రజనీకాంత్‌ని హీరోగా అందరూ వద్దన్నారు! | Rajanikanth at everyone! | Sakshi
Sakshi News home page

రజనీకాంత్‌ని హీరోగా అందరూ వద్దన్నారు!

Published Sat, Mar 29 2014 11:09 PM | Last Updated on Sat, Sep 2 2017 5:20 AM

Rajanikanth at everyone!

చెన్నైలోని మైలాపూర్ ప్రాంతం. ఓ ఇరుకు సందులో... ఓ పాతకాలం డాబాలో... రెండు గదుల పోర్షన్.  బయట నిలబడ్డ ఓ పెద్దాయన ‘‘నేనే ఈరంకి శర్మని. మీరేగా నా కోసం వచ్చింది’’ అని మమ్మల్ని లోపలకు తీసుకువెళ్లారు. ఆయనకు 92 ఏళ్లంటే అస్సలు నమ్మ బుద్ధేయదు. స్ప్రింగ్‌లా అటూ ఇటూ తిరుగుతూ, నాన్‌స్టాప్‌గా కబుర్లు చెబుతూనే ఉన్నారాయన. ‘‘చాలా చిత్రంగా ఉందే. మీరు నా ఇంటర్వ్యూ తీసుకోవడం! నాలాంటి దర్శకుణ్ణి ఇంకా ప్రేక్షకులు గుర్తు పెట్టుకున్నారంటారా? చిత్ర పరిశ్రమ వాళ్లకే నేను బతికున్నానో లేదో తెలీదు’’ అన్నారాయన. ఆ మాటల్లో నిర్వేదం ఎక్కడా లేదు. సమాజం వాస్తవ పరిస్థితి ఆయనకు బాగా తెలుసు. డబ్బుతోటీ విజయాలతోటీ ఇక్కడ మనుషుల్ని కొలుస్తారని ఆయనకు ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. సిక్ట్సీ ఇయర్స్ ఇండస్ట్రీ ఆయనది. రజనీకాంత్‌ని ‘చిలకమ్మ చెప్పింది’తో తెలుగు తెరకు పరిచయం చేసింది ఆయనే. జయప్రద ‘అంతులేని కథ’ చేయడానికి ముఖ్య కారకుడు ఆయనే. చిరంజీవితో ‘కుక్క కాటుకు చెప్పు దెబ్బ’, ‘సీతాదేవి’ లాంటి సినిమాలు చేసింది ఆయనే. చేసింది చాలా తక్కువ సినిమాలే కానీ, అన్నీ గుర్తుండిపోయేవే. ఇప్పటికీ విశ్రాంతి అనేది లేకుండా పని చేస్తున్న 92 ఏళ్ల యువకుడు ఈరంకి పురుషోత్తమశర్మ జీవన ప్రవాహంలోని కొన్ని కెరటాలు ఆయన మాటల్లోనే..!
 
ఆఫీస్ అసిస్టెంట్ నుంచి డెరైక్షన్ వైపు!

 మాది మచిలీపట్నం. మా నాన్నగారు వెంకటశాస్త్రి చిత్రకళలో ఉద్దండులు. ప్రముఖ సినీ కళాదర్శకులు టీవీయస్ శర్మ, ఎస్వీయస్ రామారావు, గోఖలే, వాలి, తోట తదితరులంతా మా నాన్నగారి శిష్యులే. మా అన్నయ్య ఈరంకి గోపాలకృష్ణమూర్తి పేరొందిన పబ్లిసిటీ ఆర్టిస్ట్. 1952లో నేనూ సినిమా ఫీల్డ్‌లోకి ఎంటరయ్యాను. ఎస్వీయస్ రామారావు దర్శకత్వంలో ‘చిన్నమ్మ కథ’ అనే సినిమా రూపొందుతుంటే ఆఫీస్ అసిస్టెంట్‌గా చేరా. తర్వాత ఎడిటింగ్ సైడ్ జాయినయ్యా. మరో పక్క దర్శకత్వశాఖలోనూ పనిచేశా. బాగా అనుభవం వచ్చాక స్వతంత్రంగా ఎడిటర్‌గా 40 సినిమాలకు పైగా పని చేశాను. కానీ నా మనసు మాత్రం డెరైక్షన్ మీదే ఉండేది. జెమినీ సంస్థ వాళ్లు తెలుగులో కె.బాలచందర్ దర్శకత్వంలో తీసిన ‘భలే కోడళ్లు’కు నేను కో-డెరైక్టర్‌ని. అప్పటినుంచీ బాలచందర్ దగ్గర చాలా సినిమాలకు పని చేశాను.
 
ఆ అమ్మాయిని నేనే బాలచందర్‌కి పరిచయం చేశా!
 
ఓ రోజు నటి నిర్మలమ్మ ఫోన్ చేసి ‘‘రాజమండ్రి నుంచి ఓ అమ్మాయి వచ్చింది. మంచి వేషం ఉంటే చూడండి’’ అని చెప్పారు. అప్పుడే తెలుగులో ‘అంతులేని కథ’ చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయి. చెల్లెలు వేషానికి బావుంటుందని నేనే తీసుకెళ్లి బాలచందర్‌కి పరిచయం చేశాను. అంతా ఓకే. తమిళ వెర్షన్‌లో చేసిన సుజాత తెలుగులోనూ హీరోయిన్‌గా చేయాలి. కానీ తను చాలా బిజీ. చెల్లెలి వేషానికి తీసుకున్న అమ్మాయినే మెయిన్ హీరోయిన్‌గా తీసుకుందామన్నారు బాలచందర్. నేను ఓకే అన్నాను. ఆ అమ్మాయి ఎవరో కాదు. జయప్రద. ‘అంతులేని కథ’ సినిమాతో ఆమె ఎంత స్టార్ అయిందో తెలిసిందే.
 
 రజనీకాంత్ పారితోషికం అయిదు వేలు!
 
‘విజయా’ నాగిరెడ్డి గారు ఓ మలయాళ సినిమా ఆధారంగా తెలుగు, తమిళ భాషల్లో కె. బాలచందర్ దర్శకత్వంలో సినిమా చేయాలనుకున్నారు. చాలా యాంటీ సబ్జెక్ట్ అది. బాలచందర్ బిజీగా ఉండి చేయలేని పరిస్థితి. నాకేమో అలాంటి కథతో డెరైక్షన్ చేయాలని ఆశ. నిర్మాత హరిరామజోగయ్య నాతో సినిమా చేయడానికి రెడీ. తమిళం హక్కులు వేరే వాళ్లతో కొనిపించి, తెలుగులో మేం సినిమా మొదలుపెట్టాం. హీరో వేషానికి కొత్త మొహం కావాలి. నేను ఒక తమిళ హీరో పేరు సూచించాను. అందరూ రిజెక్ట్ చేశారు. నేను మాత్రం అతనే కావాలని పట్టుబట్టాను. ఫైనల్‌గా అతనితో సినిమా చేశాను. సినిమా పెద్ద హిట్టు. ఆ హీరో యాక్షన్‌కి ఒకటే క్లాప్స్. ఆ సినిమా పేరు ‘చిలకమ్మ చెప్పింది’ (1977). ఆ హీరో రజనీకాంత్. తెలుగులో అతనికి అదే తొలి సినిమా. పారితోషికం మూడు వేల రూపాయలు అని మాట్లాడాం కానీ, చివరకు అయిదు వేలు ఇచ్చాం. ఈ సినిమాతో రజనీకాంత్‌కి తెలుగు మార్కెట్ కూడా వచ్చింది.
 
చిరంజీవితో చేయొద్దన్నారు!
 
నేను తీసిన ‘నాలాగా ఎందరో’ చిత్రానికి ఎనిమిది నందులు వచ్చాయి. ఆ తర్వాత చిరంజీవి, మాధవితో ‘కుక్క కాటుకి చెప్పు దెబ్బ’ చేశా. హీరోగా చిరంజీవి వద్దని కొంతమంది చెప్పారు. మళ్లీ చిరంజీవితో ‘సీతాదేవి’ చేశాను. ‘అగ్ని పుష్పం’తో సీతను పరిచయం చేశాను. ఆ తర్వాత కొన్ని కారణాల వల్ల డెరైక్షన్ చేయలేదు. అప్పుడప్పుడు కొన్ని సీరియల్స్ డెరైక్ట్ చేశాను. ఇప్పుడు సినిమా డెరైక్ట్ చేసే అవకాశం వస్తే చేయడానికి రెడీ.
 
ఇప్పటికీ అద్దె ఇల్లే!
 
ఇన్నేళ్ల కెరీర్‌లో నేను సంపాదించిందేమీ లేదు. ఇప్పటికీ అద్దె ఇల్లే. హైదరాబాద్‌లో స్థలం తీసుకోమన్నా, ఆ కొండల్లో ఎందుకని వదిలేశా. ఇప్పుడు దాని విలువ కోట్లు. విజయ్ టీవీలో మా అబ్బాయి ఎడిటర్. వాడి జీతమే మాకు ఆధారం. ఇప్పటికీ స్క్రిప్ట్ వర్క్ చేస్తున్నాను. నవతరం దర్శకులకి మెళకువలు చెబుతున్నాను. నా ఆత్మకథ రాసుకున్నాను. అయితే అది నాకు మాత్రమే సొంతం. ప్రచురణ చేయాలనుకోవడం లేదు. అప్పటి సంఘటనలు చదువుకుంటుంటే అదో తీయని అనుభూతి. అదే ఈ వయసులో నాకు ఎనర్జీ.
 
 - పులగం చిన్నారాయణ
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement