![pet dog issue in jubilee hills police station](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/02/8/1221.jpg.webp?itok=J82_9EpL)
రెండు రోజులు శ్రమించి యజమానికి అప్పగింత
యువకులను అభినందించిన పోలీసులు
హైదరాబాద్: జూబ్లీహిల్స్‌లో నివసించే 21 ఏళ్ల సంవీత్.. తన స్నేహితులైన గౌతమ్, దీక్షిత్, తరుణ్, ధనుష్‌లతో కలిసి మంగళవారం రాత్రి కారులో వెళ్తున్న సమయంలో మాదాపూర్‌లోని బజాజ్ ఎ్రక్టానిక్స్ ఎదుట సలూకి జాతికి చెందిన పెంపుడు శునకం కనిపించింది. దాని యజమానిని గుర్తించేందుకు వారంతా ప్రయత్నించారు. చుట్టుపక్కల ప్రాంతాల్లో వెతికారు. ఫలితం లేకపోవడంతో చివరికి మాదాపూర్ పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేశారు. శునకానికి తాడు కొని దానిని గౌతమ్ ఇంటికి తీసుకువెళ్లారు. బుధవారం ఉదయం ఉద్యోగాలకు వెళ్లి సాయంత్రం తిరిగి వచ్చారు.
శునకం యజమానిని కనుగొనేందుకు చుట్టుపక్కల అన్ని ప్రాంతాల్లో వెతుకుతూ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నివాసం సమీపంలోకి వెళ్లారు. అక్కడ ఉన్న ఒక సెక్యూరిటీ సదరు కుక్కను గుర్తు పట్టి సమీపంలో చూశానని చెప్పారు. దీంతో యజమానిని గుర్తించేందుకు చుట్టుపక్కల ఉన్న అందరి ఇళ్లను తట్టారు. ఈ క్రమంలోనే ఓ ఇంటి వాచ్‌మన్ ఈ కుక్కను గుర్తించాడు. అంతకు కొన్ని గంటల ముందే కుక్క యజమాని వెతుక్కుంటూ వచ్చాడని, అతని సెల్ నంబర్ ఇచ్చాడు. దీంతో జూబ్లీహిల్స్‌కు చెందిన ఆ యజమానికి కుక్కను అప్పగించారు.
బ్లేజ్ పేరుతో పిలుచుకునే ఈ కుక్క కనిపించగానే యజమాని ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. పోలీసులు యువకులను అభినందించారు. కాగా.. తనకు రెండు పెంపుడు కుక్కలు ఉన్నాయని, తన స్నేహితుడు గౌతంకు ఆరు కుక్కలు ఉన్నాయని.. వాటితో ఉండే అనుబంధం వేరుగా ఉంటుందని సంవీత్ తెలిపారు. అందుకే రెండు రోజుల పాటు కుక్క యజమానిని గుర్తించేందుకు గల్లీ గల్లీ జల్లెడ పట్టామన్నారు. అప్పగించిన కుక్క ఖరీదు దాదాపు రూ.2 లక్షలు నుంచి రూ.3 లక్షల వరకు ఉంటుందని.. అందుకే ఎంత కష్టమైనా దాని యజమానిని గుర్తించి అప్పగించామన్నారు.
Comments
Please login to add a commentAdd a comment