
హీరో నితిన్‌నే పెళ్లి చేసుకుంటా..!
* హీరోనే పెళ్లి చేసుకుంటానంటూ మారాం
* కౌన్సెలింగ్ నిర్వహించి వదిలిపెట్టిన పోలీసులు
బంజారాహిల్స్: సినీ నటుడు నితిన్ నివాసంలోకి ప్రవేశించి ఓ యువతి కలకలం సృష్టించింది. ఈ ఘటన గురువారం రాత్రి చోటుచేసుకుంది. జూబ్లీహిల్స్ పోలీసుల కథనం ప్రకారం... రాత్రి పదిగంటల ప్రాంతంలో ఓ యువతి జూబ్లీహిల్స్‌లోని సినీ నటుడు నితిన్ ఇంటివద్దకు చేరుకుంది. అక్కడి సెక్యూరిటీ గార్డుల కళ్లుగప్పి ప్రహరీ దూకి ఇంట్లోకి ప్రవేశించి కారిడార్‌లో నిద్రపోయింది. శుక్రవారం తెల్లవారుజామున నితిన్ తల్లి నిద్రలేచి చూడగా యువతి కనిపించింది. ఆందోళన చెందిన నితిన్ తల్లి ఆ యువతిని ప్రశ్నించింది.
‘నేను నితిన్ అభిమానిని.. ఆయన కోసమే ఇక్కడికి వచ్చా’నని స్పష్టం చేసింది. దీంతో నితిన్ తల్లి పోలీసులకు సమాచారం అందించింది. పోలీసులు అక్కడికి చేరుకొని ఆ యువతిని విచారించగా ఆమె ఓ పోలీసు అధికారి కూతురని తెలిసింది. ‘నేను నితిన్‌ను ప్రేమిస్తున్నానని.. ఆయన లేకుంటే జీవించలేను.. ఆయన్నే పెళ్లి చేసుకుంటా’నని పోలీసులతోనూ స్పష్టం చేసింది. కౌన్సెలింగ్ నిర్వహించిన పోలీసులు ఆ యువతిని ఆమె ఇంటి వద్ద వదిలేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.