హెచ్-1 బీ వీసాదారులకు భారీ ఊరట | US to consider requests for visa extensions due to Covid19 crisis | Sakshi
Sakshi News home page

హెచ్-1 బీ వీసాదారులకు భారీ ఊరట

Published Tue, Apr 14 2020 4:55 PM | Last Updated on Tue, Apr 14 2020 5:21 PM

US to consider requests for visa extensions due to Covid19 crisis - Sakshi

వాషింగ్టన్ : కోవిడ్-19  మహమ్మారి  కారణంగా అమెరికాలో చిక్కుకుపోయిన భారతీయులకు శుభవార్త. వీసా పొడిగింపుపై వచ్చిన అభ్యర్థనలను పరిశీలిస్తామని అమెరికా హోం ల్యాండ్ సెక్యూరిటీ విభాగం తెలిపింది. ఈ మేరకు అమెరికా పౌరసత్వం, ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్ (యుఎస్‌సిఐఎస్) సోమవారం తన వెబ్‌సైట్‌లో ఒక నోటిఫికేషన్ పోస్ట్ చేసింది.  కరోనా వైరస్ విస్తరణ నేపథ్యంలో వీసాల గడువు పొడిగింపు నిర్ణయాన్ని చాలా వేగంగా పరిష్కరిస్తామని తెలిపింది. అలాగే ప్రతీ దరఖాస్తును పరిశీలించి ప్రాసెస్ చేస్తామని తెలిపింది. ఈ నిర్ణయంతో  అక్కడ చిక్కుకున్న భారతీయులకు ప్రయోజనం చేకూరుతుందని భావిస్తున్నారు. అయితే గడువు పొడిగింపునకు సంబంధించి  విశ్వసనీయమైన సాక్ష్యాలను దరఖాస్తు దారుడు సమర్పించాలని నోటిఫికేషన్ తెలిపింది. వీసాల గడువు ముగిసి అమెరికాలో చిక్కుకున్న భారతీయ పౌరులకు ఈ నిర్ణయం భారీ ఊరట నిస్తుందని సంబంధిత  అధికారి ఒకరు పేర్కొన్నారు.

కోవిడ్-19 పరిణామాల నేపథ్యంలో అక్కడ చిక్కుకున్న భారతీయ పౌరులకు హెచ్-1 బీ సహా, వివిధ రకాల వీసాల చెల్లుబాటును పొడిగించాలని గత వారం అమెరికాకు భారత ప్రభుత్వం కోరిన నేపథ్యంలో ఈ ప్రకటన వచ్చింది. కరోనావైరస్ సంక్షోభం నేపథ్యంలో వలసదారులు వీసా గడువు ముగిసిన తరువాత అమెరికాలో ఉండేందుకు గడువు పొడిగింపు (ఈవోఎస్) లేదా స్టేటస్ మార్పు కోసం దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. తద్వారా బహిష్కరణ వంటి ఇతర పరిణామాలను తప్పించుకోవచ్చు. హెచ్-1 బీ వీసా దారులు ఒకవేళ ఉద్యోగాలు కోల్పోయినట్టయితే  అమెరికాలో ఉండే గడువును 60 రోజుల నుంచి 8 నెలలు వరకు  పొడిగించినట్టు తెలిపింది. 

కాగా కరోనా వైరస్ విస్తరిస్తున్న క్రమంలో ప్రపంచ వ్యాప్తంగా లాక్ డౌన్ నిబంధనలు అమల్లోకి వచ్చాయి. దేశీయ, అంతర్జాతీయ విమాన సర్వీసులు నిలిచిపోయాయి. వాణిజ్య కార్యకలాపాలు నిలిచిపోవడంతో ఆర్థిక మందగమన పరిస్థితులు దాపురించాయి. ఈ నేపథ్యంలోనే హెచ్‌ 1బీ వీసా పరిమితిని తాత్కాలికంగా 60 నుంచి 180 రోజులకు పెంచాలని, కరోనా కారణంగా ప్రపంచమంతా గడ్డు పరిస్ధితిని ఎదుర్కొంటున్న, తాము ఉద్యోగాలు కోల్పోయే ప్రమాదం ఉందని ఈ విపత్కర పరిస్థితుల్లో తమకు అండగా నిలవాలంటూ  పలువురు టెకీలు  అభ్యర్థించిన సంగతి తెలిసిందే.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement