జమ జచ్చ..!
ఎదుటివారిలో మచ్చలు వెతకడం మానవ నైజం. మన ‘లేడీస్ టైలర్’ చేసిందదే. కానీ అతను వెతికింది అమ్మాయిల కుడి తొడ మీది పుట్టుమచ్చ. అలాంటమ్మాయిని పెళ్లాడితే మహారాజ యోగం పడుతుందనేది అతడి ప్రగాఢ మూఢ నమ్మకం. అది నిజమో కాదో తెలీదు గానీ, ఈ సినిమాతో మాత్రం రాజేంద్రప్రసాద్‌కి మహారాజ యోగం పట్టింది. వంశీ గొప్ప ‘సిల్వర్ స్క్రీన్ కామెడీ టైలర్’ అని ఈ సినిమానే నిరూపించింది.
‘‘దేశమును ప్రేమించుమన్నా!
మంచి అన్నది పెంచుమన్నా!
ఉట్టి మాటలు కట్టిపెట్టి
పుట్టు మచ్చలు వెతకవోయ్!’’
- వీపు మీద చపక్ మంటూ బెత్తం దెబ్బ.
‘‘ఉప్పు కప్పురంబు ఒక్క పోలికనుండు
చూడ చూడ తొడల జాడ వేరు
మచ్చలందు పుట్టు మచ్చలు వేరయా!
విశ్వదాభిరామ నిన్ను ఇసకేసి తోమా!’’
- మళ్లీ రెండు బెత్తం దెబ్బలు.
కుయ్యో మొర్రో మన్నాడు సుందరం. ఎన్ని మొట్టికాయలు పడ్డా, ఎన్ని బెత్తం దెబ్బలు తగిలినా అతగాడి ధ్యాసంతా జమ జచ్చ మీదే. అసలేమిటీ జమ జచ్చ? అసలెవడీ సుందరం?
సుందరమంటే ఎవడు?
కాకినాడకవతలుండే పల్లెటూళ్లో...పడమటీది సందులోన పాత ఇంటి ముందు ఉన్న లేడీసు టైలరు! సూదీ దారం కూడా లేకుండా చొక్కాలు కుట్టేసే మొనగాడు.
బిందెడు బద్దకం... చెంబుడు చాదస్తం... లేకపోతే దర్జీలకు రాజుగా దర్జాగా ఉండేవాడు! ఉట్టికెగరలేనోడు స్వర్గానికెగరాలనుకునే టైపువాడు. ‘‘జబ జల్లి జబ జల్లి జప జడవే! నీకు సున్నుండలూ కజ్జికాయలూ పెడతా... కుడి భుజం మీదో... కడుపు మీదో పడవే’’ అని బల్లిని బతిమాలుకునే రకం.
‘కుడి తొడ మీద కుంకుడు గింజంత పుట్టుమచ్చుండే మాంచి పెట్టను పడితే నీ జాతక చక్రం నీ మిషను చక్రంలా తిరుగుతుం’దంటాడో కోయదొర. పెట్ట అంటే అమ్మాయి. అది కూడా పద్మినీ జాతి స్త్రీ అంట. పెద్ద పెద్ద కళ్లు... తెల్లటి ఒళ్లు... చూస్తే గుండె గుభిల్లు... అలాంటి స్త్రీ దొరికితే పట్టిందల్లా బంగారమేనట. ముట్టిందల్లా ముత్యమేనట.
‘‘మచ్చ ఉన్న భామ కనులకు కనరావా?
ఎక్కడ ఎక్కడ ఎక్కడ దాక్కున్నావే
లక్కున్న తెచ్చే చుక్కా...
ఎక్కువ తిప్పలు పెట్టక చప్పున చిక్కవే చక్కా!’’
అంటూ ఈ మందలో ఏ సుందరో అంటూ సుందరం కూపీ తీయడం మొదలెట్టాడు.
ఒక్క దెబ్బకు మూడు పిట్టలు పడ్డాయి.
కొబ్బరి లౌజు లాంటి నాగమణి -
పెన్సిలిన్ ఇంజక్షన్‌లాగా చురుక్కుమనిపించే నర్సు దయ -
పరికిణీ వేసుకున్న పాలకోవా లాంటి నీలవేణి -
అబ్బో... ఇక చూడాలి సుందరం తిప్పలు.
వీళ్ల కుడి తొడ మీద మచ్చాన్వేషణ చేయాలి.
బుర్రకు పదునెట్టి... కుట్టుమిషను మీద రకరకాల మేజిక్కులు చేస్తే... ప్చ్... నో జమ జచ్చ.
కానీ ఈ ముగ్గురూ బంకజిగురులా వదలరాయె!
దాంతో సుందరం ‘పుట్టుమచ్చ కరువైన బతుకెందుకూ’ అనుకుంటూ, ఊరు విడిచి జంప్ జిలానీ అయిపోతున్న టైమ్‌లో కనబడింది జమ జచ్చ.
అచ్ఛా... ఇంకేముంది.. మళ్లీ సెకండాఫ్ కథ మొదలు. ఆ మచ్చ సుజాత టీచర్‌ది.
‘‘సుజాతా... మై మర్‌జాతా!
తుమారా చుట్టూ ఫిర్‌జాతా!
అది నా తలరాత!
మై పడా! తుమారీ తొడా! మచ్చ! బహుత్ అచ్చా!
మై బచ్చా! బట్టల సత్యం లుచ్చా’’... అంటూ ఏదో వచ్చీరాని హిందీ భాషలో మాట్టాడి, అచ్చిక బుచ్చికలాడి, సుజాత చేతిలో బెత్తం దెబ్బలు తింటూ... ఎట్టకేలకు లైన్‌లో పడేస్తాడు సుందరం.
తీరా చూస్తే జంపింగ్ జపాంగ్. సుజాతకూ ఏ నా మచ్చా లేదు. లంకెల బిందెల మధ్య తాచుపాముల్లాగా వెంకటరత్నం... ఆడి అసిస్టెంట్ జట్కాబండి శ్రీనివాసు. కథ క్లైమాక్స్ కొచ్చేస్తుంది.
అందరూ చుట్టుముట్టేసి సుందరాన్ని నడిరోడ్డు మీద దోషిలా నిలబెట్టేశారు.
దాంతో సుందరానికి కళ్లకున్న కుట్లు, మనసుకేసిన హుక్కులు విడిపోయి... జ్ఞానోదయమవుతుంది.
మనిషనేవాడు మచ్చ లేకుండా బతకాలి తప్ప, మచ్చ కోసం బతక్కూడదు.
చేతిలో బంగారం లాంటి విద్య పెట్టుకుని శ్రీమంతుడు కావాలని పగటి కలలు కన్నందుకు చింతిస్తాడు.
ఆడదానిలో వెతకాల్సింది మచ్చను కాదు... మంచి మనసును అని తెలుసుకుంటాడు సుందరం.
ఇక నుంచి సుందరం జాతకం మారిపోకపోతే బట్టల సత్తిగాడి మీద ఒట్టు!
జశు జభం!
- పులగం చిన్నారాయణ
పాపులర్ డైలాగ్
‘‘ఇది మామూలు గౌను కాదు. పడుకునేటప్పుడు ఏసుకుంటే ఇంగ్లీషు కలలొస్తాయి. ఎలిజిబెత్ అని ఓ గొప్ప ఇంగ్లీషు సినిమా హీరోయినుంది. ఇలాంటి గౌనే ఏసుకుంటే బోలెడు పేరొచ్చేసింది. దాంతో ఆ గౌను కుట్టిన టైలర్‌నే పెళ్లి చేసేసుకుని, ఎలిజిబెత్ టైలర్ అయిపోయింది.’’
సినిమా పేరు : లేడీస్ టైలర్ (1986)
డెరైక్ట్ చేసింది : వంశీ
సినిమా తీసింది : ‘స్రవంతి’ రవికిశోర్
మాటలు రాసింది : తనికెళ్ల భరణి
అదే ‘జ’ భాషకు ఇన్‌స్పిరేషన్
‘‘మా ఊరు పసలపూడిలో త్యాగరాజు అనే టైలరుండేవాడు. మా ఈడు కుర్రాళ్లంతా అతని షాపు దగ్గర చేరేవాళ్లం. అతని ఇన్‌స్పిరేషన్‌తోనే ‘సుందరం’ పాత్ర అనుకున్నా. అయితే ఆడవాళ్ల గొడవ, మచ్చ... ఇవన్నీ అతనికి సంబంధం లేవు. అదంతా మా కల్పితం. సినిమా అంతా ‘తొడ మీద పుట్టుమచ్చ’కు సంబంధించి ఉంటుంది. అస్తమానూ ఆ మాట వాడితే బాగోదు కాబట్టి, ‘జ’ భాష వాడదామని రచయిత తనికెళ్ల భరణి సలహా ఇచ్చాడు.
ముళ్లపూడి వెంకటరమణ గారు ‘అమ్మాయిలూ అబ్బాయిలూ’ కథలో ‘క’ భాష వాడారు. అదే ఇన్‌స్పిరేషన్. నా సినిమాల్లో బాగా పేలిన పాత్ర అంటే సుందరమే. దీనికి సీక్వెల్ చేయమని నిర్మాతలు అడిగితే ‘ఫ్యాషన్ డిజైనర్... సన్నాఫ్ లేడీస్ టైలర్’ పేరుతో ఓ స్క్రిప్టు చేశా. ఎప్పటికైనా చేస్తానేమో...?!
- వంశీ, దర్శకుడు
కసితో చేసిన సినిమా
‘‘వంశీ డైరక్షన్‌లో ‘మంచు పల్లకీ’ చేశా. సోలో హీరోగా ‘ప్రేమించు పెళ్లాడు’ చేశా. పెద్దగా ఆడలేదు. నేను బెంబేలు పడిపోతుంటే, ‘నెక్ట్స్ సినిమాలో తడాఖా చూపిద్దాం’ అన్నాడు. అలా కసితో చేసిన సినిమా ‘లేడీస్ టైలర్’. నటునిగా నాకిది 66వ సినిమా. డబ్బింగ్ ఆర్టిస్టుగా నాకున్న అనుభవాన్ని వంశీ ఈ సినిమాలో పూర్తిగా వాడుకున్నాడు. నా చేత ఎంత యాక్టింగ్ చేయించాడో, అంత కన్నా ఎక్కువే మైమ్ చేయించాడు’’
- రాజేంద్రప్రసాద్