ladies tailor
-
అయ్యారే... లేడీస్ టైలర్..ఈ డిజైన్స్‌కి మగువలు ఫిదా!
ఈ బుజ్జిగాణ్ణి మన రాజేంద్ర ప్రసాద్‌ని పిలిచినట్టు ‘లేడిస్ టైలర్’ అనంటే ఊరుకోడు. ‘ఐ యామ్ ఏ ఫ్యాషన్ డిజైనర్’ అంటాడు. ఎనిమిదేళ్ల వయసులో పిల్లలు ఆటపాటల్లో మునిగిపోయి ఉంటారు కానీ అమెరికాకు చెందిన మాక్స్ అలెగ్జాండర్ మాత్రం కొత్త బట్టలు, సరికొత్త ఫ్యాషన్లు, నూతన ఆలోచనలు అంటూ హడావిడిగా ఉంటాడు. అతి చిన్న ఫ్యాషన్ డిజైనర్‌గా పేరు తెచ్చుకున్న మాక్స్ రూపొందించే దుస్తులకు ప్రపంచవ్యాప్తంగా అభిమానులున్నారు. కీలకమైన వేడుకల్లో అతను తయారు చేసే బట్టలే వేసుకుంటామని కొందరు సెలబ్రెటీలు హటం చేస్తారు. అనగా మంకుపట్టు పడతారు.మాక్స్‌కి నాలుగేళ్ల వయసున్నప్పుడు అతని తల్లి షెర్రీ మాడిసన్స్ అతనికో బొమ్మ ఇచ్చింది. దాని కోసం కస్టమ్ కోచర్ గౌన్ కుట్టాడు మాక్స్. అప్పటి నుండి ఇప్పటిదాకా 100 కంటే ఎక్కువ కస్టమ్ కోచర్ గౌన్లు కుట్టాడు. అతని ఆస్తకిని గమనించి తల్లిదండ్రులు బాగా ప్రోత్సహించారు. తాను తయారుచేసిన దుస్తులతో అనేక రన్‌వే షోలను నిర్వహించి, ప్రపంచంలో అతి చిన్న వయస్కుడైన రన్ వే ఫ్యాషన్ డిజైనర్‌గా మాక్స్ గిన్నిస్ వరల్డ్ రికార్డ్ సాధించాడు. అతను తయారు చేసిన దుస్తుల్ని అంతర్జాతీయ వేదికల మీద ప్రదర్శించారు. బట్టలు కుట్టేసి ఇచ్చేయడం మాత్రమే మాక్స్ పని కాదు. అవి వేసుకునేవారు ఏం కోరుతున్నారు, వారి ఇష్టాయిష్టాలు ఏమిటి, ఎలాంటి దుస్తులు సౌకర్యంగా అనిపిస్తాయి, ఎలాంటి రంగులు వారి ఒంటికి నప్పుతాయి వంటి అంశాలన్నీ ఆలోచించి డిజైన్ చేస్తాడు. ఈ కారణంగానే అతను రూ΄÷ందించే బట్టలకు డిమాండ్ పెరుగుతోంది. దీంతోపాటు పనికిరాని వస్తువులతో కూడా కొత్త రకమైన బట్టలు తయారు చేసి అందర్నీ ఆశ్చర్యపరుస్తుంటాడు. ఇన్‌స్ట్రాగామ్‌లో మాక్స్‌కి మూడు మిలియన్లకు పైగా ఫాలోవర్లు ఉన్నారు. మరిన్ని కొత్త ఫ్యాషన్లు రూపొందించాలని, అందుకోసం మరింత సాధన చేయాలని అతను అంటున్నాడు. -
సూపర్ హిట్ కాంబినేషన్.. 37 ఏళ్ల తర్వాత మళ్లీ!
1986లో వచ్చిన చిత్రం లేడీస్ టైలర్ సినిమా మీకు గుర్తుందా? అప్పట్లో ఆ మూవీ ఓ సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఈ చిత్రంలో రాజేంద్రప్రసాద్, అర్చన జోడీగా నటించారు. ఈ సినిమాలో జంటగా నటించిన రాజేంద్రప్రసాద్, అర్చనల కెమిస్ట్రీని సినీ ప్రేక్షకులు అంత సులువుగా మరచిపోలేరు. అయితే ఇప్పుడేంటీ అనుకుంటున్నారా? అయితే మళ్లీ అదే జోడీ తెరపై సందడి చేయనుంది. దాదాపు 37 ఏళ్ల తర్వాత మరోసారి స్క్రీన్ పంచుకోబోతోంది ఈ జంట. రాజేంద్ర ప్రసాద్, అర్చన ప్రధాన పాత్రల్లో తాజాగా తెరకెక్కుతోన్న చిత్రం ‘షష్ఠి పూర్తి’. రూపేష్ కుమార్ చౌదరి, ఆకాంక్షా సింగ్ జంటగా పవన్ ప్రభ దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందుతోంది. హీరోగా నటించడంతో పాటు రూపేష్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తాజాాగ చెన్నైలోని సంగీతదర్శకుడు ఇళయరాజా స్టూడియోస్‌లో ఈ చిత్రం పూజా కార్యక్రమాలతో ఆరంభమైంది. తొలి సీన్‌కి ఇళయరాజా కెమెరా స్విచాన్ చేయగా.. నిర్మాత ఆర్బి చౌదరి క్లాప్ ఇచ్చారు. రూపేష్ కుమార్ చౌదరి మాట్లాడుతూ..'లేడీస్ టైలర్’ తర్వాత రాజేంద్రప్రసాద్, ఇళయరాజా కాంబినేషన్లో ‘ఆస్తులు అంతస్తులు, చెట్టు కింద ప్లీడర్, ఏప్రిల్ 1 విడుదల లాంటి మ్యూజికల్ హిట్స్ వచ్చాయి. చాలా ఏళ్ల తర్వాత ఈ లెజెండ్స్ కాంబినేషన్ రిపీట్ కాబోతోంది. అలాగే ‘లేడీస్ టైలర్’ తర్వాత రాజేంద్ర ప్రసాద్, అర్చన నటిస్తున్న చిత్రమిదే. ఈ సినిమాలో మొత్తం నాలుగు పాటలు ఉన్నాయి. ఈ మూవీ న్యూ ఏజ్ ఫ్యామిలీ డ్రామా. జూలైలో సినిమాను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం.' అని అన్నారు. #LadiesTailor duo #RajendraPrasad & #Archana reunited after 37 years for the film #Shastipoorthi "Shoot starts this month and release in August “ says @ActorRupesh An #Ilaiyaraaja musical#RupeshKumarChaudhary @aakanksha_s30 #PavanPrabha #ThotaTharrani @BrindhaGopal1… pic.twitter.com/nCNwXPp0sz — Phani Kandukuri (@phanikandukuri1) April 1, 2023 -
బరిలోకి భల్లాలదేవుడి తమ్ముడు
టాలీవుడ్ ఇండస్ట్రీలో వారసుల జోరు బాగా కనిపిస్తోంది. మెగా ఫ్యామిలీ నుంచి ఏకంగా అరడజనుకు పైగా హీరోలు సందడి చేస్తుంటే, నందమూరి, అక్కినేని ఫ్యామిలీల నుంచి కూడా వారసులు క్యూ కడుతున్నారు. అదే బాటలో ఇప్పుడు మరో సినీ కుటుంబం నుంచి యంగ్ హీరో ఎంట్రీకి రెడీ అవుతున్నాడు. నిర్మాతగా తెలుగు సినీ రంగాన్ని శాసించిన దగ్గుబాటి రామానాయుడు కుటుంబం నుంచి మరో హీరో తెరంగేట్రానికి రెడీ అవుతున్నాడు. ఇప్పటికే సీనియర్ హీరో వెంకటేష్ తో పాటు, యంగ్ హీరో రానాలు టాలీవుడ్ స్క్రీన్ పై సందడి చేస్తుండగా ఇప్పుడు రానా తమ్ముడు అభిరామ్ హీరోగా ఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధమవుతున్నాడు. గతంలో లేడీస్ టైలర్ సీక్వల్ తో అభిరామ్ హీరోగా ఎంట్రీ ఇస్తాడన్న ప్రచారం జరిగినా ఆ సినిమా సుమంత్ అశ్విన్ చేశాడు. తాజాగా మరోసారి అభిరామ్ ఎంట్రీపై వార్తలు వినిపిస్తున్నాయి. భాను శంకర్ దర్శకత్వంలో అభిరామ్ హీరోగా పరిచయం కాబోతున్నాడట. ఈ సినిమాను సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్ లో నిర్మించే అవకాశం ఉంది. -
అనంతలో దారుణం.. నెట్లో బాలిక చిత్రాలు
-
అనంతలో దారుణం.. నెట్లో బాలిక చిత్రాలు
అనంతపురం జిల్లా కదిరిలో దారుణం జరిగింది. కదిరి మండలం హనుమంతరాయపల్లికి చెందిన ఓ బాలిక నగ్నదృశ్యాలను చిత్రీకరించిన కొందరు వ్యక్తులు.. వాటిని ఇంటర్నెట్లో పెట్టారు. ఆ బాలిక తొమ్మిదో తరగతి చదువుతోంది. దుస్తులు కుట్టించుకోడానికి లేడీస్ టైలర్ కవిత వద్దకు వచ్చినప్పుడు ఆమె సమీప బంధువు, గార్లపెంట సొసైటీ బ్యాంకు ఉద్యోగి అయిన నాగరాజు రహస్యంగా తన మొబైల్లో ఆమె నగ్నదృశ్యాలను చిత్రీకరించాడు. తర్వాతి నుంచి కొంత కాలంగా ఆ బాలికను నాగరాజు లైంగికంగా వేధిస్తున్నాడని పోలీసులు తెలిపారు. ఆమె తనకు ఎంతకీ లొంగకపోవడంతో ఆ నగ్నదృశ్యాలను నాగరాజు, అతడి స్నేహితుడు నగేష్ కలిసి ఇంటర్నెట్లో పెట్టారు. బాలిక బంధువులు కొంతమంది వాటిని చూసి ఆమె తల్లిదండ్రులకు సమాచారం అందించారు. దాంతో ఆమె తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. వెంటనే పోలీసులు బాలిక దృశ్యాలను నెట్లోంచి తొలగించారు. నిందితులు కవిత, నాగరాజు, నగేష్‌ల కోసం పోలీసులు గాలిస్తున్నారు. నిందితులంతా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కావడంతో పోలీసులపై ఒత్తిడి వస్తున్నట్లు తెలిసింది. కవిత, నాగరాజు కూడా టీడీపీలో క్రియాశీలక సభ్యులుగా ఉన్నారు. దాంతో కేసును తారుమారు చేసేందుకు టీడీపీ నాయకులు కుట్ర పన్నుతున్నారు. అయితే, ఇప్పటికే తాము పోస్కో, ఐటీ చట్టాల కింద కేసు నమోదు చేశామని, పరారీలో ఉన్న నిందితుల కోసం గాలిస్తున్నామని, ఎట్టి పరిస్థితుల్లోనూ వాళ్లను వదిలిపెట్టే ప్రసక్తి లేదని పోలీసులు చెబుతున్నారు. -
పదహారణాల సినిమా
రూపాయికి ఎన్ని అణాలని ఎవరినైనా అడిగితే.. ‘వాట్ ఈజ్ అణా’ అని అడిగే అవకాశాలే ఎక్కువ. పదహారణాల అచ్చ తెలుగు అమ్మాయి ఇప్పుడు తెలుగు సినిమాలో ఒక్క అణా కూడా కనబడటంలేదు. ఉగాది రోజు పదహారణాల దర్శకుడితో కూర్చుంటే బాగుండేమో అనిపించి... పెద్ద వంశీతో ‘సరదాగా కాసేపు’. ఉగాది పండగ సందర్భంగా ‘తెలుగు’ గురించి మాట్లాడాలనిపిస్తోంది. ఇప్పుడు తెలుగును తెలుగులా మాట్లాడేవాళ్లు తక్కువైపోయారండీ... అవును. తెలుగువారికి తెలుగు భాష మీద అభిమానం తగ్గిపోతోందన్న విమర్శలు ఇటీవల ఎక్కువైపోయాయి. మన భాషను మన భాషలా మాట్లాడుకుంటే బాగుంటుంది. స్వచ్ఛమైన తెలుగు వినసొంపుగా ఉంటుంది. కానీ, ఇప్పుడలా మాట్లాడేవాళ్లు తక్కువైపోయారు. మీ సినిమాల్లో నిండైన చీరకట్టులో కనిపించే పదహారణాల తెలుగమ్మాయిలు ఇప్పుడు వెతికినా కనిపించకపోవడం మీకెలా అనిపిస్తుంటుంది? మార్పుకి నేను వ్యతిరేకిని కాదు. కాకపోతే ఆ మార్పు మన భారతీయ సంప్రదాయాన్ని అధిగమించేలా ఉండకూడదంటున్నా. మన సంప్రదాయం చాలా గొప్పది. మీరన్నట్లు చీరకట్టులో కనిపించే అమ్మాయిలు తగ్గిపోయారు. ఇప్పుడో విషయం గుర్తొస్తోంది. ‘ఫ్యాషన్ డిజైనర్’ (‘లేడీస్ టైలర్’కి సీక్వెల్) షూటింగ్ మొత్తం కోనసీమ పరిసర ప్రాంతాల్లోనే చేశాం. అక్కడ దాదాపు చుడీదార్లు, వేరే మోడ్రన్ డ్రెస్సులు వేసుకున్న అమ్మాయిలే కనిపించారు. ఒకప్పటిలా లంగా, ఓణీలు కనిపించలేదు. ఆడవాళ్ల డ్రెస్సింగ్ విధానం మారిపోయింది. ఉదయాన్నే నైటీల్లో ముగ్గులు వేస్తూ, కనిపిస్తున్నారు. అది తప్పనడంలేదు కానీ, మనదైన కట్టూబొట్టూ మిస్సవుతున్నాయన్న బాధ. సంక్రాంతి పండగ అప్పుడు నేను గోదావరిలోనే ఉన్నా. అచ్చ తెలుగు పండగ అప్పుడూ లంగా, ఓణీలు, చీరకట్టూ కనిపించలేదు. అప్పుడు చాలా బాధ అనిపించింది. మీ హీరోయిన్లు కంటి నిండా కాటుకతో కళకళలాడేవాళ్లు. ఇప్పుడు కాటుక దాదాపు కనుమరుగైపోయింది? కాటుక కళ్లు ఎంత బాగుంటాయండి. అసలు అమ్మాయిలు కళ్ళకు కాటుక పెట్టుకుంటేనే అందంగా ఉంటారు. ఇప్పటి హీరోయిన్లు గురించి చెప్పలేం కానీ, అప్పట్లో సావిత్రిగారు, జమునగారు.. ఇలా హీరోయిన్లందరూ కాటుక కళ్లతో ఎంత అందంగా కనిపించేవారు. వాలుజడ ఎంత బాగుండేది. బాపూగారు గీసిన బొమ్మల్లో చెంపకు చారెడేసి కళ్లు, వాలుజడ... చాలా బాగుంటాయి. అందుకే నాకు ఆయన గీసిన బొమ్మలంటే ఇష్టం. ఆయన ఎక్కువ బొమ్మలు గీసింది నాకే. ఇప్పడంతా కురచ జుట్టు కల్చరే కదా.. అవును. వాలుజడలు కనిపించడంలేదు. గొప్ప సంస్కృతి, సంప్రదాయాలు ఉన్నాయి కనుకనే ప్రపంచమంతా భారతీయులు కీర్తించబడుతున్నారు. ఈ ఆధునిక జీవన సరళి ఎందుకో నాకు అంతగా నచ్చడం లేదు. ఆ మధ్య గుడికి వెళ్లాను. అక్కడే పూజారి ఇల్లు ఉంది. ఆయన కూతురు నైటీలో కనిపించింది. దేవుడి గుడి దగ్గర కూడా మన సంప్రదాయం కనిపించకపోవడం విచారం. చీరకట్టు, కాటుక కళ్లు, రూపాయి కాసంత బొట్టు, తలలో పువ్వులు.. ఈ లుక్‌లో హీరోయిన్లు బాగుంటారని మీరెలా గెస్ చేసేవారు? ఏదైనా చూసే కళ్లను బట్టే ఉంటుంది. హీరోయిన్ని సెలక్ట్ చేసేటప్పుడే వాళ్లను ఎలా చూపిస్తే బాగుంటుందో నిర్ణయించుకుంటా. నేను అనుకున్న గెటప్‌తో ఫొటోసెషన్ చేస్తాను. మీకు తెలిసో తెలియదో కానీ మీ హీరోయిన్లంటే మగవాళ్లకే కాదు... ఆడవాళ్లకి కూడా బోల్డంత ఇష్టం... (నవ్వుతూ). ఇక్కడ చిన్న ఉదాహరణ చెబుతాను. ఒకమ్మాయి తన పెళ్లి చూపులకు అచ్చంగా నా సినిమా హీరోయిన్లా పెద్ద బొట్టు, చక్కని చీర కట్టు, పువ్వులు, కాటుక పెట్టుకుని రెడీ అయిందట. తొలి చూపులోనే ఆమె ఆ కుర్రాడికి నచ్చేసిందట. ఆ సంబంధం ఖాయం అయింది. ఆమె పెళ్లి హ్యాపీగా జరిగిపోయింది. ఆమె రైటర్. ఇటీవల నన్ను కలసినప్పుడు నాతో ఈ విషయాన్ని చెప్పారు. సంతోషంగా నవ్వుకున్నాను. మీ ఊరు పసలపూడి ఉగాది పచ్చడి ప్రత్యేకత ఏంటి? ప్రత్యేకం అంటూ ఏదీ లేదు. అందరూ చేసే ఉగాది పచ్చడిలానే ఉంటుంది. మీ అమ్మగారి ఉగాది పచ్చడి... గుర్తు లేదు. మా అమ్మగారు ఎప్పుడో పోయారు. చిన్నతనంలోనే ఇంట్లోంచి వచ్చేశాను. అందుకని బాల్యం పెద్దగా తెలియదు. పోనీ ఇప్పటి ఉగాది పచ్చడి గురించి? ఇప్పుడేం ఉందండి. ఫ్రిజ్ పచ్చడి తింటున్నాం (నవ్వుతూ). ఎప్పుడో ఉదయాన్నే పచ్చడి చేసేస్తారు. ఆ సమయానికి ఇంట్లో ఉండం కదా. పనులన్నీ చూసుకుని ఇంటికెళ్లాక, ఫ్రిజ్‌లో పెట్టి ఉంచిన పచ్చడి తింటాం. సో.. మార్పు అనేది మన ఇంటిలోనూ ఉంది. అయితే ఏ మార్పైనా కొంతవరకే ఓకే. మరీ మన మూలాలను మరచిపోయేంతలా మారిపోవడం సరికాదు. మీరు మరచిపోలేని ఉగాది? అలాంటి ఉగాది ఏదీ లేదు. మామూలుగా నేను తీసే సినిమాలకు ముందు డివైడ్, ఆ తర్వాత హిట్ టాక్ వస్తుంది. కానీ, ‘లేడీస్ టైలర్’కి మాత్రం అలా జరగలేదు. విడుదలైన మొదటి రోజే హిట్ టాక్ వచ్చింది. నేను ముందు నమ్మలేదు. కానీ, నిర్మాత ‘స్రవంతి’ రవికిశోర్ ‘నిజం’ అని చెప్పిన తర్వాత నమ్మాను. ఆ రోజు నాకు నిజమైన ఉగాది. అలాగే, నా సినిమా హిట్ టాక్ తెచ్చుకున్న రోజుని నేను ఉగాదిలానే భావిస్తా. చివరగా... మీ సినిమాలో గోదావరి తప్పనిసరి. ఆ లొకేషన్ ఎప్పుడూ మీకు మొహం మొత్తలేదా? అస్సలు లేదండి. చిన్నప్పటి నుంచి గోదావరితో నాకు అనుబంధం ఉంది. గోదావరి పరిసర ప్రాంతాల్లో ఎవరైనా ఒకట్రెండు పాటలు తీస్తారేమో. నేను ‘ఫ్యాషన్ డిజైనర్’ సినిమాలోని అన్ని పాటలూ అక్కడే తీశా. చిన్నప్పుడు తిన్న జీడీలు, మా ఏరియా పెసరట్టు, గోదావరి మీద మమకారం ఎప్పటికీ పోదు. 31 ఏళ్ల క్రితం ‘లేడీస్ టైలర్’ తీసినప్పుడే సీక్వెల్ (ప్రస్తుతం చేస్తున్న ‘ఫ్యాషన్ డిజైనర్’) తీయాలనుకున్నారా? లేదు. ఓ స్టార్ హీరోతో సీక్వెల్ తీయాలని ఓ నిర్మాత ప్రయత్నించారు. అది కుదరలేదు. ఇంకొకరితో అనుకున్నారు. అదీ వర్కవుట్ కాలేదు. ‘మధుర’ శ్రీధర్‌గారు టేకప్ చేసి.. తనికెళ్ల భరణిగారితో కథ రాయించారు. ఆయన పారిస్‌లో టైలర్ అని ఓ కథ రాశారు. ఇంకొకరు హైద్రాబాద్ బ్యాక్‌డ్రాప్‌లో రాశారు. ‘మధుర’ శ్రీధర్ నన్ను సంప్రదించారు. మొదటి భాగంలో వెంకటరత్నం అనే విలన్ క్యారెక్టర్ ఉంది కదండీ.. అలా కావాలన్నారు. ముగ్గురు హీరోయిన్లు కావాలన్నారు. రెండు నెలలు కూర్చొని నవలలా రాశాను. కథ విని ఇంప్రెస్ అయ్యారు. అలా ఈ సీక్వెల్ మొదలైంది. ఇంతకీ ఫ్యాషన్ డిజైనర్ ఏం చేస్తుంటాడు? తండ్రిలానే అరుగు మీద టైలరింగ్ చేస్తుంటాడు. సిటీకి వెళ్లి షాప్ పెట్టాలన్నది అతని గోల్. – డి.జి.భవాని -
షూటింగ్ పూర్తి చేసుకున్న ఫ్యాషన్ డిజైనర్
డిఫరెంట్ టేకింగ్‌తో ఆకట్టుకునే సీనియర్ డైరెక్టర్ వంశీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న కొత్త సినిమా ఫ్యాషన్ డిజైనర్. 80లలో తన దర్శకత్వంలో తెరకెక్కిన సూపర్ హిట్ లేడీస్ టైలర్‌కు సీక్వల్గా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. అందుకే ఈ సినిమాకు సన్నాఫ్ లేడీస్ టైలర్ అనే ట్యాగ్ లైన్‌ను జోడించారు. కొంత కాలంగా తన రేంజ్ హిట్ ఇవ్వటంలో ఫెయిల్ అవుతున్న వంశీ, ఫ్యాషన్ డిజైనర్‌తో తిరిగి ఫాంలోకి రావాలని భావిస్తున్నాడు. అంతకు ముందు ఆతరువాత, కేరింత లాంటి సక్సెస్ ఫుల్ చిత్రాల్లో హీరోగా నటించిన సుమంత్ అశ్విన్ హీరోగా నటిస్తున్న ఈసినిమాను మధుర శ్రీధర్ నిర్మిస్తున్నాడు. సుమంత్ అశ్విన్ సరసన్ అనీషా ఆంబ్రోస్‌తో పాటు మరికొంత మంది ముద్దుగుమ్మలు ఆడిపాడనున్నారు. ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ సినిమా రిలీజ్‌పై త్వరలోనే క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. -
ఫ్యాషన్ డిజైనర్ కోసం ముగ్గురు భామలు
సీనియర్ దర్శకుడు వంశీ రూపొందించిన సూపర్ హిట్ సినిమాల్లో లేడీస్ టైలర్ ఒకటి. రాజేంద్ర ప్రసాద్ హీరోగా తెరకెక్కిన ఈ సినిమా అడల్ట్ కామెడీకి దగ్గరగా ఉన్నా.. అప్పట్లో ఘనవిజయం సాధించింది. దీంతో చాలా కాలంగా ఈ సినిమాకు సీక్వల్ ను రూపొందించే ప్లాన్ లో ఉన్నాడు దర్శకుడు వంశీ. గతంలో ఈ రీమేక్ లో హీరోలుగా అల్లరి నరేష్, రవితేజ లాంటి స్టార్ హీరోలు నటిస్తారన్న టాక్ వినిపించినా.. అవేవి సెట్స్ మీదకు రాలేదు. తాజాగా ఈ సినిమాను సుమంత్ అశ్విన్ హీరోగా తెరకెక్కిస్తున్నట్టుగా ప్రకటించారు. ఇప్పటికే కథా కథనాలు రెడీ అయిన ఈ సినిమాకు ప్రస్తుతం నటీనటుల ఎంపిక జరుగుతుంది. రొమాంటిక్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమా కోసం ఇప్పటికే ముగ్గురు ముద్దుగుమ్మలు ఫైనల్ చేశారు. మనమంతా ఫేం అనీషా ఆంబ్రోస్ తో పాటు, మాసన హివవర్ష, మనాలీ రాథోడ్ లు హీరోయిన్లు గా నటిస్తున్నారు. త్వరలోనే ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్లనుంది. -
లేడీస్ టైలర్ కొడుకు ఫ్యాషన్ డిజైనర్
వాలు జడ, రూపాయి కాసంత బొట్టు, కళ్లకు కాటుక, కాళ్లకు పట్టీలు, ఒంటి నిండా చీర... దర్శకుడు వంశీ చిత్రాల్లో హీరోయిన్ ఇలా నిండుగా, చూడ్డానికి రెండు కళ్లూ చాలనంత అందంగా ఉంటుంది. ఆయన సినిమా మన ఇంట్లోనో.. మన పక్కింట్లోనో జరుగుతున్న కథలా ఉంటుంది. అంత సహజంగా ఉంటుంది కాబట్టే, వంశీ సినిమాకి బోల్డంత మంది అభిమానులు ఉన్నారు. ముఖ్యంగా వంశీ దర్శకత్వం వహించిన చిత్రాల్లో ఎక్కువమంది అభిమానులను సంపాదించుకున్న వాటిలో ‘లేడీస్ టైలర్’ ఒకటి. ఈ చిత్రం విడుదలై 30 ఏళ్లవుతోంది. ఇప్పుడు దీనికి సీక్వెల్‌గా వంశీ ‘ఫ్యాషన్ డిజైనర్ సన్నాఫ్ లేడీస్ టైలర్’ తెరకెక్కించనున్నారు. ఇందులో టైటిల్ రోల్ చేసే అవకాశం సుమంత్ అశ్విన్‌కి దక్కింది. వంశీ వంటి డెరైక్టర్‌తో సినిమా అంటే సుమంత్ అశ్విన్‌కి గోల్డెన్ చాన్స్ లాంటిదే. మధుర ఎంటర్టైన్ మెంట్స్‌పై ఈ చిత్రాన్ని మధుర శ్రీధర్ నిర్మించను న్నారు. ముగ్గురు కథా నాయికలు ఉంటారట. నవంబర్‌లో చిత్రాన్ని ఆరంభిం చాలనుకుంటు న్నారు. -
లేడీస్ టైలర్‌గా స్టార్ వారసుడు.?
టాలీవుడ్లో స్టార్ వారసుల తెరంగేట్రాలు కొనసాగుతూనే ఉన్నాయి. ఇప్పటికే పదుల సంఖ్యలో వారసులు వెండితెర మీద సందడి చేస్తుండగా.. ఇప్పుడు ఈ లిస్ట్ లోకి మరో యంగ్ హీరో చేరబోతున్నాడు. డి.రామానాయుడి మనవడు, నిర్మాత సురేష్ బాబు తనయుడు, హీరో వెంకటేష్ అన్న కొడుకు, యంగ్ హీరో రానా తమ్ముడు అయిన అభిరామ్ త్వరలోనే తెరంగేట్రానికి రెడీ అవుతున్నాడు. ఇప్పటికే నటనలో శిక్షణ తీసుకుంటున్న అభిరామ్, తొలి సినిమాపై ఇంట్రస్టింగ్ వార్త టాలీవుడ్ సర్కిల్స్‌లో వినిపిస్తోంది. సీనియర్ దర్శకుడు వంశీ ముప్పయ్యేళ్ల క్రితం, రాజేంద్ర ప్రసాద్ హీరోగా తెరకెక్కించిన లేడీస్ టైలర్ సినిమాకు సీక్వల్‌ను రూపొందించే ఆలోచనలో ఉన్నాడు. ఈ సినిమాతో దగ్గుబాటి అభిరామ్‌ను తెరకు పరిచయం చేయాలని భావిస్తున్నారట. త్వరలోనే ఈ సినిమాకు సంబందించిన అఫీషియల్ ఎనౌన్స్మెంట్ కూడా రానుందన్న టాక్ వినిపిస్తోంది. -
కలీ... కటింగ్
లేడీస్ టైలర్ అమ్మాయిలు బుట్టబొమ్మల్లా కనిపించడానికి అమితంగా ఇష్టపడే డ్రెస్ జాబితాల్లో కలీ ఎప్పుడో చేరిపోయింది. కరెక్ట్ ఫిటింగ్, కంఫర్ట్, కలర్ఫుల్గా కనిపించే ఈ డ్రెస్‌లను అతివలు ముచ్చటపడి మరీ ఎంచుకుంటుంటారు. కలీ కుర్తీలోనే షార్ట్-లాంగ్ లెంగ్త్వి ఉంటాయి. కలీని ఎలా డిజైన్ చేసుకోవాలో తెలుసుకుందాం. కలీ అందం అంతా ప్యానెల్స్‌లో ఉంటుంది. ఎన్ని ఎక్కువ ప్యానెల్స్ వస్తే కలీ అంత విప్పార్చుకున్నట్టు ఉంటుంది. ఇక్కడ ఇస్తున్న కలీ కటింగ్‌లో ప్యానెల్స్ సంఖ్య 16 తీసుకున్నాం. చార్ట్ లేదా ఎంచుకున్న క్లాత్ మీద డ్రాఫ్టింగ్ తీసుకొని, తర్వాత కట్ చేయాలి. క్లాత్ ఇంచులలో... 1 మీటర్ క్లాత్ కొలత తీసుకుంటే = 40 ఇంచులు 4 మీటర్ల క్లాత్ అయితే 40గీ4 = 160 ఇంచులు కింద ఇచ్చిన చార్ట్ డ్రాప్ట్‌ను పరిశీలించండి.... ప్యానెల్స్ సంఖ్య - 16 (ప్రతీ ప్యానెల్ 1/2 ఇంచు కుట్టు భాగాన్ని వదిలి కట్ చేసుకోవాలి) AB = ఫుల్ లెంగ్త్ (మొత్తం పొడవు) AE = ఆర్మ్ హోల్ /2 - 1/2 అంగుళం కుట్టు (చంకభాగం రెండువైపులా) AF= వెయిస్ట్ లెంగ్త్ (నడుము కొలత) AG = హిప్ లెంగ్త్ (పిరుదుల భాగం) AA1=EE1 = (ఛాతీ చుట్టుకొలత / ప్యానెల్స్) /2 (రెండువైపులా) FF1 = (వెయిస్ట్ రౌండ్ (నడుము చుట్టుకొలత / ప్యానెల్స్ సంఖ్య) /2 (రెండువైపులా) GG1 = (హిప్ రౌండ్ (పిరుదుల భాగం)/ ప్యానెల్స్ సంఖ్య ) / 2 వైపులా BB= వాల్యూమ్ ఇంచెస్ (కలీ కింది భాగం అంగుళాలలో)/ ప్యానెల్స్ సంఖ్య)/ 2 వైపులా BB1 = (160 ఇంచులను 16 ప్యానెల్స్‌గా విభజించుకోవాలి)2 వైపులకు = ఒక్కో ప్యానెల్‌కు 5 ఇంచులు తీసుకోవాలి. ఆ1 ఆ2 = 1/2 ఇంచు కర్వ్ షేప్ గీసి, వంపు వచ్చేలా కట్ చేయాలి.నోట్: ఇలా డిజైన్ చేసుకున్న కలీ అంచు భాగం మొత్తం 360 డిగ్రీల కోణం ఉండాలి. కలీ కుట్టు... ప్యానెల్స్ అన్నీ జతచేసి కుట్టాలి. తర్వాత కుర్తీ ఛాతీ భాగాన్ని ఛాతీ కొలతల ప్రకారం కట్ చేసి కుట్టాలి. అలాగే నెక్, స్లీవ్స్ కట్ చేసుకొని కుట్టాలి. వివిధ పరిమాణాలఆర్తి ఫ్యాషన్ డిజైనర్ ఇన్స్టిట్యూటో డిజైన్ ఇన్నోవేషన్ (ఐడిఐ) హిమాయత్‌నగర్, హైదరాబాద్ . www.idi.co.in -
బాదం కట్!
లేడీస్ టైలర్ చీర కట్టు చూస్తే ముందు వైపే కాదు, వెనుక కూడా గొప్పగా ఉండాలి. ఈ మార్పు ‘కట్టు’లో కాకుండా ‘కట్’లో చూపించాలనేదే డిజైనర్ల తాపత్రయం. అందుకే, బ్లౌజ్ కట్స్‌లో ‘బ్యాక్’ డిజైన్స్ వందల సంఖ్యలో వెలిగిపోతున్నాయి. వాటిలో ముందు వరుసలో ఉన్న నెక్ ప్యాటర్న్ ‘బాదం కట్!’ ఈ బ్యాక్ నెక్ లైన్ డిజైన్ బాదం గింజ ఆకృతిలో ఉంటుంది కనుకనే దీనికి ‘బాదం కట్’ అనే పేరు వచ్చింది. బోట్‌నెక్ ముందు-వెనుక నెక్లైన్ మెడకు దగ్గరగా ఉంటుంది. అదే బాదం నెక్కి అయితే ముందు భాగంలో రౌండ్ కట్ వస్తుంది. వెనుక వైపు మెడ దగ్గర ఓపెన్ ఉంటుంది. మెడ మీదుగా రెండు విడి భాగాలను కలపడానికి అదే రంగు క్లాత్‌తో తాడులా కుట్టి, చివరలో హ్యాంగింగ్స్‌ను వేలాడదీస్తారు. బ్లౌజ్ ధరించినప్పుడు ఈ రెండు తాళ్లనూ కలిపి ముడివేస్తారు. బ్యాక్ నెక్ ఓపెన్ కట్ చతుర స్రాకారం, త్రికోణాకారం, రౌండ్... ఇలా వందల రకాల డిజైన్స్‌ని సృష్టించారు డిజైనర్స్. బ్లౌజ్ మార్కింగ్ ఉదాహరణకు: * 34 ఛాతి చుట్టుకొలత గలవారి నమూనా బ్లౌజ్‌ను మార్క్ చేసి, కట్ చేద్దాం. * పేపర్చార్ట్ను నిలువుగా, తిరిగి మధ్యకు మడవాలి. * ముందు భాగం (భుజం నుంచి - నడుం వరకు నిలువుగా) స్టాండర్డ్ లెంగ్త్ 14 1/2 అంగుళాలు ఉండేలా చూసి మార్క్ చేయాలి. అలాగే వెనుకభాగం 13 అంగుళాలు కొలిచి మార్క్ చేయాలి. * నడుము చుట్టుకొలత (ఛాతికి కింది భాగం) ముందు భాగం 14, వెనుకభాగం 14 అంగుళాలు ఉండేలా మార్క్ చేసుకోవాలి. ఇది మొత్తం 28 అంగుళాలు ఉండేలా మార్క్ చేసుకోవాలి. * భుజాల పై భాగం (చంక నుంచి మెడ వరకు) 6 1/2 అంగుళాలు. * షార్ట్ స్లీవ్స్ (పొట్టి చేతులు) అయితే 4 అంగుళాలు. * ఆర్మ్ హోల్ (చంకభాగం) - 8 1/2 (ముందు ఔ మార్క్ డ్రా చేసి అటు తర్వాత గుండ్రటి వంపు తీసుకోవాలి) * ఛాతి భాగం వద్ద డార్ట్స్ డ్రాఫ్టింగ్ పాయింట్స్ డ్రా చేయాలి. నెక్ భాగం... * వెనుక వైపు నెక్ డీప్‌గా కిందివైపు వంపుగా వస్తుంది. ఈ సైజు ముందు మెడ భాగం నుంచి - 10 1/2 అంగుళాలు మార్క్ చేయాలి. (భుజం దగ్గర నుంచి కిందకు కర్వ్ తీసుకుంటూ మార్క్ చేయాలి) ఫ్రంట్ నెక్ 8 1/2 అంగుళాలు కొలిచి, మార్క్ చేయాలి. కట్ చేద్దాం... * కొలతల ప్రకారం చాప్‌స్టిక్ మార్క్ మీదుగా తేడా లేకుండా కట్ చేయాలి. * ముందువైపు చెస్ట్ పార్ట్ మధ్యకు డ్రా చేసి, సమంగా కట్ చేయాలి. అంటే, 34 లో సగం 17 అంగుళాల కొలత తీసుకొని కట్ చేయాలి. * కొలతలు తీసుకున్న ప్రకారం భుజాలు, చంకభాగం, డ్రాఫ్ట్ పాయింట్స్, చేతులు కట్ చేయాలి. * వెనుక వైపు డీప్ నెక్ కొలత తీసుకున్నదాని ప్రకారం మెడ నుంచి కిందవైపుగా కర్వ్ లైన్ వచ్చేలా కట్ చేయాలి. ఇది పూర్తిగా బాదం కట్ షేప్ వస్తుంది. జాకెట్ క్లాత్‌ను కట్ చేయడం ఇలా! * ఎంచుకున్న జాకెట్ క్లాత్‌ను పేపర్ మడిచిన విధంగానే నిలువుగా మధ్యకు మడవాలి. దానిని తిరిగి మధ్యకు మడిచి టేబుల్ మీద ముడతలు లేకుండా సరిచేయాలి. * దీని మీద కొలతల ప్రకారం కట్ చేసిన పేపర్ నమూనాలను ఉంచాలి. * దీని ప్రకారం క్లాత్‌ను జాగ్రతగా కట్ చేసుకోవాలి. (కట్ చేయడానికి ముందు పేపర్ కన్నా 1 1/2 అంగుళం సైడ్ మార్జిన్ వదలాలి). * కొలతల ప్రకారం మార్క్ చేసుకున్నదాని మీదుగా కుట్టు అటూ ఇటూ కాకుండా జాగ్రత్తపడుతూ స్టిచ్ చేయాలి. * బ్యాక్‌నెక్ బాదం కట్‌కి హెమ్మింగ్ అవసరం లేకుండా పైపింగ్ చేయడం వల్ల నెక్లైన్ అందంగా, నీటుగా వస్తుంది. -
కుర్తీ డిజైన్
లేడీస్ టైలర్ అందంగా కనిపించాలి.. అదే టైమ్‌లో స్టైలిష్ అనే కాంప్లిమెంట్ రావాలి. దాంతో పాటే కంఫర్ట్ ఉండాలి. ఇవన్నీ ఒక్క కుర్తీతో సాధించేయవచ్చు. గతంలో కుర్తా మగవారు ధరించే దుస్తులలో ఒకటి. అదే కుర్తా కొన్ని రూపురేఖలు మార్చుకొని ఆడవారి వార్డ రోబ్‌లో కంపల్సరీ డ్రెస్‌గా కుర్తీ పేరుతో చేరిపోయింది. క్యాజువల్, పార్టీ వేర్... ఏ తరహా అయినా కుర్తీని మనమే డిజైన్ చేసుకుంటే..!! ఎలా కట్ చేయాలి? ఎలా స్టిచ్ చేయాలి? ఈ వారం తెలుసుకుందాం... బ్లౌజ్ కటింగ్ మాదిరిగానే కుర్తీ డిజైనింగ్‌కి కూడా ముందు పేపర్ మీద డిజైన్ గీసుకుని, తర్వాత దాని కొలతలను బట్టి, క్లాత్‌ను కట్ చేసుకుంటే కటింగ్ సరిగ్గా వస్తుంది. అదీ కాకుండా కొత్తగా ప్రాక్టీస్ చేసేవారు పేపర్‌మీద నేర్చుకోవడం సరైన పద్ధతి. పేపర్ చార్ట్, గుర్తు పెట్టడానికి టైలర్స్ చాక్ (మార్కింగ్ చేసుకోవడానికి వీలుగా చాక్‌పీస్) తీసుకోండి చార్ట్‌ను నిలువుగా, మధ్యకు మడవాలి మీ ఛాతి చుట్టుకొలత 34 అయితే (కింద అన్ని ఛాతి, వెయిస్ట్, హిప్.. చుట్టుకొలతల చార్ట్ ఇస్తున్నాం. పరిశీలించండి) నడుము భాగం 28, హిప్స్ (పిరుదులు) భాగం 38 తీసుకోవాలి ఎ-బి భాగం = ఫుల్ లెంగ్త్ ఎ-ఇ = ఆర్మ్‌హోల్ (చంకభాగం 2 వైపులా) ఎ-ఎఫ్ = నడుము భాగం ఎ-జి = పిరుదుల భాగం ఇఇ1= ఛాతి చుట్టుకొలత ఎఫ్.ఎఫ్.1 = నడుము కొలత జి.జి.1 = పిరుదల భాగం పై నుంచి కిందవరకు స్ట్రెయిట్ లైన్ ఎ1 నుంచి ఇఇ1-ఇ2 వరకు, ఇక్కడ నుంచి మళ్లీ ఎ1 దగ్గర అర అంగుళం కింద నుంచి ఎ2 వరకు మార్క్ చేసుకోవాలి * ఆర్మ్‌హోల్ మధ్య భాగాన ఎ2 , ఇ2 , ఎ 4 వరకు మార్క్ చేసుకోవాలి. * ఎ4 నుంచి ఎ 5 వరకు మార్క్ చేసేటప్పుడు లోపలి వైపు అర అంగుళం ఎక్కువ వదిలి మార్క్ చేయాలి అలాగే వెనుక భాగం ఆర్మ్‌హోల్ కర్వ్‌ను గీసుకోవాలి. * ఎఎ1 = భుజ భాగం (2 వైపుల) ఎఎ2 = అర అంగుళం భుజం వాలు * ఎఎ3 - మెడ భాగం (2 వైపుల) ఎ3, ఎ2 భుజం వాలు స్ట్రెయిట్ లైన్ * బి1 మార్క్ చేసేటప్పుడు మూలన అర అంగుళం గీయనక్కర్లేదు. * ఎ.హెచ్ = నెక్ డెప్త్‌గా తీసుకోవాలి. చేతుల భాగం: ఎ-బి = స్లీవ్స్ లెంగ్త్ (చేతుల పొడవు) ఎ-ఎ1 = 3 అంగుళాలు ఎఎ2 = ఆర్మ్‌హోల్ రౌండ్ (చంకభాగం చుట్టుకొలత) ఎఎ3 = 1 అంగుళం ఎ3 నుంచి ఎ2 వరకు స్ట్రెయిట్ లైన్, మధ్య భాగం ఎ4 ఎ4 నుంచి అర అంగుళం ఎక్కువ వదులుతూ ఎ5- ఎ6 వరకు మార్క్ చేయాలి వంపు వచ్చేలా ముందు వెనక చంకభాగం వరకు ఎ,ఎ3,ఎ5,ఎ1,ఎ,ఎ3,ఎ6,ఎ1 దగ్గర మార్క్ చేసుకోవాలి చేతుల చుట్టుకొలత = బి-బి1 ఆర్మ్ చుట్టుకొలత ముందుభాగం గీసేటప్పుడు వంపు వచ్చేలా చూసుకోవాలి. ఇందుకు (బి,బి1,ఎ1, ఎ5,ఎ3 నుంచి ఎ నుంచి ఎ1, ఎ6, ఎ3 నుంచి ఎ) ఇలా అంకెలు పెట్టి వంపు వచ్చేలా డ్రా చేసి, కట్ చేయాలి. ఇలా డ్రా చేసుకుంటే కట్ చేసేటప్పుడు కర్వ్ సరిగ్గా వస్తుంది. క్లాత్ మీద: తీసుకున్న ఫ్యాబ్రిక్‌ని నాలుగు మడతలు వేసుకోవాలి. దీని మీద కొలతల ప్రకారం కట్ చేసిన పేపర్ నమూనాను ఉంచి, క్లాత్‌ను కట్ చేసుకోవాలి. (కట్ చేయడానికి ముందు పేపర్ కన్నా ఒకటిన్నర (1 1/2) అంగుళం సైడ్ మార్జిన్ వదలాలి. ఫ్రంట్ నెక్, బ్యాక్ నెక్‌లను మాత్రం విడిగా విడ్త్‌ను బట్టి కట్ చేసుకోవాలి. లైనింగ్ కుర్తీ అయితే: కొలతలను డ్రా చేసుకున్న పేపర్ చార్ట్‌ను ముందుగా లైనింగ్ క్లాత్ మీద పెట్టి, మార్క్ చేసి, కత్తిరించాలి. ఆ తర్వాత లైనింగ్ క్లాత్‌ను మెయిన్ ఫ్యాబ్రిక్ మీద పెట్టి, కట్ చేసుకోవాలి. లైనింగ్, సిల్క్ ఫ్యాబ్రిక్ ఒకేసారి పెట్టి కట్ చేస్తే కొలతల్లో తేడాలు వచ్చే అవకాశం ఉంది. 1. పేపర్ చార్ట్ మీద డ్రా చేసుకొని, కట్ చేసిన ముందు, వెనుక భాగాలు 2. కట్ చేసిన పేపర్ నమూనాను క్లాత్ మీద పెట్టి అంగుళం మార్జిన్ వదిలి కట్ చేయాలి. 3. స్లీవ్స్ భాగం కట్ చేసే విధానం. దివ్యా మనిహర్ ఫ్యాషన్ డిజైనర్, ఇన్స్టిట్యూటో డిజైన్ ఇన్నోవేషన్ (ఐడిఐ), హిమాయత్‌నగర్, హైదరాబాద్ www.alwaysrupesh@gmail.com -
బోట్‌నెక్ బ్లౌజ్ కట్
లేడీస్ టైలర్ ఫ్యాషనబుల్‌గా కనిపించాలనుకునేవారు బ్లౌజ్‌లలో బోట్‌నెక్ స్టైల్‌ను బాగా ఇష్టపడుతున్నారు. ఆభరణాల అలంకారాలు అంతగా అవసరం లేని బోట్‌నెక్ స్టైల్ కట్ గురించి ఈ వారం ... బోట్‌నెక్ స్టైల్‌ను మొదట్లో పాశ్చాత్యులు టీ షర్ట్స్, నైట్‌వేర్, స్వెటర్స్, కాక్టెయిల్ డ్రెస్సులకు ఉపయోగించేవారు. ముఖ్యంగా నావికులు తెలుపు, సమాంతర చారలు గల బోట్‌నెక్ జాకెట్లు, స్వెటర్లు ఉపయోగించేవారు. అక్కడ నుంచే ఈ తరహా స్టైల్‌ను భారతీయ డిజైనర్లు తీసుకున్నారు. సంప్రదాయ చీరల మీదకు ఎన్నో రకాల డిజైనర్ బ్లౌజ్‌లు వచ్చినట్టే బోట్‌నెక్ డిజైన్ బ్లౌజ్ కూడా బాగా నప్పింది. దీంతో ఆధునిక వనితలు ఈ తరహా నెక్‌ను అమితంగా ఇష్టపడుతున్నారు. బోట్నెక్లో ప్రధానమైనవి * మెడ భాగానికి దగ్గరగా, వెడల్పుగా, ముందు వెనుకలు సమాంతరంగా ఈ నెక్ డిజైన్ ఉంటుంది. * రౌండ్ నెక్ బ్లౌజ్‌కి - బోట్‌నెక్ బ్లౌజ్‌కి మిగతా శరీర కొలతలన్నీ ఒకే విధంగా ఉంటాయి. ఒక్క నెక్లైన్ కొలతల్లోనే మార్పు ఉంటుంది. రౌండ్ నెక్ బ్లౌజ్ మాదిరి బోట్‌నెక్ స్టైల్‌కి ముందు (ఫ్రంట్) భాగంలో హుక్స్ రావు. వెనుక భాగాన హుక్స్ లేదా జిప్ లేదా చేతుల కిందుగా రెండువైపులా (సైడ్స్) జిప్... ఇలా వారి వారి ఇష్టాలను బట్టి డిజైన్ చేసుకోవచ్చు. కట్ చేయాల్సిన విధానం... కత్తెరతో కొలతలు తీసుకున్న ప్రకారం పేపర్‌ను కట్ చేయాలి తీసుకున్న ఫ్యాబ్రిక్‌ని నిలువుగా మధ్యకు మడవాలి. దానిని మధ్యకు మరో మడత వేసి, ముడతలు లేకుండా సరిచేయాలి. సరిచేసిన క్లాత్ మీద కొలతల ప్రకారం కట్ చేసిన పేపర్ నమూనాలను ఉంచాలి దీని ప్రకారం క్లాత్‌ను సరిగ్గా కట్ చేసుకోవాలి. (కట్ చేయడానికి ముందు పేపర్ కన్నా 1 1/2 అంగుళం సైడ్ మార్జిన్ వదలాలి. లైనింగ్ బ్లౌజ్ ... కొలతలను డ్రా చేసుకున్న పేపర్ చార్ట్‌ను కట్ చేసుకున్నాక దానిని బట్టి లైనింగ్ క్లాత్‌ను కత్తిరించాలి. ఆ తర్వాత లైనింగ్ క్లాత్‌ను మెయిన్ ఫ్యాబ్రిక్ మీద పెట్టి, కట్ చేసుకోవాలి. లైనింగ్, సిల్క్ ఫ్యాబ్రిక్ ఒకేసారి పెట్టి కట్ చేస్తే కొలతల్లో తేడాలు వచ్చే అవకాశం ఉంటుంది. హ్యాండ్ ఎంబ్రాయిడరీ చేయించాలంటే... క్లాత్‌ని కట్ చేయడానికి ముందు కొలతలు వేసి, దాని ప్రకారం డిజైన్ చేయించుకోవాలి. క్లుప్తంగా! పేపర్ మీద శరీర కొలతలను బట్టి బ్లౌజ్ డిజైన్ తీసుకొని, తర్వాత క్లాత్ కట్ చేసుకోవాలి. అందుకు పేపర్ చార్ట్, మార్కింగ్కి టైలర్స్ చాక్ తీసుకోవాలి. చార్ట్‌ను నిలువుగా మధ్యకు మడిచి, శరీర కొలతలను బట్టి డిజైన్ గీసుకోవాలి. (మార్చి 27 సంచికలో ఇచ్చిన కొలతల గురించి ఈ వారం క్లుప్తంగా) మీ ఛాతి చుట్టుకొలత 34 అయితే ... (అన్ని ఛాతి చుట్టుకొలతల చార్ట్ మార్చి 27 సంచికలో ఇచ్చాం) నిలువుగా వెనుక భాగం స్టాండర్డ్ లెంగ్త్ 13 1/2 అంగుళాలు . ముందు భాగం 14 అంగుళాలు. * చుట్టుకొలత ముందు భాగం 14, వెనకభాగం 14 అంగుళాలు తీసుకోవాలి. * బోట్ నెక్ (వెనకవైపు) - 3 1/2 అంగుళాలు. ఫ్రంట్ నెక్ 4 1/2 అంగుళాలు. * భుజాలు 6 1/2 అంగుళాలు * షార్ట్ స్లీవ్స్ (పొట్టి చేతులు) - 4 అంగుళాలు * ఆర్మ్ హోల్ (చంకభాగం) - 8 1/2 * ముందు భాగం డార్ట్స్ డ్రాఫ్టింగ్ పాయింట్స్ డ్రా చేయాలి. * ముందువైపు ఛాతిభాగాన్ని సమానకొలతల్లో అంటే, 34లో సగం 17 అంగుళాల కొలత తీసుకొని కట్ చేయాలి. భార్గవి కూనమ్, ఫ్యాషన్ డిజైనర్ నిర్వహణ: నిర్మలారెడ్డి ఫొటోలు: శివమల్లాల -
ఔను అందరూ ఇష్టపడ్డారు!
వరుస ఫ్లాపులు. వంశీకేమైంది? ‘సితార’, ‘అన్వేషణ’, ‘లేడీస్ టైలర్’, ‘ఏప్రిల్ 1 విడుదల’... ఈ సినిమాలు డెరైక్ట్ చేసిన వంశీయేనా ‘ప్రేమ అండ్ కో’, ‘నీకు 16 - నాకు 18’, ‘వైఫాఫ్ వి.వరప్రసాద్’ లాంటి వీక్ సినిమాలు తీసింది! వంశీ పని అయిపోయిందా? ఇక్కడ వంశీకి కూడా ఏమీ అర్థం కావడం లేదు. మనసంతా చిందర వందరగా ఉంది. ఏదో నిర్వేదం, నిరాశ, నిస్పృహ. ఈ మనుషులకీ, ఈ సినిమాలకీ, ఈ ఇండస్ట్రీకీ దూరంగా వెళ్లిపోవాలి. అప్పుడుగాని మనశ్శాంతి దొరకదు. అప్పుడుగాని రీచార్జ్ కాలేడు. సామాన్లన్నీ ప్యాక్ చేసేశాడు. ఇల్లు ఖాళీ చేసేశాడు. జేబులో ఐదు వందలే ఉన్నాయి. భార్యా బిడ్డల్ని తీసుకుని యానాం వెళ్లిపోయాడు. అక్కడెవరికీ వంశీ తెలీదు. వంశీ క్కూడా ఎవరితోనూ పనిలేదు. పుస్తకాలు, నాటకాలు, సినిమాలు, గోదావరి తీరం... ఇవే టైమ్‌పాస్. వంశీ ఇక్కడున్న విషయం కొద్దిమందికే తెలుసు. రైటర్ వేమూరి సత్య నారాయణ, ‘స్వాతి’ ఎడిటర్ వేమూరి బలరామ్, హీరో జేడీ చక్రవర్తి. ఈ ముగ్గురే ఫోన్లు చేసి కుశలమడిగేవారు. సినిమాల్లోనే కాదు, లైఫ్‌లో కూడా చాలా ట్విస్టులుంటాయి. వంశీ లైఫ్‌లో కూడా! ఆరోజు వంశీకి ఫుల్ ఫీవర్. మలేరియా. ఆ వెంటే తోడుగా కామెర్లు. కాకినాడలోని సాలిపేట చంద్రారెడ్డిగారి హాస్పిటల్లో జాయిన్ చేశారు. స్పృహ లేదు. కోమాలాంటి స్థితి. ఎప్పటికో తేరుకున్నాడు. నిజంగానే చచ్చి బతికినంత పనయ్యింది. అంత నీరసంలో కూడా ఆయనలోని రైటర్ హుషారెత్తిపోయాడు. హాస్పిటల్ బెడ్‌మీదే కూర్చుని ‘రవ్వలకొండ’ అనే శృంగార నవల రాసి పారేశాడు. మళ్లీ యానాం జీవితం. నాలుగు సినిమాలు... పది పుస్తకాలు... గోదావరి తీరంలో వాకింగ్. వంశీ ఇంట్లో ల్యాండ్‌ఫోన్ మోగింది. చాలా రేర్‌గా మోగుతుందా ఫోన్. చేసే వాళ్లు చాలా తక్కువ కదా. ఫోన్ చేసింది వేమూరి సత్యనారాయణ.‘‘ఏమోయ్ వంశీ... ఎన్నాళ్లుంటా వక్కడ? హైదరాబాద్ వచ్చెయ్. ఇప్పుడు సినిమా ఇండస్ట్రీ కూడా మద్రాసు నుంచి ఇక్కడకు షిఫ్ట్ అయిపోయింది. అమెరికాలో స్థిరపడ్డ మావూరోడు వేమూరి రమేశ్ నీతో సినిమా తీస్తానంటున్నాడు.’’ వంశీ గోడ గడియారం వైపు చూశాడు. మళ్లీ తన టైమ్ స్టార్టయ్యిందా?! హైదరాబాద్... అమీర్‌పేటలోని దివ్య శక్తి అపార్ట్మెంట్స్. వంశీ వచ్చాడని తెలిసి హైదరాబాద్‌లోని రైటర్స్ అంతా బిలబిలా వచ్చేశారు. వాళ్లతో ఎన్నెన్నో అచ్చట్లూ ముచ్చట్లూ. వంశీకి మళ్లీ పాతరోజులు గుర్తొస్తున్నాయి. ఈ సందళ్ల మధ్య స్క్రిప్టు రాస్తున్నాడు. తీరా చూస్తే వేమూరి రమేశ్ సినిమా తీయకుండానే అమెరికా వెళ్లిపోయాడు. వంశీ పరిస్థితి క్రాస్‌రోడ్స్‌లో ఉంది. ఇప్పుడేం చేయాలి? అలాంటి టైమ్‌లో వచ్చారు ప్రొడ్యూ సర్ జయకృష్ణ. ఒకప్పుడు ఫేమస్ మేకప్ మేన్. కమల్‌హాసన్‌తో ‘అభయ్’, శ్రీహరితో ‘దాసు’, సుమంత్‌తో ‘శభాష్’ సినిమాలు ప్రొడ్యూస్ చేస్తున్నారు. వంశీకో ఆఫర్. మలయాళం సినిమా ‘సమ్మర్ ఇన్ బెత్లెహామ్’ని వేణు హీరోగా రీమేక్ చేయాలి. వంశీ రెడీ. ‘లవ్ ఇన్ రామోజీ ఫిలిం సిటీ’ పేరుతో ప్రీ-ప్రొడక్షన్ స్టార్ట్. పాపం జయకృష్ణ... ఒకేసారి ఎక్కువ ప్రాజెక్టులు పెట్టేసుకోవడంతో ఫైనాన్షి యల్ డిస్ట్రబెన్సెస్. వంశీ సినిమా స్టార్ట్ కాకముందే స్టాప్ అయిపోయింది. వంశీ ఇలాంటివెన్నో చూశారు కాబట్టి నో టెన్షన్. వంశీ కోసం ప్రొడ్యూసర్లు వస్తూనే ఉన్నారు. రవితేజతో ‘శివలింగపురం చెక్ పోస్ట్’ చేద్దామన్నాడు తాటి సతీశ్. ఇంకో నిర్మాత ఇంకో ప్రపోజల్. ఏదీ వర్కవుట్ కావడం లేదు. ఇలా వాళ్లనీ వీళ్లనీ నమ్ము కునేకన్నా పార్టనర్‌షిప్‌లో తనే సినిమా చేస్తే? వంశీ కసిమీదున్నాడు. తలుపులు మూసేసుకున్నాడు. రెండు మూడు నెలలు ఎవరికీ కనబడలేదు. రచయిత ‘గంగోత్రి’ విశ్వనాథ్ అప్పుడెప్పుడో చెప్పిన ఓ కథను బేస్ చేసుకుని బౌండ్ స్క్రిప్ట్ రెడీ చేసేశారు. అప్పుడు గానీ బయటకు రాలేదు. రాగానే బడ్జెట్ ప్లాన్ రెడీ చేయించారు. టెక్నీషి యన్స్‌ను కూడా మాట్లాడి పెట్టుకున్నారు. శివాజీని హీరోగా అడుగుదామనుకున్నారు. ఇంకో పక్క పార్టనర్షిప్ ప్రొడ్యూసర్ కోసం సెర్చింగ్. ‘భవ్య’ ఆనంద్ప్రసాద్నీ, కడపకు చెందిన ట్రావెల్స్ వాళ్లనీ కలిశారు. వర్కవుట్ కాలేదు. అలాంటి టైమ్‌లో ఎంటరయ్యాడు వల్లూరిపల్లి రమేశ్. సీనియర్ ప్రొడక్షన్ మేనేజర్. వంశీ దగ్గర ‘మహర్షి’ లాంటి సినిమాలకు పనిచేశాడు. వేమూరి సత్యనారాయణకు దగ్గరి బంధువు. ప్రొడ్యూసరయ్యే ట్రయల్స్‌లో ఉన్నాడు. ఇప్పుడు వంశీతోనే సినిమా చేయడానికి రెడీ. ‘జెమినీ’ కిరణ్ ఫుల్ సపోర్ట్. వంశీకి పార్టనర్షిప్ కాకుండా రెమ్యునరేషన్ ఇచ్చేందుకు అగ్రిమెంట్. పూరీ జగన్నాథ్ డెరైక్షన్‌లో ‘ఇట్లు శ్రావణి సుబ్రమణ్యం’లో హీరోగా చేశాడు రవితేజ. ఇప్పుడు పూరీతోనే ‘ఇడియట్’ చేస్తున్నాడు. టిపికల్ బాడీ లాంగ్వేజ్... వెటకారపు డైలాగ్ డెలివరీ... వంశీకి ఇంతకన్నా బెటర్ ఆప్షన్ ఎవరుంటారు? రవితేజ కూడా వంశీ అనగానే ఎగిరి గంతేసినంత పనిచేశాడు. హీరోయిన్గా లయను పెడదామా? లేకపోతే ఇంకెవరు బెటర్? సరిగ్గా అదే టైమ్‌లో ‘శేషు’ రిలీజైంది. హీరోయిన్ కల్యాణి. ఫ్రెష్ ఫేస్. జెమినీ టీవీ ఆఫీసుకి లైవ్ ప్రోగ్రామ్‌కి వస్తోంది. ‘‘ఓసారి మేకప్ టెస్ట్ చేసి చూస్తారా?’’ అడిగారు ‘జెమినీ’ కిరణ్. వంశీ మైండ్‌లో హీరోయిన్ గెటప్ విషయంలో ఓ పిక్చర్ ఉంది. అప్పటి కప్పుడు షాపింగ్కెళ్లి కొన్ని చీరలు కొన్నారు. కల్యాణి, రవితేజపై జెమినీ ఆఫీసులోనే ఫొటోషూట్. పెయిర్ బాగుంది. వంశీకి ఓకే. కాకినాడకు చెందిన కృష్ణభగవాన్‌ను రైటర్‌ను చేసిందీ, ఆర్టిస్టును చేసిందీ... అంతెందుకు పాపారావు చౌదరి అనే అతని పేరును కృష్ణభగవాన్గా మార్చిందీ - వంశీనే. ‘ఏప్రిల్ 1 విడుదల’లో అతనితో విలనీ చేయించారు. ఇందులో మాత్రం మాంచి కామెడీ వేషం ఇచ్చారు.ఈ సినిమాలో ఇంకో ఇంపార్టెంట్ రోల్ ఉంది. కొత్త ఆర్టిస్టయితే బాగుం టుంది. వంశీకి ద్రాక్షారామం పరిషత్తు నాటక పోటీల్లో ‘అల్లదే మా ఊరండీ’ నాటకంలో కాంపౌండర్ వేషం వేసిన బక్కపల్చటి వ్యక్తి గుర్తొచ్చాడు. వెంటనే పిలిపించారు. అతనే కొండవలస లక్ష్మణ రావు. వైజాగ్ పోర్ట్‌ట్రస్ట్‌లో పనిచేసి, రిటైరై పోయాడు. ఈ సినిమాలో అతని పాత్రకో ఊతపదం ఉంటుంది. ‘అయితే ఓకే’. దీని కోసం చాలారోజులు ప్రాక్టీస్ చేయించారు. ‘వేమూరి స్వాతి బలరామ్ వ్రాలు’. ఇదీ టైటిల్. ‘‘బలరామ్గారికి ‘స్వాతి’ మానస పుత్రిక. లవర్స్‌కి ఆ పేరు కరెక్ట్ కాదు’’ అన్నారు స్క్రిప్టు కో-ఆర్డినేటర్ వేమూరి సత్యనారాయణ. వంశీకి అవును కదా అనిపించింది. అయినా ఆయన దగ్గర టైటిల్స్‌కు కొదవేంటి? ఈసారి టైటిల్ ‘ఔను... వాళ్లిద్దరూ ఇష్టపడ్డారు’. నో అబ్జెక్షన్. బాపుగారితో టైటిల్ రాయించడం వంశీకి సెంటిమెంట్. బాపు టైటిల్ రాస్తే, కార్టూనిస్ట్ జయదేవ్ తెగ ముచ్చటపడిపోయి దానికి ఎక్స్క్లమేటరీ మార్కు యాడ్ చేశారు. కారులో రవితేజ, వంశీ వెళ్తున్నారు. రవితేజ మ్యూజిక్ ప్లేయర్ ఆన్ చేశాడు. ‘మళ్లి కూయవే గువ్వా...’ పాట వస్తోంది. వంశీకి తెగ నచ్చేసింది. ‘‘అరె... భలే ఉందే పాట’’ అన్నారు వంశీ. ‘ఇట్లు శ్రావణి సుబ్రమణ్యం’ సినిమాలో పాట అది. ‘‘చక్రి అని కొత్త మ్యూజిక్ డెరైక్టర్’’ - చెప్పాడు రవితేజ. ‘‘అయితే మన సినిమాకీ అతణ్ణే పెట్టుకుందాం’’- ఫిక్స్ అయిపోయారు వంశీ. ఈ కథలో హీరోది రాత్రి ఉద్యోగం. నైట్ వాచ్‌మన్. హీరోయిన్‌ది పగలు ఉద్యోగం. సాఫ్ట్వేర్. పగలూ రాత్రికి సింబాలిక్‌గా నలుపూ తెలుపూ థీమ్ అయితే బావుంటుందనుకున్నారు వంశీ. అందుకే హీరోయిన్‌తో బ్లాక్ శారీస్ కట్టించాలని, రూమ్ నిండా బ్లాక్ అండ్ వైట్ కలర్స్ వేయించాలని వంశీ ప్లానింగ్. వంశీకి పర్సనల్‌గా బ్లాక్ అండ్ వైట్ అంటే చాలా ఇష్టం. ఆయన ఇంట్లో కూడా బ్లాక్ అండ్ వైట్ థీమే ఉంటుంది. సింగిల్ షెడ్యూల్లో షూటింగ్ అయిపోవాలి. దాదాపుగా ఒకటే ఇంట్లో షూటింగ్. ఇళ్ల కోసం చాలా వెతికారు. ఫైనల్‌గా సారథీ స్టూడియోకెళ్లారు. అక్కడో బ్లాక్ అండ్ వైట్ ఫిల్మ్ ల్యాబ్ ఉంది. ఆ ప్లేస్ వంశీకి నచ్చేసింది. ఆ ల్యాబ్పైనే రూమ్ సెట్ చేస్తే?! వంశీ తలుచుకుంటే లొకేషన్‌కి కొదవా! 35 వేలతో రూమ్ సెట్ రెడీ. వంశీ ఇంట్లో సామాన్లతోనే దాన్ని డిజైన్ చేసేశారు. 85 శాతం షూటింగ్ సారథీ స్టూడియోలోనే. సాంగ్స్‌కి మాత్రం అరకులోయ, పాపికొండలకెళ్లారు. 35 రోజుల్లో సినిమా కంప్లీట్. ఆరేళ్లు గ్యాప్ వచ్చినా వంశీలో అదే స్పీడ్. అదే క్రియేటి విటీ. అసలు వంశీ ఎంత వేగంగా తీశా డంటే... యూనిట్వాళ్లే అదిరిపోయారు. లాస్ట్ డే... వంశీ దగ్గరకొచ్చింది కల్యాణి. ‘‘ఈ సినిమాలో నేను కట్టిన చీరలన్నీ చాలా బాగున్నాయ్. అవి నాకు ఇచ్చేస్తారా?’’ అడిగింది అమాయకంగా. ‘‘అన్నీ పట్టుకుపో’’ అన్నారు వంశీ. కల్యాణి ఆ కాటన్ చీరల్ని పట్టు చీరలన్నంతగా ఫీలై పట్టుకు వెళ్లిపోయింది. 2002 ఆగస్టు 2. వంశీ, కృష్ణ భగవాన్ షిర్డీలో ఉన్నారు. ఆ రోజే సినిమా రిలీజ్. కృష్ణ భగవాన్‌కి ఫోన్. మాట్లాడి పెట్టేసి, ‘‘గురువుగారూ! మన సినిమా హిట్ అంట’’ అని సంబరపడిపోయాడు. వంశీలో ఎలాంటి ఫీలింగూ లేదు. ‘అవునా’ అన్నాడాయన చాలా క్యాజువల్‌గా. ‘ఔను... వాళ్లిద్దరూ ఇష్టపడ్డారు’ - చిన్న సినిమాల్లో అతి భారీ విజయం. ‘వెన్నెల్లో హాయ్ హాయ్ పాట మోగని ఇల్లు లేదు. కూనిరాగం తీయనివాళ్లు లేరు. అంతే... మళ్లీ వంశీ హవా స్టార్ట్. రవి తేజకు హ్యాట్రిక్ హిట్. కల్యాణికి క్రేజ్. కృష్ణ భగవాన్‌కి టర్నింగ్. కొండవలసకు బంపర్ ఆఫర్. చక్రి కెరీర్ స్పీడ్. అసలు టోటల్‌గా ఈ సినిమానే అందరికీ స్పెషల్. ఆడియన్స్‌కీ అంతే. ఆ జోకులు... ఆ క్యారెక్టర్లు... ఆ ఫ్రేములు... ఆ పాటలతో వెన్నెల్లో హాయ్ లాంటి ఫీలింగ్. మల్లెల్లో హాయ్ లాంటి ఫీలింగ్. వెరీ ఇంట్రస్టింగ్... సాయి శ్రీహర్ష అంతకు ముందు చాలా పాటలు రాశారు కానీ, ‘వెన్నెల్లో హాయ్ హాయ్’ పాటతో ఒక్కసారిగా పాపులర్ అయిపో యారు. ఇటీవలే చనిపోయిన ఆయనను ఎప్ప టికీ బతికించే పాటగా ఇది మిగిలిపోయింది. ఆ ఏడాది ఈ సినిమా కాస్ట్యూమర్ గణపతికి నంది అవార్డు వచ్చింది. ‘‘డ్రెస్సులన్నీ మీరు కొనుక్కొచ్చారు కదా, నేను అవార్డు అందుకుంటే ఏం బాగుంటుందండీ’’ అని ఇబ్బందిపడితే, వంశీ ‘‘ఏం ఫర్లేదు’’ అన్నారు. కోటి రూపాయల్లోపే ఈ సినిమా పూర్తయ్యింది. -
జమ జచ్చ..!
ఎదుటివారిలో మచ్చలు వెతకడం మానవ నైజం. మన ‘లేడీస్ టైలర్’ చేసిందదే. కానీ అతను వెతికింది అమ్మాయిల కుడి తొడ మీది పుట్టుమచ్చ. అలాంటమ్మాయిని పెళ్లాడితే మహారాజ యోగం పడుతుందనేది అతడి ప్రగాఢ మూఢ నమ్మకం. అది నిజమో కాదో తెలీదు గానీ, ఈ సినిమాతో మాత్రం రాజేంద్రప్రసాద్‌కి మహారాజ యోగం పట్టింది. వంశీ గొప్ప ‘సిల్వర్ స్క్రీన్ కామెడీ టైలర్’ అని ఈ సినిమానే నిరూపించింది. ‘‘దేశమును ప్రేమించుమన్నా! మంచి అన్నది పెంచుమన్నా! ఉట్టి మాటలు కట్టిపెట్టి పుట్టు మచ్చలు వెతకవోయ్!’’ - వీపు మీద చపక్ మంటూ బెత్తం దెబ్బ. ‘‘ఉప్పు కప్పురంబు ఒక్క పోలికనుండు చూడ చూడ తొడల జాడ వేరు మచ్చలందు పుట్టు మచ్చలు వేరయా! విశ్వదాభిరామ నిన్ను ఇసకేసి తోమా!’’ - మళ్లీ రెండు బెత్తం దెబ్బలు. కుయ్యో మొర్రో మన్నాడు సుందరం. ఎన్ని మొట్టికాయలు పడ్డా, ఎన్ని బెత్తం దెబ్బలు తగిలినా అతగాడి ధ్యాసంతా జమ జచ్చ మీదే. అసలేమిటీ జమ జచ్చ? అసలెవడీ సుందరం? సుందరమంటే ఎవడు? కాకినాడకవతలుండే పల్లెటూళ్లో...పడమటీది సందులోన పాత ఇంటి ముందు ఉన్న లేడీసు టైలరు! సూదీ దారం కూడా లేకుండా చొక్కాలు కుట్టేసే మొనగాడు. బిందెడు బద్దకం... చెంబుడు చాదస్తం... లేకపోతే దర్జీలకు రాజుగా దర్జాగా ఉండేవాడు! ఉట్టికెగరలేనోడు స్వర్గానికెగరాలనుకునే టైపువాడు. ‘‘జబ జల్లి జబ జల్లి జప జడవే! నీకు సున్నుండలూ కజ్జికాయలూ పెడతా... కుడి భుజం మీదో... కడుపు మీదో పడవే’’ అని బల్లిని బతిమాలుకునే రకం. ‘కుడి తొడ మీద కుంకుడు గింజంత పుట్టుమచ్చుండే మాంచి పెట్టను పడితే నీ జాతక చక్రం నీ మిషను చక్రంలా తిరుగుతుం’దంటాడో కోయదొర. పెట్ట అంటే అమ్మాయి. అది కూడా పద్మినీ జాతి స్త్రీ అంట. పెద్ద పెద్ద కళ్లు... తెల్లటి ఒళ్లు... చూస్తే గుండె గుభిల్లు... అలాంటి స్త్రీ దొరికితే పట్టిందల్లా బంగారమేనట. ముట్టిందల్లా ముత్యమేనట. ‘‘మచ్చ ఉన్న భామ కనులకు కనరావా? ఎక్కడ ఎక్కడ ఎక్కడ దాక్కున్నావే లక్కున్న తెచ్చే చుక్కా... ఎక్కువ తిప్పలు పెట్టక చప్పున చిక్కవే చక్కా!’’ అంటూ ఈ మందలో ఏ సుందరో అంటూ సుందరం కూపీ తీయడం మొదలెట్టాడు. ఒక్క దెబ్బకు మూడు పిట్టలు పడ్డాయి. కొబ్బరి లౌజు లాంటి నాగమణి - పెన్సిలిన్ ఇంజక్షన్లాగా చురుక్కుమనిపించే నర్సు దయ - పరికిణీ వేసుకున్న పాలకోవా లాంటి నీలవేణి - అబ్బో... ఇక చూడాలి సుందరం తిప్పలు. వీళ్ల కుడి తొడ మీద మచ్చాన్వేషణ చేయాలి. బుర్రకు పదునెట్టి... కుట్టుమిషను మీద రకరకాల మేజిక్కులు చేస్తే... ప్చ్... నో జమ జచ్చ. కానీ ఈ ముగ్గురూ బంకజిగురులా వదలరాయె! దాంతో సుందరం ‘పుట్టుమచ్చ కరువైన బతుకెందుకూ’ అనుకుంటూ, ఊరు విడిచి జంప్ జిలానీ అయిపోతున్న టైమ్‌లో కనబడింది జమ జచ్చ. అచ్ఛా... ఇంకేముంది.. మళ్లీ సెకండాఫ్ కథ మొదలు. ఆ మచ్చ సుజాత టీచర్‌ది. ‘‘సుజాతా... మై మర్జాతా! తుమారా చుట్టూ ఫిర్జాతా! అది నా తలరాత! మై పడా! తుమారీ తొడా! మచ్చ! బహుత్ అచ్చా! మై బచ్చా! బట్టల సత్యం లుచ్చా’’... అంటూ ఏదో వచ్చీరాని హిందీ భాషలో మాట్టాడి, అచ్చిక బుచ్చికలాడి, సుజాత చేతిలో బెత్తం దెబ్బలు తింటూ... ఎట్టకేలకు లైన్లో పడేస్తాడు సుందరం. తీరా చూస్తే జంపింగ్ జపాంగ్. సుజాతకూ ఏ నా మచ్చా లేదు. లంకెల బిందెల మధ్య తాచుపాముల్లాగా వెంకటరత్నం... ఆడి అసిస్టెంట్ జట్కాబండి శ్రీనివాసు. కథ క్లైమాక్స్ కొచ్చేస్తుంది. అందరూ చుట్టుముట్టేసి సుందరాన్ని నడిరోడ్డు మీద దోషిలా నిలబెట్టేశారు. దాంతో సుందరానికి కళ్లకున్న కుట్లు, మనసుకేసిన హుక్కులు విడిపోయి... జ్ఞానోదయమవుతుంది. మనిషనేవాడు మచ్చ లేకుండా బతకాలి తప్ప, మచ్చ కోసం బతక్కూడదు. చేతిలో బంగారం లాంటి విద్య పెట్టుకుని శ్రీమంతుడు కావాలని పగటి కలలు కన్నందుకు చింతిస్తాడు. ఆడదానిలో వెతకాల్సింది మచ్చను కాదు... మంచి మనసును అని తెలుసుకుంటాడు సుందరం. ఇక నుంచి సుందరం జాతకం మారిపోకపోతే బట్టల సత్తిగాడి మీద ఒట్టు! జశు జభం! - పులగం చిన్నారాయణ పాపులర్ డైలాగ్ ‘‘ఇది మామూలు గౌను కాదు. పడుకునేటప్పుడు ఏసుకుంటే ఇంగ్లీషు కలలొస్తాయి. ఎలిజిబెత్ అని ఓ గొప్ప ఇంగ్లీషు సినిమా హీరోయినుంది. ఇలాంటి గౌనే ఏసుకుంటే బోలెడు పేరొచ్చేసింది. దాంతో ఆ గౌను కుట్టిన టైలర్నే పెళ్లి చేసేసుకుని, ఎలిజిబెత్ టైలర్ అయిపోయింది.’’ సినిమా పేరు : లేడీస్ టైలర్ (1986) డెరైక్ట్ చేసింది : వంశీ సినిమా తీసింది : ‘స్రవంతి’ రవికిశోర్ మాటలు రాసింది : తనికెళ్ల భరణి అదే ‘జ’ భాషకు ఇన్స్పిరేషన్ ‘‘మా ఊరు పసలపూడిలో త్యాగరాజు అనే టైలరుండేవాడు. మా ఈడు కుర్రాళ్లంతా అతని షాపు దగ్గర చేరేవాళ్లం. అతని ఇన్స్పిరేషన్తోనే ‘సుందరం’ పాత్ర అనుకున్నా. అయితే ఆడవాళ్ల గొడవ, మచ్చ... ఇవన్నీ అతనికి సంబంధం లేవు. అదంతా మా కల్పితం. సినిమా అంతా ‘తొడ మీద పుట్టుమచ్చ’కు సంబంధించి ఉంటుంది. అస్తమానూ ఆ మాట వాడితే బాగోదు కాబట్టి, ‘జ’ భాష వాడదామని రచయిత తనికెళ్ల భరణి సలహా ఇచ్చాడు. ముళ్లపూడి వెంకటరమణ గారు ‘అమ్మాయిలూ అబ్బాయిలూ’ కథలో ‘క’ భాష వాడారు. అదే ఇన్స్పిరేషన్. నా సినిమాల్లో బాగా పేలిన పాత్ర అంటే సుందరమే. దీనికి సీక్వెల్ చేయమని నిర్మాతలు అడిగితే ‘ఫ్యాషన్ డిజైనర్... సన్నాఫ్ లేడీస్ టైలర్’ పేరుతో ఓ స్క్రిప్టు చేశా. ఎప్పటికైనా చేస్తానేమో...?! - వంశీ, దర్శకుడు కసితో చేసిన సినిమా ‘‘వంశీ డైరక్షన్లో ‘మంచు పల్లకీ’ చేశా. సోలో హీరోగా ‘ప్రేమించు పెళ్లాడు’ చేశా. పెద్దగా ఆడలేదు. నేను బెంబేలు పడిపోతుంటే, ‘నెక్ట్స్ సినిమాలో తడాఖా చూపిద్దాం’ అన్నాడు. అలా కసితో చేసిన సినిమా ‘లేడీస్ టైలర్’. నటునిగా నాకిది 66వ సినిమా. డబ్బింగ్ ఆర్టిస్టుగా నాకున్న అనుభవాన్ని వంశీ ఈ సినిమాలో పూర్తిగా వాడుకున్నాడు. నా చేత ఎంత యాక్టింగ్ చేయించాడో, అంత కన్నా ఎక్కువే మైమ్ చేయించాడు’’ - రాజేంద్రప్రసాద్ -
చాక్లెట్లు బిస్కెట్లు ఇచ్చి పసిపిల్లలపై లైంగిక దాడి
అమలాపురం టౌన్ :పసిపిల్లలపై లైంగిక దాడి కేసులో అమలాపురానికి చెందిన రెడ్డి సూర్యనారాయణను పట్టణ పోలీసులు గురువారం మధ్యాహ్నం అరెస్ట్ చేశారు. అమలాపురం డీఎస్పీ లంక అంకయ్య, సీఐ వైఆర్కే శ్రీనివాస్ నిందితుడిని పట్టణ పోలీసు స్టేషన్లో మీడి యా ముందు హాజరుపరిచారు. బాలికలపై సూర్యనారాయణ ఆరునెలల పాటు లైంగిక దాడులకు పాల్పడ్డాడని డీఎస్పీ తెలి పారు. అమలాపురం మండలం పేరూరు పంచాయితీ పోస్టల్ కాలనీకి చెందిన సూర్యనారాయణ లేడీస్ టైలర్. గతంలో అతను ఉపాధికి కువైట్ వెళ్లడంతో కువైట్ తాతగా పరిచితుడు. 3, 5 తరగతులు చదువుతున్న 7,8,10 ఏళ్ల బాలికలు నలుగురిని అతడు చాక్లెట్లు, బిస్కెట్లు, డబ్బులు ఇచ్చి చేరదీసి, లైంగికదాడికి పాల్పడిన సంగతి తెలిసిందే. బాలికలకు సెల్ఫోన్లో నీలి చిత్రాలు చూపించి వారిపై లైంగిక దాడి చేశాడని డీఎప్పీ తెలిపారు. ఇది ఎవరికైనా చెబితే చంపుతానని వారిని బెదిరించాడన్నారు. బాధిత బాలికలకు వైద్యపరీక్షలు చేయించామన్నారు. 376, 354(ఎ), 506, ప్రివెన్షన్ ఆఫ్ చిల్డ్రన్ ఫ్రం సెక్సువల్ అఫెన్సెస్ యాక్టు 3,4,5,6 కింద, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ సెక్షన్ 3(1), 3(2) (వి)కింద అతడిపై కేసులు నమోదు చేశామని డీఎస్పీ తెలిపారు. గురువారం మధ్యాహ్నం అమలాపురం కుమ్మరికాల్వ గట్టు శివాలయం వద్ద అతడిని అరెస్ట్ చేశామని, నీలిచిత్రాలు ఉన్న సెల్‌ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నామని చెప్పారు. సూర్యనారాయణకు భార్య, కుమారులు, కుమార్తెలు, మనుమలు ఉన్నారు.