పిల్లల్లాగే కనిపెట్‌కోవాలి | Some guidelines from Animal Welfare Board of India: Pet Dogs Revised Rules | Sakshi
Sakshi News home page

పిల్లల్లాగే కనిపెట్‌కోవాలి

Published Sat, Dec 21 2024 12:20 AM | Last Updated on Sat, Dec 21 2024 12:20 AM

Some guidelines from Animal Welfare Board of India: Pet Dogs Revised Rules

పెట్‌ను పెంచుకునే విషయంలో భారతీయ సమాజం జపాన్‌ దిశగా అడుగులు వేస్తోంది. పిల్లలు పెద్దయి ఉద్యోగాలు, వ్యాపారాలతో దూరంగా వెళ్లిపోయిన తర్వాత ఇంట్లో ఆ వెలితిని భర్తీ చేయడానికి పెట్‌లను ఆశ్రయిస్తున్నారు. అలాగే సింగిల్‌ చైల్డ్‌ ఉన్న పేరెంట్స్‌ కూడా తమ బిడ్డకు తోబుట్టువులు లేని లోటు తీర్చడానికి పెట్‌ మీద ఆధారపడుతున్నారు. అయితే పెట్‌ పేరెంట్స్‌ ఎటికెట్స్‌ పాటించకపోవడం సమాజానికి ఇబ్బందిగా మారుతోంది.

ఇందుకోసం యానిమల్‌ వెల్ఫేర్‌ బోర్డ్‌ ఆఫ్‌ ఇండియా కొన్ని మార్గదర్శకాలను చెప్పింది కూడా. అయినా పట్టించుకోవడంలో మనవాళ్లు విఫలమవుతూనే ఉన్నారు. ఫలితం... పాదచారులు ఫుట్‌పాత్‌లు, రోడ్డు అంచున ఉన్న పెట్‌ మల విసర్జకాలను తప్పించుకుంటూ నడవాలి. వాహనదారులు పెట్‌ ఒక్కసారిగా రోడ్డు మీదకు దూకుతుందేమోననే ఆందోళనతో వాహనం నడపాలి. పెట్‌ని కంట్రోల్‌ చేయడంలో విఫలమవుతున్న కారణంగా ఎదురవుతున్న సమస్యల జాబితా పెద్దదే.

ఎప్పటికీ చంటిబిడ్డే! 
పెట్‌ని పెంచుకోవడం అంటే చంటిపిల్లలను పెంచినట్లే. పిల్లలైతే పెద్దయ్యేకొద్దీ వాళ్ల పనులు వాళ్లు చేసుకుంటారు. పెట్‌ విషయంలో అలా కుదరదు. దాని జీవితకాలమంతా చంటిబిడ్డను సాకినట్లే చూసుకోవాలి. మన దగ్గర ఇతర జంతువులకంటే ఎక్కువగా కుక్కలనే పెంచుకుంటారు. పెట్‌ని పెంపకానికి ఇచ్చేటప్పుడే ఏమి చేయాలి, ఏమి చేయకూడదనే నియమావళి చెబుతాం. వ్యాక్సినేషన్, శుభ్రంగా ఉంచడం వరకే పాటిస్తుంటారు. విసర్జకాలు, మనుషుల మీదకు ఎగబాకడం వంటి విషయాలను తగినంతగా పట్టించుకోవడం లేదు.

ఎక్కడ రాజీపడతారో సరిగ్గా వాటిలోనే ఇరుగుపొరుగుతో విభేదాలు తలెత్తుతుంటాయని చెప్పారు ఢిల్లీలోని యానిమల్‌ యాక్టివిస్ట్‌ కావేరి రాణా. పెట్‌ పేరెంటింగ్‌ విషయంలో పాటించాల్సిన ఎటికెట్స్‌ నేర్పించడానికి క్లాసులు నిర్వహిస్తున్న సృష్టి శర్మ మాట్లాడుదూ... శిక్షణ పెట్‌కి మాత్రమే అనుకుంటారు. కానీ పెట్‌ పేరెంట్‌కి కూడా అవసరమే. పెట్‌ని వాకింగ్‌కి తీసుకెళ్లినప్పుడు తప్పనిసరిగా బెల్ట్‌ వేసి తీసుకెళ్లాలి. అయితే బెల్డ్‌ను వదులుగా పట్టుకుంటారు.

దాంతో ఆ పెట్‌ కొత్త మనిషి లేదా మరొక కుక్క కనిపించగానే మీదకు ఉరుకుతుంది. అలాగే ఒక్కసారిగా రోడ్డు మీదకు ఉరకడంతో వెనుక నుంచి వచ్చే వాహనాల కింద పడే ప్రమాదం ఉంటుంది. వీటితోపాటు తరచూ ఎదురయ్యే వివాదాలన్నీ పెట్‌ విసర్జన విషయంలోనే. పెట్‌ని వాకింగ్‌కి కాలనీల్లో రోడ్డు మీదకు లేదా పార్కులకు తీసుకెళ్తారు. విసర్జన కూడా రోడ్డు మీద లేదా పార్కులోనే చేయిస్తారు. వాకింగ్‌కి వచ్చిన ఇతరులకు కలిగే అసౌకర్యాన్ని ఏ మాత్రం పట్టించుకోరు.  

పెట్‌ని నియంత్రించరాదు! 
యానిమల్‌ వెల్ఫేర్‌ బోర్డ్‌ నియమాల ప్రకారం పెట్‌ని నియంత్రించే ప్రయత్నం చేయరాదు. అవరడం వంటి దాని సహజసిద్ధమైన చర్యలను గౌరవించాలి. అలాగని రాత్రిళ్లు అరుస్తూ ఉంటే ఇరుగుపొరుగు వారికి అసౌకర్యం. కాబట్టి పెట్‌ కూడా రాత్రి నిద్రపోయేటట్లు రెగ్యులర్‌ స్లీప్‌టైమ్‌ని అలవాటు చేయాలి. బయటకు తీసుకెళ్లినప్పుడు ఎవరి దగ్గరైనా ఆహారపదార్థాలు కనిపిస్తే వాళ్ల మీదకు దూకి లాక్కునే ప్రమాదం ఉంటుంది. కాబట్టి బయటకు తీసుకెళ్లడానికి ముందే వాటి ఆకలి తీర్చాలి. విసర్జన విషయంలో... ఒక పేపర్‌ లేదా పాలిథిన్‌ షీట్‌ మీద విసర్జన చేయించి ఆ షీట్‌తో సహా తీసి డస్ట్‌బిన్‌లో వేయాలి.

పెట్‌ పేరెంట్స్‌ తమ పెట్‌లను గారంగా చూసుకుంటారు. కాబట్టి వాటికి పాంపరింగ్‌ అలవాటైపోతుంది. ఇంట్లో వాళ్లతోపాటు ఇంటికి వచ్చిన అతిథులు కూడా గారం చేయాలని కోరుకుంటాయి. అతిథుల మీదకు వెళ్లిపోయి ఒడిలో కూర్చుంటాయి. వచ్చిన వాళ్లకు పెట్‌లను తాకడం ఇష్టంలేకపోతే వారికి ఎదురయ్యేది నరకమే. అలాగే పెట్‌ పేరెంట్స్‌ పెట్‌ ఒళ్లంతా నిమిరి చేతులను కడుక్కోకుండా అలాగే అతిథులకు తినుబండారాలను వడ్డించడం కూడా దాదాపు అలాంటిదే. పెట్‌ పేరెంట్‌కు శిక్షణ తరగతుల్లో అన్ని విషయాలనూ వివరిస్తారు. కానీ మన భారతీయ సమాజం కొంతవరకే ఒంటపట్టించుకుంటోంది. జపాన్, యూఎస్‌ వంటి దేశాల్లోనూ పెట్‌ లవర్స్‌ ఎక్కువే. అక్కడ నియమావళిని కూడా అంతే కచ్చితంగా పాటిస్తారు.             ∙

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement