Telangana: రాష్ట్ర బడ్జెట్‌ రూ. 3.20లక్షల కోట్లు? | Telangana Assembly budget sessions begin from 12th March 2025 | Sakshi
Sakshi News home page

Telangana: రాష్ట్ర బడ్జెట్‌ రూ. 3.20లక్షల కోట్లు?

Published Wed, Mar 12 2025 5:24 AM | Last Updated on Wed, Mar 12 2025 5:24 AM

Telangana Assembly budget sessions begin from 12th March 2025

నేటి నుంచే అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాలు షురూ.. 

ఉదయం 11 గంటలకు ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించనున్న గవర్నర్‌

సాక్షి, హైదరాబాద్‌:  రాష్ట్ర అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాలు బుధవారం ప్రారంభం అవుతున్నాయి. ఉదయం 11 గంటలకు పాత అసెంబ్లీ భవనంలో అసెంబ్లీ, మండలి భేటీతో ఈ సమావేశాలు మొదలవుతాయి. తొలిరోజు గవర్నర్‌ జిష్ణుదేవ్‌ వర్మ ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. అనంతరం సభ వాయిదాపడనుంది. 

ఆ తర్వాత శాసనసభా వ్యవహారాల సలహా కమిటీ (బీఏసీ) భేటీ నిర్వహిస్తారు. బడ్జెట్‌ సమావేశాలను ఎప్పటివరకు నిర్వహించాలి, ఏయే అంశాలను చేపట్టాలన్న దానిపై అందులో నిర్ణయం తీసుకుంటారు. గురువారం గవర్నర్‌ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై అసెంబ్లీలో చర్చ జరగనుంది. గవర్నర్‌ ప్రసంగానికి ఆమోదం తెలిపిన తరువాత సభ వాయిదా పడనుంది. 

శుక్రవారం హోలీ పండుగ కావడంతో సెలవు ఉంటుందని, శనివారం వీలును బట్టి అసెంబ్లీ నిర్వహిస్తారని లేదంటే మళ్లీ సోమవారం అసెంబ్లీ ప్రారంభమవుతుందని సమాచారం. కాగా.. గత బడ్జెట్‌ కన్నా సుమారు పది శాతం అదనంగా రూ.3.20 లక్షల కోట్లతో ఈసారి బడ్జెట్‌ ఉండవచ్చని అధికారవర్గాలు చెబుతున్నాయి. 

సభ ముందుకు రెండు బిల్లులు.. 
గవర్నర్‌ ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై చర్చ ముగిసిన అనంతరం.. ఎస్సీ వర్గీకరణ, బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల బిల్లులను రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో ప్రవేశపెట్టనుంది. ఆ బిల్లులపై చర్చించి ఆమోదించనున్నారు. తర్వాత ఈనెల 19న లేదా 20న 2025–26 బడ్జెట్‌ను అసెంబ్లీలో డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, మండలిలో శాసనసభా వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు ప్రవేశపెడతారు. 

ఈ బడ్జెట్‌ ప్రతిపాదనలు, శాఖల వారీ పద్దులపై చర్చిస్తారు. అనంతరం బడ్జెట్‌ ప్రతిపాదనలను ఆమోదించే ద్రవ్య వినిమయ బిల్లును ప్రవేశపెడతారు. ఇందుకోసం ఈనెల 27 లేదా 29వ తేదీ వరకు అసెంబ్లీ సమావేశాలు జరిగే అవకాశాలు ఉన్నాయి. 

నిరసనలకు నో..! 
అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాల నిర్వహణ కోసం అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. అటు అసెంబ్లీ, ఇటు ప్రభు త్వ, పోలీసు వర్గాలు సమన్వయంతో వ్యవహరించేలా శాసనసభ స్పీకర్‌ గడ్డం ప్రసాద్‌కుమార్, మండలి చైర్మన్‌ గుత్తా సుఖేందర్‌రెడ్డి, శాసనసభా వ్యవహారాల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు ఇప్పటికే ముందస్తు సమావేశాలు నిర్వహించి అధికారులకు దిశానిర్దేశం చేశారు. అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాల సందర్భంగా మూడంచెల భద్రతా ఏర్పాట్లు చేశారు. అసెంబ్లీ పరిసరాల్లో నిరసనలు, ర్యాలీలు, ధర్నాలకు అనుమతి లేదని పోలీసులు స్పష్టం చేశారు. 

ఎవరి వ్యూహం వారిదే.. 
అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాల కోసం అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్‌ఎస్, బీజేపీలతోపాటు ఎంఐఎం, సీపీఐ సిద్ధమయ్యాయి. గత ఏడాది కాలంలో రాష్ట్రంలో అమలు చేసిన సంక్షేమ, అభివృద్ధి పథకాల గురించి ప్రజలకు వివరించడమే ప్రధాన ఉద్దేశంగా ఈసారి అధికార కాంగ్రెస్‌ అసెంబ్లీని వేదికగా చేసుకోనుంది. 

ముఖ్యంగా కులగణన, ఎస్సీల వర్గీకరణతోపాటు ఇంటిగ్రేటెడ్‌ రెసిడెన్షియల్‌ పాఠశాలల ఏర్పాటు కోసం తీసుకున్న చర్యలు, సంక్షేమ పథకాల అమలు తీరును ప్రజలకు వివరించేలా ప్రణాళికలు రచిస్తోంది. మరోవైపు ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టేందుకు ప్రధాన ప్రతిపక్షం బీఆర్‌ఎస్‌ అస్త్రశ్రస్తాలు సిద్ధం చేసుకుంటోంది. 

ఆరు గ్యారంటీలు, కృష్ణా జలాలు, ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్‌ ప్రమాదం, రాష్ట్రంలో కరువు పరిస్థితులు, తాగు, సాగునీటి కొరత, యూరియా, సాగునీటి కోసం రైతుల ఇబ్బందులు తదితర అంశాలపై ప్రభుత్వాన్ని నిలదీయాలని బీఆర్‌ఎస్‌ నిర్ణయించింది. ఇక బీజేపీ కూడా రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలే టార్గెట్‌గా ఈసారి బడ్జెట్‌ సమావేశాలకు హాజరుకానుంది. 

బడ్జెట్‌ పరిస్థితి ఏమిటి? 
రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టబోయే బడ్జెట్‌ అంచనాలపై ఆసక్తి నెలకొంది. దేశవ్యాప్తంగా కనిపిస్తున్న ఆర్థిక మాంద్యంతోపాటు రాష్ట్ర సొంత పన్ను రాబడులు తగ్గిపోవడం, రిజి్రస్టేషన్లు, జీఎస్టీ రాబడుల్లో తగ్గుదల, రెవెన్యూ రాబడులకు, ఖర్చుకు మధ్య భారీ తేడా ఉండటం, ప్రతిపాదిత బడ్జెట్‌ అంచనాలు, సవరించిన అంచనాలకు మధ్య రూ.50 వేల కోట్ల వరకు లోటు ఉండటం వంటివి కీలకంగా మారాయి. 

అయితే అన్ని అంశాలను దృష్టిలో పెట్టుకుని వాస్తవిక బడ్జెట్‌ను రూపొందించినట్టు ప్రభుత్వ వర్గాలు చెప్తున్నాయి. గత ఆర్థిక సంవత్సరంలో రూ.2.91 లక్షల కోట్ల బడ్జెట్‌ ప్రతిపాదించగా.. ఈసారి రూ.3.20 లక్షల కోట్ల వరకు ఉండవచ్చని ఆర్థిక శాఖ వర్గాలు పేర్కొంటున్నాయి. అయితే ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో బడ్జెట్‌ పరిమాణం తగ్గినా ఆశ్చర్యం లేదని కూడా ఆర్థిక శాఖ వర్గాలు చెబుతుండటం గమనార్హం. 

నిజానికి ఎన్నికల్లో హామీ ఇచ్చిన మేరకు సంక్షేమ పథకాలకు పెద్ద మొత్తంలో నిధులు వ్యయం కానున్నాయి. ప్రభుత్వం ప్రతిష్టాత్మంగా తీసుకుంటున్న ఫ్యూచర్‌ సిటీ, ఇందిరమ్మ ఇళ్లకు రూ.20 వేల కోట్లు, నీటిపారుదల రంగానికి రూ.19 వేల కోట్లు, విద్యుత్‌ రంగానికి సుమారు రూ.14 వేల కోట్లు, రవాణాకు రూ.5,800 కోట్లు, పెన్షన్ల పెంపు అమలుకు మరో రూ.8 వేల కోట్లు కావాలి. 

ఇక యువ వికాసానికి రూ.6 వేల కోట్లు, ఇంటిగ్రేటెడ్‌ రెసిడెన్షియల్‌ స్కూల్స్‌కు రూ.11,500 కోట్లు కేటాయింపులు చేస్తారని భావిస్తున్నారు. పంచాయతీరాజ్‌ గ్రామీణాభివృద్ధికి, వైద్యారోగ్య రంగాలకు కూడా ఎక్కువ మొత్తంలో నిధులు కేటాయించే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు.   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement