
తెలుగువారికి కొత్త సంవత్సరం ఉగాది నుంచి ప్రారంభం అవుతుంది. మామూలుగా ఏ పండుగ రోజైనా స్పెషల్గా పిండివంటలు, గారెలు, బూరెలు, పాయసం లాంటి వంటకాలు ఉంటాయి. కానీ ఉగాది స్పెషల్ మాత్రం ఉగాది పచ్చడే!. ఎన్నో ఔషధగుణాలు ఉన్న షడ్రుచుల సమ్మేళనమైన ఉగాది పచ్చడిని ఉగాది పండుగ రోజు ఉదయాన్నే అభ్యంగన స్నానం చేసి పరగడుపున తీసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఆహారంలో ఉండే ఔషధ గుణాలను స్వీకరిస్తూ, జీవితంలో ఎదురయ్యే కష్టసుఖాలను సమానంగా స్వీకరిస్తూ కొత్త సంవత్సరమంతా ఆరోగ్యంగా, ఆనందంగా సాగిపోతుందనేది పురాణ వచనం. మరీ అందరికి ఎంతో ఇష్టమైన ఆ ఉగాది పచ్చడి తయారీ ఎలాగో చూద్దామా..!.
ఉగాది పచ్చడి
కావలసినవి: కొత్త బెల్లం – 100 గ్రామలు, పచ్చి మామిడి – ఒకటి (మీడియం సైజు), వేప పువ్వు – ఒక టేబుల్ స్పూన్, పచ్చి మిర్చి – రెండు (తురమాలి), ఉప్పు – చిటికెడు, చింతపండు – పెద్ద నిమ్మకాయంత (కొత్త చింతకాయల నుంచి సేకరించినది).
తయారీ: బెల్లాన్ని తురిమి, అందులో కొద్దిగా నీటిని చిలకరించి పక్కన ఉంచాలి. వేప పువ్వు కాడలు లేకుండా వలిచి పువ్వు రెక్కలను సేకరించి పక్కన ఉంచాలి. మామిడి కాయ మొదలు (సొన కారే భాగం) తీసేయాలి. కాయను నిలువుగా కోసి లోపలి గింజను కూడా తీసేయాలి. ఇప్పుడు మామిడి కాయను తొక్కతోపాటు సన్నగా ముక్కలు తరగాలి లేదా తురిమి బెల్లం నీటిలో వేయాలి. చింతపండు గుజ్జును చిక్కగా రసం తీసి పై మిశ్రమంలో కలపాలి. అందులో పచ్చిమిర్చి తురుము, ఉప్పు, వేప పూత వేసి కలపాలి. ఈ మిశ్రమం చిక్కగా ఉంటుంది. మరింత రుచి కోసం చెరకు ముక్కలు, మిగుల మగ్గిన అరటి పండు గుజ్జు కలుపుకోవచ్చు.
ఈ పచ్చడి తినేటప్పుడు చదవాల్సిన శ్లోకం..
శతాయుష్యం వజ్రదేహం దదాత్యర్థం సుఖానిచ
సర్వారిష్టవినాశంచ నింబకందళ భక్షణమ్॥"
అందరికీ శ్రీ విశ్వావసు నామ సంవత్సరం శుభాకాంక్షలు
(చదవండి: