Animal welfare board
-
పిల్లల్లాగే కనిపెట్‌కోవాలి
పెట్‌ను పెంచుకునే విషయంలో భారతీయ సమాజం జపాన్ దిశగా అడుగులు వేస్తోంది. పిల్లలు పెద్దయి ఉద్యోగాలు, వ్యాపారాలతో దూరంగా వెళ్లిపోయిన తర్వాత ఇంట్లో ఆ వెలితిని భర్తీ చేయడానికి పెట్లను ఆశ్రయిస్తున్నారు. అలాగే సింగిల్ చైల్డ్ ఉన్న పేరెంట్స్ కూడా తమ బిడ్డకు తోబుట్టువులు లేని లోటు తీర్చడానికి పెట్ మీద ఆధారపడుతున్నారు. అయితే పెట్ పేరెంట్స్ ఎటికెట్స్ పాటించకపోవడం సమాజానికి ఇబ్బందిగా మారుతోంది.ఇందుకోసం యానిమల్ వెల్ఫేర్ బోర్డ్ ఆఫ్ ఇండియా కొన్ని మార్గదర్శకాలను చెప్పింది కూడా. అయినా పట్టించుకోవడంలో మనవాళ్లు విఫలమవుతూనే ఉన్నారు. ఫలితం... పాదచారులు ఫుట్‌పాత్‌లు, రోడ్డు అంచున ఉన్న పెట్ మల విసర్జకాలను తప్పించుకుంటూ నడవాలి. వాహనదారులు పెట్ ఒక్కసారిగా రోడ్డు మీదకు దూకుతుందేమోననే ఆందోళనతో వాహనం నడపాలి. పెట్ని కంట్రోల్ చేయడంలో విఫలమవుతున్న కారణంగా ఎదురవుతున్న సమస్యల జాబితా పెద్దదే.ఎప్పటికీ చంటిబిడ్డే! పెట్ని పెంచుకోవడం అంటే చంటిపిల్లలను పెంచినట్లే. పిల్లలైతే పెద్దయ్యేకొద్దీ వాళ్ల పనులు వాళ్లు చేసుకుంటారు. పెట్ విషయంలో అలా కుదరదు. దాని జీవితకాలమంతా చంటిబిడ్డను సాకినట్లే చూసుకోవాలి. మన దగ్గర ఇతర జంతువులకంటే ఎక్కువగా కుక్కలనే పెంచుకుంటారు. పెట్ని పెంపకానికి ఇచ్చేటప్పుడే ఏమి చేయాలి, ఏమి చేయకూడదనే నియమావళి చెబుతాం. వ్యాక్సినేషన్, శుభ్రంగా ఉంచడం వరకే పాటిస్తుంటారు. విసర్జకాలు, మనుషుల మీదకు ఎగబాకడం వంటి విషయాలను తగినంతగా పట్టించుకోవడం లేదు.ఎక్కడ రాజీపడతారో సరిగ్గా వాటిలోనే ఇరుగుపొరుగుతో విభేదాలు తలెత్తుతుంటాయని చెప్పారు ఢిల్లీలోని యానిమల్ యాక్టివిస్ట్ కావేరి రాణా. పెట్ పేరెంటింగ్ విషయంలో పాటించాల్సిన ఎటికెట్స్ నేర్పించడానికి క్లాసులు నిర్వహిస్తున్న సృష్టి శర్మ మాట్లాడుదూ... శిక్షణ పెట్‌కి మాత్రమే అనుకుంటారు. కానీ పెట్ పేరెంట్‌కి కూడా అవసరమే. పెట్ని వాకింగ్‌కి తీసుకెళ్లినప్పుడు తప్పనిసరిగా బెల్ట్ వేసి తీసుకెళ్లాలి. అయితే బెల్డ్‌ను వదులుగా పట్టుకుంటారు.దాంతో ఆ పెట్ కొత్త మనిషి లేదా మరొక కుక్క కనిపించగానే మీదకు ఉరుకుతుంది. అలాగే ఒక్కసారిగా రోడ్డు మీదకు ఉరకడంతో వెనుక నుంచి వచ్చే వాహనాల కింద పడే ప్రమాదం ఉంటుంది. వీటితోపాటు తరచూ ఎదురయ్యే వివాదాలన్నీ పెట్ విసర్జన విషయంలోనే. పెట్ని వాకింగ్‌కి కాలనీల్లో రోడ్డు మీదకు లేదా పార్కులకు తీసుకెళ్తారు. విసర్జన కూడా రోడ్డు మీద లేదా పార్కులోనే చేయిస్తారు. వాకింగ్‌కి వచ్చిన ఇతరులకు కలిగే అసౌకర్యాన్ని ఏ మాత్రం పట్టించుకోరు. పెట్ని నియంత్రించరాదు! యానిమల్ వెల్ఫేర్ బోర్డ్ నియమాల ప్రకారం పెట్ని నియంత్రించే ప్రయత్నం చేయరాదు. అవరడం వంటి దాని సహజసిద్ధమైన చర్యలను గౌరవించాలి. అలాగని రాత్రిళ్లు అరుస్తూ ఉంటే ఇరుగుపొరుగు వారికి అసౌకర్యం. కాబట్టి పెట్ కూడా రాత్రి నిద్రపోయేటట్లు రెగ్యులర్ స్లీప్టైమ్ని అలవాటు చేయాలి. బయటకు తీసుకెళ్లినప్పుడు ఎవరి దగ్గరైనా ఆహారపదార్థాలు కనిపిస్తే వాళ్ల మీదకు దూకి లాక్కునే ప్రమాదం ఉంటుంది. కాబట్టి బయటకు తీసుకెళ్లడానికి ముందే వాటి ఆకలి తీర్చాలి. విసర్జన విషయంలో... ఒక పేపర్ లేదా పాలిథిన్ షీట్ మీద విసర్జన చేయించి ఆ షీట్‌తో సహా తీసి డస్ట్‌బిన్‌లో వేయాలి.పెట్ పేరెంట్స్ తమ పెట్లను గారంగా చూసుకుంటారు. కాబట్టి వాటికి పాంపరింగ్ అలవాటైపోతుంది. ఇంట్లో వాళ్లతోపాటు ఇంటికి వచ్చిన అతిథులు కూడా గారం చేయాలని కోరుకుంటాయి. అతిథుల మీదకు వెళ్లిపోయి ఒడిలో కూర్చుంటాయి. వచ్చిన వాళ్లకు పెట్లను తాకడం ఇష్టంలేకపోతే వారికి ఎదురయ్యేది నరకమే. అలాగే పెట్ పేరెంట్స్ పెట్ ఒళ్లంతా నిమిరి చేతులను కడుక్కోకుండా అలాగే అతిథులకు తినుబండారాలను వడ్డించడం కూడా దాదాపు అలాంటిదే. పెట్ పేరెంట్కు శిక్షణ తరగతుల్లో అన్ని విషయాలనూ వివరిస్తారు. కానీ మన భారతీయ సమాజం కొంతవరకే ఒంటపట్టించుకుంటోంది. జపాన్, యూఎస్ వంటి దేశాల్లోనూ పెట్ లవర్స్ ఎక్కువే. అక్కడ నియమావళిని కూడా అంతే కచ్చితంగా పాటిస్తారు. ∙ -
జంతు వధ, అక్రమ రవాణా నిరోధానికి చర్యలు తీసుకోండి
సాక్షి, అమరావతి: జంతు వధ, అక్రమ రవాణా ను నిరోధించేందుకు చట్టప్రకారం తగిన చర్యలు తీసుకోవాలని హైకోర్టు శుక్రవారం పోలీసులను ఆదేశించింది. జంతు వధ, అక్రమ రవాణాపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు, ఫిర్యాదులు చేసేందుకు వీలుగా నోడల్ అధికారులను నియమించాలని సూచించింది. ఈ ప్రక్రియను మూడురోజుల్లో పూర్తి చేయాలని నిర్దేశించింది. నోడల్ అధికారుల ఫోన్ నంబర్లను, జంతుసంక్షేమ బోర్డు మార్గదర్శకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని, ఇందుకోసం ప్రధాన పత్రికల్లో ప్రకటనలివ్వాలని ఆదేశించింది. ఈ మేరకు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి (ఏసీ జే) జస్టిస్ ఆకుల వెంకటశేషసాయి, న్యాయమూర్తి జస్టిస్ రావు రఘునందన్‌రావు ధర్మాసనం ఉత్తర్వులు జారీచేసింది. బక్రీద్ సందర్భంగా జంతు వధను, అక్రమ రవాణాను అడ్డుకునేందుకు తగిన చర్యలు తీసుకునేలా అధికారులను ఆదేశించాలని కోరుతూ యానిమల్ రెస్క్యూ ఆర్గనైజేషన్ కార్యదర్శి గోపాలరావు, మరో ఇద్దరు హైకోర్టులో ప్రజాప్రయోజ న వ్యాజ్యం (పిల్) దాఖలు చేశారు. ఈ వ్యాజ్యంపై ఏసీజే ధర్మాసనం శుక్రవారం విచారించింది. జంతు హింసను అడ్డుకోవడానికి చర్యలు తీసుకోకపోవడం సరికాదు ఇదిలా ఉంటే.. జంతు అక్రమ రవాణా, గోవధ నిరోధానికి ఎలాంటి చర్యలు తీసుకున్నారో తెలియచేయాలని గుంటూరు మునిసిపల్ కమిషనర్‌ను హైకోర్టు ఆదేశించింది. జంతు హింసను అడ్డుకోవడానికి ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం ఎంతమాత్రం సరికాదంది. పూర్తి వివరాలను సమర్పించాలని కమిషనర్‌ను ఆదేశిస్తూ విచారణను ఈ నెల 26కి వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ సత్తి సుబ్బారెడ్డి శుక్రవారం ఉత్తర్వులు జారీచేశారు. గుంటూరులో యథేచ్ఛగా గోవధ జరుగుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదంటూ గుంటూరు జిల్లా జంతుహింస నిరోధక కమిటీ సభ్యులు దాసరి రామమోహనరావు, జె.సురేష్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. వీరి న్యాయవాది జె.వి.ఫణిదత్ వాదనలు వినిపిస్తూ.. జంతు అక్రమ రవాణా, గోవధ నిషేధం విషయంలో చట్టనిబంధనలను అధికారులు పట్టించుకోవడం లేదన్నారు. దీంతో యథేచ్ఛగా గోవధ జరుగుతోందని చెప్పారు. వాదనలు విన్న న్యాయమూర్తి.. ఈ విషయంలో పూర్తివివరాలు సమర్పించాలని మునిసిపల్ కమిషనర్‌ను ఆదేశించారు. -
సోషల్ మీడియాలో మీమ్స్.. కౌ హగ్ డే నిర్ణయంపై వెనక్కి తగ్గిన కేంద్రం
ఫిబ్రవరి 14న ప్రజలు ఆవును కౌగించుకోవాలన్న నిర్ణయంపై కేంద్రం వెనక్కి తగ్గింది. ప్రేమికుల దినోత్సవం రోజున కౌ హగ్ డే జరుపుకోవాంటూ ఇచ్చిన పిలుపును ఉపసంహరించుకుంది. ఈ మేరకు భారత జంతు సంరక్షణ బోర్డు శుక్రవారం ప్రకటన విడుదల చేసింది. కేంద్ర మత్స్య, పశుసంవర్థక, డెయిరీ మంత్రిత్వశాఖ నుంచి అందిన ఆదేశాల మేరకు ఫిబ్రవరి 14న కౌ హగ్ డే జరుపుకోవాలంటూ ఇచ్చిన పిలుపును వెనక్కి తీసుకొంటున్నట్టు కేంద్ర పశు సంరక్షణ బోర్డు కార్యదర్శి ఎస్కే దత్తా ఓ నోటీసులో పేర్కొన్నారు. కాగా గోవులను ప్రేమించేవారు ఫిబ్రవరి 14వ తేదీన వాలెంటైన్స్ డేకి బదులుగా కౌ హగ్ డే జరుపుకోవాలని కేంద్ర జంతు సంక్షేమ శాఖ ఇటీవలే ప్రకటించిన విషయం తెలిసిందే. పాశ్చాత్య సంస్కృతి పెరిగిపోతున్న నేపథ్యంలో భారతీయ పురాతన సంప్రదాయాలు అంతరించిపోతున్నాయని.. గోమాత ప్రాధాన్యతను గుర్తించి ఫిబ్రవరి 14న గోవులను ఆలింగనం చేసుకోవాలంటూ పేర్కొంది. గోవును కౌగిలించుకోవడం ద్వారా భావ సంపద వృద్ధి చెందుతుందని.. తద్వారా వ్యక్తిగత, సామూహిక సంతోషం పెరుగుతుందని తెలిపింది. అయితే ఈ ప్రకటన చే'rనప్పటి నుంచి కౌ హగ్ డే అంశం సోషల్ మీడియాలో ట్రెండింగ్‌గా మారింది. అప్పటి నుంచి దీనిపై రచ్చ జరుగుతూనే ఉంది. కొంతమంది దీనిపై సానుకూలంగా స్పందిస్తుంటే.. మరికొందరు ఈ నిర్ణయాన్ని తప్పుబడుతూ విమర్శిస్తున్నారు. దీంతో నెట్టింట్లో మీమ్స్ వెల్లువెత్తుతున్నాయి. అటు విపక్షాలు కౌ హగ్ డేపై సైతం విమర్శలు గుప్పించాయి. కౌ హగ్ డే పిలుపు హాస్యాస్పదమని.. ప్రధాని మోదీకి పారిశ్రామికవేత్త గౌతమ్ అదానీ ఓ ‘పవిత్ర గోవు’ అంటూ మండిపడ్డాయి. ఈ నేపథ్యంలో జంతు సంరక్షణ బోర్డు ‘కౌ హగ్ డే’ పాటించాలంటూ ఇచ్చిన పిలుపును తాజాగా ఉపసంహరించుకోవడం గమనార్హం. చదవండి: మోదీ సర్కార్‌ను ఇంటికి పంపే సమయం ఆసన్నమైంది: ఎమ్మెల్సీ కవిత -
వీధి కుక్కలకు, ఆవులకు వసతి గృహాలు నిర్మించండి
న్యూఢిల్లీ : వీధి కుక్కలకు, ఆవులకు వసతి గృహాలు నిర్మించాలని ‘‘యానిమల్ వెల్ఫేర్ బోర్డ్ ఆఫ్ ఇండియా (ఏడబ్ల్యూబీఐ)’’ రాష్ట్రాలను కోరింది. యవ్వనంలో ఉన్న జంతువులు కబేళాలకు బలికాకుండా ఆ కమిటీ చూసుకుంటుదని తెలిపింది. చలనచిత్రాలలో జంతువులు హింసకు గురికాకుండా చూసుకోవటానికి ప్రత్యేకంగా మరో కమిటీ వేస్తామని పేర్కొంది. ఒక వేళ జంతువులను చలనచిత్రాలలో ఉపయోగించినట్లయితే ఏడబ్ల్యూబీఐ నుంచి ‘నో అబ్జక్షన్ సర్టిఫికేట్’ తీసుకోవాలని తెలిపింది. ఇంకో నెలలోగా వీధి జంతువుల సమస్యను పరిష్కరించాలని కోరింది. జంతువులకు వసతిగా ఉండేలా గృహాలను నిర్మించాలని సూచించింది. ‘‘యానిమల్ వెల్ఫేర్ బోర్డ్ ఆఫ్ ఇండియా’’ ఛైర్పర్సన్ ఎస్పీ గుప్తా మాట్లాడుతూ.. తామెవరినీ ఆహారపు అలవాట్లు మార్చుకోవాలనటం లేదని, మాంసం తినేవారు తినటానికి ఎలాంటి ఆంక్షలు లేవని అన్నారు. కాకపోతే అన్ని జంతు వధశాలలు నియమాలకు కట్టుబడి ఉండాలని తెలిపారు. జంతు వధశాలల్లో యవ్వనంలో ఉన్న జంతువులను చంపకుండా ఉండటానికి దుకాణాలను తనిఖీ చేయటం జరుగుతుందన్నారు. రహదారులపై జంతువులు తిరగటం కూడా క్రూరత్వం కిందకే వస్తుందన్నారు. వీధి జంతువులకు రక్షణ కల్పించే విధంగా చర్యలు తీసుకోవటానికి ఉత్తరప్రదేశ్‌తో పాటు మరో రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో చర్చించటమే కాకుండా ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులకు లేఖ రాశామని పేర్కొంది. -
ఔరా! ఎస్ఐని ఊర కుక్క కరిచిందని..!
అసలే పోలీసోళ్లకు కోపం ఎక్కువ అంటారు. అందుకే ఓ సబ్ ఇన్స్పెక్టర్ తనను కరిచిన ఊరకుక్కను తుపాకీతో కాల్చిపారేశారు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని లక్నోలో జరిగింది. ఈ ఘటనపై సమగ్ర నివేదిక అందించాలని లక్నోలోని చిన్హాత్ పోలీసు స్టేషన్ అధికారిని కేంద్ర మహిళా, శిశు సంక్షేమశాఖ మంత్రి మేనకా గాంధీ ఆదేశించారు. చిన్హాత్ పోలీసు స్టేషన్ పరిధిలోని ఆదర్శ్ నగర్లో సబ్ ఇన్స్పెక్టర్ మహేంద్ర ప్రతాప్ నివసిస్తున్నారు. డ్యూటీలో భాగంగా బరాబంకీ వెళుతుండగా ఓ ఊరకుక్క ఆయనను కరిచింది. దీంతో కోపోద్రిక్తుడైన మహేంద్ర ప్రతాప్ వెంటనే ఇంటికి వెళ్లి లైసెన్స్డ్ రైఫిల్ తీసుకొని వచ్చి ఆ కుక్కను అక్కడికక్కడే కాల్చిపారేసినట్టు కథనాలు వచ్చాయి. అయితే, ఈ ఘటనలో సదరు ఎస్సైపై కేసు నమోదుచేసేందుకు పోలీసులు నిరాకరిస్తున్నారు. దీంతో జంతు హక్కుల కార్యకర్తలు నిరసనబాట పట్టారు. నిందితుడైన ఎస్సై చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో జంతు సంరక్షణ బోర్డు మెంబరైన కమ్నా పాండే ఈ అంశాన్ని కేంద్రమంత్రి మేనకాగాంధీ దృష్టికి తీసుకెళ్లారు. దీంతో ఈ ఘటనపై సమగ్ర నివేదిక ఇవ్వాలని సంబంధిత పోలీసు స్టేషన్ అధికారుల్ని ఆమె ఆదేశించారు. మరోవైపు ఎస్సై తుపాకీతో కాల్చిన కుక్క పరిస్థితి ఏమైందనేది తెలియకుండా ఉంది. కాల్పుల తర్వాత ఆ కుక్క పరిసర ప్రాంతాల్లో కనిపించకపోవడంపై స్థానికులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. -
జంతువధను ఆపండి: సుప్రీం
న్యూఢిల్లీ: వివిధ రాష్ట్రాల్లో కొనసాగుతున్న జంతువధను జులై 15 వరకు ఆపాల్సిందిగా సుప్రీం కోర్టు ఉత్వర్వులను జారీ చేసింది. బీహార్ లో నీల్ గాయ్( నీలి ఎద్దు)లను, ఉత్తరాఖండ్ లో అడవిపందులను, హిమాచల్ ప్రదేశ్ లో కోతులను చంపడానికి కేంద్ర ప్రభుత్వం అనుమతిని ఇచ్చిన విషయం తెలిసిందే. ప్రభుత్వం ఎటువంటి అధ్యయనం చేయకుండానే ఈ నిర్ణయాన్ని తీసుకుందని జంతు సంరక్షణ బోర్డు సుప్రీంలో పిటిషన్ దాఖలు చేసింది. దీనిపై స్పందించిన ఉన్నత న్యాయస్థానం ఈ మేరకు ఉత్తర్వులను జారీ చేసింది. పంటలను పాడు చేస్తున్నందున ఆయా రాష్ట్ర ప్రభుత్వాల కోరికపైనే తాము జంతువులను చంపడానికి అనుమతినిచ్చామని కేంద్ర ప్రభుత్వం బెబుతోంది.జంతువులను చంపడంపై జంతు ప్రేమికులు, పర్యావరణవేత్తలు మండి పడుతున్నారు. మేనకా గాంధీ పర్యావరణ మంత్రిత్వశాఖ నిర్ణయాన్ని తప్పుపడుతూ గతంలో విమర్శించిన విషయం తెలిసిందే.