
‘‘నాకు ఎంత సంగీతం తెలుసన్నది ముఖ్యం కాదు... సంగీతమే నా గురించి తెలుసుకుంది. నాలోంచి సంగీతం ఎలా వస్తోందో తెలియదు. ఆ సంగతి తెలిసిన మరుక్షణం సంగీతం మానేస్తాను’’ అని ప్రముఖ సంగీత దర్శకుడు ఇళయరాజా అన్నారు. రూపేష్, ఆకాంక్షా సింగ్ జంటగా, రాజేంద్రప్రసాద్, అర్చన ముఖ్య తారలుగా నటించిన చిత్రం ‘షష్టిపూర్తి’. పవన్ ప్రభ దర్శకత్వంలో రూపేష్ చౌదరి నిర్మించిన ఈ చిత్రం త్వరలో విడుదల కానుంది.
హైదరాబాద్‌లో జరిగిన ఈ చిత్రం టీజర్ లాంచ్ ఈవెంట్‌లో చిత్ర సంగీతదర్శకుడు ఇళయరాజా(Ilaiyaraaja) టీజర్ రిలీజ్ చేసిన అనంతరం మాట్లాడుతూ–‘‘షష్టిపూర్తి’ ద్వారా కొత్తవాళ్లు తొలి ప్రయత్నం చేశారు. వారిని ప్రోత్సహించాలని ఇక్కడకి వచ్చాను. ఈ సినిమాకి, పని చేసిన అందరికీ దేవుడు ఆశీస్సులు అందించాలి’’ అన్నారు. సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణి మాట్లాడుతూ– ‘‘ఈ సినిమాలో ‘ఏదో ఏ జన్మలోదో ఈ పరిచయం..’ అనే పాట రాశాను. ఇళయరాజాగారి సంగీతానికి పాడాలనుకున్నా ఆ అవకాశం రాలేదు. కానీ, ఆయన సంగీతానికి పాట రాసే అవకాశం వచ్చింది. ఇదొక రకంగా నా జీవితానికి సంబంధించినదే. ఇళయరాజాపై నాకున్న అభిమాన భావానికి సంబంధించిన పాటని అనుకోండి’’ అని అన్నారు.
రాజేందప్రసాద్( Rajendra Prasad) మాట్లాడుతూ– ‘‘ఇళయరాజా సంగీతం వల్లే ‘లేడీస్ టైలర్’ సినిమా హిట్టయింది. మళ్లీ ఇన్నేళ్లకు నా సినిమాకి ఆయన సంగీతాన్ని అందించడం చాలా సంతోషాన్ని కలిగిస్తోంది. రజనీకాంత్, కమల్‌హాసన్‌తో పాటు ఎంతోమందిని తన సంగీతంతో స్టార్లుగా ఇళయరాజా నిలబెట్టారు.’ అని అన్నారు. ‘‘ఇంత గొప్పవారు మా సినిమాకి పని చేయడం సంతోషంగా ఉంది’’ అని పవన్ ప్రభ, రూపేష్ అన్నారు. కాగా ఇళయరాజాకి భారతరత్న ఇవ్వాలన్న ఆకాంక్షను పలువురు ఈ వేదికపై వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో సినిమాటోగ్రాఫర్ రామ్, కళా దర్శకుడు తోట తరణి, గీత రచయిత చైతన్య ప్రసాద్ మాట్లాడారు.