న్యాయం కావాలి
- రమ్య మృతికి సంతాపంగా కొవ్వొత్తుల ర్యాలీ
హైదరాబాద్: చిన్నారి రమ్యకు హైదరాబాద్ నగరవ్యాప్తంగా అశ్రునివాళి అర్పించారు. స్వచ్ఛంద సంస్థలు, విద్యార్థులు, కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు కేబీఆర్ పార్కు వద్ద సోమవారం కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. ఈ నెల ఒకటో తేదీన బంజారాహిల్స్ రోడ్ నం.3లో జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన రమ్య చికిత్స పొందుతూ శనివారం మృతి చెందిన విషయం తెలిసిందే. రమ్య తాత చింతపల్లి సురేందర్, అమ్మమ్మ విజయలక్ష్మి, మేనమామ నవీన్ తదితరులతోపాటు రమ్య సోదరి రష్మి కూడా కొవ్వొత్తుల ర్యాలీలో పాల్గొన్నారు. పెద్ద ఎత్తున యువత తరలి వచ్చి రమ్యకు శ్రద్ధాంజలి ఘటించారు.
రమ్య ప్రాణాన్ని తిరిగి ఎవరు తెస్తారు.. తాగుబోతు డ్రైవర్లను కఠినంగా శిక్షించాలి.. న్యాయం కావాలి.. అటూ ప్లకార్డులు ప్రదర్శించారు. పబ్‌లు, హుక్కా సెంటర్లపై నియంత్రణ ఏది అని ప్రశ్నించారు. సుమారు 2 గంటలపాటు జరిగిన రమ్య అశ్రునివాళిలో ప్రతిఒక్కరూ చిన్నారిని తలచుకొని కంటనీరు పెట్టారు. ఈ కొవ్వొత్తుల ప్రదర్శనలో మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్, ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, గజల్ శ్రీనివాస్, సినీ హీరో శివాజీ, నటి మంచులక్ష్మి తదితరులు పాల్గొన్నారు.