పదహారణాల సినిమా
రూపాయికి ఎన్ని అణాలని ఎవరినైనా అడిగితే.. ‘వాట్ ఈజ్ అణా’ అని అడిగే అవకాశాలే ఎక్కువ. పదహారణాల అచ్చ తెలుగు అమ్మాయి ఇప్పుడు తెలుగు సినిమాలో ఒక్క అణా కూడా కనబడటంలేదు. ఉగాది రోజు పదహారణాల దర్శకుడితో కూర్చుంటే బాగుండేమో అనిపించి... పెద్ద వంశీతో ‘సరదాగా కాసేపు’.
ఉగాది పండగ సందర్భంగా ‘తెలుగు’ గురించి మాట్లాడాలనిపిస్తోంది. ఇప్పుడు తెలుగును తెలుగులా మాట్లాడేవాళ్లు తక్కువైపోయారండీ...
అవును. తెలుగువారికి తెలుగు భాష మీద అభిమానం తగ్గిపోతోందన్న విమర్శలు ఇటీవల ఎక్కువైపోయాయి. మన భాషను మన భాషలా మాట్లాడుకుంటే బాగుంటుంది. స్వచ్ఛమైన తెలుగు వినసొంపుగా ఉంటుంది. కానీ, ఇప్పుడలా మాట్లాడేవాళ్లు తక్కువైపోయారు.
మీ సినిమాల్లో నిండైన చీరకట్టులో కనిపించే పదహారణాల తెలుగమ్మాయిలు ఇప్పుడు వెతికినా కనిపించకపోవడం మీకెలా అనిపిస్తుంటుంది?
మార్పుకి నేను వ్యతిరేకిని కాదు. కాకపోతే ఆ మార్పు మన భారతీయ సంప్రదాయాన్ని అధిగమించేలా ఉండకూడదంటున్నా. మన సంప్రదాయం చాలా గొప్పది. మీరన్నట్లు చీరకట్టులో కనిపించే అమ్మాయిలు తగ్గిపోయారు. ఇప్పుడో విషయం గుర్తొస్తోంది. ‘ఫ్యాషన్ డిజైనర్’ (‘లేడీస్ టైలర్’కి సీక్వెల్) షూటింగ్ మొత్తం కోనసీమ పరిసర ప్రాంతాల్లోనే చేశాం. అక్కడ దాదాపు చుడీదార్లు, వేరే మోడ్రన్ డ్రెస్సులు వేసుకున్న అమ్మాయిలే కనిపించారు. ఒకప్పటిలా లంగా, ఓణీలు కనిపించలేదు. ఆడవాళ్ల డ్రెస్సింగ్ విధానం మారిపోయింది. ఉదయాన్నే నైటీల్లో ముగ్గులు వేస్తూ, కనిపిస్తున్నారు. అది తప్పనడంలేదు కానీ, మనదైన కట్టూబొట్టూ మిస్సవుతున్నాయన్న బాధ. సంక్రాంతి పండగ అప్పుడు నేను గోదావరిలోనే ఉన్నా. అచ్చ తెలుగు పండగ అప్పుడూ లంగా, ఓణీలు, చీరకట్టూ కనిపించలేదు. అప్పుడు చాలా బాధ అనిపించింది.
మీ హీరోయిన్లు కంటి నిండా కాటుకతో కళకళలాడేవాళ్లు. ఇప్పుడు కాటుక దాదాపు కనుమరుగైపోయింది?
కాటుక కళ్లు ఎంత బాగుంటాయండి. అసలు అమ్మాయిలు కళ్ళకు కాటుక పెట్టుకుంటేనే అందంగా ఉంటారు. ఇప్పటి హీరోయిన్లు గురించి చెప్పలేం కానీ, అప్పట్లో సావిత్రిగారు, జమునగారు.. ఇలా హీరోయిన్లందరూ కాటుక కళ్లతో ఎంత అందంగా కనిపించేవారు. వాలుజడ ఎంత బాగుండేది. బాపూగారు గీసిన బొమ్మల్లో చెంపకు చారెడేసి కళ్లు, వాలుజడ... చాలా బాగుంటాయి. అందుకే నాకు ఆయన గీసిన బొమ్మలంటే ఇష్టం. ఆయన ఎక్కువ బొమ్మలు గీసింది నాకే.
ఇప్పడంతా కురచ జుట్టు కల్చరే కదా..
అవును. వాలుజడలు కనిపించడంలేదు. గొప్ప సంస్కృతి, సంప్రదాయాలు ఉన్నాయి కనుకనే ప్రపంచమంతా భారతీయులు కీర్తించబడుతున్నారు. ఈ ఆధునిక జీవన సరళి ఎందుకో నాకు అంతగా నచ్చడం లేదు. ఆ మధ్య గుడికి వెళ్లాను. అక్కడే పూజారి ఇల్లు ఉంది. ఆయన కూతురు నైటీలో కనిపించింది. దేవుడి గుడి దగ్గర కూడా మన సంప్రదాయం కనిపించకపోవడం విచారం.
చీరకట్టు, కాటుక కళ్లు, రూపాయి కాసంత బొట్టు, తలలో పువ్వులు.. ఈ లుక్‌లో హీరోయిన్లు బాగుంటారని మీరెలా గెస్ చేసేవారు?
ఏదైనా చూసే కళ్లను బట్టే ఉంటుంది. హీరోయిన్‌ని సెలక్ట్ చేసేటప్పుడే వాళ్లను ఎలా చూపిస్తే బాగుంటుందో నిర్ణయించుకుంటా. నేను అనుకున్న గెటప్‌తో ఫొటోసెషన్ చేస్తాను.
మీకు తెలిసో తెలియదో కానీ మీ హీరోయిన్లంటే మగవాళ్లకే కాదు... ఆడవాళ్లకి కూడా బోల్డంత ఇష్టం...
(నవ్వుతూ). ఇక్కడ చిన్న ఉదాహరణ చెబుతాను. ఒకమ్మాయి తన పెళ్లి చూపులకు అచ్చంగా నా సినిమా హీరోయిన్‌లా పెద్ద బొట్టు, చక్కని చీర కట్టు, పువ్వులు, కాటుక పెట్టుకుని రెడీ అయిందట. తొలి చూపులోనే ఆమె ఆ కుర్రాడికి నచ్చేసిందట. ఆ సంబంధం ఖాయం అయింది. ఆమె పెళ్లి హ్యాపీగా జరిగిపోయింది. ఆమె రైటర్. ఇటీవల నన్ను కలసినప్పుడు నాతో ఈ విషయాన్ని చెప్పారు. సంతోషంగా నవ్వుకున్నాను.
మీ ఊరు పసలపూడి ఉగాది పచ్చడి ప్రత్యేకత ఏంటి?
ప్రత్యేకం అంటూ ఏదీ లేదు. అందరూ చేసే ఉగాది పచ్చడిలానే ఉంటుంది.
మీ అమ్మగారి ఉగాది పచ్చడి...
గుర్తు లేదు. మా అమ్మగారు ఎప్పుడో పోయారు. చిన్నతనంలోనే ఇంట్లోంచి వచ్చేశాను. అందుకని బాల్యం పెద్దగా తెలియదు.
పోనీ ఇప్పటి ఉగాది పచ్చడి గురించి?
ఇప్పుడేం ఉందండి. ఫ్రిజ్ పచ్చడి తింటున్నాం (నవ్వుతూ). ఎప్పుడో ఉదయాన్నే పచ్చడి చేసేస్తారు. ఆ సమయానికి ఇంట్లో ఉండం కదా. పనులన్నీ చూసుకుని ఇంటికెళ్లాక, ఫ్రిజ్‌లో పెట్టి ఉంచిన పచ్చడి తింటాం. సో.. మార్పు అనేది మన ఇంటిలోనూ ఉంది. అయితే ఏ మార్పైనా కొంతవరకే ఓకే. మరీ మన మూలాలను మరచిపోయేంతలా మారిపోవడం సరికాదు.
మీరు మరచిపోలేని ఉగాది?
అలాంటి ఉగాది ఏదీ లేదు. మామూలుగా నేను తీసే సినిమాలకు ముందు డివైడ్, ఆ తర్వాత హిట్ టాక్ వస్తుంది. కానీ, ‘లేడీస్ టైలర్’కి మాత్రం అలా జరగలేదు. విడుదలైన మొదటి రోజే హిట్ టాక్ వచ్చింది. నేను ముందు నమ్మలేదు. కానీ, నిర్మాత ‘స్రవంతి’ రవికిశోర్ ‘నిజం’ అని చెప్పిన తర్వాత నమ్మాను. ఆ రోజు నాకు నిజమైన ఉగాది. అలాగే, నా సినిమా హిట్ టాక్ తెచ్చుకున్న రోజుని నేను ఉగాదిలానే భావిస్తా.
చివరగా... మీ సినిమాలో గోదావరి తప్పనిసరి. ఆ లొకేషన్ ఎప్పుడూ మీకు మొహం మొత్తలేదా?
అస్సలు లేదండి. చిన్నప్పటి నుంచి గోదావరితో నాకు అనుబంధం ఉంది. గోదావరి పరిసర ప్రాంతాల్లో ఎవరైనా ఒకట్రెండు పాటలు తీస్తారేమో. నేను ‘ఫ్యాషన్ డిజైనర్’ సినిమాలోని అన్ని పాటలూ అక్కడే తీశా. చిన్నప్పుడు తిన్న జీడీలు, మా ఏరియా పెసరట్టు, గోదావరి మీద మమకారం ఎప్పటికీ పోదు.
31 ఏళ్ల క్రితం ‘లేడీస్ టైలర్’ తీసినప్పుడే సీక్వెల్ (ప్రస్తుతం చేస్తున్న ‘ఫ్యాషన్ డిజైనర్’) తీయాలనుకున్నారా?
లేదు. ఓ స్టార్ హీరోతో సీక్వెల్ తీయాలని ఓ నిర్మాత ప్రయత్నించారు. అది కుదరలేదు. ఇంకొకరితో అనుకున్నారు. అదీ వర్కవుట్ కాలేదు. ‘మధుర’ శ్రీధర్‌గారు టేకప్ చేసి.. తనికెళ్ల భరణిగారితో కథ రాయించారు. ఆయన పారిస్‌లో టైలర్ అని ఓ కథ రాశారు. ఇంకొకరు హైద్రాబాద్ బ్యాక్‌డ్రాప్‌లో రాశారు. ‘మధుర’ శ్రీధర్ నన్ను సంప్రదించారు. మొదటి భాగంలో వెంకటరత్నం అనే విలన్ క్యారెక్టర్ ఉంది కదండీ.. అలా కావాలన్నారు. ముగ్గురు హీరోయిన్లు కావాలన్నారు. రెండు నెలలు కూర్చొని నవలలా రాశాను. కథ విని ఇంప్రెస్ అయ్యారు. అలా ఈ సీక్వెల్ మొదలైంది.
ఇంతకీ ఫ్యాషన్ డిజైనర్ ఏం చేస్తుంటాడు?
తండ్రిలానే అరుగు మీద టైలరింగ్ చేస్తుంటాడు. సిటీకి వెళ్లి షాప్ పెట్టాలన్నది అతని గోల్.
– డి.జి.భవాని