
జూ.ఎన్టీఆర్ ఇంట్లోకి చొరబాటు యత్నం
సెక్యూరిటీ అప్రమత్తతతో పరార్
సాక్షి, హైదరాబాద్: సినీనటుడు జూనియర్ ఎన్టీఆర్ ఇంట్లోకి చొరబడేందుకు ఓ అగంతకుడు విఫలయత్నం చేసిన సంఘటన జూబ్లీహిల్స్ పోలీస్‌స్టేషన్ పరిధిలో ఆదివారం రాత్రి జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. జూబ్లీహిల్స్ రోడ్ నంబర్ 37లో నివాసం ఉంటున్న జూనియర్ ఎన్టీఆర్ ఇంట్లోకి ఆదివారం అర్ధరాత్రి చేతిలో తుపాకీ ఉన్న ఓ గుర్తుతెలియని వ్యక్తి ప్రహరీగోడ దూకి లోనికి వెళ్లాడు. అలికిడి కావడంతో అప్రమత్తమైన సెక్యూరిటీ సిబ్బంది అటువైపుగా రావడంతో.. గమనించిన అగంతకుడు అక్కడ్నుంచి పారిపోయాడు.
అగంతకుడు నెంబర్‌ప్లేట్ లేని వాహనంపై అక్కడికి వచ్చినట్లు తెలుస్తోంది. ఈ సంఘటనంతా సమీపంలోని విజయవాడ ఎంపీ లగడపాటి రాజగోపాల్ ఇంటి ముందున్న సీసీ కెమెరాలో రికార్డైంది. జూనియర్ ఎన్టీఆర్ ఫిర్యాదు మేరకు జూబ్లీహిల్స్ పోలీసులు సోమవారం సీసీ కెమెరా పుటేజిని పరిశీలించి, ఆ వ్యక్తి ఆచూకీ కనుగొనేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు.