సాక్షి, సిటీబ్యూరో: అమెరికా విద్యాలయాల్లో ఆన్‌లైన్ క్లాసులు హాజరవుతున్న గ్రేటర్ విద్యార్థులు.. వారి తల్లిదండ్రుల్లో ఆందోళన మొదలైంది. సెప్టెంబరు–డిసెంబరు సెమిస్టర్‌ను ఆన్‌లైన్‌లో చదవాలనుకుంటున్న విద్యార్థులు సొంత దేశం వెళ్లాలని తాజాగా ట్రంప్ సర్కారు హుకుం జారీచేయడం ఈ ఆందోళనకు కారణమైంది. తాజా నిర్ణయంతో అమెరికాలో విద్యనభ్యసిస్తున్న సుమారు 25 వేల మంది విద్యార్థులకు పిడుగుపాటులా మారింది. దేశం విడిచి వెళ్లకుంటే.. క్యాంపస్‌లో తరగతులు బోధించే విద్యాలయాలకు బదిలీ కావాలని ఇమ్మిగ్రేషన్, కస్టమ్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్(ఐసీఈ) ఆదేశాలిచ్చిన నేపథ్యంలో.. తక్షణం బదిలీ కావడం కత్తిమీద సాములా మారుతుందని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక ఆన్‌లైన్‌లో క్లాసులు హాజరయ్యే విద్యార్థులకు విదేశాంగ శాఖ సైతం వీసాలను మంజూరు చేయదని ఐసీఈ పేర్కొనడం గమనార్హం.(అమెరికాలోని తెలుగు విద్యార్థులకు ప్రభుత్వ అండ)
వేలాది మంది విద్యార్థులపై పిడుగు..
అమెరికాలో సుమారు 12 లక్షల మంది అంతర్జాతీయ విద్యార్థులు 8,700 విద్యాలయాల్లో చదువుతున్నారు. వీరిలో భారతీయ విద్యార్థులు సుమారు 3.60 లక్షలమంది ఉండగా.. రెండు రాష్ట్రాలకు చెందిన తెలుగు విద్యార్థులు సుమారు 60 వేలు.. అందులో హెచ్‌ఎండీఏ పరిధిలోని విద్యార్థులు సుమారు 25 వేల మంది వరకు ఉన్నట్లు అంచనా.. తాజా ఉత్తర్వుల నేపథ్యంలో ఈ విద్యార్థులు ఒకవేళ స్వస్థలాలకు తిరిగి వస్తే తిరిగి అమెరికా వెళ్లడం కష్టసాధ్యమవుతుందని నిపుణులు చెబుతున్నారు. ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా చాలా రాయబార కార్యాలయాల్లో అమెరికా వీసా ప్రక్రియను నిలిపివేయడం తెలిసిందే. ఇక ఆన్‌లైన్‌లో బోధించే విద్యాలయాలు పాక్షికంగానైనా తరగతి గదుల్లో బోధనకు శ్రీకారం చుడితే మన సిటీ విద్యార్థులు ప్రమాదం నుంచి తప్పించుకోవచ్చని చెబుతున్నారు.
భారంకానున్న విద్యారుణాలు..
అమెరికాలో విద్యాభ్యాసం చేసేందుకు నగరానికి చెందిన పలువురు విద్యార్థుల తల్లిదండ్రులు పలు వాణిజ్య, ప్రైవేటు బ్యాంకుల నుంచి తమ శక్తికి మించి రూ.25 నుంచి రూ.50 లక్షల దాకా విద్యా రుణాలు తీసుకున్నారు. వీరిలో మధ్యతరగతి వేతన జీవులే అధికంగా ఉన్నారు. ఈ నేపథ్యంలో ఒక్కసారిగా తమ పిల్లలు సొంతగూటికి తిరిగి వస్తే వారి కోర్సులు పూర్తయినా.. అమెరికాకు తిరిగి వెళ్లడం.. అమెరికాలో ఉద్యోగాలు చేసే పరిస్థితి ఉండని కారణంగా విద్యారుణాలు తీర్చడం కష్టసాధ్యమవుతుందని పలువురు తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆన్‌లైన్ క్లాసులు నిర్వహించే విద్యాలయాలు తక్షణం తరగతి గదుల్లో బోధన ప్రారంభించాలని కోరుతున్నారు. ఈమేరకు ఆయా విద్యాలయాలకు ఈమెయిల్స్ పంపినట్లు పలువురు విద్యార్థుల తల్లిదండ్రులు ‘సాక్షి’కి తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment