candles rally
-
సాగు చట్టాల రద్దుకు మద్దతుగా.. వైఎస్సార్సీపీ కొవ్వొత్తుల ర్యాలీలు
సాక్షి నెట్వర్క్: కేంద్ర ప్రభుత్వం సాగు చట్టాలను ఉపసంహరించడాన్ని స్వాగతిస్తూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శనివారం రాత్రి కొవ్వొత్తుల ర్యాలీలు నిర్వహించింది. వివిధ జిల్లాల్లో మంత్రులు, ఎమ్మెల్యేల నేతృత్వంలో ఈ ర్యాలీలు జరిగాయి. విశాఖపట్నంలో ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్‌కుమార్ ఆధ్వర్యంలో కాగడాల ప్రదర్శన నిర్వహించారు. జీవీఎంసీ గాంధీ విగ్రహం నుంచి ప్రారంభమైన ఈ ప్రదర్శన జగదాంబ జంక్షన్ వరకు జైకిసాన్ నినాదంతో సాగింది. నెడ్ క్యాప్ చైర్మన్, ఉత్తర నియోజకవర్గ సమన్వయకర్త కేకే రాజు ఆధ్వర్యంలో అక్కయ్యపాలెం జాతీయ రహదారి నుంచి మహారాణి పార్లర్ కూడలి వరకు కొవ్వొత్తులతో ర్యాలీ నిర్వహించారు. అలాగే, అచ్యుతాపురం జంక్షన్లో డీసీసీబీ మాజీ చైర్మన్ ఉప్పలపాటి సుకుమారవర్మ ఆధ్వర్యంలో కొవ్వొత్తులతో ర్యాలీ నిర్వహించారు. ఇంకా చోడవరం, బుచ్చెయ్యపేట, పాడేరు, అరకు తదితర ప్రాంతాల్లోనూ ఈ ర్యాలీలు నిర్వహించారు. ప్రతిచోటా వ్యవసాయ చట్టాల రద్దు రైతుల విజయం అని నినాదాలు చేశారు. సాగు చట్టాలను కేంద్రం రద్దుచేయడంపై శ్రీకాకుళం జిల్లాలోని వైఎస్సార్సీపీ శ్రేణులూ జిల్లా వ్యాప్తంగా శనివారం రాత్రి కొవ్వొత్తుల ర్యాలీలు నిర్వహించాయి. రైతుల పోరాటాలకు వైఎస్సార్సీపీ మద్దతిచ్చిన విషయాన్ని గుర్తుచేశాయి. అలాగే, రైతన్నలకు సంఘీభావంగా విజయనగరం జిల్లా వ్యాప్తంగా కూడా వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు కొవ్వొత్తుల ర్యాలీలు నిర్వహించారు. జిల్లా కేంద్రంలోని కోట నుంచి గంట స్తంభం కూడలి వరకు సాగిన ర్యాలీలో మేయర్ వెంపడాపు విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్ కోలగట్ల శ్రావణి పాల్గొన్నారు. తూర్పు గోదావరిలో.. తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా నియోజకవర్గ కేంద్రాల్లో వైఎస్సార్సీపీ శ్రేణులు కొవ్వొత్తుల ర్యాలీలు నిర్వహించాయి. రామచంద్రపురంలో మంత్రి వేణుగోపాలకృష్ణ, మండపేటలో ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు, కాకినాడ రూరల్‌లో ఎంపీ వంగ గీత, పి.గన్నవరంలో జెడ్పీ చైర్మన్ వేణుగోపాల్, ఎమ్మెల్యే కొండేటి చిట్టిబాబు పాల్గొన్నారు. ఇక రైతులకు సంఘీభావంగా పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో జెడ్పీ చైర్మన్ కవురు శ్రీనివాస్, ద్వారకా తిరుమల, నిడదవోలులో ఎమ్మెల్యేలు తలారి వెంకట్రావు, జి. శ్రీనివాసనాయుడు పాల్గొని విజయం సాధించిన రైతులకు అభినందనలు తెలిపారు. వీరికి వైఎస్సార్సీపీ ప్రభుత్వం అండగా నిలిచి సీఎం జగన్ రైతుల పక్షపాతిగా నిలిచారని కొనియాడారు. కృష్ణా జిల్లాలో.. కృష్ణాజిల్లా నూజివీడు పట్టణంలో స్థానిక ఎమ్మెల్యే మేకా ప్రతాప్ అప్పారావు, నందిగామలో స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ మొండితోక జగన్మోహన్రావు, జగ్గయ్యపేటలో ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే సామినేని ఉదయభాను నేతృత్వంలో ర్యాలీలు నిర్వహించారు. కైకలూరులో కూడా జరిగింది. గుంటూరుతో పాటు బాపట్ల, చిలకలూరిపేట, మంగళగిరి, పెదకూరపాడు, చెరుకుపల్లి, వినుకొండ, దాచేపల్లి, తెనాలి, తాడికొండలలో ఈ ర్యాలీలు నిర్వహించారు. డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతి, ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి, ఎమ్మెల్యేలు మద్దాళి గిరి, ముస్తఫా, బొల్లా బ్రహ్మనాయుడు, డాక్టర్ ఉండవల్లి శ్రీదేవి పాల్గొన్నారు. ఇక నెల్లూరు జిల్లా వ్యాప్తంగా కూడా వైఎస్సార్సీపీ శ్రేణులు, రైతుల ఆధ్వర్యంలో క్యాండిల్ ర్యాలీ చేపట్టారు. వెంకటాచలం, సూళ్లూరుపేట, గూడూరు, ఉదయగిరి బస్టాండ్ సెంటర్, వింజమూరు, కావలి పట్టణంలో కొవ్వొత్తుల ర్యాలీలు నిర్వహించారు. కర్నూలు జిల్లావ్యాప్తంగా కూడా కొవ్వొత్తుల ప్రదర్శన నిర్వహించారు. పార్టీ కర్నూలు పార్లమెంట్ జిల్లా అధ్యక్షుడు, మేయర్ బీవై రామయ్య, ఎమ్మెల్యేలు కాటసాని రాంభూపాల్‌రెడ్డి, గంగుల బిజేంద్రారెడ్డి, డాక్టర్ సుధాకర్‌తో పాటు పార్టీ శ్రేణులు పాల్గొన్నాయి. -
అకృత్యాలపై ఆగ్రహం
కర్నూలు(కొండారెడ్డి ఫోర్టు) : బాలికలు, మహిళలపై లైంగిక దాడులను నియంత్రించడంలో చంద్రబాబు ప్రభుత్వం విఫలమైందని వైఎస్సార్సీపీ నాయకులు ధ్వజమెత్తారు. ఈ ప్రభుత్వంలో మహిళలకు రక్షణ కొరవడిందని ఆందోళన వ్యక్తం చేశారు. మహిళలు, బాలికలపై జరుగుతున్న లైంగిక దాడులకు నిరసనగా పార్టీ పిలుపు మేరకు శనివారం సాయంత్రం ఆరు గంటలకు జిల్లావ్యాప్తంగా వైఎస్సార్సీపీ నాయకులు కొవ్వొత్తుల ప్రదర్శన నిర్వహించారు. కర్నూలు కలెక్టరేట్ ఎదుట పార్టీ సమన్వయ కర్త హఫీజ్‌ఖాన్ ఆధ్వర్యంలో చేపట్టిన కొవ్వొత్తుల ప్రదర్శనలో కర్నూలు పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు బీవై రామయ్య టీడీపీ సర్కారు తీరుపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. టీడీపీ ప్రభుత్వ పెద్దలు రాష్ట్రంలోని అక్కాచెల్లెమ్మలకు మనశ్శాంతి లేకుండా చేస్తున్నారని మండిపడ్డారు. టీడీపీ చోటామోటా నాయకులు మొదలు ప్రజాప్రతినిధులు, మంత్రుల వరకు మహిళలను వేధింపులకు గురి చేస్తున్నారని ఆరోపించారు. మంత్రులు, ఎమ్మెల్యేలు గుండాలు, రౌడీలుగా మహిళలపై దాడులకు దిగుతున్నా సీఎం చంద్రబాబు పట్టించుకోవడంలేదన్నారు. నాలుగేళ్ల పాలనలో ఎంతోమంది మహిళలను టీడీపీ నాయకులు కాల్‌మనీ, సెక్స్ రాకెట్లలో ఇరికించి వారి జీవితాలను నాశనం చేశారని ధ్వజమెత్తారు. శాంతిభద్రతలను కాపాడడంలో పోలీసులు విఫలమయ్యార ని ఆరోపించారు. కార్యక్రమంలో నాయకులు తెర్నేకల్ సురేందర్‌రెడ్డి, సీహెచ్ మద్దయ్య, కరుణాకరరెడ్డి తదితరులు పాల్గొన్నారు. నందికొట్కూరులో ఎమ్మెల్యే ఐజయ్య ఆధ్వర్యంలో పటేల్ సెంటర్లో కొవ్వొత్తుల ప్రదర్శన చేపట్టారు. పాణ్యం నియోజకవర్గానికి సంబంధించి కర్నూలు అమ్మ హాస్పిటల్ సమీపంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గౌరు వెంకటరెడ్డి, కల్లూరు చెన్నమ్మ సర్కిల్లో పార్టీ యూత్ నాయకుడు అక్కిమి హనుమంతరెడ్డి ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ప్రదర్శన చేపట్టారు. ఎమ్మిగనూరులో పార్టీ ఇన్చార్జి ఎర్రకోట జగన్మోహన్రెడ్డి, కోడుమూరులో మాజీ ఎమ్మెల్యే మురళీకృష్ణ, ఆదోనిలో పార్టీ నాయకులు గోపాల్‌రెడ్డి, ప్రసాదరావు, ఆలూరులో మండల కన్వీనర్ చిన్న ఈరన్న, మంత్రాలయంలో సర్పం చ్ తల్లెబండ్ల భీమప్ప, నంద్యాలలో మాజీ ఎంపీపీ జగదీశ్వరరెడ్డి ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ప్రదర్శన నిర్వహించారు. -
పునరావృతం కానివ్వం!
శ్రీనివాస్ సంస్మరణ సభలో కన్సాస్ ఉన్నతాధికారులు ♦ కన్సాస్ సిటీలో భారత అమెరికన్ల శాంతి ర్యాలీ ♦ విద్వేషపూరిత రాజకీయాలకు మద్దతివ్వబోమని ప్రకటన ♦ కూచిభొట్లతో అనుబంధాన్ని నెమరువేసుకున్న మిత్రులు హూస్టన్ : విద్వేషపూరిత ఉద్దేశంతో జరిగిన భారత ఇంజనీర్ కూచిభొట్ల శ్రీనివాస్ హత్యకు నిరసనగా అమెరికాలోని కాన్సస్ సిటీలో వందల మంది క్యాండిల్స్ పట్టుకుని శాంతి ర్యాలీ నిర్వహించారు. ‘శాంతి కావాలి. ప్రేమతో ఉండాలి. సమాజంలో ఐకమత్యం కావాలి. కలిసుంటేనే కలదుసుఖం’ అని నినాదాలు చేశారు. విద్వేషపూరిత రాజకీయాలకు మద్దతివ్వమని.. ఇలాంటి ఘటనలు పునరావృతం కావొద్దని ముక్తకంఠంతో తెలిపారు. ఈ ర్యాలీలో గత బుధవారం నాటి కాల్పుల్లో గాయపడిన అలోక్ రెడ్డి సహా.. మృతుడు శ్రీనివాస్ మిత్రులు, సన్నిహితులు, దాదాపు 200 మంది భారత–అమెరికన్లు పాల్గొన్నారు. అనంతరం జరిగిన సంస్మరణ సభలో.. కాన్సస్ లెఫ్టినెంట్ గవర్నర్ జెఫ్ కాల్యర్, చట్ట సభ్యుడు కెవిన్ యోడర్, ఒలేత్ మేయర్ మైక్ కోప్లాండ్, పోలీస్ చీఫ్ స్టీవెన్ మెంకే, ఇతర ఉన్నతాధికారులు కూడా ఈ శాంతి సమావేశానికి హాజరయ్యారు. వివిధ మతాల పెద్దలు ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ‘ఒకడు చేసిన చెడ్డ పని అమెరికా ఐకమత్యాన్ని దెబ్బతీయదు. భారత–అమెరికన్లకు మేం అండగా ఉంటాం. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూసుకుంటాం’ అని కాన్సస్ మేయర్ కోప్లాండ్ తెలిపారు. బాధితుడి కుటుంబానికి న్యాయం జరిగేందుకు కృషిచేస్తామని పోలీస్ చీఫ్ మెంకే వెల్లడించారు. అనురాగం, ఆప్యాయతల కలబోత కూచిభొట్ల శ్రీనివాస్ సంస్మరణ సభ ఉద్వేగంగా సాగింది. ‘శ్రీనివాస్‌తో నాది తొమ్మిదేళ్ల స్నేహబంధం. ప్రతి ఒక్కరికీ ప్రేమ, అనురాగం, ఆప్యాయత పంచే ఇలాంటి వ్యక్తిని జీవితంలో ఒక్కసారైనా కలవాలి. ఆయన నోటివెంట ఒక్కసారి కూడా చెడు మాట వినబడలేదు. ప్రతి ఒక్కరూ బాగుండాలని కోరుకునేతత్వం ఆయనది. ఆరోజు బార్లో జరిగిన ఘటన మరెక్కడా పునరావృతం కాకూడదు. శ్రీనివాస్ ఇకలేడనే విషయం జీర్ణించుకోలేకపోతున్నా. నాకోసం ఆయనిక్కడుండాల్సింది’ అని అలోక్ కన్నీటి పర్యంతమయ్యారు. ‘నేను కారు కొనుక్కునేంతవరకు రోజూ ఆఫీసుకు శ్రీనివాస్ తన కార్లోనే తీసుకెళ్లేవాడు. ఒక్కరోజు కూడా విసుక్కున్నట్లు కనిపించలేదు. అలాంటి మనుషులను చాలా అరుదుగా చూస్తుంటాం. తొమ్మిదేళ్ల మా స్నేహం తాలూకు జ్ఞాపకాలింకా నా మదిలో మెదులుతున్నాయి’ అని వెల్లడించారు. శ్రీనివాస్ మిత్రులు మరికొందరు కూడా అతని మంచితనం, ఇతరులకు సహాయపడే తత్వాన్ని గుర్తుచేసుకుని కంటతడిపెట్టారు. ‘గోఫండ్‌మి’ పేరుతో తెరిచిన మూడు వేర్వేరు అకౌంట్లలో ఇప్పటివరకు దాదాపు మిలియన్ (దాదాపు రూ.6.71 కోట్లు) విరాళాలుగా వచ్చాయి. వీటితో అలోక్, ఇయాన్ కు వైద్యం చేయించటంతోపాటు శ్రీనివాస్ కుటుంబానికి సాయం చేయనున్నారు. ప్రాణాలిచ్చేందుకైనా సిద్ధమే! భవన నిర్మాణ కార్మికుడిగా పనిచేస్తున్న ఇయాన్ గ్రిలాట్ ‘ఇతరుల ప్రాణాలు కాపాడేందుకు తన ప్రాణమిచ్చేందుకూ సిద్ధమే’ అని తెలిపారు. ‘బార్లో కుటుంబాలతో, చిన్న పిల్లలతో వచ్చిన వారంతా బాస్కెట్‌బాల్ మ్యాచ్ చూస్తున్నారు. చాలా మందే అక్కడున్నారు. ఇంతలోనే ఇద్దరిపై కాల్పులు చేస్తున్న పురింటన్ ను చూశాను. వాళ్ల ప్రాణాలు కాపాడేందుకు నా ప్రాణాలు బలిచ్చేందుకూ వెనకాడలేదు. నేను ఏదోఒకటి చేయాలి. అందుకే అతన్ని అడ్డుకునే ప్రయత్నం చేశాను’ అని గ్రిలాట్ తెలిపాడు. పురింటన్ తో పెనుగులాటలో గ్రిలాట్ ఛాతీలోకి బుల్లెట్ దూసుకెళ్లింది. అయితే దీన్ని తొలగించటంతో ప్రాణాపాయం తప్పినా.. ఆయన కోలుకునేందుకు చాలా సమయం పడుతుందని వైద్యులు వెల్లడించారు. -
అక్క ప్రాణాల్ని తిరిగి ఎవరూ తెస్తారు?
-
న్యాయం కావాలి
- రమ్య మృతికి సంతాపంగా కొవ్వొత్తుల ర్యాలీ హైదరాబాద్: చిన్నారి రమ్యకు హైదరాబాద్ నగరవ్యాప్తంగా అశ్రునివాళి అర్పించారు. స్వచ్ఛంద సంస్థలు, విద్యార్థులు, కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు కేబీఆర్ పార్కు వద్ద సోమవారం కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. ఈ నెల ఒకటో తేదీన బంజారాహిల్స్ రోడ్ నం.3లో జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన రమ్య చికిత్స పొందుతూ శనివారం మృతి చెందిన విషయం తెలిసిందే. రమ్య తాత చింతపల్లి సురేందర్, అమ్మమ్మ విజయలక్ష్మి, మేనమామ నవీన్ తదితరులతోపాటు రమ్య సోదరి రష్మి కూడా కొవ్వొత్తుల ర్యాలీలో పాల్గొన్నారు. పెద్ద ఎత్తున యువత తరలి వచ్చి రమ్యకు శ్రద్ధాంజలి ఘటించారు. రమ్య ప్రాణాన్ని తిరిగి ఎవరు తెస్తారు.. తాగుబోతు డ్రైవర్లను కఠినంగా శిక్షించాలి.. న్యాయం కావాలి.. అటూ ప్లకార్డులు ప్రదర్శించారు. పబ్‌లు, హుక్కా సెంటర్లపై నియంత్రణ ఏది అని ప్రశ్నించారు. సుమారు 2 గంటలపాటు జరిగిన రమ్య అశ్రునివాళిలో ప్రతిఒక్కరూ చిన్నారిని తలచుకొని కంటనీరు పెట్టారు. ఈ కొవ్వొత్తుల ప్రదర్శనలో మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్, ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, గజల్ శ్రీనివాస్, సినీ హీరో శివాజీ, నటి మంచులక్ష్మి తదితరులు పాల్గొన్నారు. -
కొవ్వొత్తులు ప్రదర్శించడం కాదు.. ప్రజలకు ఇవ్వండి
హుదూద్ తుఫాను కారణంగా విశాఖపట్నం నగరం మొత్తం విద్యుత్ సరఫరా నిలిచిపోయిందని, కానీ ప్రభుత్వ యంత్రాంగం మాత్రం 60 శాతం కూడా విద్యుత్ సరఫరాను పునరుద్ధరించలేదని మాజీ ఐఏఎస్ అధికారి ఈఏఎస్ శర్మ విమర్శించారు. దీపావళి సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 40 వేల మందితో నిర్వహిస్తున్న 40 వేల కొవ్వొత్తుల ప్రదర్శనపై ఆయన విరుచుకుపడ్డారు. అక్కడ ప్రదర్శన నిర్వహించే బదులు కరెంటు లేనిచోట వాటిని పంచిపెడితే బాగుంటుందని సూచించారు. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్ కృష్ణారావు, ఇతర అధికారులకు ఆయన ఓ బహిరంగ లేఖ రాశారు. విశాఖలో విద్యుత్ సరఫరాను వారం రోజుల్లోనే పునరుద్ధరించేశామని, ప్రకృతి విలయాన్ని టెక్నాలజీతో అడ్డుకున్నామని ముఖ్యమంత్రి చంద్రబాబు చేస్తున్న ప్రకటనలపై కూడా ఈ ప్రాంత వాసుల నుంచి తీవ్ర విమర్శలు వస్తున్నాయి. చాలాచోట్ల ప్రజలే స్వచ్ఛందంగా చెట్లు తొలగించుకున్నారు తప్ప, సర్కారు ప్రకటించిన 200 పొక్లెయిన్లు ఎటు వెళ్లాయో తెలియట్లేదని అంటున్నారు. -
సిక్కుల నిరసన.. ఉద్రిక్తత
హైదరాబాద్, న్యూస్‌లైన్: విజయనగరంలోని ఓ గురుద్వారాపై ఇటీవల జరిగిన దాడిని నిరసిస్తూ సోమవారం నాంపల్లి గన్‌పార్క్‌లోని తెలంగాణ అమరవీరుల స్థూపం వద్ద నగరానికి చెందిన సిక్కులు కొవ్వొత్తుల ప్రదర్శన నిర్వహించారు. కోవా స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి తెలంగాణ ప్రజా ఫ్రంట్ పార్టీ ఉపాధ్యక్షుడు వేద కుమార్ అధ్యక్షత వహించారు. రాష్ట్ర ఏపీఎన్జీవో సంఘం అధ్యక్షుడు అశోక్‌బాబు, పలువురు సిక్కు మతపెద్దలతో పాటు తెలంగాణవాదులూ హాజరయ్యారు. అశోక్‌బాబు రాకపై పలువురు తెలంగాణవాదులు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఆయన ప్రసంగాన్ని అడ్డుకునే ప్రయత్నం చేశారు. సిక్కు మతపెద్దలు జోక్యం చేసుకుని వారికి నచ్చజెప్పారు. అదే సమయంలో గురుద్వారాపై దాడి జరిగి రెండురోజులు కావస్తున్నా టీఆర్ఎస్ అధ్యక్షుడు కె.చంద్రశేఖర్‌రావు, పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణలు ఖండించలేదని కొందరు సిక్కులు ఆగ్రహం వ్యక్తం చేశారు. మరోవైపు అశోక్‌బాబు ప్రసంగం ముగించి వెళుతుండగా జై తెలంగాణ నినాదాలు చేసిన తెలంగాణవాదులు, సిక్కుల మధ్య వాగ్వివాదం చోటుచేసుకుంది. పోలీసులు జోక్యం చేసుకుని ఇరువర్గాల వారిని చెల్లాచెదురు చేశారు. నిరసన కార్యక్రమంలో కోవా ప్రతినిధులు, గురుద్వార శిక్షాని బరమ్‌బాల అధ్యక్షుడు హర్భజన్ సింగ్, సంయుక్త కార్యదర్శి ఇక్బాల్ సింగ్ తదితర సిక్కు మతపెద్దలు పాల్గొన్నారు. -
ఉద్రిక్తంగా మారిన సీమాంధ్ర ఉద్యోగుల ర్యాలీ
న్యూఢిల్లీ: దేశ రాజధానిలో సమైక్య సెగ తీవ్రరూపం దాల్చుతోంది.తెలంగాణపై అధిష్టానం తీసుకున్ననిర్ణయాన్నివ్యతిరేకిస్తూ సీమాంధ్ర ఉద్యోగులు కదం తొక్కారు.ఆంధ్రప్రదేశ్ ను కాపాడాలంటూ నినాదాలతో హోరెత్తించారు. ఢిల్లీలోని ఏపీభవన్ కు అతి సమీపంలోనే సీమాంధ్ర ఉద్యోగులు ఆంధ్ర ప్రదేశ్ ను 'కాపాడండి..కాపాడండి' అంటూ గురువారం సాయంత్రం కొవ్వొత్తులతో వినూత్న శైలిలో ధర్నా చేపట్టారు. పోలీసులు వీరిని అడ్డుకోవడానికి యత్నించడంతో సీమాంధ్ర ఉద్యోగులు వాగ్వివాదానికి దిగారు. దీంతో అక్కడి పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. నిరసన తెలుపుతున్న తమపై పోలీసులు దాడులకు దిగుతున్నారని వారు తెలిపారు. సీమాంధ్ర ఎంపీల రాజీనామాలు ఆలస్యమయ్యే కొద్దీ సమైక్యాంధ్ర ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని ఏపీ ఎన్జీవోలు హెచ్చరించిన సంగతి తెలిసిందే. ఇప్పటికైనా రాజీనామాలు చేసి రాజకీయాలకతీతంగా ఉద్యమంలోకి రావాలని సీమాంధ్ర ప్రజాప్రతినిధులకు సూచించారు. తమ ప్రసంగాలపై అభ్యంతరాలుంటే చర్చకు సిద్ధమని ప్రకటించారు. -
విడిపోతే.. బతుకంతా చీకటే
సాక్షి, తిరుపతి: సమైక్యాంధ్రకు మద్దతుగా విభజనను వ్యతిరేకిస్తూ విద్యుత్ జేఎసీ ఆధ్వర్యంలో ఎస్పీడీసీఎల్ ఉద్యోగులు శనివారం సాయంత్రం కొవ్వొత్తులతో ర్యాలీ నిర్వహించారు. ఎన్టీఆర్ సర్కిల్ నుంచి విద్యుత్ ఉద్యోగులు రాత్రి 7 నుంచి 8 గంటల వరకు జిల్లా పోలీసు కార్యాలయం, కృష్ణాపురం ఠాణా, గాంధీరోడ్డు మీదుగా నాలుగుకాళ్ల మండపం వరకు కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. నాలుగుకాళ్ల మండపం వద్ద మానవహారంగా ఏర్పడ్డారు. విద్యుత్ ర్యాలీ నిర్వహించిన పరిసర ప్రాంతాల్లో గాంధీరోడ్డు, తిలక్‌రోడ్డు, కృష్ణాపురం ఠాణా, టౌన్‌క్లబ్ ఏరియా, తీర్థకట్టవీధి, చిన్నబజారు వీధుల్లో విద్యుత్ నిలిపేశారు. విభజన వద్దు, సమైక్యాంధ్రాముద్దు అంటూ నినాదాలు చేశారు. ర్యాలీలో జేఎసీ నాయకులు అశోక్‌కుమార్, మునిశంకరయ్య, చలపతి, బాలాజి, పద్మావతీ మహిళా వర్సిటీ ప్రొఫెసర్ వరలక్ష్మి, మెడికల్ జేఏసీ డాక్టర్లు సుధారాణి, కృష్ణప్రశాంతి పాల్గొన్నారు.