నాన్న ఇప్పటికీ గ్రేటే! | fathers day special interview with jandhyala wife Mrs. Annapurna | Sakshi
Sakshi News home page

నాన్న ఇప్పటికీ గ్రేటే!

Published Sat, Jun 14 2014 11:09 PM | Last Updated on Sat, Sep 2 2017 8:48 AM

fathers day special interview with jandhyala wife Mrs. Annapurna

జంధ్యాల పోలికలు వీళ్లిద్దరిలో ఎవరికెక్కువ వచ్చాయంటే సంపదకే. జంధ్యాల ఏ కూర ఇష్టంగా తినేవారో సంపద కూడా అంతే. జంధ్యాల గల గల ఎలా మాట్లాడతారో, ఎలా అల్లరి చేస్తారో... సంపద కూడా డిటో. ‘‘నువ్వేంటే మీ నాన్న తీసిన సినిమాల్లో శ్రీలక్ష్మిలాగా లొడలొడా వాగుతుంటావ్’’ అని జంధ్యాల శ్రీమతి అన్నపూర్ణ ఆటపట్టిస్తుంటారు.
 
హైదరాబాద్‌లోని సహేలీ అపార్ట్‌మెంట్స్ ఫోర్త్ ఫ్లోర్‌లోని బాల్కనీలోంచి చూస్తే నెక్లెస్‌రోడ్ అరవంకీలా మెరుస్తూ కనిపిస్తోంది.
 
‘‘మేం అల్లరి ఎక్కువ చేస్తూ అన్నం తినకపోతే నాన్నగారు మమ్మల్ని నెక్లెస్ రోడ్‌కి తీసుకెళ్లి ఆడించేవారట’’ చెప్పింది సాహితి. గంభీర గోదావరిలా నిశ్శబ్దంగా ఉండే ఆ అమ్మాయిలో నాన్న టాపిక్ రాగానే ఏదో హుషారు.
 
‘‘అవునవును. డాడీ ఆ నెక్లెస్ రోడ్ అంతా తిప్పుతూ మాకు గోరుముద్దలు తినిపించేవారట. స్టోరీ సిట్టింగ్స్‌క్కూడా తీసుకెళ్లేవారట. ఐస్‌క్రీమిస్తే అల్లరి చేయకుండా అలా కూర్చుని ఉండేదాన్నట’’ అంది మురిపెంగా సంపద.
అసలు నాన్నంటే ఎవరికి ఇష్టం ఉండదు.
 
పాపం... వీళ్లిద్దరికీ నాలుగేళ్ల వయసులో జంధ్యాల చనిపోయారు. జంధ్యాల అంటే గ్రేట్ రైటర్... గ్రేట్ డెరైక్టర్. ముఖ్యంగా కామెడీ సినిమాలకు కేరాఫ్ అడ్రస్. పేరుకు పేరు... డబ్బుకు డబ్బు... కానీ పిల్లలే లేరు! చివరివరకూ అదే చింత జంధ్యాలకు. కానీ... లక్ష్మీ, సరస్వతి జంటగా కరుణించారు. కవలలుగా జంధ్యాల ఇంట్లో పుట్టారు. అందుకేనేమో ఒకరి పేరు సాహితి, మరొకరి పేరు సంపద. ఇద్దరికీ ఒకే ఒక్క నిమిషం తేడా. జంధ్యాలకు పెళ్లైన పాతికేళ్ల తర్వాత పుట్టారిద్దరూ. జంధ్యాల మురిసిపోయారు. నాలుగేళ్లు నాలుగు క్షణాల్లా గడిచాయి. అక్కడితో ఆయన టైం అయిపోయి పెకైళ్లిపోయారు. వీళ్లకేమో తెలిసీ తెలియని వయసు. నాన్న అని గుర్తు పెట్టుకునేలోపే గుట్టుగా వెళ్లిపోయారాయన. వీళ్లిద్దరికీ నాన్న గుర్తున్నాడా అంటే ఉన్నాడు, లేడా అంటే లేడు. లీలగా జ్ఞాపకాలు. నాన్న నవ్వడం... ముద్దు పెట్టుకోవడం.. నాన్న గోరు ముద్దలు తినిపించడం. ఎత్తుకు తిప్పడం. అన్నీ మసక మసగ్గా..
 
అమ్మకు చెబితే ఆయనే మీ నాన్న అంటుంది. అందుకే సాహితీ, సంపదలకు నాన్నంటే... అమ్మ పంచిన జ్ఞాపకాలు. ‘‘నాన్న లేని లోటు కనపడకుండా అమ్మ ప్రతి క్షణం శ్రద్ధ తీసుకుంటుంది. నాన్న గురించి ప్రతి క్షణం గుర్తు చేస్తుంది. నాన్న తీసిన సినిమాలు, రాసిన డైలాగులు, నాన్న గురించి నలుగురూ చెప్పే ముచ్చట్లు, ఇప్పటికీ ప్రజ్వలంగా వెలుగుతోన్న ఆయన పేరు ప్రఖ్యాతులు... వీటన్నిటి మధ్యలో నాన్న లేరన్న ఫీలింగ్ తెలీడం లేదు. మా ఇంట్లోనే మాతోనే మా మధ్యనే నాన్న ఉన్నారనిపిస్తోంది...’’ సాహితి నాన్‌స్టాప్‌గా మాట్లాడుతోంది. జనరల్‌గా సాహితి ఎక్కువ మాట్లాడదట. అలాంటిది నాన్న పేరు చెప్పగానే సాహితిలో ఏదో ఉద్వేగం.
 
అందుకు పూర్తి భిన్నంగా ఎప్పుడూ గలగల మాట్లాడే సంపద మాత్రం నాన్న పేరు చెప్పగానే నిశ్శబ్దమైపోయింది. ఏదో చెప్పాలనుకుంటోంది. కానీ చెప్పలేకపోతోంది.
 
సంపదకు స్పోర్ట్స్ అంటే ఇష్టం. బాస్కెట్‌బాల్ బాగా ఆడుతుంది. డాన్స్ అంటే ఇష్టం. కూచిపూడి చేస్తుంది. నాజర్ స్కూల్లో ఎంఇసి చదువుతోంది. ఎంబిఏ చేయాలన్నది లక్ష్యం. సాహితి ఓబుల్‌రెడ్డి స్కూల్లో ఎంపీసీ చదువుతోంది. ఆర్కిటెక్చరంటే ఆసక్తి. ఇంటీరియర్ డెకరేటర్‌గా పేరు తెచ్చుకోవాలనుకుంటోంది.
 
‘‘నాన్నగారు చనిపోయి పదమూడేళ్లవుతోంది. కానీ ఇప్పటికీ అందరికీ గుర్తున్నారాయన. మా స్కూల్లో మేం జంధ్యాల డాటర్స్‌గా ఫేమస్. మా టీచర్స్ మమ్మల్ని ప్రత్యేకంగా చూస్తుంటారు. ఇదంతా నాన్న ఇచ్చిన గిఫ్ట్ మాకు’’ అని సాహితి చెబుతుంటే, ఆమె కళ్లల్లో ఓ మెరుపు.
 
‘‘మేమిద్దరం సినిమాలు బాగా చూస్తాం. ముఖ్యంగా కామెడీ సినిమాలు. ఐ లైక్ కామెడీ. బ్రహ్మానందం అంకుల్ కామెడీ అంటే పడి చస్తాం. నాన్న తీసిన సినిమాల వీడియోలు వీలు కుదిరినప్పుడల్లా చూస్తూనే ఉంటాం. ఎంత బావుంటాయో నాన్న తీసిన సినిమాలు. ఇప్పుడు చూసినా ట్రెండీగా అనిపిస్తాయి. అయినా ఈ రోజుల్లో ఆరోగ్యకరమైన కామెడీ సినిమాలే కరువైపోయాయి. డాడీ ఉంటే ఎంత బావుండేదో అనిపిస్తుంది’’ అంది సంపద.
 
‘‘మీలో ఎవరికైనా జంధ్యాలగారి లాగా రైటింగ్, డెరైక్షన్ వైపు ఆసక్తి ఉందా?’’ అనడిగితే సాహితి, సంపద ఒకరి మొహాలు ఒకరు చూసుకున్నారు. జంధ్యాల సతీమణి అన్నపూర్ణ సమాధానం చెబుతూ, ‘‘వీళ్లల్లో ఒక్కరికైనా అలాంటి ఆసక్తి ఉంటే కచ్చితంగా నేను ఎంకరేజ్ చేసేదాన్ని. సినిమాలంటే ఇద్దరికీ ఆసక్తే. కానీ, సినిమాల్లోకి వెళ్లాలని మాత్రం లేదు. సంపదకు ఫొటోగ్రఫీ అంటే ఇష్టం. హాలీడేస్‌లో ఫొటోగ్రఫీ కోర్స్‌లో జాయిన్ చేద్దామనుకున్నా. కానీ తాను పెద్ద ఆసక్తి చూపలేదు’’ అన్నారు. నాన్న సినిమాల్లో ఏవి ఇష్టం? అనడిగితే ఠకీమని ఆన్సర్లొచ్చేస్తాయి. సాహితికేమో ‘చంటబ్బాయ్, నాలుగు స్తంభాలాట’ అంటే ఇష్టం. సంపద అయితే ‘అహ నా పెళ్లంట, చంటబ్బాయ్’ సినిమాలను లెక్కలేనన్నిసార్లు చూసిందట. సాధారణంగా ఫస్ట్ బర్త్‌డే పిల్లలకు గుర్తుండదు. కానీ వీళ్లకు మాత్రం బాగా గుర్తుంది. కారణం... చుట్టాలంతా ఇప్పటికీ ఆ బర్త్‌డేని గుర్తు చేసి కథలు కథలుగా చెబుతుండడమే. నిజంగా బర్త్‌డేని జంధ్యాల ఓ పెళ్లిలా చేశారట. హైదరాబాద్‌లోని ఖాజా మ్యాన్షన్‌లో పెద్ద ల్యాన్. 800 మంది జనం... బోలెడంత మంది వీఐపీలు. ఏనుగులూ, గుర్రాలూ... పాలకొల్లు నుంచీ బుట్టబొమ్మలు... రకరకాల సంప్రదాయ వంటకాలు... కడియం వాళ్లు చేసిన పూల డెకరేషన్... మేజిక్‌షోస్, కామెడీ స్కిట్స్... పెద్ద పెద్దవాళ్లు కూడా చిన్న చిన్న పిల్లలైపోయి మరీ ఈ బర్త్‌డే ఫంక్షన్ ఎంజాయ్ చేశారట. ఆ వీడియో చూసుకుని సాహితి, సంపద ఇప్పటికీ మురిసిపోతుంటారు. ‘‘మాకు నాన్నంటే ఇష్టం. నాన్న పేరు నిలబెట్టాలని అమ్మ ఎప్పుడూ చెబుతూ ఉంటుంది. మా లక్ష్యం కూడా అదే. నాన్న పేరు నిలబెడతాం’’ అని సాహితి, సంపద కాన్ఫిడెంట్‌గా చెబుతుంటే ఎంత ముచ్చటేసిందో!
 
ఈ ముచ్చట్లన్నీ పై నుంచి జంధ్యాల వ్యూ ఫైండర్‌లో చూస్తూనే ఉంటారు.
     
- పులగం చిన్నారాయణ
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement