మూడు రోజుల్నుంచి చీకట్లే!
హుదూద్ తుఫాను దెబ్బకు విశాఖపట్నంలో మూడు రోజులుగా చీకట్లు కమ్ముకునే ఉన్నాయి. అక్కడ కరెంటు ఎప్పుడొస్తుందో కూడా చెప్పలేని స్థితిలో అధికారులు ఉన్నారు. సహాయ కార్యక్రమాలు చాలా మందకొడిగా సాగుతున్నాయి. శిథిలాలను, చెట్లను తొలగించడానికి 200 పొక్లెయిన్లు సిద్ధంగా ఉంచినట్లు అధికారులు చెప్పినా, అవి ఎక్కడ పనిచేస్తున్నాయో అర్థం కావట్లేదు. దాంతో ప్రజలు తమంతట తామే శిథిలాలను తొలగించుకుంటున్నారు.
కాలనీల్లో ప్రజలు బృందాలుగా ఏర్పడి చెట్లను తమకు తాముగా తొలగించుకుంటున్నారు. అలాగే కాలనీ రోడ్లను యువత తమంతట తామే క్లియర్ చేసుకుంటున్నారు. ప్రభుత్వ సాయం అందకపోవడంతో ప్రజలు ఇక చేసేది లేక.. తామే ముందుకు వెళ్తున్నారు. ఆస్పత్రులకు కూడా కరెంటు సరఫరా లేకపోవడంతో రోగుల పరిస్థితి దారుణంగా ఉంది. కేవలం డీజిల్ జనరేటర్లపైనే ఆధారపడి అత్యవసర సేవలు అందిస్తున్నారు.