డబ్బులు తీసుకుని ఇవ్వడం లేదు
నటి విజయనిర్మల ఫిర్యాదు
రియల్‌ఎస్టేట్ సంస్థ నిర్వాహకులపై కేసు నమోదు
బంజారాహిల్స్: వ్యాపారంలో ఇబ్బందులున్నాయని నమ్మించి కోటి రూపాయలు హ్యాండ్‌లోన్ తీసుకొని ముఖం చాటేసిన ఓ కన్‌స్టక్ష్రన్ కంపెనీ నిర్వాహకులపై సినీదర్శక నిర్మాత, నటి జి. విజయనిర్మల కోర్టును ఆశ్రయించారు. ఈ మేరకు కోర్టు వారిపై కేసు నమోదు చేయాలంటూ జూబ్లీహిల్స్ పోలీసులను ఆదేశించింది. జూబ్లీహిల్స్ పోలీసుల కథనం మేరకు ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నారుు.. నానక్‌రాంగూడలో నివసించే నటుడు జిఎస్‌ఆర్ కృష్ణమూర్తి(కృష్ణ) సతీమణి విజయనిర్మలకు విజన్ మెడోస్ ఎస్టేట్స్ అండ్ డెవలపర్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ ఎండీ ఆర్. శ్రీనివాసరాజు, ముదునూరి భద్రిరాజు, ముదునూరి సీతారామరాజులతో దాదాపు 20ఏళ్లుగా పరిచయం ఉంది.
2007లో తమకు వ్యాపారంలో కొంత ఇబ్బందులు వచ్చాయని ఇందుకు కోటి రూపాయలు హ్యాండ్‌లోన్‌గా కావాలని వారు విజయనిర్మలను కోరారు. ఇందుకు అంగీకరించిన ఆమె మూడు విడతలుగా ఫిలింనగర్‌లోని ఆంద్రాబ్యాంకు చెక్కుల ద్వారా డబ్బులు ఇచ్చారు. ఆ మొత్తాన్ని తిరిగి చెల్లించాలని ఎన్నిసార్లు కోరినా చెల్లించకుండా కాలయాపన చేశారు. వారు ఇచ్చిన చెక్కులను ఫిలింనగర్‌లోని ఆంధ్రాబ్యాంకులో డిపాజిట్ చేయగా అందులో డబ్బులు లేవంటూ బ్యాంకు ఆ చెక్కులను తిరస్కరించింది.
ఈ విషయంలో వారిని ఎన్నిసార్లు ప్రశ్నించినా ఫలితం లేకపోవడంతో కోర్టును ఆశ్రయించింది. ఈ మేరకు కోర్టు కేసు నమోదు చేయాలంటూ జూబ్లీహిల్స్ పోలీసులను ఆదేశించింది. పోలీసులు సంస్థ నిర్వాహకులు శ్రీనివాసరాజు, మదునూరి భద్రిరాజు, మదునూరి సీతారామరాజులపై ఐపీసీ సెక్షన్ 420, 406, 156(3) సీఆర్‌పీసీ కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.