భారీ వర్షం..
అంధకారం
సిటీబ్యూరో: నగరంలో మంగళవారం సాయంత్రం ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. పలుచోట్ల రోడ్లు జలమయమయ్యాయి. కొన్నిచోట్ల విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడి అంధకారం నెలకొంది. చెట్లు విరగడం..వైర్లు తెగిపడడం వంటి కారణాల వల్ల సిటీలో సుమారు వందకు పైగా ఫీడర్‌ల పరిధిలో విద్యుత్ సరఫరా నిలిచి పోయింది. ఈదురు గాలులతో చెట్ల కొమ్మలు విరిగి విద్యుత్ లైన్లపై పడటంతో ట్రాన్స్‌ఫార్మర్లు కాలిపోయాయి.
శివం రోడ్‌లో టాన్స్‌ఫార్మర్ పెద్ద శబ్ధంతో కాలిపోయింది. కొన్ని చోట్ల వర్షం వెలిసిన అరగంటకే విద్యుత్ సరఫరా పునరుద్ధరణ కాగా, మరికొన్ని బస్తీలో రాత్రంతా అంధకారం నెలకొంది. వర్షానికి ఫీడర్‌లు ట్రిప్ అవడంతో పాటు ఫ్యూజులు కాలిపోయాయి. మరోవైపు రోడ్లపై చెట్ల కొమ్మలు పడటంతో పాదచారులు, వాహనాల రాకపోకలకు అంతరాయం కలిగింది. పేట్లబురుజు వద్ద భారీ వృక్షం నేలకొరగడంతో విద్యుత్ సరఫరాకు తీవ్ర అంతరాయం కలిగింది. ఆ పరిసర ప్రాంతాలన్నీ చీకటిమయంగా మారాయి.