నకిలీ ఐఫోన్ల తయారీ ముఠా అరెస్టు
హైదరాబాద్ : నకిలీ ఐఫోన్ల తయారి చేసి మోసాలకు పాల్పడుతున్న ముఠాగుట్టును జూబ్లీహిల్స్ పోలీసులు మంగళవారం రట్టు చేశారు. జూబ్లీహిల్స్ పోలీసుల కథనం ప్రకారం ఢిల్లీకి చెందిన ప్రిన్స్ మల్హోత్రా అలియాస్ సోను (22), అమన్ నాగ్‌పాల్ అలియాస్ అర్మాన్ మాలిక్ (23), జితిన్ మున్ని, ధ్రువ్, నాకుల్, సత్యం తదితరులు ఏడుగురు నెలన్నరగా నగరంలోని మాదాపూర్‌లో నివసిస్తున్నారు. ఐఫోన్లను పోలిన నకిలీ ఫోన్లు తయారు చేస్తూ వాటికి పత్రాలు కూడా సృష్టించి వివిధ షాపులలో రీప్లేస్‌మెంట్ చేస్తూ కొత్త వాటిని తీసుకుని.... వాటిని కూడా విక్రయిస్తున్నారు.
జూబ్లీహిల్స్ రోడ్ నంబర్- 45లోని ఆప్ట్రానిక్స్‌లో ఇటీవల ఓ నకిలీ ఐ ఫోన్‌ను రీప్లేస్ చేస్తూ సదరు వ్యక్తులు దొరికిపోయారు. షాపు సిబ్బంది పోలీసులకు సమాచారం అందించడంతో... వారిని అదుపులోకి తీసుకుని ... పోలీస్ స్టేషన్కు తరలించారు. అనంతరం పట్టుబడిన సోను, అమన్‌నాగ్‌పాల్‌ను విచారించగా తాము ఢిల్లీలోని జఫర్‌మార్కెట్ నుంచి వాటిని తీసుకొస్తున్నామని వెల్లడించారు. వారిద్దరి నుంచి దాదాపు 20 నకిలీ ఐఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మిగతా అయిదుగురు పరారీలో ఉన్నారు. వారి కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. జూబ్లీహిల్స్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.