animal slaughter
-
బక్రీద్‌పై తెలంగాణ హైకోర్టు కీలక ఉత్తర్వులు
సాక్షి, హైదరాబాద్: బక్రీద్ సందర్భంగా జంతువధపై హైకోర్టు ఇవాళ విచారణ జరిపింది. యుగ తులసి ఫౌండేషన్ వ్యవస్థాపకుడు శివకుమార్ లేఖను సుమోటో పిల్‌గా కోర్టు స్వీకరించింది. మత పరమైన మనోభావాలు దెబ్బ తినేలా గోవధ జరుగుతోందని లేఖలో పేర్కొనగా.. చర్యలు తీసుకోవాలని బక్రీద్‌కు ఒక్క రోజు ముందు లేఖ రాయడం తగదన్న ధర్మాసనం.. సున్నితమైన అంశాల్లో చివరి నిమిషంలో వచ్చి హైకోర్టును లాగితే ఎలా అని ప్రశ్నించింది. గోవధ, అక్రమ రవాణా నియంత్రణకు అన్ని చర్యలు తీసుకున్నామన్న ఏజీ ప్రసాద్.. చెక్ పోస్టులు పెట్టి కేసులు నమోదు చేస్తున్నామని హైకోర్టుకు తెలిపారు. గోవధ నిషేధ చట్టం అమలయ్యేలా చర్యలు తీసుకోవాలని, సీఎస్, డీజీపీ తగిన చర్యలు తీసుకోవాలని హైకోర్టు ఆదేశించింది. రాష్ట్రంలో శాంతిభద్రతల పరిరక్షణకు చర్యలు తీసుకోవాలన్న హైకోర్టు.. నిజమైన స్ఫూర్తితో బక్రీద్ జరుపుకోవాలని సూచించింది. ఆగస్టు 2న నివేదికలు సమర్పించాలని సీఎస్, డీజీపీకి ఆదేశిస్తూ హైకోర్టు కీలక ఉత్తర్వులు జారీ చేసింది. చదవండి: తెలంగాణ బీజేపీ.. మరీ ఇంత గందరగోళమా? -
జంతు వధ, అక్రమ రవాణా నిరోధానికి చర్యలు తీసుకోండి
సాక్షి, అమరావతి: జంతు వధ, అక్రమ రవాణా ను నిరోధించేందుకు చట్టప్రకారం తగిన చర్యలు తీసుకోవాలని హైకోర్టు శుక్రవారం పోలీసులను ఆదేశించింది. జంతు వధ, అక్రమ రవాణాపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు, ఫిర్యాదులు చేసేందుకు వీలుగా నోడల్ అధికారులను నియమించాలని సూచించింది. ఈ ప్రక్రియను మూడురోజుల్లో పూర్తి చేయాలని నిర్దేశించింది. నోడల్ అధికారుల ఫోన్ నంబర్లను, జంతుసంక్షేమ బోర్డు మార్గదర్శకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని, ఇందుకోసం ప్రధాన పత్రికల్లో ప్రకటనలివ్వాలని ఆదేశించింది. ఈ మేరకు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి (ఏసీ జే) జస్టిస్ ఆకుల వెంకటశేషసాయి, న్యాయమూర్తి జస్టిస్ రావు రఘునందన్‌రావు ధర్మాసనం ఉత్తర్వులు జారీచేసింది. బక్రీద్ సందర్భంగా జంతు వధను, అక్రమ రవాణాను అడ్డుకునేందుకు తగిన చర్యలు తీసుకునేలా అధికారులను ఆదేశించాలని కోరుతూ యానిమల్ రెస్క్యూ ఆర్గనైజేషన్ కార్యదర్శి గోపాలరావు, మరో ఇద్దరు హైకోర్టులో ప్రజాప్రయోజ న వ్యాజ్యం (పిల్) దాఖలు చేశారు. ఈ వ్యాజ్యంపై ఏసీజే ధర్మాసనం శుక్రవారం విచారించింది. జంతు హింసను అడ్డుకోవడానికి చర్యలు తీసుకోకపోవడం సరికాదు ఇదిలా ఉంటే.. జంతు అక్రమ రవాణా, గోవధ నిరోధానికి ఎలాంటి చర్యలు తీసుకున్నారో తెలియచేయాలని గుంటూరు మునిసిపల్ కమిషనర్‌ను హైకోర్టు ఆదేశించింది. జంతు హింసను అడ్డుకోవడానికి ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం ఎంతమాత్రం సరికాదంది. పూర్తి వివరాలను సమర్పించాలని కమిషనర్‌ను ఆదేశిస్తూ విచారణను ఈ నెల 26కి వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ సత్తి సుబ్బారెడ్డి శుక్రవారం ఉత్తర్వులు జారీచేశారు. గుంటూరులో యథేచ్ఛగా గోవధ జరుగుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదంటూ గుంటూరు జిల్లా జంతుహింస నిరోధక కమిటీ సభ్యులు దాసరి రామమోహనరావు, జె.సురేష్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. వీరి న్యాయవాది జె.వి.ఫణిదత్ వాదనలు వినిపిస్తూ.. జంతు అక్రమ రవాణా, గోవధ నిషేధం విషయంలో చట్టనిబంధనలను అధికారులు పట్టించుకోవడం లేదన్నారు. దీంతో యథేచ్ఛగా గోవధ జరుగుతోందని చెప్పారు. వాదనలు విన్న న్యాయమూర్తి.. ఈ విషయంలో పూర్తివివరాలు సమర్పించాలని మునిసిపల్ కమిషనర్‌ను ఆదేశించారు. -
అలా చేయలేమన్న దీదీ..
కోల్‌కతా : బక్రీద్ సందర్భంగా జంతుబలిని నియంత్రించాలన్న కోర్టు ఉత్తర్వులకు బదులిస్తూ పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం అఫిడవిట్ దాఖలు చేసింది. జంతు వధను నిలిపివేసేందుకు అవసరమైన మౌలిక యంత్రాంగం తమ వద్ద లేదని కలకత్తా హైకోర్టులో దాఖలు చేసిన అఫిడవిట్లో మమతా బెనర్జీ సారథ్యంలోని బెంగాల్ ప్రభుత్వం స్పష్టం చేసింది. రాష్ట్రమంతటా ప్రతి సబ్ డివిజన్లోని అన్ని బ్లాక్‌ల్లో ఈద్ ఉల్ జుహ జరుపుకుంటారని పశ్చిమ బెంగాల్ జంతు వధ నియంత్రణ చట్ట నిబంధనలను కఠినంగా అమలు చేసేందుకు తగిన యంత్రాంగం ప్రభుత్వం వద్ద లేదని పేర్కొంది. రాష్ట్రంలో తగినంతగా వెటర్నరీ సర్జన్లు, వెటర్నరీ అధికారులు లేరని కోర్టుకు నివేదించింది. కబేళాలు సైతం చాలినంతగా లేవని స్పష్టం చేసింది. వచ్చే క్యాలండర్ సంవత్సరాంతానికి సంబంధిత చట్టానికి అనుగుణమైన సాధనా సంపత్తిని సమకూర్చుకుంటామని పేర్కొంది. కాగా ఈద్ ఉల్ జుహ వేడుకులకు ముందు జంతు వధ నియంత్రిస్తూ ప్రజల్లో అవగాహన కల్పించేందుకు బహిరంగ నోటీసు జారీ చేయాలని బెంగాల్ ప్రభుత్వాన్ని కలకత్తా హైకోర్టు ఆదేశించింది. బక్రీద్‌కు ముందుగా జంతు వధ నియంత్రణపై ప్రింట్, ఎలక్ర్టానిక్ మీడియాలో ప్రకటనలు జారీ చేయాలని కోరింది. -
కేంద్ర ప్రభుత్వానికి మద్రాసు హైకోర్టు షాక్
పశువధ విషయంలో కేంద్ర ప్రభుత్వానికి చుక్కెదురైంది. కేంద్రం ఇచ్చిన గెజిట్ నోటిఫికేషన్‌పై మద్రాస్ హైకోర్టు మదురై ధర్మాసనం నాలుగు వారాల స్టే విధించింది. వధించడం కోసం పశువుల అమ్మకాలు, కొనుగోళ్లను నిషేధిస్తూ కేంద్ర ప్రభుత్వం ఇటీవల ఉత్తర్వులు విడుదల చేయడం, దానిపై కేరళ, పశ్చిమబెంగాల్ ప్రభుత్వాలు, పలు సంస్థలు మండిపడటం తెలిసిందే. దీనిపై ఎస్. సెల్వగోమతి దాఖలు చేసిన ప్రజాహిత వ్యాజ్యం విచారణ సందర్భంగా కోర్టు స్టే విధించింది. దీనిపై నాలుగు వారాల్లోగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సమాధానం ఇవ్వాలని ఆదేశించింది. ఒక మతం లేదా వర్గం ఆచారాల ప్రకారం జంతువులను చంపడం నేరం కాదని ప్రివెన్షన్ ఆఫ్ క్రూయెల్టీ టు యానిమల్స్ (పీసీఏ) చట్టంలోని సెక్షన్ 28 చెబుతోందని మదురైకి చెందిన ప్రముఖ న్యాయవాది సెల్వగోమతి తన ప్రజాహిత వ్యాజ్యంలో పేర్కొన్నారు. దాంతో కోర్టు ఈ విషయమై తదుపరి విచారణ జరిపేందుకు వీలుగా కేంద్రప్రభుత్వ ఉత్తర్వులపై స్టే విధించింది.