
ఆ సినిమా ఆడకపోవడంతో చనిపోదామనుకున్నాను.. కానీ తర్వాత వచ్చిన లేడీస్ టైలర్ నన్ను కాపాడింది అంటూ ఎమోషనలయ్యాడు ప్రముఖ నటుడు రాజేంద్రప్రసాద్ (Rajendra Prasad). ఈయన ముఖ్య పాత్రలో నటించిన తాజా చిత్రం షష్టిపూర్తి. ఈ మూవీ టీజర్ లాంచ్ ఈవెంట్‌లో రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ.. నన్ను 48 ఏళ్లుగా ఆదరిస్తున్న అందరికీ కృతజ్ఞతలు. ఇళయరాజా.. తన మ్యూజిక్‌తోనే రజనీకాంత్, కమల్ హాసన్, రాజేంద్రప్రసాద్.. ఇలా అందర్నీ హీరోలుగా చేశారు.
నా ఫోటోకు దండ వేసేవారు
నేను హీరోగా చేసిన తొలి మూవీ ప్రేమించు పెళ్లాడు (Preminchu Pelladu Movie) బాక్సాఫీస్ వద్ద ఆడలేదు. కానీ అందులోని పాటలు మాత్రం బాగా హిట్టయ్యాయి. అంతకుముందు డబ్బింగ్‌లు చెప్పేవాడిని. ఆ డబ్బుతో చెన్నైలో ఇల్లు కట్టాను. తొలిసారి కథానాయకుడిగా నటించిన ప్రేమించి పెళ్లాడు ఆడకపోవడంతో చనిపోదామనుకున్నాను. తర్వాత వచ్చిన లేడీస్ టైలర్ ఆడకపోయుంటే ఈరోజు నేనిక్కడ ఉండేవాడినే కాదు. నా ఫోటోకు దండ వేసి దండం పెట్టేవారు.
కాలు ఫ్రాక్చర్
లాయర్ సుహాసిని అనే సినిమాలో డైరెక్టర్ వంశీ.. కొత్త విలన్‌ను తీసుకొచ్చాడు. మేమిద్దరం ఫైటింగ్ చేస్తుంటే కొట్టుకోండి.. కొట్టుకోండి అన్నాడు. అతడేమో నా కాలు విరగ్గొట్టాడు. కాలికి ఫ్రాక్చర్ అయింది. కట్టు కట్టుకుని ఇంట్లో ఉన్నాను. నేను వస్తేనే మా స్వామి (Ilayaraja) రీరికార్డింగ్ చేస్తానన్నారట.. ఈ పరిస్థితిలో ఎలా రావాలి? రాను అన్నాను. చిత్రయూనిట్ అభ్యర్థించడంతో కట్టుతోనే ప్రసాద్ ల్యాబ్‌కు వచ్చాను. ఇళయరాజా థియేటర్ బయట నిలబడి ఉన్నాడు.
ఇళయరాజా పాదాలు నమస్కరిస్తూ.
ఆయన నన్ను చూసి.. ఏమైందిరా? అన్నాడు. వీడే ఇరగ్గొట్టాడు అని వంశీని చూపించాను. ఏరా.. నువ్వు అంత బాగా యాక్టింగ్ చేస్తావా? నేనిప్పుడు రీరికార్డింగ్ చేస్తాను. నీ యాక్టింగా? నా రీరికార్డింగా? తేల్చుకుందాం అన్నారు. మూడు రోజులపాటు రీరికార్డింగ్ చేశారు. ఆ సినిమాతో నా జర్నీ ఇక్కడిదాకా వచ్చింది అంటూ రాజేంద్రప్రసాద్.. చివర్లో ఇళయరాజా పాదాలు నమస్కరించాడు.