‘ఆరోగ్యశ్రీ’లో అక్రమాలు!  | Irregularities in Aarogyasri | Sakshi
Sakshi News home page

‘ఆరోగ్యశ్రీ’లో అక్రమాలు! 

Published Sun, Sep 1 2019 3:50 AM | Last Updated on Sun, Sep 1 2019 8:08 AM

Irregularities in Aarogyasri - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ఆరోగ్యశ్రీలో అవినీతి జలగలు రాజ్యమేలుతున్నాయి. పేదల వైద్యం కోసం ఏర్పాటైన దీన్ని కూడా అవినీతికి కంచుకోటగా మార్చారు. బయటి దళారులతో కుమ్మక్కై వారితో అక్రమాలు చేయిస్తూ సొమ్ము గడిస్తున్నారు. ఆరోగ్యశ్రీ నెట్‌వర్క్‌ ఆసుపత్రులను బెదిరిస్తూ వసూళ్లకు పాల్పడుతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా అనేక జిల్లాల్లో ఈ దందా జరుగుతున్నట్లు ఆరోగ్యశ్రీ ట్రస్టుకు ఫిర్యాదులు అందాయి. వీటిపై సంబంధిత విజిలెన్స్‌ విభాగం విచారణ జరుపుతుండగా, వరంగల్‌ జిల్లాలో జరిగిన అక్రమాలు వెలుగులోకి వచ్చాయి.వాటిపై సమగ్ర విచారణ జరిపిన తర్వాత ఈ దందాలో పాల్గొన్న ఆరోగ్యశ్రీ ఉమ్మడి వరంగల్‌ జిల్లా కోఆర్డినేటర్‌ సహా మరో ముగ్గురు టీం లీడర్లపై వేటు వేశారు. దీన్ని తొలగించుకునేందుకు వారు వైద్య ఆరోగ్యశాఖ ఉన్నతాధికారుల వద్ద ప్రదక్షిణలు చేస్తున్నారు. కొందరు ఆరోగ్యశ్రీ అధికారులు తిరిగి వారిని వెనక్కు తీసుకువచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇదిలావుండగా ఇతర జిల్లాల్లో జరుగుతున్న దందాపైనా విజిలెన్స్‌ అంతర్గతంగా విచారణ జరుపుతోంది.  

లాగిన్, పాస్‌వర్డ్‌ దొంగిలించి మరీ... 
ఆరోగ్యశ్రీని అమలుచేసేందుకు జిల్లా స్థాయిలో కోఆర్డినేటర్, మేనేజర్లు ఉంటారు. వారి కింద టీం లీడర్లు ఉంటారు. వారి పరిధిలో ప్రతీ నెట్‌వర్క్‌ ఆసుపత్రిలో ఆరోగ్య మిత్రలు విధులు నిర్వహిస్తారు. వీళ్లు నెట్‌వర్క్‌ ఆసుపత్రులకు వెళ్లే రోగుల శస్త్రచికిత్సలకు ఆన్‌లైన్‌లో అనుమతులు ఇవ్వడం, ఆ తర్వాత ప్యాకేజీ ప్రకారం ఆసుపత్రుల బిల్లులు తయారు చేసి ఆరోగ్యశ్రీ ట్రస్టుకు ఆన్‌లైన్‌లో పంపడం వారి విధుల్లో కీలకమైనవి. దీన్నే జిల్లాస్థాయిలోని ఆరోగ్యశ్రీలోని కొందరు ఉద్యోగులు సొమ్ము చేసుకుంటున్నారు. ఎలాంటి కొర్రీలు పెట్టకుండా బిల్లులు పాస్‌ చేయించినందుకు నెట్‌వర్క్‌ ఆసుపత్రుల నుంచి మామూళ్లు తీసుకుంటారు. ఎవరైనా ఇవ్వకుంటే కొర్రీలు వేస్తారు. లేకుంటే ఆయా ఆసుపత్రులపై చర్యలు తీసుకునేలా ఉన్నతాధికారులకు ఫిర్యాదులు చేస్తారు. దీంతో ప్రతీ నెట్‌వర్క్‌ ఆసుపత్రి వారికి నెలవారీగా రూ. 10 వేల నుంచి రూ. 25 వేల వరకు ఇవ్వాల్సిందే. దాంతోపాటు ఆరోగ్యశ్రీ రోగుల నుంచి బిల్లులకు చెల్లించాల్సిన పన్నుల సొమ్మును వసూలు చేస్తున్నారు. మరోవైపు బయటి దళారులతో కుమ్మక్కై వారికి ఆరోగ్యశ్రీ అంతర్గత వెబ్‌సైట్‌ లాగిన్, పాస్‌వర్డ్‌ వివరాలు అందజేస్తారు. వారు ఆ బిల్లుల వివరాలు, అవి ఆమోదం పొందాయో గుర్తిస్తారు. ఆ ప్రకారం ముందే ఆసుపత్రి యాజమాన్యం వద్దకు వెళ్లి మేం ఇంత సొమ్ము ఆరోగ్యశ్రీ ట్రస్టు నుంచి ఇప్పిస్తామంటూ బేరసారాలు ఆడతారు. లేకుంటే కొర్రీలు పెడతామని బెదిరిస్తారు. దీంతో యాజమాన్యాలు ఎంతో కొంత ముట్టజెప్పుతాయి.  

తీగలాగితే డొంక కదిలిందిలా...! 
గత నెల ఆరోగ్యశ్రీ కింద చికిత్స పొందిన రోగులను ఫోన్లలో బెదిరించి డబ్బులు వసూలు చేస్తున్న హరీశ్‌ అనే వ్యక్తిని జూబ్లీహిల్స్‌ పోలీసులు అరెస్టు చేసి కేసు నమోదు చేశారు. ఈ ముఠా ఆరోగ్యశ్రీ  కింద వైద్య సేవలు పొందిన రోగుల జాబితాను తస్కరించి వారి నుంచి బిల్లులపై వేసే పన్నుల పేరిట డబ్బులు వసూలు చేసినట్లు హరీశ్‌ అంగీకరించాడు. వరంగల్‌ కేంద్రంగా జరుగుతున్న ఈ రాకెట్‌ను విజిలెన్స్‌ సిబ్బంది బట్టబయలు చేశారు. ఓ నలుగురు ఉద్యోగులు ఆరోగ్యశ్రీ వెబ్‌సైట్‌ లాగిన్‌ సమాచారాన్ని హరీశ్‌తో పాటు ఇతర వ్యక్తులకు ఇచ్చి  రోగుల వివరాలను సేకరించి, డబ్బులు వసూలు చేస్తున్నారని తేలింది. ఆరోగ్యశ్రీ వెబ్‌సైట్లలో ప్రభుత్వ చెల్లింపుల వివరాలను తెలుసుకుని ఆయా ఆసుపత్రులకు వెళ్లి తామిచ్చిన  నివేదికల  వల్లే వారికి ఆరోగ్యశ్రీ నిధులు మంజూరు ఆయ్యాయని, అందుకు  కమీషన్‌ చెల్లించాలని ఒత్తిళ్లు చేసి మరీ డబ్బులు  వసూలు చేస్తున్నారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement