
నేడు 1,292 ఇంటర్ లెక్చరర్లకు నియామక పత్రాలు అందజేయనున్న సీఎం రేవంత్
రాష్ట్రంలోని జూనియర్ కాలేజీల్లో బోధనకు ఇబ్బంది
మొత్తం పోస్టులు 6,008.. ఏడాది క్రితం వరకు ఉన్నది 900 మందే
మరో 3,500 కాంట్రాక్టు అధ్యాపకుల క్రమబర్థికరణ
ఇప్పుడు కొత్త నియామకాలు.. అయినా 316 పోస్టులు ఖాళీ
వీటికితోడు కొత్త కాలేజీలకు కావాల్సిన పోస్టులు మరో 480
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో కొత్తగా 1,292 మంది లెక్చరర్లు చేరబోతున్నారు. వారితోపాటు 240 మంది పాలిటెక్నిక్ లెక్చరర్లు కూడా బాధ్యతలు చేపట్టబోతున్నారు. వీరందరికీ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి బుధవారం మధ్యాహ్నం 12 గంటలకు రవీంద్ర భారతి వేదికగా నియామక ఉత్తర్వులు అందజేస్తారు. విద్యాశాఖ కార్యదర్శి యోగితా రాణా ఈ మేరకు ప్రకటన విడుదల చేశారు. అయితే కొత్తగా నియామకాలు చేపట్టినా కూడా.. జూనియర్ కాలేజీల్లో గణనీయంగానే లెక్చరర్ పోస్టులు ఖాళీ ఉండే పరిస్థితి నెలకొంది.
రెండున్నరేళ్ల కిందే నోటిఫికేషన్..
ఇంటర్ బోర్డ్ మూడేళ్ల క్రితమే జూనియర్ కాలేజీల్లో ఖాళీలను గుర్తించి.. పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీజీపీఎస్సీ)కు వివరాలు అందజేసింది. టీజీపీఎస్సీ 2022 డిసెంబర్‌లో ఆ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. పలు కారణాలతో ఈ ప్రక్రియ ఆలస్యమైంది. చివరికి అర్హులను ఎంపిక చేసిన కమిషన్.. ఇటీవలే జాబితాను ఇంటర్ బోర్డుకు అందజేసింది. ప్రస్తుతం ఇంటర్ విద్యా సంవత్సరం ముగుస్తుండటంతో.. కొత్త వారికి శిక్షణ ఇచ్చి, వచ్చే విద్యా సంవత్సరం నుంచి విధులు అప్పగించాలని అధికారులు నిర్ణయించారు.
ఇంకా గణనీయంగానే ఖాళీలు
రాష్ట్రంలో 424 ప్రభుత్వ జూనియర్ కాలేజీలు ఉన్నాయి. వీటిలో చాలా చోట్ల లెక్చరర్ల కొరతతో బోధనకు ఇబ్బంది నెలకొంది. నిజానికి జూనియర్ కాలేజీల్లో మొత్తం 6,008 పోస్టులు ఉండగా.. ఏడాది క్రితం వరకు 900 మంది మాత్రమే రెగ్యులర్ అధ్యాపకులు, ప్రిన్సిపాల్స్ ఉన్నారు. గత ఏడాది ప్రభుత్వం 3,500 మంది కాంట్రాక్టు అధ్యాపకులను క్రమబద్ధీకరించే ప్రక్రియ చేపట్టింది. అది ఇంకా పూర్తవలేదు. వీరిని, ఇప్పుడు కొత్తగా నియమించబోతున్న వారిని కలిపితే.. 5,692 మంది రెగ్యులర్ అధ్యాపకులు ఉంటారు. ఇంకా 316 ఖాళీలుంటాయి. ఇవన్నీ రెండేళ్ల క్రితం లెక్కలు. ఇప్పుడీ ఖాళీల సంఖ్య మరింత ఎక్కువగా ఉంటుందని అధ్యాపకులు చెబుతున్నారు.
కొత్త కాలేజీల మాటేంటి?
గత రెండేళ్లలో రాష్ట్రంలో 24 జూనియర్ కాలేజీలను కొత్తగా ఏర్పాటు చేశారు. కానీ అందులో 19 కాలేజీలకు ఇప్పటికీ పోస్టులు మంజూరు చేయలేదు. గెస్ట్ ఫ్యాకల్టీ, ఇతర కాలేజీల లెక్చరర్లతో బోధిస్తున్నారు. కొత్త కాలేజీలకు కనీసం 480 పోస్టులు అవసరమని ఇంటర్ బోర్డు ప్రభుత్వానికి ప్రతిపాదన పంపింది. అంటే ఇప్పటికే ఉన్న 316 ఖాళీలను కలుపుకుంటే.. మొత్తం ఖాళీల సంఖ్య 796కు చేరుతుంది. పైగా గత రెండేళ్లలో ఖాళీ అయిన పోస్టులు అదనం.
దీనికి తోడు వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఇంటర్ సిలబస్ మార్చి, జేఈఈ, నీట్ వంటి జాతీయ స్థాయి పోటీలకు సన్నద్ధం చేసేలా ఇంటర్ బోర్డు సన్నాహాలు చేస్తోంది. దానికోసం మరికొన్ని అధ్యాపక పోస్టులు అవసరం. ఇక ఇంగ్లి‹Ùలో ప్రాక్టికల్స్‌ను కొత్తగా తీసుకొచ్చారు. మాట్లాడే స్కిల్, గ్రామర్ స్థాయిని పెంచారు.
గ్రూప్ డిస్కషన్లు నిర్వహించి, విద్యార్థి రాతను పరిశీలించి ప్రాక్టికల్స్‌లో మార్కులు వేస్తున్నారు. వీటి ప్రామాణికత పెరగాలంటే ఆంగ్ల భాషా నిపుణుల పోస్టులు మరో 129 అవసరమని అంచనా వేశారు. రసాయన శాస్త్రంలో అంతర్జాతీయ ప్రమాణాలతో ప్రయోగాలు చేయగలగాలని బోర్డ్ తీర్మానించింది. ఆ ప్రాక్టికల్స్‌కు నిపుణులు అవసరం. ఇలా ప్రతీ విభాగంలోనూ అధ్యాపకుల కొరత ఏర్పడుతోంది.
Comments
Please login to add a commentAdd a comment