సినీ దర్శకుడు వంశీ
కూలిపోయిన నిద్ర గన్నేరు వృక్షాన్ని చూసి భావోద్వేగం
దాదాపు 18 సినిమాల్లో ఆ చెట్టు కింద ఏదో ఒక సన్నివేశం
కొవ్వూరు: సితార, లేడీస్ టైలర్, డిటెక్టివ్ నారద, చెట్టు కింద ప్లీడర్, గోపి–గోపిక–గోదావరి, మంచు పల్లకీ.. ఇలా సుమారు 18 సినిమాలకు కుమారదేవం చెట్టు కింద ఏదో ఒక సన్నివేశాన్ని చిత్రీకరించానని ప్రముఖ సినీ దర్శకుడు వంశీ తెలిపారు. ఆయన గురువారం తూర్పు గోదావరి జిల్లా కొవ్వూరు మండలం కుమారదేవం వచ్చి కూలిపోయిన భారీ నిద్ర గన్నెరు వృక్షాన్ని పరిశీలించి భావోద్వేగానికి లోనయ్యారు. స్థానికులతో మాట్లాడుతూ తనకు, చెట్టుకు ఉన్న అనుబంధాన్ని నెమరువేసుకున్నారు.
తాను చిన్నప్పుడు పట్టిసీమ వెళుతూ ఈ చెట్టును చూసినట్టు తెలిపారు. తాను దర్శకత్వం వహించే ప్రతి చిత్రంలోనూ గోదావరి సీన్ కచ్చితంగా ఉంటుందని, సుమారు 18 సినిమాల్లో ఈ కుమారదేవం చెట్టు ఉందని వెల్లడించారు. తాను రాసిన గోకులంలో రాధ నవలలో ప్రధానంగా ఈ చెట్టు గురించే ఉంటుందని చెప్పారు. ఈ చెట్టు మళ్లీ బతకాలన్నారు. చెట్టు బతికితే తాను మళ్లీ ఇక్కడ సినిమా తీస్తానని చెప్పారు.
చెట్టు పడిపోయిన విషయం తెలిసి వేలాది మంది నుంచి తనకు వేలాది మెసేజ్‌లు వచ్చాయని, తన తల్లి చనిపోయినప్పుడు కూడా ఇన్ని మెసేజ్‌లు రాలేదన్నారు. ఇటువైపు వచ్చినప్పుడల్లా మిత్రులతో కలిసి ఇక్కడ చెట్టు కింద సేద తీరేవాడినని, మిత్రులతో కలిసి పార్టీ కూడా చేసుకున్నట్టు చెప్పారు. రాజమహేంద్రవరం రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో గురువారం కెమికల్ ట్రీట్‌మెంట్ ద్వారా వృక్షాన్ని చిగురింపజేసే పనులను ప్రారంభించారు. సబ్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాస్తవ ఈ పనులను లాంఛనంగా ప్రారంభించారు.
Comments
Please login to add a commentAdd a comment