
బంజారా హిల్స్(హైదరాబాద్) : పెళ్లి చేసుకుంటానని ఓ వైద్యురాలిని నమ్మించి మోసం చేసిన వ్యక్తిపై జూబ్లీహిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు. వివరాల్లోకి వెళితే.. జూబ్లీహిల్స్ ప్రాంతానికి చెందిన వైద్యురాలికి జనవరిలో వివాహ వేదిక ద్వారా హర్ష చెరుకూరి అనే యువకుడితో పరిచయం ఏర్పడింది. ఫోన్ నంబర్లు ఇచ్చి పుచ్చుకున్న వారు వాట్సాప్ చాటింగ్ చేసుకుంటున్నారు.
ఈ నేపథ్యంలో సదరు యువకుడు తన పాన్ కార్డు విషయంలో కొంత గందరగోళం ఉందని ఆదాయపన్ను శాఖ అధికారులు తన బ్యాంకు ఖాతాను సీజ్ చేయడంతో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు తెలిపాడు. తనకు కొంత నగదు సహాయం చేస్తే తిరిగి ఇస్తానని చెప్పాడు. అతడి మాటలు నమ్మిన వైద్యురాలు పలు దఫాలుగా రూ.10 లక్షలు ఇచ్చింది. ఈ నెల 21న తన తల్లి అమెరికా నుంచి వస్తున్నదని పెళ్లి విషయం మాట్లాడుకుందాం అని చెప్పాడు.
తీరా అతడి తల్లి రాకపోవడంతో అనుమానం వచ్చిన బాధితురాలు అతడిని నిలదీసింది. తన డబ్బులు తిరిగి ఇవ్వాలని కోరింది. దీంతో తన నిజ స్వరూపాన్ని బయట పెట్టిన హర్ష డబ్బులు అడిగితే నీ ఫొటోలు మార్ఫింగ్ చేసి సోషల్ మీడియా వేదికలో పోస్ట్ చేస్తానంటూ బెదిరించాడు. ఫొటోలు వైరల్ కాకుండా ఉండాలంటే మరో రూ.10 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశాడు. దీంతో బాధితురాలు జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment