సాక్షి, అమరావతి: జంతు వధ, అక్రమ రవాణా ను నిరోధించేందుకు చట్టప్రకారం తగిన చర్యలు తీసుకోవాలని హైకోర్టు శుక్రవారం పోలీసులను ఆదేశించింది. జంతు వధ, అక్రమ రవాణాపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు, ఫిర్యాదులు చేసేందుకు వీలుగా నోడల్ అధికారులను నియమించాలని సూచించింది. ఈ ప్రక్రియను మూడురోజుల్లో పూర్తి చేయాలని నిర్దేశించింది.
నోడల్ అధికారుల ఫోన్ నంబర్లను, జంతుసంక్షేమ బోర్డు మార్గదర్శకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని, ఇందుకోసం ప్రధాన పత్రికల్లో ప్రకటనలివ్వాలని ఆదేశించింది. ఈ మేరకు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి (ఏసీ జే) జస్టిస్ ఆకుల వెంకటశేషసాయి, న్యాయమూర్తి జస్టిస్ రావు రఘునందన్‌రావు ధర్మాసనం ఉత్తర్వులు జారీచేసింది.
బక్రీద్ సందర్భంగా జంతు వధను, అక్రమ రవాణాను అడ్డుకునేందుకు తగిన చర్యలు తీసుకునేలా అధికారులను ఆదేశించాలని కోరుతూ యానిమల్ రెస్క్యూ ఆర్గనైజేషన్ కార్యదర్శి గోపాలరావు, మరో ఇద్దరు హైకోర్టులో ప్రజాప్రయోజ న వ్యాజ్యం (పిల్) దాఖలు చేశారు. ఈ వ్యాజ్యంపై ఏసీజే ధర్మాసనం శుక్రవారం విచారించింది.
జంతు హింసను అడ్డుకోవడానికి చర్యలు తీసుకోకపోవడం సరికాదు
ఇదిలా ఉంటే.. జంతు అక్రమ రవాణా, గోవధ నిరోధానికి ఎలాంటి చర్యలు తీసుకున్నారో తెలియచేయాలని గుంటూరు మునిసిపల్ కమిషనర్‌ను హైకోర్టు ఆదేశించింది. జంతు హింసను అడ్డుకోవడానికి ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం ఎంతమాత్రం సరికాదంది. పూర్తి వివరాలను సమర్పించాలని కమిషనర్‌ను ఆదేశిస్తూ విచారణను ఈ నెల 26కి వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ సత్తి సుబ్బారెడ్డి శుక్రవారం ఉత్తర్వులు జారీచేశారు.
గుంటూరులో యథేచ్ఛగా గోవధ జరుగుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదంటూ గుంటూరు జిల్లా జంతుహింస నిరోధక కమిటీ సభ్యులు దాసరి రామమోహనరావు, జె.సురేష్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. వీరి న్యాయవాది జె.వి.ఫణిదత్ వాదనలు వినిపిస్తూ.. జంతు అక్రమ రవాణా, గోవధ నిషేధం విషయంలో చట్టనిబంధనలను అధికారులు పట్టించుకోవడం లేదన్నారు. దీంతో యథేచ్ఛగా గోవధ జరుగుతోందని చెప్పారు. వాదనలు విన్న న్యాయమూర్తి.. ఈ విషయంలో పూర్తివివరాలు సమర్పించాలని మునిసిపల్ కమిషనర్‌ను ఆదేశించారు.
Comments
Please login to add a commentAdd a comment