అక్కడ అన్ని క్యారెక్టర్స్‌కు ప్రాధాన్యత ఉంటుంది. కానీ, ఇందులో కొన్నింటికి తక్కువ ప్రాముఖ్యత ఉంటుంది. నార్నె నితిన్ తనదైన స్టైల్లో సెట్‌ అయిపోయాడు. లడ్డూగా విష్ణు తన నటన తీరుతో నూటికి నూరు మార్కులు కొట్టేశాడు. ఈ సినిమాకు ప్రధాన బలం లడ్డునే అని చెప్పవచ్చు. సంగీత్ శోభన్ డీడీగా తన వేగం ఎక్కడా తగ్గనివ్వకుండా పంచ్‌ డైలాగ్స్‌ పేలుస్తూనే ఉంటాడు. ఎక్కడా కూడా  తన ఎనర్జీ తగ్గకుండా మెప్పిస్తాడు. మనోజ్ పాత్రలో రామ్ నితిన్ సైలెంట్‌గా లవర్‌ బాయ్‌లా తన ఫెయ్యిల్యూర్‌ స్టోరీ చెబుతూ చుట్టేస్తూ ఉంటాడు. రఘుబాబు, మురళీధర్ గౌడ్‌లు తమ పాత్రల పరిధి మేరకు  నవ్వులు పంచారు. జాతిరత్నాలు దర్శకుడు అనుదీప్ మరోసారి అతిథి పాత్రలో కనిపించింది కొద్దిసేపు మాత్రమే అయినప్పటికీ ప్రేక్షకులతో విజిల్స్‌ వేపించేలా చేశాడు. 

మ్యాక్స్‌ పాత్రలో సునీల్‌ విలనిజమే కాకుండా కామెడీని కూడా పండించాడు. శుభలేఖ సుధాకర తన పాత్ర పరిమితిమేరకు పర్వాలేదు. మ్యాడ్ స్క్వేర్‌ కథలో పెద్దగా బలం లేకున్నప్పటికీ దర్శకుడు కల్యాణ్‌ శంకర్  తెరకెక్కించిన విధానం బాగుంది. కానీ,  సంభాషణల విషయంలో బలవంతంగా నవ్విద్దాం అనేలా కొన్ని సీన్లు ఉన్నాయి. పాటల విషయంలో భీమ్స్ ఇంకాస్త శ్రద్ధ పెట్టింటే బాగుండు. తమన్‌ బీజీఎమ్‌ కూడా పెద్దగా వర్కౌట్‌ కాలేదని చెప్పవచ్చు. శ్యామ్ దత్  సినిమాటోగ్రఫి సూపర్‌ అనిచెప్పవచ్చు.  నిర్మాణం పరంగా ఉన్నంతమేరకు బాగుంది. నిర్మాతలు సూర్యదేవర హారిక, సాయి సౌజన్యలకు మ్యాడ్ స్క్వేర్‌ మంచి విజయాన్ని ఇచ్చే సినిమా అని చెప్పవచ్చు.

Rating:
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement