కొవ్వొత్తులు ప్రదర్శించడం కాదు.. ప్రజలకు ఇవ్వండి
హుదూద్ తుఫాను కారణంగా విశాఖపట్నం నగరం మొత్తం విద్యుత్ సరఫరా నిలిచిపోయిందని, కానీ ప్రభుత్వ యంత్రాంగం మాత్రం 60 శాతం కూడా విద్యుత్ సరఫరాను పునరుద్ధరించలేదని మాజీ ఐఏఎస్ అధికారి ఈఏఎస్ శర్మ విమర్శించారు. దీపావళి సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 40 వేల మందితో నిర్వహిస్తున్న 40 వేల కొవ్వొత్తుల ప్రదర్శనపై ఆయన విరుచుకుపడ్డారు.
అక్కడ ప్రదర్శన నిర్వహించే బదులు కరెంటు లేనిచోట వాటిని పంచిపెడితే బాగుంటుందని సూచించారు. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్ కృష్ణారావు, ఇతర అధికారులకు ఆయన ఓ బహిరంగ లేఖ రాశారు. విశాఖలో విద్యుత్ సరఫరాను వారం రోజుల్లోనే పునరుద్ధరించేశామని, ప్రకృతి విలయాన్ని టెక్నాలజీతో అడ్డుకున్నామని ముఖ్యమంత్రి చంద్రబాబు చేస్తున్న ప్రకటనలపై కూడా ఈ ప్రాంత వాసుల నుంచి తీవ్ర విమర్శలు వస్తున్నాయి. చాలాచోట్ల ప్రజలే స్వచ్ఛందంగా చెట్లు తొలగించుకున్నారు తప్ప, సర్కారు ప్రకటించిన 200 పొక్లెయిన్లు ఎటు వెళ్లాయో తెలియట్లేదని అంటున్నారు.