శుక్రవారం క్యాంపు కార్యాలయంలో వైఎస్సార్ ఆరోగ్యశ్రీ హెల్త్ కేలండర్‌ను ఆవిష్కరిస్తున్న సీఎం వైఎస్ జగన్
వైఎస్సార్ ఆరోగ్యశ్రీ లబ్ధిదారులకు మెరుగైన సేవలు లభిస్తాయనే ఉద్దేశంతోనే పొరుగు రాష్ట్రాల్లోని మూడు ప్రధాన నగరాల్లో 130 ఆసుపత్రులను ఎంపానల్ చేశాం.
– సీఎం వైఎస్ జగన్
సాక్షి, అమరావతి/సాక్షి ప్రతినిధి, ఒంగోలు/హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా భావించే వైఎస్సార్ ఆరోగ్యశ్రీ పథకాన్ని మరింత బలోపేతం చేస్తూ తీసుకున్న కీలక నిర్ణయం శుక్రవారం నుంచి అమల్లోకి వచ్చింది. పొరుగు రాష్ట్రాల్లోని హైదరాబాద్, చెన్నై, బెంగళూరుల్లో 130 ఆసుపత్రుల్లో ఈ సేవలను ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి శుక్రవారం తన క్యాంపు కార్యాలయం నుంచి ప్రారంభించారు. దీంతో ఈ మూడు నగరాల్లోని 130 ఆసుపత్రుల్లో వైఎస్సార్ ఆరోగ్యశ్రీ లబ్ధిదారులకు 17 సూపర్ స్పెషాలిటీ విభాగాల్లోని 716 రకాల జబ్బులకు వైద్య సేవలు అందుబాటుల్లోకి వచ్చాయి. ఇందుకు సంబంధించిన పోస్టర్‌ను ముఖ్యమంత్రి వైఎస్ జగన్ విడుదల చేశారు. ప్రతి గ్రామ సచివాలయంలో ఈ పోస్టర్‌ను అంటిస్తారని, విస్తరించిన వైద్య సేవలకు సంబంధించిన సమాచారాన్ని ఆ పోస్టర్‌లో పేర్కొన్నట్లు అధికారులు తెలిపారు. అనంతరం.. ఆ మూడు నగరాల్లోని వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న వైఎస్సార్ ఆరోగ్యశ్రీ లబ్ధిదారులు, అక్కడి వైద్యులతో సీఎం వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడారు. రోగుల యోగక్షేమాలు అడిగి తెలుసుకున్న ఆయన.. ఆ తర్వాత వైద్యులతోనూ మాట్లాడి చికిత్స విధానాలను ఆరా తీశారు.
సౌకర్యాలు బాగున్నాయా.. బాగా చూసుకుంటున్నారా?
హైదరాబాద్ మెడికవర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న కర్నూలుకు చెందిన నేతి కుంటయ్యతోపాటు మరో వ్యక్తి శివగురప్పలతో సీఎం వైఎస్ జగన్ మాట్లాడారు వారికి అందుతున్న వైద్య సేవల గురించి అడిగి తెలుసుకున్నారు. ఆసుపత్రిలో సౌకర్యాలు బాగాన్నాయా.. బాగా చూసుకుంటున్నారా లేదా అని ఆరా తీశారు. దీంతో.. బాగా చూసుకుంటున్నారని, సదుపాయాలు బాగున్నాయని, అత్యంత మెరుగైన వైద్య సేవలు పొందగలిగామని కుంటయ్య బదులివ్వగా.. ‘ఆల్ ది బెస్ట్’ అని సీఎం చెప్పారు. అనంతరం.. ఆరోగ్యశ్రీ పేషెంట్లకు అందిస్తున్న వైద్య సేవల గురించి అక్కడి డాక్టర్లు కృష్ణప్రసాద్, పద్మకుమార్‌లు సీఎంకు వివరించారు. ఏపీ నుంచి వచ్చే వారికి మెరుగైన వైద్య సదుపాయాలు అందించాలని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి వారిని కోరారు.
శుక్రవారం శ్రీకాకుళం జిల్లా టెక్కలిలో వేతనాలు పెంచినందుకు సీఎం వైఎస్ జగన్ చిత్రపటానికి క్షీరాభిషేకం చేస్తున్న 108 ఉద్యోగులు
మా పేషెంట్లను బాగా చూసుకోవాలి
అలాగే, చెన్నై మియాట్ ఆసుపత్రిలో వైఎస్సార్ ఆరోగ్యశ్రీ కింద చికిత్స పొందుతున్న ప్రకాశం జిల్లా సింగరాయకొండ మండలం మూలగుంటపాడుకు చెందిన బేల్దారి మేస్త్రి సన్నెబోయిన వెంకటేష్, ప్రమీల దంపతుల ఏకైక కుమారుడు.. చిన్నారి లోకేశ్వర్ ఆరోగ్య పరిస్థితి గురించి వైఎస్ జగన్ వైద్యులను అడిగి తెలుసుకున్నారు. పుట్టుకతో మల ద్వారం లేకపోవడంతో చిన్న పేగుల సమస్యతో చిన్నారి బాధపడుతున్నాడని, ఇంతకు ముందు సర్జరీ కూడా చేశారని డాక్టర్ రాఘవన్ సీఎంకు వివరించారు. చిన్నపేగు తెరిచి మళ్లీ క్లోజ్ చేస్తామని డాక్టర్ చెప్పారు. ఆరోగ్యశ్రీ కింద ఇది మొట్టమొదటి కేసు అని చెప్పడంతో.. బాలునికి ఎలాంటి ఇబ్బంది కలగకుండా చికిత్స చేయాలని.. శస్త్రచికిత్సకు వెంటనే అనుమతులు ఇస్తామని వైఎస్ జగన్ హామీ ఇచ్చారు. అలాగే, ఆసుపత్రిలోని సదుపాయాలపై చిన్నారి తల్లిదండ్రులను ముఖ్యమంత్రి అడిగి తెలుసుకున్నారు. అపారమైన విశ్వాసం, నమ్మకంతో మా పేషెంట్లను మీ దగ్గరికి పంపిస్తున్నామని.. వారిని బాగా చూసుకోవాలంటూ వైద్యులను ఈ సందర్భంగా సీఎం జగన్ కోరారు. దేవుని మాదిరిగా ముఖ్యమంత్రి తమ బిడ్డకు నేనున్నానంటూ భరోసా ఇవ్వడంపై లోకేశ్వర్ తల్లిదండ్రులు సంతోషం వ్యక్తంచేశారు. కాగా, గత ప్రభుత్వ హయాంలో ఆరోగ్యశ్రీ ద్వారా చికిత్స చేసేందుకు వీల్లేకపోవడంతో వెంకటేష్ అప్పులుచేసి మరీ తన బిడ్డ వైద్యానికి సుమారు రూ.4లక్షల వరకు ఖర్చుచేశాడు.
మెరుగైన వైద్య సేవల కోసమే పొరుగు రాష్ట్రాల్లోనూ ఆరోగ్యశ్రీ
ఇక బెంగళూరు పోర్టిస్ ఆసుపత్రిలో వైఎస్సార్ ఆరోగ్యశ్రీ కింద చికిత్స పొందుతున్న అనంతపురం జిల్లాకు చెందిన బి. సుమిత్రకు అందుతున్న వైద్యంపైనా సీఎం డాక్టర్లను ఆరా తీశారు. కిడ్నీకి సంబంధించిన వ్యాధితో బాధపడుతున్నారని, షాక్‌వేవ్ పద్ధతి ద్వారా కిడ్నీలో రాళ్లను తొలగించే ప్రక్రియను చేపడుతున్నామని డాక్టర్ షకీర్ తబ్‌రీజ్ వైఎస్ జగన్‌కు వివరించారు. వైఎస్సార్ ఆరోగ్యశ్రీ లబ్ధిదారులకు మెరుగైన సేవలు లభిస్తాయనే ఉద్దేశ్యంతోనే పొరుగు రాష్ట్రాల్లోని మూడు ప్రధాన నగరాల్లో దాదాపు 130 ఆసుపత్రులను ఎంపానల్ చేశామని ముఖ్యమంత్రి అన్నారు.
కాగా, ఈ కార్యక్రమంలో రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి జవహర్‌రెడ్డి, ఏపీ మెడికల్ సర్వీసెస్ అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (ఏపీఎంఎస్‌ఐడీసీ) చైర్మన్ చంద్రశేఖర్‌రెడ్డి, వైఎస్సార్ ఆరోగ్యశ్రీ సీఈఓ మల్లికార్జున్, సీఎం కార్యాలయంలో ప్రత్యేకాధికారి హరికృష్ణ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment