కోర్టును ఆశ్రయించిన టాలీవుడ్ నిర్మాత
స్థలాన్ని కాజేస్తున్నారంటూ సినీ సి. కల్యాణ్ ఫిర్యాదు
సాక్షి, హైదరాబాద్ : జూబ్లీహిల్స్ కో–ఆపరేటివ్ సొసైటీ పరిధిలోని జూబ్లీహిల్స్ రోడ్ నెం. 5లో ఉన్న ప్లాట్ నం. 31/బిలో డాక్టర్ టి. శ్రీనివాసులు, టి.విమలాదేవిలకు చెందిన 1182 గజాల స్థలాన్ని జ్యోతి కన్‌స్ట్రక్షన్స్‌కు 1998లో డెవలప్‌మెంట్ నిమిత్తం ఇచ్చారు. అయితే జీహెచ్‌ఎంసీ అనుమతితో 11 ప్లాట్లు నిర్మించి విమల్ బిల్డింగ్ ప్లాట్ ఓనర్స్ అసోసియేషన్‌కు చెందిన 11 మందికి విక్రయించారు. అనంతరం ఆ కాంట్రాక్టర్ నిర్మాణానంతరం మిగిలిపోయిన 389 గజాల కామన్ ప్రాపర్టీని కాజేసేందుకు యత్నిస్తున్నారంటూ ప్రముఖ సినీ నిర్మాత సి. కల్యాణ్ కోర్టును ఆశ్రయించారు.
స్థల యజమానులు శ్రీనివాసులు, విమలాదేవితో పాటు బిల్డర్ ఎంవీఎస్. శేషగిరిరావులపై క్రిమినల్ కేసు నమోదు చేయాల్సిందిగా కోర్టు ఆదేశాల మేరకు జూబ్లీహిల్స్ పోలీసులు ఈ ముగ్గురిపై కేసు నమోదు చేశారు. వివరాల్లోకి వెళ్తే.... జూబ్లీహిల్స్ రోడ్ నెం. 66 కు చెందిన డాక్టర్ టి.శ్రీనివాసులు, విమలాదేవిలకు జూబ్లీహిల్స్ రోడ్‌నెం. 5లో 1188 గజాల స్థలం ఉండగా ఈ స్థలంలో అపార్ట్‌మెంట్ నిర్మించేందుకు జూబ్లీహిల్స్ రోడ్ నెం. 17కు చెందిన జ్యోతి కన్‌స్ట్రక్షన్స్ అధినేత ఎం.వీ.ఎస్ శేషగిరిరావుకు అప్పగించారు. 11 ప్లాట్లు విక్రయించగా 2015లో రోడ్డు విస్తరణలో అపార్ట్‌మెంట్‌కు చెందిన 202 గజాల స్థలాన్ని జీహెచ్‌ఎంసీ సేకరించింది.
అపార్ట్‌మెంట్ నిర్మాణం తర్వాత మిగిలి ఉన్న 380 గజాల స్థలాన్ని కాజేసేందుకు యత్నిస్తున్నారని ఆరోపిస్తూ కల్యాణ్ కోర్టును ఆశ్రయించారు. జీహెచ్‌ఎంసీ అనుమతుల్లో చూపించిన స్థలాన్ని పూర్తిగా ప్లాట్‌దారు లకే పంచాల్సి ఉండగా ఈ ముగ్గురూ పథకం ప్రకారం కాజేసేందుకు యత్నిస్తున్నారని ఆరోపించారు. మొత్తం 18,790 చదరపు అడుగుల స్థలాన్ని 11 మంది ప్లాట్ ఓనర్లకు పంచుతూ విడివిడిగా ఒప్పందం చేశారని ఇప్పుడు మిగులు స్థలాన్ని ఆక్రమించేందుకు యత్నిస్తున్నారంటూ ఆయన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ మేరకు జూబ్లీహిల్స్ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.