ఆరోగ్యశ్రీలో సంస్కరణలకు శ్రీకారం  | Making reforms in Aarogyasri | Sakshi
Sakshi News home page

ఆరోగ్యశ్రీలో సంస్కరణలకు శ్రీకారం 

Published Fri, Jun 14 2019 5:03 AM | Last Updated on Fri, Jun 14 2019 10:39 AM

Making reforms in Aarogyasri - Sakshi

సాక్షి, అమరావతి: ప్రజలందరికీ మెరుగైన వైద్య సేవలు అందించే దిశగా ఆరోగ్య శాఖలో భారీ సంస్కరణలకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా ఆరోగ్యశ్రీ పథకాన్ని పునరుజ్జీవింపజేసేందుకు ఓ కమిటీని నియమించింది. పథకాన్ని బలోపేతం చేసేందుకు ఏం చేయాలి, ఎలా ముందుకెళ్లాలి అన్న అంశాలపై నిర్ణీత సమయంలో నివేదిక ఇచ్చేందుకు నిపుణులతో కమిటీని ఏర్పాటు చేస్తూ వైద్య ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి కె.ఎస్‌.జవహర్‌రెడ్డి బుధవారం ఉత్తర్వులు జారీచేశారు. గడిచిన కొన్ని సంవత్సరాలుగా కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతున్న ఆరోగ్యశ్రీ పథకానికి జవసత్వాలు ఇచ్చేందుకు ఈ కమిటీ పనిచేయనుంది. దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి హయాంలో ప్రారంభమైన ఆరోగ్యశ్రీ పథకం.. దేశంలోనే అత్యంత గొప్ప పథకంగా రూపుదిద్దుకున్న విషయం తెలిసిందే. తర్వాత ప్రభుత్వాలు ఆ పథకంపై నిర్లక్ష్య వైఖరి ప్రదర్శించాయి. ఇప్పుడు ఈ పథకాన్ని బలోపేతం చేసి ప్రజలందరికీ మెరుగైన వైద్యం అందుబాటులోకి తెచ్చేందుకు ప్రణాళికాబద్ధంగా ముందుకెళ్లాలని సర్కారు నిర్ణయించింది. పథకం రూపకర్త, దివంగత నేత వైఎస్‌ రాజశేఖరరెడ్డి పేరునే ఈ పథకానికి వైఎస్సార్‌ ఆరోగ్య శ్రీగా పెట్టారు. గతంలో ఉన్న ఎన్టీఆర్‌ వైద్య సేవ    ట్రస్ట్‌ పేరు మార్చి ‘వైఎస్సార్‌ ఆరోగ్యశ్రీ హెల్త్‌ కేర్‌ ట్రస్ట్‌’గా నామకరణం చేశారు.  

పథకాలపై సమగ్ర సమీక్ష 
గత ప్రభుత్వ అలక్ష్యం కారణంగా ప్రస్తుతం 108, 104 పథకాలు అధ్వానంగా నడుస్తున్నాయి. ఈ సేవలతో పాటు అన్ని వైద్య ఆరోగ్య శాఖ వివిధ పథకాలపైనా నిపుణుల కమిటీ అధ్యయనం చేసి నివేదిక ఇస్తుందని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఏ పథకానికి ఎన్ని నిధులు కేంద్రం నుంచి వస్తున్నాయి, వాటి వినియోగం ఎంత, దీనివల్ల పేదలకు ఎలాంటి వైద్యసేవలు అందుతున్నాయి అన్నది కూలంకషంగా పరిశీలించనున్నారు. రాష్ట్రంలో గడిచిన ఐదేళ్లలో చేపట్టిన పీపీపీ ప్రాజెక్టులన్నిటిపైన కూడా కమిటీ పునఃసమీక్ష చేసి నివేదిక ఇస్తుందని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.   

రిటైర్డ్‌ ఐఏఎస్‌ అధికారి ఆధ్వర్యంలో కమిటీ 
తెలుగుదేశం ప్రభుత్వం వచ్చాక ఆరోగ్యశ్రీ పథకాన్ని ఎన్టీఆర్‌ వైద్యసేవగా పేరు మార్చారు. ఇప్పుడు మళ్లీ దానిని వైఎస్సార్‌ ఆరోగ్యశ్రీ హెల్త్‌ కేర్‌ ట్రస్ట్‌గా మారుస్తూ ప్రభుత్వం ఉత్తర్వులిచ్చింది. ఈ కమిటీకి రిటైర్డ్‌ ఐఏఎస్‌ అధికారి సుజాతారావు చైర్‌పర్సన్‌గా వ్యవహరిస్తారు. ప్రముఖ నరాల సంబంధ వైద్య నిపుణుడు డా.భూమిరెడ్డి చంద్రశేఖర్‌రెడ్డి, డా.సింహాద్రి చంద్రశేఖర్‌ రావు, న్యూరో సర్జన్‌ డా.సాంబశివారెడ్డి, దంతవైద్య నిపుణులు కె.సతీష్‌కుమార్‌రెడ్డి, డా.దుత్తా రామచంద్రరావు, ఎన్టీఆర్‌ హెల్త్‌ యూనివర్సిటీ వైస్‌ చాన్స్‌లర్, వైద్య ఆరోగ్యశాఖలో వివిధ విభాగాల అధికారులు ఉన్నారు. కమిటీకి వైద్య ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి కె.ఎస్‌.జవహర్‌రెడ్డి కన్వీనర్‌గా వ్యవహరిస్తారు. నిపుణుల కమిటీ 8 వారాల్లో నివేదిక ఇవ్వాలని ప్రభుత్వం ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది.  

వైఎస్సార్‌ ఆరోగ్యశ్రీపై కమిటీ బాధ్యతలు 
- నాణ్యమైన వైద్య సేవలు అందించేందుకు ఎలాంటి చర్యలు తీసుకోవాలి 
ప్రస్తుతం కొనసాగుతున్న ఎన్టీఆర్‌ వైద్యసేవలో లోపాలేమిటి.. వాటిని ఎలా అధిగమించాలి 
పథకానికి సంబంధించి లోటుపాట్లపై రోడ్‌మ్యాప్‌ రూపకల్పన 
ప్రాథమిక వైద్యం మొదలుకుని, ప్రభుత్వ, ప్రైవేటు సంస్థల్లో పథకం అమలుకు చర్యలు 
ఏరియా, జిల్లా ఆస్పత్రులతో పాటు బోధనాసుపత్రుల్లో ఆధునిక వైద్యం అందించేందుకు చర్యలు 
మన రాష్ట్రంలో అందే వైద్య సేవలు దేశంలోనే బెస్ట్‌ అనిపించేలా ఉండేందుకు సూచనలు 
రాష్ట్రంలో ప్రస్తుతం నడుస్తున్న పథకాలు, వాటికి కేంద్రం ఇస్తున్న నిధులు, రాష్ట్ర వాటా, పీపీపీ పథకాల వల్ల రోగులకు ఎంతమేరకు లబ్ధి జరిగిందో అంచనా వేయడం  
- ప్రస్తుతం రాష్ట్రంలో 108, 104 వాహనాల అమలు పరిస్థితి, వాటి బలోపేతానికి తీసుకోవాల్సిన చర్యలపై నివేదిక 
వైఎస్సార్‌ ఆరోగ్యశ్రీని నిర్ణీత కాల వ్యవధిలో అమలు పరిచేందుకు అవసరమైన ప్రణాళిక 
కేన్సర్, మధుమేహం, గుండెపోటు, రక్తపోటు వంటి వ్యాధుల నివారణకు ప్రత్యేక కార్యచరణతో పాటు ముఖ్యంగా కుష్టు, మలేరియా, గ్యాస్ట్రో వ్యాధుల నివారణ చర్యలపై నివేదిక 
- ప్రస్తుతం అమలులో ఉన్న హెల్త్‌ ఇన్ఫర్మేషన్‌ మేనేజ్‌మెంట్‌ సిస్టం (హెచ్‌ఎంఐఎస్‌), హాస్పిటల్‌ హెల్త్‌ రికార్డ్‌ సిస్టం, హౌస్‌హోల్డ్‌ హెల్త్‌ రికార్డ్‌ డిజిటలైజేషన్‌ వంటి వాటిని సమీక్షించి, అత్యవసర సమయాల్లో అందించాల్సిన వైద్యం (క్రిటికల్‌ కేర్‌ హెల్త్‌) ప్రామాణికాలపై నివేదిక 
పేదలకు అత్యాధునిక వైద్యం అందించేందుకు   ఆర్థిక అవసరాలు, వనరులపై నివేదిక 
నివేదిక ఇవ్వడానికి ముందే కమిటీ క్షేత్రస్థాయిలో పర్యటించడం, వర్క్‌షాప్‌లు నిర్వహించడం, జబ్బుల స్థితిగతులపై అధ్యయనం చేయడం  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement