అనంతలో దారుణం.. నెట్‌లో బాలిక చిత్రాలు
అనంతపురం జిల్లా కదిరిలో దారుణం జరిగింది. కదిరి మండలం హనుమంతరాయపల్లికి చెందిన ఓ బాలిక నగ్నదృశ్యాలను చిత్రీకరించిన కొందరు వ్యక్తులు.. వాటిని ఇంటర్‌నెట్‌లో పెట్టారు. ఆ బాలిక తొమ్మిదో తరగతి చదువుతోంది. దుస్తులు కుట్టించుకోడానికి లేడీస్ టైలర్ కవిత వద్దకు వచ్చినప్పుడు ఆమె సమీప బంధువు, గార్లపెంట సొసైటీ బ్యాంకు ఉద్యోగి అయిన నాగరాజు రహస్యంగా తన మొబైల్‌లో ఆమె నగ్నదృశ్యాలను చిత్రీకరించాడు. తర్వాతి నుంచి కొంత కాలంగా ఆ బాలికను నాగరాజు లైంగికంగా వేధిస్తున్నాడని పోలీసులు తెలిపారు.
ఆమె తనకు ఎంతకీ లొంగకపోవడంతో ఆ నగ్నదృశ్యాలను నాగరాజు, అతడి స్నేహితుడు నగేష్ కలిసి ఇంటర్‌నెట్‌లో పెట్టారు. బాలిక బంధువులు కొంతమంది వాటిని చూసి ఆమె తల్లిదండ్రులకు సమాచారం అందించారు. దాంతో ఆమె తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. వెంటనే పోలీసులు బాలిక దృశ్యాలను నెట్‌లోంచి తొలగించారు. నిందితులు కవిత, నాగరాజు, నగేష్‌ల కోసం పోలీసులు గాలిస్తున్నారు. నిందితులంతా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కావడంతో పోలీసులపై ఒత్తిడి వస్తున్నట్లు తెలిసింది. కవిత, నాగరాజు కూడా టీడీపీలో క్రియాశీలక సభ్యులుగా ఉన్నారు. దాంతో కేసును తారుమారు చేసేందుకు టీడీపీ నాయకులు కుట్ర పన్నుతున్నారు. అయితే, ఇప్పటికే తాము పోస్కో, ఐటీ చట్టాల కింద కేసు నమోదు చేశామని, పరారీలో ఉన్న నిందితుల కోసం గాలిస్తున్నామని, ఎట్టి పరిస్థితుల్లోనూ వాళ్లను వదిలిపెట్టే ప్రసక్తి లేదని పోలీసులు చెబుతున్నారు.