
థాయ్‌లాండ్ నుంచి వచ్చిన రెండో విమానం
దేశరాజధానిలో అడుగిడిన 270 మంది
నేడు ఏపీ, తెలంగాణకు 42 మంది బాధితులు
దిగిన వెంటనే అదుపులోకి తీసుకున్న సీబీఐ
అర్ధరాత్రి వరకు సాగిన స్టేట్‌మెంట్ల రికార్డు
బండి సంజయ్ కృషితో 578 మందికి విముక్తి
సాక్షి ప్రతినిధి, కరీంనగర్: కొలువుల కోసం వెళ్లి.. సైబర్ ఫ్రాడ్ కంపెనీల్లో చిక్కుకున్న వారి తరలింపు ప్రక్రియ పూర్తయ్యింది. మంగళవారం థాయ్‌లాండ్‌లోని మై సోట్ నుంచి రెండో ఆర్మీ విమానం 270 మంది భారతీయులతో భారత కాలమానం ప్రకారం.. మధ్యాహ్నం 2 గంటల సమయంలో బయల్దేరి సాయంత్రం 6.30 గంటలకు ఢిల్లీ విమానాశ్రయానికి చేరింది. దీంతో థాయ్‌లాండ్ కేంద్రంగా సాగిన మానవ అక్రమ రవాణాలో చిక్కుకున్న బందీలందరికీ విముక్తి లభించినట్టయ్యింది.
రూ.లక్షల వేతనం పేరిట ఆశచూపి తీరా వెళ్లాక, మన భారతీయ యువతతో సైబర్ నేరాలు చేయిస్తున్న విషయాన్ని ‘సాక్షి’దినపత్రిక వెలుగులోకి తీసుకురావడం, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ చొరవతో కేంద్రం వీరిని అక్కడి ఆర్మీ సాయంతో వారిని కాపాడింది. ఏకంగా రెండు విమానాలు పంపి సొంత ఖర్చులతో ఇండియాకు తీసుకొచ్చింది.
అసలేం జరిగింది?
కరీంనగర్ జిల్లా మానకొండూరు మండలం రంగపేట గ్రామానికి చెందిన మధుకర్‌రెడ్డి ఉద్యోగం వచ్చిందంటూ థాయ్‌లాండ్ వెళ్లాడు. అక్కడ మానవ అక్రమ రవాణా చేసే ముఠా అతన్ని మయన్మార్‌లోని మైవాడీ జిల్లాలోని చైనీస్ సైబర్ ఫ్రాడ్ కంపెనీకి 3,000 డాలర్లకు విక్రయించింది. అతను, తనతోపాటు బందీలుగా ఉన్న పలువురు భారతీయుల దయనీయ పరిస్థితిని సాక్షికి ఫిబ్రవరి 16న వివరించాడు. దీంతో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ జోక్యం చేసుకున్నాడు.
‘సాక్షి’దినపత్రిక కూడా పలుమార్లు మయన్మార్‌లోని భారత దౌత్యకార్యాలయంతో నిరంతరం సంప్రదింపులు జరిపింది. భారత్ సహా అంతర్జాతీయంగా కూడా ఒత్తిడి రావడంతో మయన్మార్ తన ఆర్మీతో ఫిబ్రవరి 22న భారతీయులను రక్షించి ఆశ్రయం కల్పించింది. కేంద్ర దౌత్యం ఫలించడంతో సోమవారం ఉదయం తొలివిమానం భారతీయులను ఇండియాకు తీసుకొచ్చింది. రెండో విమానంలో మంగళవారం మిగిలిన వారిని థాయ్‌లాండ్‌లోని మై సోట్ మీదుగా ఇండియాకు తరలించింది. దీంతో రిపాట్రియేషన్ ప్రక్రియ ముగిసింది.
నేడు హైదరాబాద్‌కు తెలుగువారు
బాధితుల్లో తెలంగాణకు చెందిన 23 మంది, ఆంధ్రప్రదేశ్‌కు చెందిన 19 మంది మొత్తం 42 మంది తెలుగువారు ఉన్నారు. 270 మందితో కూడిన విమానం మంగళవారం సాయంత్రం 6.30 గంటలకు ఢిల్లీకి చేరుకుంది. విమానం దిగిన వెంటనే బాధితులను అందరినీ.. సీబీఐ అదుపులోకి తీసుకుంది. మీరు ఫారిన్ ఎలా వెళ్లారు? ఎవరి సాయంతో వెళ్లారు? అర్ధరాత్రి దాటినా బాధితుల నుంచి సీబీఐ స్టేట్‌మెంట్ తీసుకుంటూనే ఉంది. ఈ విషయంపై ఇప్పటికే జాతీయ దర్యాప్తు సంస్థ కూడా వివరాలు సేకరిస్తున్న సంగతి తెలిసిందే.
సాక్షి చొరవ భేష్
578 మందిని మా ప్రభుత్వం సురక్షితంగా ఇండియాకు తీసుకొచ్చింది. అందరూ క్షేమంగా ఉన్నారు. థాయ్‌లాండ్ కేంద్రంగా జరిగిన ఈ ఉదంతాన్ని సాక్షి దినపత్రిక మా దృష్టికి తీసుకురావడం, బాధితుల కోసం పోరాడిన తీరు, ఆ చొరవ అభినందనీయం. మనవారిని ప్రత్యేక విమానాల ద్వారా ఇండియాకు తీసుకొచ్చాం. – కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్
ఇది మాకు పునర్జన్మ
వాస్తవానికి మేం థాయ్‌లాండ్‌కు ఉద్యోగానికని వెళ్లాం. మాకు తెలియకుండా మాలో కొందరిని మయన్మార్‌కు అక్రమంగా పంపారు. అక్కడ పాస్‌పోర్టు లాక్కొని, మాతో నేరాలు చేయించడానికి ప్రయతి్నంచారు. కానీ, నేను మా బావ సాయంతో సాక్షిని ఆశ్రయించాను. మమ్మల్ని వెనక్కి రప్పించడంలో బండి సంజయ్, సాక్షి దినపత్రికకు ప్రత్యేక ధన్యవాదాలు. ఇది మాకు పునర్జన్మ. – మధుకర్‌రెడ్డి
Comments
Please login to add a commentAdd a comment