నాన్న డైరక్షన్ కూడా చేయాలనుకున్నారు
‘‘ఏ అట్టు... పెసరట్టా, మినపట్టా, రవ్వట్టా, మసాలా అట్టా, 70 ఎంఎం అట్టా, ఎమ్మెల్యే అట్టా, నూనేసి కాల్చాలా, నెయ్యేసి కాల్చాలా, నీళ్లోసి కాల్చాలా, పెట్రోలు పోసి కాల్చాలా, కిరసనాయిలు పోసి కాల్చాలా... డీజిలేసి కాల్చాలా... అసలు కాల్చాలా, వద్దా...’’ ‘వివాహ భోజనంబు’ సినిమాలో ఒకసారి ఈ సీన్ గుర్తు చేసుకోండి. ముఖ్యంగా ‘సుత్తి’ వీరభద్రరావు ఎక్స్‌ప్రెషన్స్. నవ్వి నవ్వి పొట్ట చెక్కలు కాకపోతే ఒట్టు. ‘సుత్తి’ వీరభద్రరావు తన కామెడీతో ఓ ట్రెండ్ సెట్ చేశారు. ఆయన పోయి 26 ఏళ్లవుతోంది. కానీ, ఇప్పటికీ ఎప్పటికీ ఆయన మనకు గుర్తుంటారు. వీరభద్రరావుకు ఒక కొడుకు, కూతురు. కొడుకు చక్రవర్తి చెన్నైలో సాఫ్ట్‌వేర్ కంపెనీ నిర్వహిస్తున్నారు. తండ్రి జ్ఞాపకాల్లోకి వెళ్తూ చక్రవర్తి చెప్పిన సంగతులు.
నాన్న లేరంటే ఇప్పటికీ నమ్మబుద్దేయడంలేదు. చనిపోయేనాటికి ఆయన వయసు 41. ఆయన అంత త్వరగా చనిపోవడం మా దురదృష్టం. ‘చూపులు కలిసిన శుభవేళ’ సినిమా కోసం ఓ పాట తీస్తుంటే కాలు స్లిప్ అయ్యింది. తర్వాత బాగా వాచిపోయింది. షుగర్, బీపీ ఉన్నాయి కాబట్టి ఎందుకైనా మంచిదని చెన్నైలోని ఆళ్వార్‌పేటలోగల ఓ ఆసుపత్రిలో చేరారు. అక్కడుండగానే ఆయన హార్ట్ ఎటాక్‌తో చనిపోయారు. నాన్న పోయే నాటికి నాకు పదహారేళ్లు. ఇంటర్ ఫస్టియర్‌లో ఉన్నా. మాకు పెద్దగా ఆస్తులు లేకపోయినా ఉన్నంతలో మేం ఫర్వాలేదు.
నాన్న ఎంత బిజీగా ఉన్నా మాకు సమయాన్ని కేటాయించేవారు. మా ఇంటి పేరు ’మామిళ్లపల్లి’. కానీ జంధ్యాలగారి సినిమాల వల్ల మా ఇంటి పేరే ‘సుత్తి’ అన్నట్టుగా అయిపోయింది. నాన్న కామెడీ అంటే నాకు బాగా ఇష్టం. ముఖ్యంగా ‘పుత్తడిబొమ్మ’ సినిమాలో ఏనుగు కోసం ఆస్తుల్ని అమ్ముకున్న పాత్ర ఎన్నిసార్లు చూసినా నవ్వొస్తుంది. రెండు రెళ్లు ఆరు, శ్రీవారికి ప్రేమలేఖ, ఆనందభైరవి, వివాహ భోజనంబు, బాబాయ్ అబ్బాయ్ తదితర చిత్రాల్లో కూడా నాన్న కామెడీ అదుర్స్.
విజయవాడ ఆలిండియా రేడియోలో నాన్న పదేళ్లు అనౌన్సర్‌గానూ, ఆఫీసర్‌గానూ పని చేశారు. ఆయనకు మొదట్నుంచీ రంగస్థలం అంటే ప్రాణం. ఎన్నో నాటకాలు వేశారు. నాన్న తొలి సినిమా ‘బలిపీఠం’. ఆ తర్వాత వరుసగా ‘ఎర్రమల్లెలు’, ‘జాతర’ చేశారు. నాలుగో సినిమా ‘నాలుగు స్తంభాలాట’ నుంచి ఆయన హవా మొదలైంది. 1982 నుంచి 88 వరకూ 180కు పైగా సినిమాలు చేశారు. ఆయన ఆఖరి సినిమా ‘చూపులు కలిసిన శుభవేళ’. ఇంకొన్నాళ్లు ఉండుంటే, ఇంకెన్ని మంచి సినిమాలు చేసేవారో కదా!
‘కొంటె కోడళ్లు’ లాంటి రెండు, మూడు సినిమాల్లో మెయిన్ విలన్‌గా చేశారు. నాన్న విలనీ కూడా బాగుంటుంది.
విజయవాడలో రంగస్థలం మీద నాన్న డెరైక్ట్ చేస్తే, జంధ్యాలగారు యాక్ట్ చేసేవారు. సినిమా ఫీల్డ్‌కొచ్చాక జంధ్యాలగారు డెరైక్టరైతే, నాన్న యాక్టరయ్యారు. నాన్న ఎప్పటికైనా డెరైక్షన్ చేయాలనుకున్నారు కూడా. నాక్కూడా నటన అంటే ఆసక్తి ఉంది కానీ, పరిస్థితుల రీత్యా ఇటు రాలేకపోయాను. అయితే భవిష్యత్తులో కమెడియన్‌గా రావాలని ఉంది.
‘సుత్తి ఆన్‌లైన్ డాట్‌కామ్’ పేరుతో నాన్న, సుత్తివేలుగారి సినిమాల కలెక్షన్ అంతా ఓ చోట నిక్షిప్తం చేసే ప్రయత్నంలో ఉన్నా. అలాగే ‘నాటిక డాట్ కామ్’ ప్రారంభించి నాన్న నాటకాలతో పాటు, రంగస్థల కళాకారుల ప్రొఫైల్స్ అన్నీ సేకరించి పెట్టాలనుకుంటున్నా. ఇన్నేళ్ల తర్వాత కూడా నాన్న పేరు అందరికీ గుర్తుందంటే ప్రేక్షకుల హృదయాల్లో ఆయన హాస్యం అంతలా ముద్ర వేసిందన్నమాట. సీరియస్‌గా కనిపిస్తూనే డైలాగ్ మాడ్యులేషన్‌తో కామెడీ పుట్టించేవారు. అంతటి గొప్ప నటుడికి కొడుకు కావడం నా అదృష్టంగా భావిస్తున్నా.
- పులగం చిన్నారాయణ