
హైదరాబాద్: హిజ్రాల అరెస్టు కేసులో పోలీసులకు పెద్ద చిక్కే వచ్చిపడింది. ఓ కేసుకు సంబంధించి ప్రియ(22), సనం(20), అఫ్రిన్(22), యాస్మిన్(26) అనే నలుగురు హిజ్రాలను పోలీసులు అరెస్ట్ చేశారు. అనంతరం వారిని రిమాండ్‌కు తరలించమని కోర్టు ఆదేశించింది. అయితే వారిని మగవారి జైలుకు తరలించాలా? లేక మహిళా జైలుకు తరలించాలా? అన్నదానిపై పోలీసులు తర్జనభర్జన పడ్డారు. జూబ్లీహిల్స్ పోలీసులు మొదట వీరిని చంచల్‌గూడ మగవారి జైలుకు తీసుకెళ్లారు.
అయితే వీరు ఆడవారని, ఇక్కడకు అనుమతించబోమంటూ జైలు అధికారి నిరాకరించారు. దీంతో పోలీసులు కోర్టును ఆశ్రయించగా తాము రిమాండ్ విధించి జైలుకు తరలించాలని చెప్పామని, ఎక్కడికి తీసుకెళ్తారో మీ ఇష్టమంటూ వ్యాఖ్యానించింది. దీంతో పోలీసులు ఈ నలుగురిని మహిళా జైలుకు తీసుకెళ్లారు. అయితే వీరు ఆడా? మగా? అన్న విషయాన్ని వైద్యుడిచే ధ్రువీకరించి తీసుకురావాలని జైలు అధికారి తెలిపారు. దీంతో ఈ నలుగురిని ఆస్పత్రికి తీసుకెళ్లి పరీక్షలు నిర్వహించగా ఆడవారే(మగవారు ఆపరేషన్ చేయించుకుని మహిళలుగా మారారు)నని వైద్యులు నిర్ధారించారు.
అనంతరం ఆ పత్రాలు తీసుకెళ్లి చంచల్‌గూడ మహిళా జైలర్‌కు ఇవ్వడంతో జైలర్ వీరిని జైలులోకి అనుమతించారు. వీరిని రిమాండ్‌కు తరలించడానికి 10 గంటల పాటు పోలీసులు కష్టపడాల్సి వచ్చింది. వివరాలు.. రాజస్తాన్‌కు చెందిన కైలాశ్ పటేల్ అనే యువకుడు అన్నపూర్ణ స్టూడియో పక్కన నుంచి శనివారంరాత్రి నడుచుకుంటూ వెళ్తున్నాడు. ఈ క్రమంలో అక్కడ ఐదుగురు హిజ్రాలు కనపడగా వారితో మాటామంతి కలిపాడు. కొద్దిసేపటికి తన నుంచి హిజ్రాలు డబ్బులు లాక్కున్నారంటూ అతడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఆదివారం ఉదయం నలుగురు హిజ్రాలను అదుపులోకి తీసుకొని విచారించిన పోలీసులు అనంతరం రిమాండ్‌కు తరలించారు. సిమ్రాన్ ఫాతిమా(20) అనే మరొకరు పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment